అర్ధరాత్రి దాటింది. వీధుల్లో భోగి మంటలు ఇంకా ఉన్నాయి. పండగ రోజులు కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద హడావుడి లేదు. లోపల రోగులు మందుల మత్తులో నిద్రిస్తున్నారు. వాళ్ల అటెండర్లు మాత్రం బెంగతోనో, భయంతోనో బయట తచ్చాడుతున్నారు నాలాగ. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ భోగి మంట చుట్టూ చేరి జోకులేసుకుంటున్నారు. తెల్లారితే సంక్రాంతి. ఎవరికి సెలవు కావాలి, ఎవరు కొత్త అల్లుళ్లు, పోయిన పండక్కి ఎవరు ఎవరికోసం త్యాగాలు చేశారు, పెద్ద డాక్టర్‌తో పండగపూటా తిట్లు తిన్నదెవరులాంటి విషయాలు వాళ్ల మధ్య చర్చకొస్తున్నాయి. ఇంతలోనే ఆసుపత్రి ముందుకి దూసుకొచ్చిన ఒక షేర్ ఆటో– అప్పటిదాకా భోగి మంట చుట్టూ అలముకున్న సరదాలతో పాటు అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఆ రాత్రి నిశ్శబ్దాన్ని కూడా పటాపంచలు చేసింది. ఆటో పూర్తిగా ఆగేలోపే గబగబా నలుగురు దిగారు.
‘పట్టండి పట్టండి’ అంటూ ఆటో లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పరుగున వచ్చి ఆ నలుగురితో కలిశాడు. వాళ్లంతా కలిసి ఆటోలోంచి ఒక కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏమైందో చూద్దామని మునివేళ్లపై నిలబడి వాళ్ల మధ్యలోకి చూపు సారించాను. స్పృహలో లేని ఒక కుర్రాడు. అతడి నూనూగు మీసాల కంటే ముందు చెంపలకంటిన తెల్లటి నురుగు కనిపించింది. నిండా ఇరవై కూడా ఉండవు. కాళ్లూ చేతులూ పట్టుకుని నలుగురు మోసుకెళ్లడం చూసి నా మనసంతా అదోలా అయిపోయింది. దాదాపు ఆటోలో వచ్చినవాళ్లంతా లోపలికి పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం మెట్ల పక్కనే ఉన్న అరుగుమీద కూలబడి అలా గోడకు జారబడిపోయాడు. మోకాళ్ల పైకి కట్టిన గళ్ల పంచె అక్కడక్కడా తెల్లటి తడి మరకలు. చొక్కా మధ్యగుండీ, చివరిదీ వదిలేసి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు.
కాస్త పరిశీలించి చూస్తే మన్ను, పేడ కలిసి అంటుకుని ఆరిపోయినట్టుగా ఉన్నాయి పాదాలు. ముఖం చూస్తే రైతు అని అర్థమవుతుంది. చుట్టూ ఏమున్నా అతను చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మనుషులతో ఒక టూ వీలర్ వచ్చి ఆగింది. అందులో వెనక కూర్చున్న ఇద్దరూ బండి దిగుతూనే లోపలికి పరిగెడుతూ, పార్కింగ్ చేస్తున్న మూడో మనిషితో ‘‘ఒరేయ్ వెంకన్నా! చతురుడు ఇక్కడున్నాడు చూస్కో’’ అంటూ అరుగుమీద ఉన్న అతన్ని చూపిస్తూ వెళ్లిపోయారు. ‘చతురుడా..!’ అని నేను ఒక్కక్షణం ఆ పేరు దగ్గరే ఆగేలోపే వెంకన్న అతని దగ్గరగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. అతని చెయ్యి భుజం మీద భరోసాగా పడేసరికి చతురుడు దుఃఖంతో వణికిపోయాడు. చేతిలో తుండు గుప్పెట నిండా పట్టుకుని నోట్లో కుక్కుకున్నాడు. గుండెల్లోని బాధ కళ్ల వెంట జలజలా జారుతున్నా అడ్డుకోలేకపోతున్నాడు.
వెంకన్న తన చేతిని భుజం మార్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు కాని, అతని ముఖంవైపు చూడలేకపోతున్నాడు. అప్పటికే వెంకన్న కళ్లు కూడా చెరువయ్యాయి. ఇంతలో లోపలినుంచి వచ్చిన ఒక వ్యక్తి గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరినీ చూసి,‘‘ఒరేయ్! ఏంట్రా ఇది. వెంకన్నా నువ్వు కూడా ఏంటెహె, పక్కనే ఉండి దైర్నం సెప్తావంటే.’’ఆ మాటలు విన్న వెంకన్న కళ్లు తుడుచుకుంటూ నువ్వు చూసుకో అన్నట్టుగా అతనికి సైగ చేసి పక్కకు వెళ్లిపోయాడు. చతురుడి దుఃఖం పోటెత్తిన గోదారిలా ఉంది. అది గమనించి పక్కనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఊరుకోరా చతురూ... భయమేం లేదు. డాట్రగారు వచ్చేసేడు. ఆడికేం కాదురా. కుర్రోడు, ఉడుకురత్తం. గెంటుకొచ్చేత్తాడులే. బయటడిపోతాడు నువ్వు కంగారడక,’’ అంటూ నోటికి అడ్డంగా పెట్టుకున్న ఆ తువ్వాలు నెమ్మదిగా కళ్లమీదకు జరిపి చతురుడి కన్నీటిధారలు కట్టే ప్రయత్నం చేశాడు.
హోరు వానలో పిల్లలగూడు చెదిరిన పక్షిలా వణుకుతున్నాడు చతురుడు. ఇప్పుడు అతన్ని తండ్రి స్థానంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. తెలియకుండానే గుండె ఇంకాస్త బరువెక్కినట్టు అనిపించింది. అసలేం జరిగిందో? లోపలి నుంచి ఒక నర్సు పేపరు తీసుకొని వచ్చింది. కూడా వచ్చిన మనిషి చతురుడ్ని చూపించేసరికి, ఆ కాగితం మీద అతని వేలిముద్ర తీసుకొని వెళ్లిపోయింది.పక్కనే బైక్‌ను ఆనుకుని కూర్చున్న వెంకన్న వైపు మళ్లాయి నా చూపులు.
పాదాలు కూడా అప్రయత్నంగానే అటు కదిలాయి. ఇంతలో అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ మోగడంతో పక్కకు తిరిగి రెండడుగుల దూరంలోనే ఆగాను. ఫోన్ ఎత్తి ‘హలో’... అనేలోగానే అవతలి గొంతు బయటకు వినిపిస్తోంది నాకు. ‘‘ఎంకన్నా... ఏవన్నారు, డాట్రగారు ఉన్నారా, పర్లేదు కదా! కళ్లు తెరిసి సూత్తన్నాడా..?’’ ఏం సమాధానం వినాల్సి వస్తుందో అనే భయంతో సాగుతున్న ప్రశ్నల వర్షంలా అనిపించింది నాకు. ‘‘డాట్రగారు వచ్చేరు, సూత్తన్నారు. మీరేం కంగారడకండి,’’ వెంకన్న సమాధానం నిశ్శబ్దంగా విన్నారు.
ఆ వెంటనే...‘‘నువ్వు లోపలే ఉన్నావా, ఎలా ఉందిపుడు?’’ మళ్లీ అదే ప్రశ్న అవతలి నుంచి.‘‘లేదు, అందరూ లోపలికెలిపోతే డాట్రగారు దెబ్బలెడతారని బయటున్నాను. ఆడికేం అవదు. వదిన జాగ్రత్త!’’చతురుడు, వెంకన్న అన్నదమ్ములనే విషయం స్పష్టం చేసింది ఆ మాట. చెవులు ఫోన్ మీద పెట్టి ఒకసారి ఎందుకో చతురుడి వంక చూశాను. కళ్లు పొడిబారి ముఖమంతా బెంగటిల్లి ఉన్నాడు. ఇంతలో ఫోన్లో మాటలు నా దృష్టిని మరల్చాయి.‘‘ఏం జాగర్తరా బాబూ, ఎవరూ ఆపలేకపోతన్నారు. తల బాదేసుకుంటంది, నా కొడుకో... నా కొడుకో... అంటా నేలంతా పొర్లాడిపోతంది. నీళ్ల చుక్క ఇచ్చినా గిరాటేసి కొట్టేత్తంది. నన్ను తీసుకెళ్లండి ఆస్పటల్‌కి, నేను నా కొడుకును చూడాలంటంది.
