ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'! | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'!

Published Sun, Feb 11 2024 12:24 PM

Tribal People Migratory Path For Livestock - Sakshi

ఈ జీవిత పోరాటంలో ఒక్కొక్క‌రి జీవ‌నం ఒక్కోవిధంగా కొన‌సాగుతూంటుంది. వాటిలో ఎన్నో మార్పులు, చేర్పులు కూడా జరుగుతూంటాయి. కొన్ని స‌మ‌యాల్లో జీవించ‌డానికి వ‌ల‌స‌లు వెళ్లాల్సివ‌స్తుంది. కొంద‌రైతే ఊర్లు, దేశాలు, ఏకంగా ఖండాలే దాటి వెళ్తున్నారు. అది కూడా బ‌స్సులు, రైల్లు, విమ‌నాల్లోనో ప్ర‌యాణిస్తున్నారు. జీవ‌న శైలిలో ఇది ఒకెత్తు అయితే, మ‌రో ఎత్తు.. మూగ జీవాల‌కై.. గిరిజన తండా వాసులు ప‌డే తంటాలు. ఎండ‌న‌కా, వాన‌న‌కా, రాళ్ల‌న‌కా, ముళ్ల‌న‌కా వారివి కాలిన‌డ‌క ప్ర‌యాణాలు. ఇలా ఒక‌రోజు రెండురోజులు కాదు.. ఏకంగా ఏడాదిలో ఆరుమాసాలు. ఇంటివాకిలిపై, పిల్లాజ‌ల్ల‌ల‌పై మ‌న‌సున్నా గానీ, ఎంచుకున్న మార్గాన్ని వీడ‌క‌, మూగ‌ప్రాణుల క‌డుపు మేత‌కై ఈ ఆడ‌ప‌డుచుల ప్ర‌యాణాన్ని గురించి ఓసారి చూద్దాం!

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, వీర్నపల్లి గిరిజన తండాలకు చెందిన 25 కుటుంబాలు ఆరు నెలలపాటు ఇల్లు విడిచి, ఊరును వదిలి వనవాసం చేస్తూ... ఆవులను మేపుతుంటారు. స్థానికంగా గడ్డి లేకపోవడంతో ఊరు వదిలి మన్నెం(వలసపోవడం) అనివార్యమైంది. మద్దిమల్ల నుంచి అటవీమార్గంలో ఆవులను మేపుతూ.. కోరుట్ల, మెట్‌పల్లి, ఖానాపూర్‌, నిర్మల్‌ శివారులోకి వెళ్లి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆవులను మేపుతారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే ఆవులతోపాటు నిద్రిస్తారు.

అక్కడే వంట చేసుకుని తింటారు. ఎవరైనా పెద్ద రైతులు తమ పొలాల్లో సేంద్రియ ఎరువుల కోసం ఈ ఆవుల మందలను వారం, పది రోజులు పెట్టించుకుని డబ్బులు ఇస్తారు. ఆవుల మూత్రం, పేడ పొలాలకు సేంద్రియ ఎరువులుగా పనికి వస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా ఆవుల మందలను పొలాల్లో పెట్టిస్తారు. అలా వచ్చిన డబ్బులతోనే గిరిజనులు బియ్యం కొనుక్కుని, కట్టెల పొయ్యిపై వంట చేసుకుని తింటారు. కొన్ని ఆవులను, కోడెలను ఒక్కోదాన్ని రూ.15వేల నుంచి రూ.30 వేలకు స్థానిక రైతులకు, పశువుల సంతల్లో అమ్ముతారు. కోడెలు రైతులకు ఎవుసానికి అక్కరకు వస్తుంటాయి. ఇలా ఆరు నెలలపాటు వనవాసం చేసి వర్షాకాలంలో ఇల్లు చేరుతారు.

ఆవుల మందలే ఆధారం..
గిరిజనులకు ఆవుల మందలే ఆధారం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉండేవి. ఇప్పుడు వాటిని మేపేందుకు చెల్కలు లేక, అడవుల్లోకి వెళ్లకుండా కంచెలు వేయడంతో ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు వన్యప్రాణుల భయం వెంటాడుతుండడంతో అడవుల్లోకి వెళ్లడం తగ్గిపోయింది. మైదాన ప్రాంతాలన్నీ పొలాలుగా మారడంతో పశుపోషణ భారమైంది. అయినా.. కొందరు గిరిజనులు ఆవులను పోషిస్తూ.. వాటితో వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టడం, పిల్లలను చదివించడం, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆవుల మందల సంఖ్య తగ్గిపోయింది. అయినా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ వంద కుటుంబాల వరకు ఆవులే ఆధారంగా ఇప్పటికీ జీవిస్తున్నాయి.

ఇవి చ‌ద‌వండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!

Advertisement
 
Advertisement