
ఆధ్యాత్మికథ
అదొక నదీ తీరం. అక్కడి పచ్చటి చెట్ల నడుమ అందమైన శ్రీ కృష్ణుడి విగ్రహం ఉంది. ఆ దారిన పోతున్న ఓ నాస్తికుడైన రాజు కొద్దిసేపు కూర్చుని వెళ్దామని అక్కడ ఆగాడు. వేణువు ఊదే శ్రీ కృష్ణుడి విగ్రహం పక్కనే ఒక యువ సంగీతకారుడు కూర్చుని సాధన చేస్తూ ఉన్నాడు. అతడి ధ్యాస అంతా సాధన మీదే ఉంది. రాజు రాకను అతడు పట్టించుకోలేదు. రాజు సంగీతకారుడి దగ్గరికి వెళ్ళి భుజం తట్టాడు. రాజును చూసి ఉలిక్కిపడ్డాడు సంగీతకారుడు.
‘‘శ్రీ కృష్ణుడు వేణువు ఊదితే ఆవులు పాలిచ్చేవట కదా’’ అని వెటకారంగా అన్నాడు రాజు . ‘స్వామి వేణుగానానికి ప్రకృతే పరవశించిపోతుందని’ చెప్పాలనుకున్నాడు సంగీతకారుడు. ‘రాజు తలిస్తే దెబ్బలకు కొదువా?’ సామెత గుర్తుకొచ్చి గమ్మున తల వంచుకుని ఉండిపోయాడు. అలసి ఉన్న రాజు విగ్రహం ముందున్న మెట్ల మీద కూర్చున్నాడు. అంత చక్కటి వాతావరణంలో మంచిగా నిద్రపోతే బాగుంటుందని భావించాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూత పడలేదు.
కొద్దిసేపు గడిచింది. చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది. ఆ సంగీతకారుడు సాధన ప్రారంభించాడు. జల తరంగిణి మీద ఓ రాగాన్ని వాయించసాగాడు. ఆ రాగం వింటూ రాజు ‘సంగీతానికి చింతకాయలే రాలవు, నాకు నిద్ర ఎలా వస్తుంది?’ అని నవ్వుకున్నాడు. అయితే చక్కటి ఆ రాగానికి రాజుకు చిన్నచిన్నగా నిద్ర పట్టసాగింది. అలాగే మెట్ల మీద పడుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు.
గంట తర్వాత లేచి కూర్చున్నాడు రాజు. కళ్ళు తడి అయి ఉన్నాయి. మంచి నిద్ర వచ్చినట్లు గ్రహించాడు. ఆ ఆలోచనారహిత స్థితికి సంగీతం కారణమని గుర్తించాడు. కళ్ళు తుడుచుకుంటూ ‘చాన్నాళ్ళయ్యింది ఇంత ప్రశాంతంగా నిద్రపోయి’ అనుకున్నాడు. సంగీత విద్యకు హద్దు లేదు, యుద్ధభూమికి కొలతలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. ‘‘సంగీతంలో ఎంతో మహత్తు ఉంది. అందుకే శ్రీ కృష్ణుడి వేణు గానానికి ఆవులు తప్పక పాలు ఇచ్చి ఉంటాయి’’ అని గట్టిగా అన్నాడు. అవునన్నట్లుగా చిన్నగా తల ఊపాడు సంగీతకారుడు.
రాజు గబగబా లేచి వెళ్ళి శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. రాజధానిలో చక్కటి సంగీత పాఠశాల ఏర్పాటు చేస్తానని అక్కడినుంచి కదిలాడు. శ్రీ కృష్ణుడు ముసిముసినవ్వులు నవ్వుతున్నట్లుగా అనిపించింది సంగీతకారుడికి.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు