ఇక నుంచి వారి లోదుస్తులు ఒకేలా ఉండవు!

Swiss Army To Begin Issuing Female Recruits With Womens Under Wear - Sakshi

మహిళలకు అవకాశాలు ఉంటున్నాయి తప్ప అనుకూలతలు ఉండటం  లేదన్నది వాస్తవం.  ఉదా : డిఫెన్స్‌. ఇప్పటికీ ఆర్మీలో చేరిన మహిళలు పురుషుల ‘ఆది’ (కొలతలు) లో ఉండే యూనిఫామ్‌నే ధరించాల్సి వస్తోంది. సోల్జర్‌ మగేమిటి, ఆడేమిటి అనుకోవచ్చు. కానీ సౌకర్యం మాటేమిటి! సౌకర్యంగా ఉండే దుస్తులే ఎవరికైనా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. కార్యోన్ముఖుల్ని, కార్యసాధకుల్ని చేస్తాయి. ఈ సంగతిని మొదటిసారిగా ఇప్పుడు స్విట్జర్లాండ్‌ గుర్తించింది. సైన్యంలో ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మహిళల్ని పది శాతానికి పెంచేందుకు  మహిళల ‘అనుకూలతల్ని’ దృష్టిలో పెట్టుకుని కొత్త యూనిఫామ్‌ తేబోతోంది. మహిళా సైనికుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన యూనిఫామ్‌ను ప్రయోగాత్మకంగా నేటి నుంచి అమల్లోకి తెస్తోంది.

స్విట్జర్లాండ్‌ ఐరోపా ఖండంలోని ఒక చిన్న దేశం. జనాభా అటూ ఇటుగా 86 లక్షలు. భూభాగ వివాదాలేమీ లేవు. ఎప్పుడో ఉండేవి.. ఓ నూట డెబ్బై ఏళ్ల క్రితం. ఆ కాలంలోనే అవన్నీ సమసిపోయాయి. ఇప్పుడది ప్రేమ దేశం. ప్రశాంతలోకం! ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ సరిహద్దు దేశాలు. వాటితో మంచి సంబంధాలు ఉన్నాయి. దేశం ఎంత పూలతోటైనా, అందులో పక్షులు పాటలు పాడుతున్నా ఆర్మీ అనే కంచె అవసరం. అందుకోసమే అన్నట్లు చిన్న ఆర్మీ ఉంది ఆ దేశానికి. లక్షా 50 వేల మంది సైన్యం. ఆ సైన్యంలో ఓ పదిహేను వందల వరకు మహిళా సైన్యం. అంటే.. ఒక శాతం. ఒక్క శాతమే కాబట్టి, యుద్ధ పరిస్థితులు లేవు కాబట్టి, ఆ ఒక్క శాతం మహిళల అనుకూలతల గురించి పట్టించుకోవాలన్న ఆలోచన సాధారణంగా ఆర్మీ వంటి పురుషాధిక్య రంగానికి కలగదు. యూనిఫామ్‌ గురించైతే అసలే కలగదు. ఏ దేశంలోని ఆర్మీలోనైనా పురుష సైనికుల కొలతల్లోనే మహిళా యూనిఫామ్‌లూ ఉంటాయి.


సమాన అవకాశాలు.. ప్రత్యేక అనుకూలతలు  

ఈ దేశంలోనూ అంతే. ఉన్నది గుప్పెడు మందే మహిళలు కనుక యూనిఫామ్‌ ఏమీ పెద్ద సంగతి కాదని స్విట్టర్లాండ్‌ అనుకోవచ్చు. ఇప్పటి వరకు అలాగే అనుకుంది కానీ, ఇక అనుకోదలచుకోలేదు. మహిళా సైనికుల కోసం ప్రత్యేకంగా యూనిఫామ్‌ను కేటాయించబోతోంది. యూనిఫామ్‌ అన్నప్పుడు పైన ధరించే దుస్తులు మాత్రమే కాదు. లో దుస్తులు కూడా. వాటిని కూడా మహిళా సైనికుల కోసం ఇప్పటికీ డిజైన్‌ చేయించి ఉంచింది స్విట్జర్లాండ్‌. నేటి నుంచి (ఏప్రిల్‌ 1) అక్కడి మహిళా సైనికులు వాటిని ధరిస్తాను. వాటి ధారణలోని అనుకూలతల్ని, అననుకూలతల్ని చెబుతారు. వారు సూచించిన మార్పులు చేర్పులను బట్టి మళ్లీ డిజైన్‌ని మార్పు చేసి, సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫామ్‌ని స్థిరపరుస్తారు. అంటే.. ఇంతవరకు స్విట్లర్లాండ్‌ మహిళా సైనికులు యూనిఫామ్‌తో పాటు లోదుస్తులను కూడా పురుషుల కొలతలతో తయారైన వాటినే ధరిస్తూ వస్తున్నారా! అవును. 

