ఫండే
శ్రీవారి గోపురం వెనుక శతాబ్దాల చరిత్ర
తిరుమల కొండపైకి చేరుకున్న భక్తులకు దూరం నుంచే కనిపించే బంగారు గోపురం ఆనందనిలయ విమానం. శ్రీవారి ఆలయంపై నిలిచిన ఈ స్వర్ణ విమానం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదు. శతాబ్దాలుగా వివిధ రాజులు, పాలకులు, భక్తులు సమర్పించిన కానుకలు, చేపట్టిన జీర్ణోద్ధరణ పనుల ద్వారా ఆనందనిలయం నేటి వైభవాన్ని సంతరించుకుంది. ఆలయ చరిత్రను పరిశీలిస్తే ఈ బంగారు విమానం వెనుక అనేక రాజవంశాల సేవ కనిపిస్తుంది.
ఆనందనిలయ విమానానికి సంబంధించిన నిర్మాణం, బంగారు తాపడం అనేక దశల్లో జరిగింది. పురాణ కథనం ప్రకారం వైకుంఠం నుంచి గరుడుడు ఆనందనిలయ విమానాన్ని తీసుకొచ్చి తిరుమలలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు. చారిత్రకంగా మాత్రం ఆలయ నిర్మాణం, విమానానికి సంబంధించిన జీర్ణోద్ధరణలు వివిధ కాలాల్లో జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి.
ఆనందనిలయ విమానానికి బంగారు తాపడం చేసిన తొలి దశలను పాండ్య, యాదవరాయ, విజయనగర కాలాలతో అనుసంధానించే ఆధారాలు ఉన్నాయి. జటావర్మ సుందర పాండ్యుడు 13వ శతాబ్దిలో విమానానికి çబంగారు అలంకరణ చేయించి, బంగారు కలశాన్ని సమర్పించాడు. అనంతరం వీరనరసింగ యాదవరాయలు తన బరువుకు సమానమైన బంగారాన్ని తులాభారంగా సమర్పించి, విమానానికి బంగారు తాపడం చేయించాడు. తరువాత సాళువ మంగిదేవుడు కూడా ఆనందనిలయ విమానానికి బంగారు తాపడం చేయించినట్లు శాసనాలు చెబుతున్నాయి. అనంతరం 1417లో విజయనగర కాలానికి చెందిన చంద్రగిరి మల్లన మహామణి మండపాన్ని నిర్మించడంతో పాటు ఆనందనిలయ విమానాన్ని పునరుద్ధరించాడు.
ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారిని పలుమార్లు దర్శించుకున్నారు. క్రీ.శ. 1518 సెప్టెంబరు 9న ఆనందనిలయ దివ్య విమానానికి బంగారు తాపడం కోసం ముప్పయివేల వరహాలు సమర్పించాడు. కృష్ణదేవరాయల అనంతరం కూడా ఆనందనిలయ విమానానికి జీర్ణోద్ధరణలు, బంగారు తాపడం పనులు కొనసాగాయి. విజయనగర రాజు వీరనరసింగదేవరాయలు తన బరువుకు సమానమైన బంగారాన్ని సమర్పించి విమానంతో పాటు బంగారు వాకిలికి సంబంధించిన పనులు చేయించాడు. అనంతరం 1630లో కాంచీపురానికి చెందిన తాతాచార్యులు, 1909లో తిరుమలలోని మహంతుల కాలంలో రామలక్ష్మణదాస్ తదితరులు విమానానికి బంగారు తాపడం పనులు చేయించారు.
స్వాతంత్య్రం తర్వాత కూడా ఆనందనిలయ విమానానికి ప్రత్యేక ప్రాధాన్యం కొనసాగింది. 1950వ దశకంలో పాత లోహపు పలకలను తొలగించి విమానానికి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనులకు సుమారు ఐదేళ్లు పట్టింది. పాత నిర్మాణాన్ని బలోపేతం చేసి రాగి పలకలను అమర్చి వాటిపై బంగారు పలకలను అమర్చారు. 1964లో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంతో కొత్తగా పునరుద్ధరించిన ఆనందనిలయ విమానానికి సంప్రోక్షణ నిర్వహించారు. ఆనందనిలయ విమానం కేవలం బంగారు గోపురం మాత్రమే కాదు. దానిపై 64 వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. విమానంపై కొలువైన విమాన వెంకటేశ్వరస్వామికి కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
ఇదీ చదవండి: ఒక్కో వాహనం.. ఒక్కో ప్రత్యేకత.. శ్రీవారి బ్రహ్మోత్సవాల చరిత్ర ఇదే!


