House Interior Design: జాడీలో పూసిన పూలు

Trendy Flower Decoration Which Shows House Beautiful - Sakshi

Trendy House Interior Design: ఇంటి అలంకరణలో ఫ్లవర్‌ వేజ్‌ల వాడకం తెలిసిందే. అందమైన ఫ్లవర్‌వేజ్‌ల ఎంపిక గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవల ఇంటీరియర్‌ డెకార్‌లో భాగంగా పాతకాలం నాటి వస్తువుల ప్రాధాన్యత పెరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది పచ్చడి జాడీ. 

బామ్మల కాలం నుంచి వివిధ రకరాల పచ్చడి జాడీల గురించి మనకు పరిచయమే. పది కేజీల పచ్చడి మొదలుకొని, పావు కేజీ పచ్చడి పట్టేంత జాడీలు ఉండేవి. ఆవకాయ, మాగాయ, ఉసిరి, చింత, గోంగూర.. ఇలా రకరకాల పచ్చళ్లకు రకరకాల పరిమాణాల్లో జాడీలు ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం తగ్గి, చాలా వరకు అటక చేరిపోయాయి. లేదంటే, ఊళ్లోనే వాటిని వదిలేసి వచ్చి ఉంటారు. కానీ, ఇప్పుడు ఇంటి అలంకరణలో ఇవే వైవిధ్యం అయ్యాయి. అందుకే ఎక్కడో మూలన చేరిన జాడీలు ముందు గదిలో దర్జాపోతున్నాయి. 

ఇత్తడి.. జాడీ 
పక్క పక్కనే చేరి కొత్తగా కబుర్లు చెప్పుకుంటున్నాయి పాతకాలం నాటి ఇత్తడి వస్తువులు, పచ్చడి జాడీలు. జాడీ పువ్వులను సింగారించుకొని బామ్మల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే ఇత్తడి పాత్రలు ఇంపుగా వింటున్నాయి. ఇంటి డెకార్‌లో వింటేజ్‌ స్టైల్‌ ఎప్పుడూ ప్రత్యేకమే అని నిరూపిస్తున్నాయి. 

చిన్నా పెద్ద.. జాడీ
పరిమాణాలు, షేపుల్లో వివిధ రకాల జాడీలను ఎంచుకొని తాజా పువ్వులు లేదా డ్రై పువ్వులను అలంకరిస్తే సంప్రదాయ సొగసు, పండగ కళ నట్టింటికి నడిచివచ్చినట్టే. 

పచ్చని మొక్కకు జీవం
ఎర్రని నోరూరించే పచ్చడికే కాదు పచ్చని మొక్కలకూ జీవం పోస్తుంది జాడీ. ఇండోర్‌ ప్లాంట్స్‌కు ఇలవేల్పుగా కొత్త రకం కుండీలో ఖుషీగా మారిపోతుంది. మొక్కలకు, పూలకు కుండీలుగా మారి కొత్త కళతో వెలిగిపోతున్నాయి. 


ఎప్పటికీ కళగా!
తాజా పువ్వులు రోజూ అలంకరించలేం అనుకునేవారు ఇప్పటికే ఉన్న కృత్రిమ ఆకులు, పువ్వుల కొమ్మలను జాడీలో పొందిగ్గా అమర్చితే చాలు. సెంటర్‌ టేబుల్‌కి ఆకర్షణీయత పెంచుతుంది. సైడ్‌ వాల్‌ షెల్ఫ్‌లో కళగా మెరిసిపోతుంది. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలిసి ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఆధునికత వైపు పరుగులు తీసి అలసిపోతే ప్రాచీన సంపద అక్కున జేర్చుకుని మనసును సేద తీరుస్తుంది. అందుకు అసలు సిసలైన ఉదాహరణగా పచ్చడి జాడీలు నిలుస్తున్నాయని ‘హోమ్‌ హార్మనీ, మై హోమ్‌ వైబ్స్‌’ క్రియేషన్స్‌ అలంకరణను ఇలా కళ్లకు కట్టింది.  

చదవండి: బెదిరించినా సరే మహేశ్‌ అలా చేయరు : సుధీర్‌బాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top