
పఠనాసక్తి ఉన్న వారి కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటాయని తెలుసు. అలాంటి వారికి సిటీలో గ్రంథాలయాలు ఎక్కడా అని భూతద్ధం పెట్టి వెతకాల్సిన పనిలేదు. వాటిని వేళ్లమీదే లెక్కబెట్టొచ్చు. వాస్తవానికి నగరంలో గ్రంథాలయాలు అరకొరా ఉన్నా.. ఆ లైబ్రరీలో ఉండే వసతులు నామమాత్రమే అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ కంపెనీ అత్యాధునిక లైబ్రరీని నగరవాసుల కోసం అందుబాటులోకి తెచ్చిది. ఏమాత్రం లాభాపేక్ష, వ్యాపార కోణం లేకుండా పూర్తి అధునాతన వసతులతో సిటీలో ఓ లైబ్రరీ.. మంగళవారం ప్రారంభమైంది.
టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోని టాప్ 10లో ఒకటిగానే కాకుండా 7వ స్థానంలో నిలిచిన సంస్థ కోఫోర్జ్. ఈ కార్పొరేట్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీని నగరంలోని కొత్తగూడ జంక్షన్‌లో ప్రణవ్ బిజినెస్ పార్క్, 8వ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసింది.
గత సంవత్సరం ఫిబ్రవరి 2024లో నోయిడాలో మొదటి కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ తర్వాత రెండోది గురుగ్రామ్‌లో ప్రారంభించామని, ఇవి వేలాది సందర్శకుల రాకపోకలతో సందడిగా మారాయని, ఈ నేపథ్యంలో నగరంలో 3వ అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.
విశాలమైన..విశేషాల్లో మిన్న..
ఈ లైబ్రరీ పఠనాభిలాషులు ఎవరైనా సరే రావచ్చు. లోనికి ప్రవేశించిన తర్వాత ఒకసారి డిజిటల్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఆ తర్వాత కేవలం సైన్ ఇన్ అయ్యి ఎన్ని సార్లయినా రాకపోకలు సాగించవచ్చు.
దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 15,000 కంటే ఎక్కువ పుస్తకాలను అందించనున్న ఈ కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ వారాంతాలు, సెలవులలో సహా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శకులను స్వాగతిస్తుంది. ఏకకాలంలో 160 మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విభిన్న రకాల సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. లైబ్రరీ ఆధ్యంతం ఆహ్లాదకరమైన ఇంటీరియర్‌తో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది.
నో చాటింగ్, వర్కింగ్.. ఓన్లీ రీడింగ్..
ఒక అధునాతన కేఫ్‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. ఈ లైబ్రరీలో కాలక్షేపానికి చాటింగ్స్, ల్యాప్ టాప్‌పై ఆఫీస్ వర్క్స్ వంటివి అనుమతించరు. కేవలం పఠనాభిలాషుల కోసం మాత్రమే ఏర్పాటైన ఈ లైబ్రరీలో బుక్ రీడింగ్ సెషన్స్, బుక్ లాంచ్ సహా ఏ రకమైన గేదరింగ్స్‌కు అవకాశం లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పుస్తకాలను చదువుకోవడం మాత్రమే ప్రధానం అయినప్పటికీ.. అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటే రిఫండబుల్ డిపాజిట్ కట్టి తీసుకెళ్లవచ్చు.
కిడ్స్ స్పెషల్ జోన్..
ఈ లైబ్రరీలోనే ఒక కార్నర్‌లో కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు.. అందులో చిన్నారులకు ఉపయుక్తమైన పుస్తకాలు ఉంచారు. అదే విధంగా ఫిక్షన్, నాన్–ఫిక్షన్, పిల్లల సాహిత్యం నుంచి స్వచ్ఛంద సేవ, వ్యాపారం, ఆధ్యాతి్మకత, కళ, కృత్రిమ మేధస్సు, సాంకేతికత, ఫొటోగ్రఫీ, కవిత్వం.. సహా అన్ని విభాగాల్లో ప్రసిద్ధ పుస్తకాల సేకరణ ఉంది.
ఈ సేకరణలో పెంగి్వన్, హార్పర్‌కాలిన్స్, అమర్ చిత్ర కథ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ప్రెస్ సాహిత్య అకాడమీ వంటి 350కి పైగా ప్రముఖ ప్రచురణకర్తలకు చెందిన 13,000 పైబడిన రచనలు చోటు చేసుకోనున్నాయిు. లైబ్రరీ కేటలాగింగ్ నిర్వహణ పూర్తిగా డిజిటలైజ్ చేశారు.