ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..

What Is Attention Deficit Hyperactivity Disorder How To Overcome By Expert - Sakshi

Attention Deficit Hyperactivity Disorder: సుమంత్‌ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు.

కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్‌. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్‌ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది.

సుమంత్‌ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్‌ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్‌–డెఫిషిట్‌/హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD).. ఒక న్యూరో డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది.

కారణాలు– పర్యవసానాలు
ఏడీహెచ్డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు.

అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు.

స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు.

కనీసం ఆరు లక్షణాలు
ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్‌. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. 

చంచలత్వం  (attention deficit) లక్షణాలు: 
వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం ∙టాస్క్స్‌ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం
సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు
అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం
పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు

హైపర్‌యాక్టివ్‌ అండ్‌ ఇంపల్సివ్‌  లక్షణాలు: 
►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం
►సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం
►తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం
►ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం
►తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం
►ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం
►ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. 

తల్లిదండ్రులు ఏం చేయాలి?
►ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్‌ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే..
►మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి
►పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి
►వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి
►మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి

►ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్‌. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో అఈఏఈ అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. 
►పేరెంటింగ్‌ ట్రైనింగ్, బిహేవియర్‌ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి.
►సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
►మందులు మెదడులోని న్యూరోట్రాన్సి్మటర్లు డోపమైన్, నోర్‌ ఎపినెఫ్రిన్‌ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్‌ ను మెరుగుపరుస్తాయి.
-సైకాలజిస్ట్‌ విశేష్‌ 

చదవండి: తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా..

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top