దాని బాధ సూళ్లాపోతన్నాంరా!’’ మాటలు విన్న వెంకన్న దుఃఖాన్ని ఆపుకుంటూనే, ‘‘అస్సలా... మీరెవరూ ఇటుకేసి రాకండి. మావున్నాం కదా!, ఏదైనా అవసరమైతే కవురెడతాం. బానేవుంది కళ్లు తెరిసాడని సెప్పండి వదినికి. ఇక్కడకి మాత్రం బయల్దేరొద్దు. కుసేపాగి నేనే పోన్ సేత్తాన్లే,’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వెంకన్న. అవతలి నుంచి ’అలాగే అలాగే సెయ్యి ఎంకన్నా’ అనే మాట వినిపించింది. వెంకన్న ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్నాడో లేదోగాని, గండిపడ్డ చెరువు ముందరి పంటచేనులా ఉన్నాడు చతురుడు. అన్నయ్య వైపు చూస్తే ఏమైనా అడుగుతాడేమో, ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా అటుపక్కగా తిరిగిపోయాడు. దగ్గరకు వెళదాం అనిపించినా, అతను కాస్త కుదురుకున్నాక మాట కలుపుదామని ఆగిపోయాను.
ఇంతలో లోపలి నుంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. వాళ్ల మనిషే, ఇంతకు ముందు ఆటోలోనుంచి దిగేటప్పుడు చూసిన గుర్తుంది. నేను ఉన్నవైపే నడుస్తూ వచ్చి,‘‘ఎంకన్నా, ఇంటికాడ ఎలావుందో, పోన్ సెయలాకపోయావా ఓసారి?’’ తోడొచ్చిన మనిషి కాబట్టి కాస్త నిబ్బరంగా ఉంది మాట.‘‘ఉప్పుడే ఇంటికాణ్ణుంచి సేసారు మాయా, డాట్రగారు సూత్తన్నారు కంగారడద్దొని సెప్పాను.’’ వెంకన్న కాస్త భయం భయంగానే,‘‘ఏవంటన్నారు మాయా?’’ ‘‘కాస్త కూస్తయితే పర్లేదుగానీ, ఈడమ్మ మొత్తం పట్టించేసాడ్రా కుర్రెదవ. మా సెడ్డా యాతన తెచ్చేడు. ఆయనగారు ప్రయత్నం సేత్తన్నాడు.
చూద్దాం, భగమంతుడే ఉన్నాడు,’’ అంటూ వెంకన్న దగ్గర అగ్గిపెట్టె తీసుకొని జేబులో చుట్ట బయటకు తీసి దాని కొస కొరికి బయటకు ఊస్తూ, ఇప్పుడే వస్తా అన్నట్టుగా పక్కకు కదిలాడు ఆ వ్యక్తి. వయసు యాభై దాటి ఉంటుంది. జుట్టు నెరిసింది. ఇలాంటి మంచి చెడ్డా బాగా చూసి, నలుగురి కోసం తిరిగి నలిగినవాడిలా ఉన్నాడు. వెంకన్నను కదిపి బాధ పెంచడం కంటే ఇతనితో మాట కలపడం కరెక్ట్ అనిపించింది. ఆటో అవతల కాస్త దూరంగా పొగ వదులుతున్న ఆ పెద్దాయన్ను చూసి అటువైపు కదిలాను. ఆస్పత్రి ఆవరణం కదా, అందరూ ఏదో ఒక బాధ మోస్తూనే ఇక్కడ నిలబడతారని తెలిసిన మనిషిలా నన్ను పలకరింపుగా చూశాడు. అది చూసి నేను ఇంకాస్త దగ్గరకు అడుగులేశాను.
‘‘ఏ ఊరండీ?’’ మాట కలిపాను.‘‘మన్యంవారిపాలెం, మీది?’’ ‘‘గండేపల్లి. మా అమ్మకు బాగోకపోతే తీసుకొచ్చాం. సడన్ గా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. సోడియం తగ్గిందట. మందులిచ్చారు, రాత్రికి ఇక్కడే ఉంచమన్నారు. పొద్దున్నే రాజమండ్రి తీసుకెళ్లాలి స్కానింగ్ కోసం.’’ నేను అడగాల్సిన సంగతి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని, ఆయన అడక్క ముందే నా వివరం మొత్తం పూర్తి చేసేశా. నా మాటలు విన్న ఆ పెద్దమనిషి నిట్టూర్పుగా,‘‘ఏంటో యింత యింత రోగాలు. ఒక వయసు దాటాక ఏది ఎలా ముంచుకొత్తందో చెప్పలాకపోతన్నాం.
హాయిగా బతకాల్సిన కుర్రెదవలేమో ఇలా చేత్తన్నారు.’’ ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ కుర్రాడిపై బాధతో నిండిన కోపంతో అన్నాడు. ‘‘ఏమైంది..?’’ నా ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విన్నాక మళ్లీ చతురుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి అతని అసలు పేరు చతురుడు కాదు. ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్లతో చతుర్లాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని ఊళ్లో అలా పిలుచుకుంటారు. అసలు పేరు వీరన్న. బయట ఊరోళ్లకు, ఇంట్లోవాళ్లకు, చుట్టాలకు తప్ప ఆ పేరు ఊళ్లో పెద్దగా తెలియదు. అతని నైజానికి పూర్తి విరుద్ధమైన స్థితిలో ఇప్పుడు వున్నాడనిపించింది. ఎప్పటిలాగే పొలం పని చూసుకొని కాస్త పెందరాడే ఇంటికి బయలుదేరిన చతురుడు, ఇంటికి దగ్గరలో ఉన్న గొడ్ల సావిడి దగ్గర ఆగాడు. అక్కడ అంతా శుభ్రం చేసుకుని పాలు పితుకుతున్నాడు.
ఇంతలోనే ఇంటినుంచి కబురు. కుర్రాడు మందు తాగేశాడు అర్జంటుగా రమ్మని. కాళ్ల మధ్యలో ఉన్న పాలక్యానుతో పాటు అతని గుండె జారిపోక ఏమవుతుంది? ఉన్న మనిషి ఉన్నట్టే పరిగెత్తాడు. అక్కడ నుంచి నేరుగా ఆటో ఎక్కి ఆస్పత్రికి వచ్చి ఇక్కడ కూలబడిపోయాడు. ఒక్కడే కొడుకు. పేరు శ్యామ్‌సుందర్. పెద్దాయన ఆ పేరు చెప్పగానే నోటి వెంట తెల్లటి నురుగు కారుతూ ఉన్న ఆ పిల్లాడి ముఖం గుర్తొచ్చింది. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. తాను పెట్టిన కండిషన్ ప్రకారం స్మార్ట్‌ఫోన్ బహుమతిగా కొనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ సెకండియర్. నెలరోజుల్లో పరీక్షలున్నాయి. ఇంతలోనే బలవంతపు చావుకి సిద్ధపడి కన్నవాళ్లకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు.
‘‘ఏదైనా అనండి, ఇయ్యాలా రేపు పిల్లలకు అదుపు లేకుండా పోయిందండీ. ఏదడిగితే అది కొనేయడం, కొనకపోతే కొనేదాకా ఆళ్లు అమ్మాబాబుని తినేయడం,’’ ఆలోచనగా వింటున్న నన్ను చూసి ఇంకాస్త గట్టిగా తనే, ‘‘కాలేజీకి పోయే కుర్రగాళ్ల చేతికి పోనెందుకు సెప్పండి? ఆళ్లు పాటాలింటారా, పోనే సూత్తారా? గట్టిగా ఏవన్నా అంటే ఆ మేస్టర్ల మీదకి కూడా మనమే యుద్ధానికి పోతన్నాం. ఇదంతా ఎవరిని ఉద్దరించడానికి?’’ నిలదీసినట్టుగా అడిగేసరికి నేను తలూపాను. శ్యామ్‌సుందర్ ఎందుకిలా చేశాడో చెప్పేసరికి అతని ఆవేదన నాలోనూ అనేక ప్రశ్నల్ని రేపింది.
స్మార్ట్ ఫోన్ చేతికొచ్చేసరికి చాలామంది కుర్రాళ్ల మాదిరే శ్యామ్‌సుందర్ లోకం కూడా మారిపోయింది. తెల్లారగానే చూసేది ఆ ఫోన్ ముఖమే, రాత్రి నిద్రపోయేది కూడా దాని ముఖం చూస్తూనే. ’ఎప్పుడూ ఆ పోన్లోనే తలకాయ పెట్టుకుని ఉంటావ్, ఏం చూత్తావ్‌రా గంటల గంటలు’ అనే మాట చాలామంది తల్లిదండ్రుల్లాగే చాలాసార్లు అన్నాడు చతురుడు. చదువుకు సంబంధించింది ఏదో చూస్తున్నామనో, ఫ్రెండు నోట్స్ పంపుతానన్నాడనో ఏదో ఒక కథ చెప్పి వాళ్లను ఏమార్చడం తప్ప మాట వినిందే లేదు సుందర్.
అంతకు మించి పట్టించుకునే తీరిక ఆ కష్టజీవికి లేదు. ఆ అలవాటు నెమ్మదిగా సుందర్‌ను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. డబ్బులు రాగానే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేయడం, సినిమాలకు వెళ్లిపోవడం, డబ్బు పోతే ఎవర్నో అప్పు అడగటం, ఇంట్లో అయితే ఆ ఫీజులని, ఈ ఫీజులనీ అబద్ధం చెప్పి తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మొత్తానికి కొన్ని నెలలుగా ఆ మాయావలయంలో చిక్కుకు పోయాడు. ఇంట్లో డబ్బు దొంగతనంగా తియ్యడం నుంచి బీరువాలో అమ్మ నగలు కూడా చాటుగా తీసుకెళ్లి పట్నంలో తాకట్టు పెట్టేయడం వరకు అయిపోయింది.
తెల్లారితే పెద్దపండగ. పెద్దలకు దండం పెట్టుకొని, మూలన పెట్టుకున్న కొత్త బట్టలు కట్టుకోవడం ఇంట్లో ప్రతి యేటా జరిగే తంతు. అమ్మ బీరువాలో నగలు కచ్చితంగా తీసుకొని వేసుకునే రోజు. ఎలాగైనా బెట్టింగ్ గెలిచి ఆ ముందు రోజే నగలు తెచ్చి బీరువాలో పెట్టేద్దాం అనుకున్నాడు సుందర్. కానీ... అతనికి అప్పటికీ తెలియంది ఏంటంటే, అది పోయే డబ్బు తప్ప వచ్చే డబ్బు కాదని; అదంతా పచ్చి మోసం అని. అమ్మ నగల కోసం అప్పు తెచ్చి పెట్టిన డబ్బు కూడా పోయింది. దిక్కుతోచక, ఇంట్లో అమ్మానాన్నకు నిజం చెప్పలేక, తెల్లారితే నిజం తెలిసిపోతుందనే భయంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. చదువురాని తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసిపెట్టి, పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డిమందు గడగడా తాగేశాడు.
‘‘ఆడి పిచ్చిగానీ... ఇలా ఎదవ పని చేశానని ఇంట్లో అమ్మాబాబుకి సెప్పడానికి జడిసినోడు, చావడానికి ఎందుకు భయపడలేదని!? సచ్చి సెప్పాలనుకున్నది కూడా అదే కదండీ? ఇది కూడా అర్థమై ఏడ్వకపోతే ఇంకేం సదువులు సంకనాకడానికి. ఉప్పుడేదైనా ఐతే ఈడేవైపోను, ఆయమ్మి ఏమైపోను. ఉన్నదొక్కడే ఒంటిగాడు. ఈడ్ని సూసుకునే కదా ఆళ్లు బతుకుతుంటా!’’ పెద్దాయన ఆసుపత్రి లోపలికెళ్లి చాలాసేపైనా నాకు మాత్రం ఆయన ప్రశ్నలే లోపల తిరుగుతున్నాయి. ఎందుకోగాని కాళ్లు నిలవడం లేదు, ఒక్కసారి లోపలికెళ్లి సుందర్‌ని చూడాలనిపించింది. వీలైతే డాక్టరుతో మాట్లాడి ఆ భరోసాను బయటకొచ్చి చతురుడికి చెప్పాలనిపించింది.
అమ్మని చూసి కూడా చాలాసేపయింది.
చెల్లి నిద్రపోయిందో, మెలకువగా ఉందో కనపడినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎమెర్జెన్సీ రూము బయట అంతా గడబిడగా ఉంది. సుందర్‌ను తీసుకొచ్చినవాళ్లు, ఆ తర్వాత చూద్దామని వచ్చిన వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు. నిర్లిప్తంగా తచ్చాడుతున్నారే కానీ ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా లేదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మనసు కీడు శంకిస్తోంది. వాళ్లను తప్పించుకుని లోపలికి వెళ్లబోతుంటే ఒక ఏడుపు వినిపించింది. నన్ను నెట్టుకుంటూనే కట్టలు తెంచుకున్న దుఃఖంతో బయటకు వెళ్లిపోతున్నాడు వెంకన్న. తడిసిన కళ్లు తుడుచుకొని సుందర్‌ను చూసే ధైర్యం చేశాను. తెల్లటి గుడ్డ అతని ముఖం మీద నుంచి కప్పుతుండగా చూశాను చివరిసారి. తొలిసారి చూసినప్పటి కంటే బాగున్నాడు. నూనూగు మీసాలను కప్పేసిన నురుగు ఇప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు సుందర్ కూడా లేడు.
గుండె బరువెక్కిపోయింది. ఊపిరి సలపనట్టుగా దేహం బిగుసుకుపోతున్నట్టుగా ఏదోలా ఉంది. వెంటనే అమ్మను చూడాలనిపించింది. నాలుగడుగులు వేసి పేషెంట్లు ఉన్న రూముల దగ్గరకు వెళ్లాను. బెంగగా అమ్మ బెడ్‌వైపు చూశాను. సెలైన్ బాటిల్ ఎక్కుతోంది. చెల్లెలు అక్కడే బెంచిమీద కూర్చుని అదే బెడ్ మీద అమ్మ కాళ్ల దగ్గర తలవాల్చి కునుకు తీస్తుంది. నెమ్మదిగా వెళ్లి అమ్మ పాదాలను ఒకసారి తాకి ముఖంవైపు చూశాను. సుందర్ తల్లి గర్తుకొచ్చింది. గబగబా నడుచుకుంటూ బయటకొచ్చాను. చతురుడ్ని చూడాలి అర్జంటుగా అన్నట్టు. తిరిగి వస్తుంటే ఎమెర్జెన్సీ రూమ్ దగ్గర అంతా ఇంకా గోలగానే ఉంది. కాగితాలు, సంతకాలు, అంబులెన్ ్స గొడవేదో నడుస్తుందక్కడ. వాళ్లందరినీ తప్పించుకుని బయటపడ్డాను. అరుగుమీద అటూ ఇటూ పొర్లుతున్న చతురుడ్ని చూసి గుండె చెరువైపోయింది. ఇందాక లోపలికి వెళ్లేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడాల్సింది. పక్కనే వెంకన్న పరిస్థితి కూడా అలాగే ఉంది.
అన్నకు ధైర్యం చెప్పే దారిలేక, వదినకు ఫోన్ చేసే ధైర్యం లేక, కాలి మునివేళ్లు నేలకు గుచ్చుతూ కన్నీళ్లు ఒంపుతున్నాడు.ఫార్మాలిటీస్ అయిపోయాయి. లోపలనుంచి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. అంబులెన్ వెనకపక్కకు వెళ్లడం చూస్తూ ఒక్కసారిగా గొల్లుమన్నారు చతురుడు, వెంకన్న. ‘‘ఇంటికెవరూ పోన్ గట్టా చెయ్యకండిరా, ఆయమ్మిని కాయలేరు,’’ అంటూ జరగాల్సినవి చక్కబెడుతున్నాడు పెద్దాయన. ముందు చతురుడ్ని, వెంకన్నను ఆటో ఎక్కించమన్నాడు. వాళ్లు కాదన్నాసరే వినలేదు. ‘‘ఆ కుర్రోడి ముఖం సూత్తూ అంబులెన్సులో కూసోలేరు, ముందు ఆటో తీసేయండి, మీరు కదలండ్రా... వెనకాల అంబులెన్సు ఎంతసేపొత్తాది! నడండి,’’ అనేసరికి నలుగురూ కలిసి చతురుడ్ని లేవదీయ బోయారు. ఎక్కడా మనిషి నేలను అంటి పెట్టుకుని కదలడం లేదు. అది చూసిన పెద్దాయన కాస్త దగ్గరకెళ్లి, ‘‘రేయ్ చతురా! ఇంక లేదు మనకి, అంతే రుణం.
నువ్వు ఎంత బాదుకున్నా ఎనక్కి తీసుకురాగలవా? ఇంటికాడ ఆడమనిషి పరిస్థితి ఏంటో ఆలోసించు కాస్త,’’ అంటుండగా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించారు. ‘‘ఇంత బాధ నా అన్న ఎలా తట్టుకుంటాడని ఎల్లిపోయావ్‌రా సుందరా,’’ అంటూ బోరున విలపిస్తున్న వెంకన్నను పెద్దాయన జబ్బ పట్టుకుని లేపి ఓదారుస్తూ,‘‘బాధే మరి, బాధ కాదేటి. కొరివెడతాడు అనుకున్నోడు మనకంటే ముందే కాటికెల్లిపోతే బాధ కాదా! ఏం చేత్తాం, రాతలు కనలేం,’’ అంటూ ఆటోలో కూర్చోబెట్టి పోనీమన్నాడు.ఇప్పుడు ఆటో వెళుతుంటే రాత్రి వచ్చినప్పుడు ఉన్నంత శబ్దం అనిపించలేదు నాకు. కానీ, అప్పటికంటే బరువుగా కదిలినట్టుంది. ఇంతలోనే హారన్ మోగింది. ఆస్పత్రి వెనకనుంచి వచ్చిన అంబులెన్సు ఆటో వెనకాలే వెళ్లిపోయింది తేలిగ్గా! సుందర్‌ని మోసుకుంటూ!మళ్లీ అక్కడంతా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే అది మునుపటి నిశ్శబ్దం కాదు. సమయం తెల్లవారి నాలుగు కావొచ్చింది.
అప్పుడప్పుడే లేచిన పేషెంట్ల అటెండర్లు, అంతవరకు జరిగిన విషయం గురించి ఆరా తీస్తున్నారు. ‘‘చిన్న వయసంటమ్మా... ఒక్కడే కొడుకంట... గడ్డి మందు తాగేశాడంట. చానా తంటాలు పడ్డారంట డాట్రగారు. అప్పుడుకే రక్తంలో పట్టేసిందంట. బతకలేదు, కన్నపేగు ఏమైపోద్దో,’’ అవే మాటలు నాకు చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. లోపలికి వెళ్లబోయి మళ్లీ వెనక్కి వచ్చి అరుగుమీద కూర్చుని గోడకు తల ఆన్చాను.చతురుడు పొలంలో గడ్డి మందు కొడుతున్నాడు. బెట్టింగ్ యాప్‌లు అన్నీ పురుగుల్లా రాలిపోతున్నాయి. వాడిపోయి మాడిపోతున్న కలుపులో యావజ్జీవ ఖైదీల్లా వికారంగా కనిపిస్తున్నారు యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇంతలో ఎవరో గట్టుమీద నిలబడి చతురుడ్ని ‘వీరన్నా!’ అని పిలవడంతో ఉలిక్కిపడి లేచాను. ఎప్పుడు పట్టిందో చిన్న మాగన్ను పట్టేసినట్టుంది. కలత కల పడింది. నిజమైతే ఎంత బాగుండో!

పూడి శ్రీనివాసరావు


