ప్లస్‌ సైజ్‌అయినా మైనస్‌ కాదు

Tanvi Geetha Ravishankar A Plus Size Women Inspiring So Many people - Sakshi

శరీరం పరిమాణం... ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్‌ ఇది. సన్నగా, నాజూకుగా ఉండే అమ్మాయిలనే అందగత్తెలుగా గుర్తించడం కామన్‌ అయింది. అలాంటిది లావుగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోక పోగా, వారి మనసు గాయపడేలా కామెంట్లు చేస్తుంటారు. ప్లస్‌ సైజు అయితే ఏంటీ? సైజు గురించి పట్టించుకోకండి! అది అస్సలు మైనస్సే కాదు! ఒబేసిటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్‌ చేసుకోండి! అంటోంది తన్వి గీతా రవిశంకర్‌. తన్వి లావుగా ఉన్నప్పటికీ నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటూ ఫ్యాషన్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. ఫ్యాటీ ఫ్యాషన్‌ వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. 

డ్యాన్సర్, స్టైలిస్ట్, వాయిస్‌ వోవర్‌ ఆర్టిస్ట్‌ అయిన తన్వి ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండే తన్విని అందరూ బాగానే ముద్దు చేసేవారు. ఆమెకు మొదటి నుంచి డ్యాన్స్‌ అంటే ఆసక్తి. మిగతా విద్యార్థుల కంటే తాన్వి బాగా డ్యాన్స్‌ చేస్తుందని టీచర్‌ కూడా చెప్పేవారు. దీంతో చిన్నతనం నుంచే తన్వికి తనపై తనకు ఒక నమ్మకం ఏర్పడింది. అంతేగాక తన శరీరం భారీగా ఉన్నప్పటికీ పన్నెండేళ్ల నుంచే ఫ్యాషన్‌గా ఉండడానికి ఇష్టపడేది. మొదట్లో ఇంజినీరింగ్‌ చదవాలనుకుంది.

కానీ డాన్స్‌ అంటే మక్కువతో ఫైనలియర్‌లోనే ఇంజినీరింగ్‌ను వదిలేసి, ముంబైలో డ్యాన్స్‌ అకాడమీలో చేరి, డాన్స్‌ నేర్చుకుంది. దాంతోబాటు తనకు ఫ్యాషన్‌ మీద కూడా ఆసక్తి ఉన్న ఉండడంతో ఫ్యాషన్‌ డిగ్రీ చదివింది. అయితే అక్కడా ఆమె శరీరాకృతి గురించి కామెంట్లు తప్పేవి కాదు. అయితే, అవేమీ లెక్క చేయకుండా నచి్చన డ్రెస్‌లు వేసుకుంటూ, వాటిలోనే అందంగా కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో అందరి నోళ్లు మూయించింది. శరీరాన్ని చూసి చిన్నబుచ్చుకోవద్దు..దాన్ని సెలబ్రేట్‌ చేసుకోండని చెబుతోన్న తన్వి మాటలు భారీకాయులెందరికో స్ఫూర్తిదాయకం.   

ఆ మాటలు వినకండి..
కడుపునిండా తినకండి, నెయ్యి వేసుకోవద్దు, చిప్స్‌ తినొద్దు. ఇలాంటి మాటలు అస్సలు వినకండి. వీటిని విన్నారంటే ఆహారాన్ని ప్రసాదంలాగా తినాల్సి వస్తుంది. మా అమ్మ తరపున వాళ్లు సన్నగా ఉంటే, నాన్న తరపు వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లు. నేను వాళ్ల కమ్యూనిటీలో చేరాను. చాలామంది లావుగా ఉన్నవాళ్లను చూసి వీళ్లు అతిగా తింటారు, శరీరానికి వ్యాయామం ఉండదు. బద్దకంగా తయారవుతారు అంటారు. అది నిజం కాదు.  

ఇన్‌స్టా స్టైలిస్ట్‌గా 
స్కూలు, కాలేజీలో ఎక్కడా నేను నా శరీరాన్ని గురించి సిగ్గుపడింది లేదు. లావుగా ఉన్నానని ఫీల్‌ అవ్వలేదు. అందుకే ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ను ఎంతో ధైర్యంగా క్రియేట్‌ చేసాను. ఇండియాలో దొరికే బ్రాండెడ్‌ డ్రెస్‌లు వేసుకుని ఇన్‌స్టాలో పోస్టు చేసేదాన్ని. జీన్స్, బికినీ, షార్ట్స్‌’, చీరలతోపాటు దాదాపు అన్నిరకాల డ్రెస్‌లు వేసుకుని ఫొటోలు అప్‌లోడ్‌ చేసేదాన్ని. అంతేగాక లిప్‌స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్, షూస్, మ్యాచింగ్‌ జ్యూవెలరీ వేసుకునేదాన్ని. నా పోస్టులకు చాలా అభినందనలు వచ్చేవి. 

సెలబ్రేట్‌ చేసుకోండి! 
మీరు ఊబకాయం, అధిక బరువుతో ఉన్నారని ఇబ్బంది పడొద్దు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరంలో ఏదో లోపించిందని కాదు. సన్నగా ఉన్నవారిలాగే మీరు అన్ని చేయగలరు. ఫ్యాటీగా ఉన్నప్పటికీ ఫిట్‌గా, యాక్టివ్‌గా హెల్దీగా ఉండేందుకు ప్రయతి్నంచాలి. దీనివల్ల మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే సమాజం కామెంట్‌ చేయడానికి ఆలోచిస్తుంది. లావుగా ఉన్న శరీరం గురించి ఫీల్‌ కాకుండా ప్రతిరోజూ ‘‘ఐయామ్‌ ఓకే, ఐయామ్‌ వర్త్‌ ఇట్‌’’ అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకుని డైలీ సెలబ్రేట్‌ చేసుకోండి. నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగించే వారు ఉంటే ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top