
ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్‌ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే వచ్చే వ్యాధే తలసేమియా.. రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్లడంలో హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. తలసేమియా పుట్టుకతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. దీనికి జీవిత కాలం పర్యవేక్షణ అవసరం. ఈ వ్యాధి సోకిన చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. వీరు రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలాంటి చిన్నారుల దీనస్థితి చూసిన ఓ పసి హృదయం చలించింది. వారికి ఏదో విధంగా సేవ చేయాలనే తపన అతడిని వెంటాడింది. ఈ ప్రయత్నంలోనే భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన 15 ఏళ్ల సమర్థ్ లాంబా ’హెచ్‌బీ కేర్’ అనే సంస్థను ప్రారంభించి స్ఫూర్తిగా నిలిచాడు. తన వయస్సుకి మించి సామాజిక బాధ్యతను గుర్తించి, తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా కథనం..
సాధారణంగా 15 ఏళ్ల వయసులో చిన్నారులు చదువు, ఆటలు వంటి వాటిలోనే బిజీగా ఉంటారు. అయితే.. సమర్థ్ చిన్నతనంలోనే తలసేమియా బాధితుల జీవితాలు, వారి కష్టాలను తెలుసుకున్నాడు. వారి కోసం ఏదైనా చేయాలన్న తపనతో హెచ్‌బీ కేర్ అనే సంస్థను స్థాపించి, ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, రక్తదానం, ముందస్తు పరీక్షల అవసరాన్ని వివరించడంలో కూడా తనదైన పాత్ర పోషిస్తున్నాడు.
సేవల కోసం విరాళాల సేకరణ
2023లో ప్రారంభించిన హెచ్‌బీ కేర్ సంస్థ ద్వారా సమర్థ్ ఇప్పటి వరకు రూ.7.5 లక్షల నిధులను సమీకరించాడు. ప్రజల నుంచి విరాళాల ద్వారా రూ.2.5 లక్షలు, సీఎస్‌ఆర్ ఫండ్‌లో భాగంగా కొన్ని కంపెనీల నుంచి మరో రూ.5 లక్షలు వచ్చాయి. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్పందించాలని సోషల్ మీడియా వేదికగా 7 వేల మందికి పైగా సందేశాన్ని చేరవేశాడు.
వారధిగా ‘బ్లడ్ బ్రిడ్జ్’ యాప్
నగరంలో ఐదు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, వందలాది మందిని చైతన్యవంతులుగా మార్చాడు. భద్రుక కాలేజ్, ఎమ్‌జీఐటీ, కేబీఆర్ పార్క్ వంటి ప్రదేశాల్లో నిర్వహించిన క్యాంపులకు స్పందన లభించింది. తొలి క్యాంప్‌లోనే 40 మందిని రక్తదాతలుగా మార్చాడు.
‘బ్లడ్ బ్రిడ్జ్’ వంటి యాప్ ఆధారిత సేవలపై అవగాహన కల్పించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సేవా కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాడు. సమర్థ్ సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అమెరికాలోని యూసీ బెర్కిలీ విశ్వవిద్యాలయంలోని సుటార్డియా సెంటర్ వద్ద ప్రదర్శించే అవకాశం పొందాడు.
ఇతర నగరాలకు విస్తరించాలి
భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాల్లో ప్రయాణం చేయాలనుంది. హెచ్‌బీ కేర్‌ను ఇతర నగరాలకు విస్తరించాలనే ప్రణాళికలు ఉన్నాయి. అవగాహనతో ముందస్తు పరీక్షలు నిర్వహిస్తే తలసేమియా వంటి వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి యువకుడు వలంటీర్‌గా మారాలి. ప్రతి రక్తదాన శిబిరం ఒక జీవితాన్ని కాపాడుతుంది.
– సమర్థ్ లాంబా
(చదవండి: