
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా డ్యాన్స్‌లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్‌గా తన కొరియోగ్రాఫర్‌ని బీట్‌చేసేలా నృత్యం చేసింది.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్‌లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు.
ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు.
(చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..)