
తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో చారిత్రక పర్యాటకం అనగానే చాలా మందికి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ అందరికీ తెలిసిన ఈ చారిత్రక విశేషాలు మాత్రమే కాకుండా.. కాలగమనంలో మరుగునపడిపోయిన అనేక కట్టడాలు నిశ్శబ్దంగా దర్శనమిస్తున్నాయి. కొత్త మెరుపుల మధ్య వాటి వెలుగులు మసకబారుతున్నాయి. అద్భుతమైన కట్టడాలు.. ఆకట్టుకునే విశేషాలను తడిమి చూస్తే ఎన్నో మధురానుభూతులను కలి్పంచే అనేక పర్యాటక విశేషాలు ప్రాచుర్యానికి నోచుకోవడంలేదు.. ఇవి తప్పక చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కనబడకపోవచ్చు. కానీ వాటిని సందర్శిస్తే మనకు తెలియని హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి.
పర్యాటకులు, సందర్శకుల గుర్తింపుకు నోచుకోకుండా.. గోల్కొండ కోట వెనుక భాగంలో, ఆక్రమణల మధ్య మరుగున పడిన నయా కిలాకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని 1656లో షాజహాన్ పరిపాలన సమయంలో జరిగిన మొఘల్ దాడికి ప్రతిస్పందనగా నిర్మించారు.
ఒకప్పుడు గోల్కొండ రక్షణ వ్యవస్థలో భాగంగా ఉండేది.. ఇప్పుడు ప్రధాన కోట కాంప్లెక్స్ నుంచి వేరుగా ఉంది. ఇందులోనే మజూ్న, లైలా బురుజులు, హైదరాబాద్ స్థాపనకు ముందు 1561లో నిర్మితమైన ముస్తఫా ఖాన్ మసీదు, డెక్కన్ కవి పేరిట నెలకొన్న ముల్లా ఖయాలి మసీదు, ఆఫ్రికన్ సన్యాసులు నాటినదిగా చెప్పే 400 ఏళ్ల నాటి పాత బోబాబ్ చెట్టు వంటి విశేషాలెన్నో ఉన్నాయి.
స్మృతుల నిధి.. రేమండ్ సమాధి..
ఇది చాదర్‌ఘాట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని హిల్స్‌పైన అస్మాన్ ఘడ్ ప్యాలెస్‌లో ఉంది. (మిచెల్ జోచిమ్ మేరీ రేమండ్) అనే ఫ్రెంచ్ జనరల్ సమాధి. ఆయన నిజాం అలీ ఖాన్ (ఆసఫ్ జాహ్–2) దగ్గర సేనాధిపతిగా సేవలందించారు.
ఆయన్ని హిందువులు ‘మూసా రామ్, ముస్లింలు’, ‘మూసా రహీం’గా పిలిచేవారని చెబుతారు. నిజాంలు కూడా 1940ల వరకూ ఇతని వర్థంతి సందర్భంగా నివాళులర్పించేవారట. దీనిని 2003లో పునరుద్ధరించినా, భారత–ఫ్రెంచ్ స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ స్థలం ఇప్పటికీ పర్యాటక ఆకర్షణగా మారలేదు.
బహుత్ పురానా.. ఈ ఠాణా..
పర్యాటక అర్హతలున్న పోలీస్ స్టేషన్ సైతం ఉన్న నగరం మనదే అని చెప్పొచ్చు. ఎప్పుడో 1867లో నిర్మించిన జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, నగరంలోని పురాతన బ్రిటిష్ కాలపు కట్టడాలలో ఒకటి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కనే ఉన్న ఇది.. బ్రిటిష్ శాసన కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కీలక పరిపాలనా కేంద్రంగా ఉపయోగించబడింది.
ఆర్చ్‌లా మార్చిన వరండాలు, స్టోన్‌వాల్స్, కలోనియల్ శైలిని ప్రతిబింబించే నిర్మాణ పద్ధతులతో పాటు.. ప్రత్యేకమైన బ్రిటిష్ శైలి ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని సందర్శించాలని ఆర్కిటెక్ట్స్ అంటున్నారు.
అందమైన కథ.. బ్రిటిష్ రెసిడెన్సీ..
వైట్ మొఘల్ అనే పుస్తకంలో రాసిన ఓ అందమైన ప్రేమ కథకు మౌన సాక్షి గా ఈ భవనాన్ని పేర్కొంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయం కోసం సుమారు 1805లో ఆర్కిటెక్ట్ సామువెల్ రస్సెల్ ఆధ్వర్యంలో నిజాంల దగ్గర బ్రిటిస్ రెసిడెంట్ అయిన జేమ్స్ అకిలిస్ కిర్క్‌పాట్రిక్ (వైట్ మఘల్ గా ప్రసిద్ధుడు) కోసం నిర్మితమైంది. దీనిని పల్లాడియన్ శైలిలో డిజైన్ చేశారు.
ఈ విశాలమైన విల్లాలో ఆరు కొరింథియన్ స్తంభాలు, ద్వితీయ అంతస్తుకు తీసుకెళ్లే ద్విపాద మెట్లదారి, పెయింటింగ్స్‌తో నిండిన పైకప్పులు.. పార్కే ఫ్లోర్స్ బ్రిటిష్ సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. అమెరికాలోని వైట్ హౌస్‌ని తలపించే ఈ భవనంలో చరిత్రను తెలియజేసే చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ భవనం 1949 తర్వాత కోఠి మహిళా కళాశాలలో భాగమైంది. కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరగా దీన్ని 2022లో పునరుద్ధరించారు.