తెరమరుగవుతున్న తెలుగు లిపి!

Telugu Become An Endangered Language Preserving And Promoting - Sakshi

దక్షిణాది భాషలైన తమిళ, మలయాల, కన్నడ, తెలుగు భాషలలో మన తెలుగు భాష తెరమగయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక రాను రాను ఇంగ్లీష్‌ భాష ప్రభావంతో పిచ్చి తెలుగుగా మారుతుందో లేక అర్థరహితమైన భాషగా మారిపోతుందో తెలియదు. ఏదో చేయాలనుకున్నా ప్రకటనలకే పరిమితవుతుందే తప్ప కార్యరూపం దాల్చే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే  అది సాధ్యం కాదే కూడా. కనీసం ఇవాళ ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష గురించి దానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుందాం. ఈ విధంగానైన మన తెలుగు భాష, లిపి ఒక్కప్పుడూ ఉండేదని గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. 

నిజానికి ఒక లిపి ఏర్పడటానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. ఒక రాయి నీటిలో ఒరుసుకుని మొనదేలి గుండ్రంగా అయినట్లు మన తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఉంటుంది. అసలు మన వర్ణమాలలోని అక్షరాలను గమనిస్తే..'అ' అక్షరం నవ్వుతున్నట్లుగానూ, 'ఖ' అంక్షరం నెమలి పురివిప్పినట్లు, 'ఠ' అక్షరం బుగ్గన సొట్టలా ఎంత అందంగా ఉంటాయి. అలాగే వర్ణమాలలో అచ్చులు, హల్లులు ఏర్పడ్డ పద్దతి భాషను శాశ్వతంగా నిలిపేలా ఉంటుంది తెలుగు లిపి. మాట్లాడే భాష మొత్తం లిపి కాకపోవచ్చు కానీ దాదాపుగా మాట్లేడ భాషకు దగ్గర దగ్గరగానే వర్ణమాలలానే ఉంటుంది. అంతలా ఇమిడిపోయి ముత్యాల్లా ఉండే మన తెలుగు లిపి ఇప్పుడెందుకనో చాలామందికి వెగటుపుడుతోంది. అసహస్యించుకోవాల్సినవిగా ఉన్నాయి.

ఎందుకంటున్నానంటే మన తెలుగుని తెలుగు లిపిలో రాస్తే బావుండు దాన్ని ఇంగ్లీష్‌లో రాసి తెగులు పట్టించేస్తున్నారు. ఇలా రాసి.. రాసి.. అసలు తెలుగు లిపి కాస్త ఇంగ్లీష్‌ మిక్స్‌డ్‌ తెలుగు లిపిగా మార్చేసి అర్థరహిత భాషగా తయారవ్వుతుందేమో! అని భాషావేత్తలు బాధపడుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయులంతటి వారే "తేనేలూరు తెలుగు భాష దేశా భాషలందు లెస్సా" అన్న మాట విలువలేనిదిగా అయ్యిపోతుందని ఆందోళన చెందుతున్నారు. మన మనుగడ కోసం, జీవనోపాధి రీత్యా, తప్పక ఇతర భాషలను నేర్చుకోవాలి. అలానే మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్‌ నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. అవసరం కూడా. అదే సమయంలో మన మాతృభాషకు తిలోదకాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయం. మన తల్లి లాంటి భాషని మనమే చంపేసుకోవడం సమంజసమా?.

ఇలా తెలుగును ఇంగ్లీష్‌ లిపిలో రాసే సమస్య సినిమా పాటలకు కూడా అంటుకుంది. పక్క రాష్ట్రాల నుంచి సింగర్‌ల నుంచి తెప్పించుకుని పాటలు పాడిస్తారు. ఇక్కడే అసలైన సమస్య వస్తుంది. వారికి పాటా అర్థమయ్యేలా తెలుగులోని పాటనే ఇంగ్లీష్‌లో లిప్యంతరీకరణ చేసి కూనీ చేసేస్తారు. ఇక వారు దాన్ని చదివి ఉచ్ఛారణనే మార్చేసి కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. అంతేగాదు ఆ మహానుభావుల పాడిన పాటను నేర్చుకుంటూ మన వాళ్లు కూడా ఇలానే పలకాలేమో లేక సంగీతంలో ఇలా పలకాలేమో అన్నట్లుఫాలో అయిపోతున్నారు. ఇలా తెలుగు భాషను కూనీ చేయడం ఎంతవరకు వెళ్లిపోయిందంటే..రాబోయే తరాలను కన్ఫ్యూజ్‌ చేసి వద్దురా బాబాయో! అనేంతకు వచ్చేసింది.

ఇలా మనలా మాతృ భాషను ఇంత దారుణంగా కూనీ చేస్తున్నావారెవ్వరూ ఉండరేమో!. ఇదంతా చూస్తుంటే ఇంకో రెండొందల ఏళ్లలోనే తెలుగు లిపి అదృశ్యమయ్యిపోతుందేమో!. మహా అయితే మాట్లాడే భాషగా ఇంకొంత కాలం బతకవచ్చేమో!. అది కూడా తెలుగు మాట్లాడే వాళ్లు బతికి ఉంటేనే. ఆ తర్వాత మన తెలుగు భాష తర్వాతితరాలకు శ్రీనాథుడి పద్యం వలే గందరగోళంగా ఉండొచ్చు. ఎవరో విడమరిచి చెబితే గానీ అర్థం కాకపోవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంగ్లీష్‌ మాట్లాడటం రాక తెలుగు మాట్లాడొచ్చేమో గానీ ప్రత్యేకంగా తెలుగు భాష మాట్లాడే వారు ఉండరేమో!. అంతేగాదు భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరనే భరోసా కూడా లేదు.

కనీసం ఇలాంటి దినోత్సవం పేరుతో అయినా ఈ తెలుగు భాష వైభవం గురించి భావితరాలు తెలుసుకునేలా చేద్దాం!. ఎలాగో మనభాషను మనమే చేజేతులారా అంతం చేసుకుని నిరక్షరులుగా మిగిలిపోయే గొప్పోళ్లం కదా! మనం. కనీసం ఈ సందర్భంగానైనా మన తెలుగుని స్మరించుకుందాం. అలాగే తెలుగును తెలుగులో రాస్తే అమ్మభాష అని, ఇంగ్లీష్‌ లిపిలో రాస్తే అది అర్థరహితమైన చెత్త భాష అవుతుందని చెబుదాం!. తెలుగు తెరమరుగవ్వకుండా ఈ విధంగానైనా కాపాడుకుందాం. బావితరాలు కనీసం మన పూర్వీకులు ఈ తెలుగు భాషలో మాట్లాడేవారని, ఇది తెలుగు లిపి అని గుర్తించేలా చేద్దాం!.  

--పమిడికాల్వ మధుసూదన్‌
మొబైల్‌ నెం: 9989090018

(చదవండి: ఈ షర్ట్‌ చాలా కాస్ట్‌లీ గురూ!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top