
వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులెన్నో చెప్పుకున్నాం. ఇంకా కొన్నే మిగిలాయి. ముఖ్యమైనది పెయింటింగ్. పిల్లలూ... మీరు నేచురల్ పెయింటర్స్. అంటే మీరు బ్రష్ తీసుకుని ఏది గీసినా అందులో అందం ఉంటుంది. బొమ్మలు వేయడంలో చాలా విధానాలున్నాయి. బొమ్మలు వేయకుండా పిల్లలు ఉండకూడదు. ఈ సమ్మర్‌ను కలర్‌ఫుల్ జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంటే కాసిన్ని బొమ్మలేసి దాచుకోవాల్సిందే.
రంగులకు ఏ విలువా లేదు. కాని వాటితో వేసే రూపాలకు విలువ. పిల్లలూ... బొమ్మలు వేయడం మనిషి పుట్టుకతో వచ్చే ఒక కుతూహలం. బొమ్మలు ఎప్పటికీ రాని వాళ్లు కూడా పెన్నూ పేపర్ దొరికితే పిట్ట బొమ్మో పిల్లి బొమ్మో గీస్తారు. మన చేతుల్లో నుంచి ఒక రూపం పుట్టడం మనిషికి ఆనందం. చెట్టు వేసి దాని మీద గూడు వేసి ఆ గూటిలో పిల్లల్ని వేసి ఆ బొమ్మను చూసుకుంటే సంతోషం కలుగుతుంది.
మనం బొమ్మలు ఎందుకు వేస్తామంటే మనం చూసింది, ఊహించింది రంగుల్లో నిక్షిప్తం చేసుకోవడానికి. బొమ్మలు వేయడం మంచి హాబీ. కాలక్షేపం. మీరు మంచి పెయింటర్‌లుగా ఎదిగితే ఆ బొమ్మలను కొనేవాళ్లు కూడా ఉంటారు. నిజం. మన దేశంలో త్యాబ్ మెహతా అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన బొమ్మలు ఇప్పటికీ కొంటారు. ఎంతకు తెలుసా? ముప్పై కోట్లు... నలభై కోట్లు...
చిన్న బొమ్మ. అంత డబ్బు. అయితే ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీ బొమ్మల్లో కూడా ప్రత్యేకత ఉండాలి. అది సాధన చేస్తే వస్తుంది. బొమ్మలు వేయకుండా సెలవుల్ని ముగించకూడదు. అసలు మీ అందరి దగ్గర కలర్స్, కలర్ పెన్సిల్స్, చార్‌కోల్స్, బ్రష్షులు తప్పకుండా ఉండాలి. వాటర్ కలర్స్‌తో వండర్స్ సృష్టించొచ్చు తెలుసా?
చిత్రలేఖనంలో రకాలు..
బొమ్మలు గీయడమంటే మీకు చాలా ఇష్టం. తెల్ల కాగితం, రంగుల పెన్సిళ్లు కనిపిస్తే ఏదో ఒకటి తోచింది గీస్తూ ఉంటారు కదా. దాన్నే మరింత నైపుణ్యంగా గీస్తే చిత్రలేఖనం మీ చేతికి వచ్చేసినట్లే. చిత్రలేఖనంలో అనేక రకాలున్నాయి. ఆబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్, ఫిగరెటివ్ పెయింటింగ్స్, ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్స్, యానిమల్స్ పెయింటింగ్స్, గాడ్ పెయింటింగ్స్... ఇలా. వాటి గురించి మీరు బొమ్మలు గీసేకొద్దీ తెలుసుకుంటారు.
ఇవి కాకుండా కార్టూన్లు, క్యారికేచర్లు... కూడా గీయొచ్చు. లైన్ ఆర్ట్ సాధన చేయొచ్చు. రాజా రవివర్మ, దామెర్ల రామారావు, పాకాల తిరుపతిరెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు, మోహన్, బాలి, చంద్ర, ఏలే లక్ష్మణ్ లాంటి అనేక మంది చిత్రకారుల బొమ్మలు మీకు నెట్‌లో దొరుకుతాయి. వాటిని చూసి వారిలా వేయడానికి సాధన చేస్తూ కూడా బొమ్మలు నేర్చుకోవచ్చు.
చిత్రలేఖనం వల్ల లాభాలు..
ఏకాగ్రత: చిత్రలేఖనమంటే రంగులతో మాత్రమే పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. మనసులోని భావాలను కాగింతపై బొమ్మగా మారేందుకు ఆలోచించాలి, నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. చిత్రలేఖనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చదువు మీద దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుంది.
మానసికోల్లాసం: రంగులతో బొమ్మలేయడం వల్ల మానసికోల్లాసం లభిస్తుంది. ఖాళీ కాగితం మన చేతిలో రంగులమయం మారుతున్నకొద్దీ మనలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మన చేతివేళ్లు చకచకా కదిలి, బొమ్మగా రూపుదిద్దుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇదంతా చిత్రలేఖనం వల్ల సాధ్యపడుతుంది.
క్రియేటివిటి: సమాజంలో రోజూ మీరు చూసే అంశాలను బొమ్మలుగా గీయాలనుకునే క్రమంలో మీలో క్రియేటివిటి పెరుగుతుంది. బొమ్మల్ని గీసే పద్ధతిలో మీదైన కొత్త విధానం ఒంటబడుతుంది. ఇది మీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. కొత్త విషయాలు ఆలోచించేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది.
గుర్తింపు: చిత్రలేఖనం లలిలకళల్లో ఒకటి. అనేకమంది చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి చిత్రాలు నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. మీరు చిత్రలేఖనం సాధన చేయడం ద్వారా అందరిలో గుర్తింపు పొందుతారు. మరింత పట్టు సాధించడం ద్వారా గొప్ప చిత్రకారులుగా పేరు పొందుతారు. అది మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది.
చిత్రలేఖనం ఎక్కడ నేర్చుకోవాలి?
పిల్లలకు చిత్రలేఖనం నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు, సంస్థలు ఉన్నాయి. రోజూ కొంత సమయం అక్కడికి వెళ్లి, వారి చెప్పిన పద్ధతిలో బొమ్మలు గీయడం సాధన చేయవచ్చు. చిత్రలేఖనం నేర్పేందుకు ఈ వేసవిలో కొన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు.
వాటిలో చేరొచ్చు. ఆన్‌లైన్ ద్వారా చిత్రలేఖనం నేర్పేవారు కూడా అందుబాటులో ఉంటారు. ఆ పద్ధతిలో రోజూ సాధన చేయవచ్చు. మీకు మరింత ఆసక్తి ఉంటే సెలవుల తర్వాత కూడా దాన్ని కొనసాగించవచ్చు.