స్విట్జర్లాండ్‌ ఆర్మీ మహిళా సైనికుల యూనిఫామ్‌లో చేసిన ప్రధానమైన మార్పు.. పురుషుల లోదుస్తులకు, మహిళల లోదుస్తులకు మధ్య తేడా చూపించడం. ప్రస్తుతం ‘అన్నీ అందరివీ’ అక్కడి ఆర్మీలో. లూజ్‌ ఫిటింగ్‌తో, లార్జర్‌ సైజులలో ఉండే లోదుస్తులనే మహిళలూ ధరిస్తున్నారు. అవొక్కడే కాదు. కంబాట్‌ క్లోతింగ్, బ్యాక్‌ప్యాక్స్, ప్రొటెక్టివ్‌ వెస్ట్స్‌.. అన్నీ పురుషులవే మహిళలకు. ఇప్పుడు వీటిని కూడా మహిళలకు అనుకూలంగా రీడిజైన్‌ చేస్తున్నారు. ప్రాథమికంగా వేసవి ధారణకు ఒక రకంగా, చలికాలానికి మరో విధంగా ఉండేలా లోదుస్తుల డిజైన్‌ను మార్పు చేశారు. అవి ఎంత అనుకూలంగా ఉంటున్నాయో పరిశీలిస్తారు. చక్కగా అమరిపోతే ఆ డిజైన్‌నే కొనసాగిస్తారు. అమరిపోవడం అంటే? 27 కిలోల బరువైన సామగ్రిని వీపుపై మోసుకుంటూ నేలపై పాకు కుంటూ వెళ్లేటప్పుడో, లేదా ఆఫీస్‌ చెయిర్‌లో కూర్చున్నప్పుడో ఆ లోదుస్తుల వల్ల ఎలాంటి అసౌకర్యమూ కలగపోతే అది అమరిపోవడమే. ‘‘స్త్రీ పురుషుల డ్యూటీ ఒకటే అయినా, ఆ డ్యూటీని సక్రమంగా నెరవేర్చడానికి అవసరమై వస్త్రధారణ మాత్రం ఒకేలా ఉండకూడదు. కచ్చితంగా వేరుగా ఉండాలి. అంటే మహిళలకు అనుకూలంగా..’’ అని.. యూనిఫామ్‌ మార్పు విషయమై ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో స్విట్జర్లాండ్‌ రక్షణ శాఖ మంత్రి వయోలా ఆమ్హర్డ్‌ చక్కగా అర్థమయ్యేలా చెప్పగలిగారంటే ఆమె మహిళ అయినందు వల్లనేనని అనుకోవాలి. 

గత ఏడాది మార్చిలో యూఎస్‌ నావికాదళం కూడా ఇలాంటి మార్పునే చేసింది. అక్కడి పురుషులకు అండర్‌వేర్‌ రీప్లేస్‌మెంట్‌ అలవెన్స్‌ ఇచ్చేవారు. కొత్త లోదుస్తులను లోపల ఉన్న డిపార్ట్‌మెంట్‌లోని స్టోర్‌లో కొనుక్కోడానికి కొంత డబ్బును ఇచ్చేవాళ్లు. దాన్ని రద్దు చేశారు. నేవీలోని మహిళా సిబ్బంది తమ లోదుస్తుల కొనుగోళ్లకు తమ కెరీర్‌ మొత్తంలో సుమారు ఆరు లక్షల రూపాయల వరకు (8 వేల డాలర్లు) సొంత డబ్బును ఖర్చు చేస్తుండగా పురుషులకు ప్రత్యేకంగా అలవెన్స్‌ ఇవ్వడం లింగ వివక్ష అవదా  ‘గవర్నమెంట్‌ అకౌంటబిలిటీ ఆఫీస్‌’ తన నివేదికలో వేలెత్తి చూపడంతో ఆ అలవెన్స్‌ రద్దు అయింది. పురుషులకు రద్దు చేసే బదులు, మహిళలకూ అలవెన్స్‌ ఇవ్వొచ్చు కదా అనే సూచన వచ్చినప్పటికీ యూఎస్‌ మెరైన్‌.. రద్దు వైపే మొగ్గు చూపింది. 

చిన్న మార్పు.. పెద్ద సంస్కరణ
వచ్చే పదేళ్లలో సైన్యంలో మహిళల శాతాన్ని ఒకటి నుంచి పదికి పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ‘మార్పు’ నిర్ణయాన్ని తీసుకుంది స్విట్జర్లాండ్‌ ఆర్మీ. ఈ చిన్న మార్పు ఏమైనా ప్రభావం చూపుతుందా? నిజానికది చిన్న మార్పేమీ కాదు. ఆర్మీలో చేరాలని ఆశపడే మహిళా అభ్యర్థులకు ప్రతిబంధకంగా ఉన్న అసౌకర్యాన్ని సవరించి సౌకర్యంగా మలచడం పెద్ద మార్పే. ఇదొక ‘సంస్కరణ’ అని కూడా అనుకోవచ్చు. లోకమంతా పురుషుల దేహ పరిమాణాలకు, దేహ అనుకూలతలకు అనుగుణంగా తయారై ఉన్నప్పుడు అందులో స్త్రీ ఇమడడం, కొనసాగడం పైకి కష్టంగా కనిపించని, అనిపించని కష్టం. అది పురుషులకు అర్థం కాదు. సీటు సంపాదించారు కదా.. కూర్చోడానికి కష్టం ఏమిటి అనుకుంటారు! ఆ సీటు ఆమె కాళ్లకు, నేలకు అనుకూలమైనంత ఎత్తులో ఉందా అని ఆలోచించరు. సీటు హ్యాండిల్స్‌ ఆమె చేతులు ఆన్చుకోడానికి అవసరమైన యాంగిల్‌లో ఉన్నాయా అని చూడరు. కుర్చీ అనేది చిన్న ఉదాహరణ. పెద్ద ఉద్యోగంలో, పెద్ద బాధ్యతల్లో, పెద్ద విధి నిర్వహణల్లో ఉండే భౌతికమైన అననుకూలతలు మహిళలు చెప్పుకుంటే తప్ప, పురుషులు అర్థం చేసుకుంటే తప్ప సరి కానివి, సవరణకు నోచుకోనివీ! ఈ ఇబ్బందిని గమనించి సరిచేయడంతో పాటు, మరింత మంది మహిళల్ని ఆర్మీలోకి రప్పించేందుకు స్విట్జర్లాండ్‌ తగిన మార్పులు చేస్తోంది. తనను తను దిద్దుకుంటోంది! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top