మెల్లకన్ను ఉండటం అదృష్టమా? అందులో వాస్తవమెంత?

When To Suspect That There Is Squint Eye In Children - Sakshi

చిన్నపిల్లలు ఏ వైపునకు దృష్టిసారించినప్పటికీ... వాళ్ల రెండు కళ్లూ సమాంతరంగా కదులుతుండాలి... కదులుతుంటాయి.  అలా కాకుండా... కళ్లు తిప్పినప్పుడు వాటిలో అలైన్‌మెంట్‌ లోపించడాన్ని మెల్లగా చెప్పవచ్చు. ఇది కొంతమంది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటి వరకు పిల్లల్లో విజన్‌ కాస్త బ్లర్‌గా ఉంటుంది. చూపు పూర్తిగా డెవలప్‌ అయి ఉండదు. అంటే పిల్లలు మూడో నెల వరకు నిర్దిష్టంగా ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. నాలుగు–ఐదు నెలలప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్‌) మీద దృష్టి పెట్టడం మెుదలు పెడతారు. దాదాపు 12–14 నెలల వయసు వచ్చేప్పటికి వాళ్ల దృష్టి (విజన్‌) నార్మల్‌ అవుతుంది.

మెల్ల ఉందని ఎప్పుడు అనుమానించాలంటే.. 
పిల్లల కనుపాపలు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు దృష్టి మరల్చినప్పుడు ఒక కనుపాపే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మెల్ల అనుకోవచ్చు. చిన్నారి బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉన్నప్పుడు ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అదే లక్షణాలు కనిపిస్తే తక్షణం పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.

కారణాలు... 
మెల్లకన్ను రావడానికి కారణాలు చెప్పడం కష్టం. అది పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి వాటివల్ల కూడా కనిపించవచ్చు. ఇది కొంచెం పెద్దపిల్లల్లో వస్తుంటుంది. మెదడుకు సంబంధించిన కొన్ని రుగ్మతలు, జెనెటిక్‌ సిండ్రోమ్స్‌ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. దీని లక్షణాలు కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డయాగ్నోజ్‌ చేయడం అవసరం. వెంటనే గుర్తించి చికిత్స అందించకపోతే అది శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌) ఉన్నాయా, లేదా అన్నది నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌ ఉంటే దాన్ని చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్‌ స్పెక్టకిల్స్‌) వాడటం తప్పనిసరి. అంతేకాదు... డాక్టర్‌ సలహా మేరకు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ అవసరం. మెల్లకన్నుకు వుజిల్‌ ఇంబాలెన్సెస్‌ కారణం అయితే దాన్ని సర్జికల్‌గా చక్కదిద్దాల్సి ఉంటుంది.

మెల్లకన్నుకు వెంటనే సరైన చికిత్స చేయించకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కాంప్లికేషన్‌కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్లలోపు దీన్ని చక్కదిద్దకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతం కావచ్చు. కాబట్టి కొందరు అపోహపడేలా మెల్లకన్ను ఉండటం అదృష్టం కానే కాదు. బాగా అభివృద్ధి చెందిన దేశల్లో ఉన్నట్టే ఇప్పుడు మన దగ్గర కూడా మెల్లకన్ను సమస్యను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మిక్‌ సర్జన్స్‌ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మెల్లకన్ను కనిపించినప్పుడు వీలైనంత త్వరగా ఆఫ్తాల్మిక్‌ సర్జన్లచే పిల్లలకు తగిన చికిత్స ఇప్పించాలి.


డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌
పీడియాట్రీషియన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top