వామ్మో దెయ్యాల ఊళ్లు.. ఆ ఇళ్లలో ప్రేతాత్మలు ఉన్నాయా?.. అక్కడికి వెళ్లాలంటే?

USA: Interesting Story About Bodie State Historic Park In California - Sakshi

ఆ ఊళ్లో ఎటుచూసినా చెదురు మదురుగా విసిరేసినట్లుండే భూత్‌ బంగ్లాలే కనిపిస్తాయి. వీధుల్లో తిరుగుతుంటే, అక్కడక్కడా పాడుబడిన వాహనాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా కనిపించే దెయ్యాల ఊళ్లుగా పేరుమోసిన ఊళ్లలో ఆ ఊరొకటి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఊరి పేరు బోడీ. ఇదొక చిన్న పట్టణం. రెండువందలకు పైగా ఇళ్లు, చర్చిలు, పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోదకేంద్రాలు, హోటళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండరు.

అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతుంటారు. పర్యాటకులు బస చేయడానికి ఇక్కడా ఎలాంటి వసతులూ ఉండవు. బాగున్న రోజుల్లో ఈ ఊరి జనాభా పదివేలకు పైగానే ఉండేది. ఊరికి దగ్గరగానే బంగారు గని ఉండేది. గనిలో పనిచేసేవాళ్లంతా ఈ ఊళ్లో ఉండేవాళ్లు. ఊరే కాదు, ఊరవతల ఉండే బంగారు గని కూడా ఇప్పుడు ఖాళీగా మిగిలింది.

దెయ్యాల భయంతోనే జనాభా అంతా ఈ ఊరిని విడిచిపెట్టి తలోదిక్కూ వెళ్లిపోయారు. డెబ్బయ్యేళ్ల కిందట ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకెవ్వరూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయకపోవడంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని ‘బోడీ స్టేట్‌ హిస్టారిక్‌ పార్క్‌’గా మార్చింది. గుండెధైర్యం ఉన్న పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వస్తుంటారు.

వారిలోనూ కొందరు ఇక్కడ కొన్ని పాడుబడిన ఇళ్లలో ప్రేతాత్మలు చూశామని, కొన్ని ఇళ్ల నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు విన్నామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. పాడుబడిన ఇళ్లలో అప్పటి జనాలు వాడుకున్న ఫర్నిచర్, ఇతర వస్తువులు దుమ్ముపట్టి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఊరిని సందర్శించడానికి పగటి వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. రుతువును బట్టి సందర్శకులను అనుమతించే వేళల్లో మార్పులు ఉంటాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top