వినీషా సోలార్‌ ఇస్త్రీ బండి | Sakshi
Sakshi News home page

వినీషా సోలార్‌ ఇస్త్రీ బండి

Published Sun, Sep 19 2021 4:01 AM

Tamilnadu girl finalist for Earthshot Prize launched by Prince William - Sakshi

మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్‌ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్‌ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్‌ ఇస్త్రీ బంyì  రూపకల్పన చేసింది.  బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ ప్రారంభించిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ 15 మంది ఫైనల్స్‌ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది.

పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్‌ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్‌ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్‌ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్‌ జాబితాలో వినీషా ఉమాశంకర్‌ ’క్లీన్‌ అవర్‌ ఎయిర్‌’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్‌ ఇస్త్రీ బండిని డిజైన్‌ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది.

మేలైన ప్రయోజనాలు
ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విశ్లేషకులు వినిషా సోలార్‌ పవర్డ్‌ కార్డ్‌ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్‌ పాయింట్‌ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు.  బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్‌ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్‌ టాప్‌ అప్, ఛార్జింగ్‌ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు.

ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్‌ కాన్సెప్ట్‌ కంపెనీ టకాచర్‌ కో ఫౌండర్‌ విద్యుత్‌మోహన్‌ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్‌ రంగ వ్యాపారాల నెట్‌వర్క్‌ అయిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ గ్లోబల్‌ అలియన్స్‌ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్‌ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement