ఒక లీడర్‌ మిలియన్‌ నీడలు

Woman Politician Kalvakuntla Kavitha Got One Million Followers In Twitter - Sakshi

కొత్త నెంబర్‌! ఫోన్‌ ఎత్తం.  కొత్త మనిషి! తలెత్తం. ఫోనెత్తితే సమాధానం ఇవ్వాలి. తలెత్తితే.. సహాయం చెయ్యాలి. వీలవక కానీ మన నీడను కూడా.. మనల్ని ఫాలో అవనివ్వం. కవితను చూడండి.  పది లక్షల నీడలు! మనిషెవరని కాదు.. కష్టం ఏమిటని చూసే లీడర్‌. సౌత్‌ పొలిటీ‘షి’యన్‌లలో.. ఫస్ట్‌ ‘మిలియనీర్‌’. 

ట్విట్టర్‌లో పది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది మహిళా నేతగా కల్వకుంట్ల కవిత నిన్న ఆదివారం రికార్డు సృష్టించారు! ఈ రికార్డుతో సామాజిక మాధ్యమాల వినియోగంలో ఆమె ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయినట్లయింది. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రారంభం అయిన నాటి నుంచీ ఆమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండును బలంగా వినిపించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. రక్తదానం, హెల్మెట్‌ ఆవశ్యకతపై ఇదే ట్విట్టర్‌ వేదికగా కవిత నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి దేశవ్యాప్త మద్దతు లభించింది.

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో, ఆ తర్వాత కూడా సాయం కోరుతూ దేశవిదేశాల నుంచి ట్వీట్‌ చేస్తున్న వారికి  అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌లో దేశవిదేశాల్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన దక్షిణాది మహిళా నేతలు దివ్య స్పందన, కనిమొళి, తమిళిసై సౌందర రాజన్, శోభా కరంగ్దలే తదితరులను దాటుకుని.. వన్‌ మిలియన్‌ ఫాలోవర్లతో కవిత అగ్రస్థానం లో నిలిచారు. మైలురాయి వంటి ఈ ప్రత్యేక సందర్భంలో తన సామాజిక మాధ్యమ ప్రస్థానంపై ‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

మేల్కొలుపు వేదిక
‘‘సమానత్వ సాధనలో టెక్నాలజీ అత్యంత ముఖ్యమైన సాధనం. రాజకీయ రంగంలో టెక్నాలజీని ఎంత బాగా వినియోగించుకుంటే అంతగా ప్రజలకు చేరువ అవుతాం. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నా, ప్రజల అవసరాలు తీర్చాలన్నా టెక్నాలజీ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. గతంలో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులను చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకులు దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ట్విట్టర్‌ ఖాతాలో ఓ సందేశం పెడితే చాలు... క్షణాల్లో చేరుకుంటుంది. సోషల్‌ మీడియా ప్రస్తుతం సామాన్యుల చేతిలో ఓ బ్రహ్మాస్త్రం. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి నిజజీవితంలో, సామాజిక మాధ్యమాల్లో ఒకేలా పారదర్శకంగా ఉంటాం. పుట్టినరోజు శుభాకాంక్షలు లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు.. పండుగలు, ప్రభుత్వ విధానాలు, ప్రజలకు మేలు చేసే అంశాలు, వారిని మేల్కొలిపే విషయాలు తదితరాలను ప్రజలతో పంచుకుంటున్నా. ఆఫీసులో కూర్చుని ఎంత పనిచేస్తానో సోషల్‌ మీడియాలో కూడా అంతే ధ్యాసగా ప్రజాసమస్యలకు ప్రతిస్పందిస్తున్నా.

బాధ్యతను పెంచింది
2010 నుంచి ట్విట్టర్‌ ఖాతాను వినియోగిస్తున్నా 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. కరోనా సమయంలో ట్విట్టర్‌ ద్వారా వచ్చిన వినతులకు వివిధ దేశాలలో ఉన్న టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి కార్యకర్తల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాయం అందించాం. ట్విట్టర్‌తో సాయం అందుతుందని, పనిచేస్తామని తెలియడంతో ఇటీవలి కాలంలో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ట్విట్టర్‌లో అందే సందేశాలను ఒక క్రమపద్దతి లో అడ్రస్‌ చేస్తున్నాం. ఫాలోవర్ల సంఖ్య పది లక్షలకు చేరుకోవడంతో నా బాధ్యత మరింత పెరిగినట్లయింది. మహిళలకు, యువతకు కనెక్ట్‌ కావడానికి ప్రయత్నిస్తా. 

మంచి వాతావరణం
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలు, అనుచరులతో తరచు సోషల్‌ మీడియాలో ఇంటరాక్షన్‌ జరుపుతుంటాం. మా అన్నయ్య కేటీఆర్‌తో ట్విట్టర్‌లో సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో ఒక మంచి వాతావరణానికి దోహదం చేస్తాయి. పార్టీలకు అతీతంగా చాలా మందితో టచ్‌లో ఉంటాం. కొత్త టెక్నాలజీ వేల రెట్ల సామర్థ్యంతో దినదినాభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ, ఐటీ సంబంధిత రంగాలు.. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాకు సంబంధించిన చట్టాలు ఇంకా రావాలి. ప్రస్తుతం సైబర్‌ ప్రపంచంలో జరుగుతున్న నేరాలపై మాత్రమే చర్చ జరుగుతోంది. స్టాకింగ్, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటి అంశాలను కూడా చర్చించాల్సి ఉంది. సోషల్‌ మీడియా రెగ్యులేషన్‌కూ చట్టాలు రావల్సిన అవసరం ఉంది’’ అని కవిత అన్నారు.
– కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top