breaking news
drawings
-
ఈ సమ్మర్ కలర్‌ఫుల్ జ్ఞాపకంగా ఉండాలంటే..బొమ్మలు వేయాల్సిందే..!
వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులెన్నో చెప్పుకున్నాం. ఇంకా కొన్నే మిగిలాయి. ముఖ్యమైనది పెయింటింగ్. పిల్లలూ... మీరు నేచురల్ పెయింటర్స్. అంటే మీరు బ్రష్ తీసుకుని ఏది గీసినా అందులో అందం ఉంటుంది. బొమ్మలు వేయడంలో చాలా విధానాలున్నాయి. బొమ్మలు వేయకుండా పిల్లలు ఉండకూడదు. ఈ సమ్మర్‌ను కలర్‌ఫుల్ జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంటే కాసిన్ని బొమ్మలేసి దాచుకోవాల్సిందే.రంగులకు ఏ విలువా లేదు. కాని వాటితో వేసే రూపాలకు విలువ. పిల్లలూ... బొమ్మలు వేయడం మనిషి పుట్టుకతో వచ్చే ఒక కుతూహలం. బొమ్మలు ఎప్పటికీ రాని వాళ్లు కూడా పెన్నూ పేపర్ దొరికితే పిట్ట బొమ్మో పిల్లి బొమ్మో గీస్తారు. మన చేతుల్లో నుంచి ఒక రూపం పుట్టడం మనిషికి ఆనందం. చెట్టు వేసి దాని మీద గూడు వేసి ఆ గూటిలో పిల్లల్ని వేసి ఆ బొమ్మను చూసుకుంటే సంతోషం కలుగుతుంది. మనం బొమ్మలు ఎందుకు వేస్తామంటే మనం చూసింది, ఊహించింది రంగుల్లో నిక్షిప్తం చేసుకోవడానికి. బొమ్మలు వేయడం మంచి హాబీ. కాలక్షేపం. మీరు మంచి పెయింటర్లుగా ఎదిగితే ఆ బొమ్మలను కొనేవాళ్లు కూడా ఉంటారు. నిజం. మన దేశంలో త్యాబ్ మెహతా అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన బొమ్మలు ఇప్పటికీ కొంటారు. ఎంతకు తెలుసా? ముప్పై కోట్లు... నలభై కోట్లు... చిన్న బొమ్మ. అంత డబ్బు. అయితే ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీ బొమ్మల్లో కూడా ప్రత్యేకత ఉండాలి. అది సాధన చేస్తే వస్తుంది. బొమ్మలు వేయకుండా సెలవుల్ని ముగించకూడదు. అసలు మీ అందరి దగ్గర కలర్స్, కలర్ పెన్సిల్స్, చార్కోల్స్, బ్రష్షులు తప్పకుండా ఉండాలి. వాటర్ కలర్స్‌తో వండర్స్ సృష్టించొచ్చు తెలుసా?చిత్రలేఖనంలో రకాలు..బొమ్మలు గీయడమంటే మీకు చాలా ఇష్టం. తెల్ల కాగితం, రంగుల పెన్సిళ్లు కనిపిస్తే ఏదో ఒకటి తోచింది గీస్తూ ఉంటారు కదా. దాన్నే మరింత నైపుణ్యంగా గీస్తే చిత్రలేఖనం మీ చేతికి వచ్చేసినట్లే. చిత్రలేఖనంలో అనేక రకాలున్నాయి. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, ఫిగరెటివ్ పెయింటింగ్స్, ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్స్, యానిమల్స్ పెయింటింగ్స్, గాడ్ పెయింటింగ్స్... ఇలా. వాటి గురించి మీరు బొమ్మలు గీసేకొద్దీ తెలుసుకుంటారు. ఇవి కాకుండా కార్టూన్లు, క్యారికేచర్లు... కూడా గీయొచ్చు. లైన్ ఆర్ట్ సాధన చేయొచ్చు. రాజా రవివర్మ, దామెర్ల రామారావు, పాకాల తిరుపతిరెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు, మోహన్, బాలి, చంద్ర, ఏలే లక్ష్మణ్ లాంటి అనేక మంది చిత్రకారుల బొమ్మలు మీకు నెట్లో దొరుకుతాయి. వాటిని చూసి వారిలా వేయడానికి సాధన చేస్తూ కూడా బొమ్మలు నేర్చుకోవచ్చు.చిత్రలేఖనం వల్ల లాభాలు..ఏకాగ్రత: చిత్రలేఖనమంటే రంగులతో మాత్రమే పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. మనసులోని భావాలను కాగింతపై బొమ్మగా మారేందుకు ఆలోచించాలి, నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. చిత్రలేఖనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చదువు మీద దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుంది.మానసికోల్లాసం: రంగులతో బొమ్మలేయడం వల్ల మానసికోల్లాసం లభిస్తుంది. ఖాళీ కాగితం మన చేతిలో రంగులమయం మారుతున్నకొద్దీ మనలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మన చేతివేళ్లు చకచకా కదిలి, బొమ్మగా రూపుదిద్దుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇదంతా చిత్రలేఖనం వల్ల సాధ్యపడుతుంది.క్రియేటివిటి: సమాజంలో రోజూ మీరు చూసే అంశాలను బొమ్మలుగా గీయాలనుకునే క్రమంలో మీలో క్రియేటివిటి పెరుగుతుంది. బొమ్మల్ని గీసే పద్ధతిలో మీదైన కొత్త విధానం ఒంటబడుతుంది. ఇది మీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. కొత్త విషయాలు ఆలోచించేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది.గుర్తింపు: చిత్రలేఖనం లలిలకళల్లో ఒకటి. అనేకమంది చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి చిత్రాలు నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. మీరు చిత్రలేఖనం సాధన చేయడం ద్వారా అందరిలో గుర్తింపు పొందుతారు. మరింత పట్టు సాధించడం ద్వారా గొప్ప చిత్రకారులుగా పేరు పొందుతారు. అది మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది. చిత్రలేఖనం ఎక్కడ నేర్చుకోవాలి?పిల్లలకు చిత్రలేఖనం నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు, సంస్థలు ఉన్నాయి. రోజూ కొంత సమయం అక్కడికి వెళ్లి, వారి చెప్పిన పద్ధతిలో బొమ్మలు గీయడం సాధన చేయవచ్చు. చిత్రలేఖనం నేర్పేందుకు ఈ వేసవిలో కొన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు. వాటిలో చేరొచ్చు. ఆన్లైన్ ద్వారా చిత్రలేఖనం నేర్పేవారు కూడా అందుబాటులో ఉంటారు. ఆ పద్ధతిలో రోజూ సాధన చేయవచ్చు. మీకు మరింత ఆసక్తి ఉంటే సెలవుల తర్వాత కూడా దాన్ని కొనసాగించవచ్చు. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
అత్యంత ప్రజాదరణ ఉన్న టాప్ 10 కళాకారులు
-
మా పిల్లలు ప్రతిభావంతులు
చిన్నతనంలో పిల్లలు పిచ్చి గీతలు గీస్తేనే మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక వాళ్లే కుంచె పట్టుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తే? ఆ ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. లాక్డౌన్లో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ డ్రాయింగ్ మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్లో వాళ్లు గీసిన పెయింటింగ్స్‌ను తన ట్విట్టర్లో షేర్ చేసి, ‘మా పిల్లలు ప్రతిభావంతులు’ అని మురిసిపోయారు బోనీ కపూర్. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గీసిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. -
ఆంజనేయుని ఆనందబాష్పాలు
బ్రహ్మానందం నటుడని అందరికీ తెలుసు. సాహితీప్రియుడు అని కొందరికి తెలుసు. ఆయన చిత్రలేఖనం చేస్తారని చాలా కొద్దిమందికి తెలుసు. కరోనా లాక్డౌన్ తర్వాత బ్రహ్మానందం చిత్రకళను సాధన చేస్తున్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శేషబ్రహ్మంతో ఆయన తన చిత్రాలు పంచుకుంటూ ఆనందం పొందుతున్నారు. బ్రహ్మానందం ఎక్కువగా పెన్సిల్ డ్రాయింగ్స్ సాధన చేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం వేసిన మదర్ థెరిసా బొమ్మ ఆ కారుణ్యమూర్తి కరుణను రేఖల్లో పట్టుకోగలిగింది. ఇప్పుడు రామమందిర నిర్మాణ సందర్భం. ఈ సందర్భం రాముడి భక్తులందరికీ ఆనందదాయకం. ఇక అపర భక్తుడైన ఆంజనేయస్వామికి ఆనంద బాష్పాల సమయం కాకుండా ఉంటుందా. అందుకే బ్రహ్మానందం కాగితం, పెన్సిల్ అందుకున్నారు. ‘ఆంజనేయుని ఆనందబాష్పాలు’ పేరుతో ఈ చిత్రం గీశారు. రాముని కోవెలకు ఈ బొమ్మ ఒక భక్తిపూర్వక సమర్పణం అనుకోవచ్చు. -
ఆర్ట్ బై సోనాక్షీ
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో హీరోహీరోయిన్లందరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్‌పాస్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా రోజుకో బొమ్మ గీస్తున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితమే బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు నాకు మెడిటేషన్లా అనిపిస్తోంది. నాకు సరైన స్ట్రెస్ బస్టర్ పెయింటింగ్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను’’ అని పేర్కొన్నారు సోనాక్షీ. ఇటీవల ఆమె వేసిన డ్రాయింగ్స్‌ను ‘ఆర్ట్ బై సోనాక్షీ’గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు సోనాక్షీ గీసినవే. -
బొమ్మని గీస్తే...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులకు కరోనా ప్రభావంతో కాస్త విరామం దొరికింది. దీంతో ఇంటి పట్టునే ఉండి తమకు ఇష్టమైన పని చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇంట్లో ఉండి తన సృజనాత్మకతను బయపెట్టారు. సల్మాన్‌కి బొమ్మలు గీయడం వచ్చు. ఓ బొమ్మ గీస్తూ, ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు సల్మాన్. డ్రాయింగ్ ప్యాడ్, స్కెచ్‌లు, వాటర్ కలర్స్‌తో కాలక్షేపం చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే చక్కని బొమ్మ వేశారట. ఆ బొమ్మలో ఇద్దరు వ్యక్తుల తలలు, ముఖాలు పాక్షికంగా కప్పబడి ఉన్నాయి. వారి కళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్కెచ్ చూసిన ఆయన అభిమానులు ‘వావ్.. భాయ్’ అని అభినందిస్తున్నారు. -
తలచుకుంటే చాలు గీసేస్తుంది!
టోరెంటో : మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు. నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారం గా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పా రు. మాట్లాడలేని వారి మనసులో ఏముం దో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కుంచెతో కుస్తీ పడతా
మనందరం ఖాళీ సమయాల్లో ఏం చేస్తాం? పుస్తకాలు చదువుతాం, లేదా సినిమాలు చూస్తాం. లేదా వేరే ఏదైనా చేస్తాం. మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచితే – ‘‘కుంచె పట్టుకొని బొమ్మలు గీసేస్తా అంటున్నారు. చిన్నప్పుడు నా బుక్స్ నిండా చిన్న చిన్న బొమ్మలే ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా గీసేదాన్ని. సంవత్సరం క్రితం నుంచి స్కెచ్‌లు మరియు కలర్స్‌తో ప్రయోగాలు మొదలెట్టాను. ఈ మధ్యనే అబస్ట్రాక్ట్ ఆర్ట్ (ఆకారం లేకుండా రంగులతో భావ వ్యక్తీకరణ చేసే కళ)తో మొదలెట్టి యానిమల్స్, ఉమెన్ ఫేస్‌లు గీస్తున్నా. రీసెంట్గా నేను గీసిన బొమ్మలను బ్రెస్ట్ క్యాన్సర్ భాదితుల విరాళం కోసం వేలం వేశాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవల కోసం నా డ్రాయింగ్స్ వాడదలుచుకున్నాను. బొమ్మలు గీయటం నాకు ఓ మెడిటేషన్ లాంటిది. ఈ మధ్య నా స్నేహితులకు నేను గీసిన పెయింటింగ్స్ బహుమతిగా ఇచ్చాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయి ‘మాకో గిఫ్ట్ ప్లీజ్’ అంటున్నారు. వాళ్ళ కోసమైనా తరచుగా గీయాల్సి వస్తోంది’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. -
ఆ చిత్రాలకు ‘రంగు’ పడింది!
వేల ఏళ్ల కింద ఆది మానవులు గుహల్లో, తమ ఆవాసాల్లోని రాళ్లపై చిత్రించిన బొమ్మలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. సాధారణంగా మనం ఇప్పుడు వాడే రంగులు కొంచెం నీరు తగలగానే, కొంతకాలం కాగానే వెలిసిపోతాయి. కానీ ఆది మానవులు గీసిన చిత్రాలు మాత్రం ఇంకా నిలిచి ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు నాని, వేల ఏళ్లుగా నిలిచి ఉన్న ఆ చిత్రాలకు వాడిన రంగులు, ఉపయోగించిన పద్ధతులు ఏమిటో తెలుసా..? ఇనుప ఖనిజం అధికంగా ఉండే హెమటైట్ రాయి. దీని పొడికి వివిధ పదార్థాలు కలిపి ఆది మానవులు చిత్రాలు వేసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ఫోరెన్సిక్ నిపుణుడు జ్ఞానేశ్వర్ తాజాగా నిర్ధారించారు. – సాక్షి, హైదరాబాద్ కొత్త రాతియుగం నుంచే రంగులు పాత రాతియుగం కాలంలో ఆది మానవుల చిత్రాల్లో రంగులు కనిపించవు. మొనదేలిన రాళ్లతో బండరాళ్లపై లోతుగా చెక్కి చిత్రాలకు ఆకృతి ఇచ్చేవారు. వాటిని పెట్రోగోలైవ్స్గా పేర్కొంటారు. అలాగే రాళ్లతో గీతలు గీసి (రాక్ బ్రూజింగ్స్) కూడా బొమ్మలు వేసేవారు. మధ్య రాతియుగం చివరికి వచ్చేసరికి రంగులు అద్దడం మొదలైంది. ఆ సమయంలోనివారు పెట్రోగ్లైవ్స్లో రంగులు వేయడం మొదలుపెట్టారు. వేల ఏళ్ల కింద చిత్రించిన పెట్రోగ్లైవ్స్లోనూ.. కొన్ని వందల ఏళ్ల తర్వాత రంగులద్దినట్టు పరిశోధకులు గుర్తించారు. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, పూర్వపు మెదక్ జిల్లా రత్నాపూర్లలో ఇలా పెట్రోగ్లైవ్స్, వాటిలో రంగులు వేసిన తీరు కనిపిస్తాయి. వేల ఏళ్లుగా నిలిచే ఉన్నాయి ఆది మానవులు వేల ఏళ్ల కింద రాళ్లపై చిత్రించిన బొమ్మలు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అసలేమాత్రం పరిజ్ఞానం లేని కాలంలో.. ఎరుపు, నలుపు రంగుల్లో ఆ చిత్రాలను ఎలా గీశారు, ఆ రంగుల కోసం వాడిన పదార్థాలేమిటన్న దానిపై మన దేశంలో ఇప్పటివరకు శాస్త్రీయ నిర్ధారణ జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా పరిశోధన కూడా జరగలేదు. కానీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ దిశగా అడుగు వేసింది. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి, వర్గల్లలోని ఆది మానవుల గుహల్లోని చిత్రాలపై పరిశోధన చేసి.. ఆ రంగులు ఏమిటనేది గుర్తించింది. అది హెమటైట్.. పీఠభూముల ప్రాంతాల్లో సహజంగానే ఎరుపు రంగులో ఉండే ఇనుము రాయి కనిపిస్తుంటుంది. అందులో హెమటైట్ అనే ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజాన్నే ఆది మానవులు రంగు తయారీలో వినియోగించారని పరిశోధనలో గుర్తించారు. ఈ ఎరుపు రాయిని పొడి చేసి, అందులో జంతువుల కొవ్వు కలిపి ఎరుపు రంగును తయారు చేశారని నిర్ధారించారు. తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా చిత్రాలున్నందున ఈ ప్రాంతంలో అప్పట్లో ఈ రంగును విస్తారంగా వినియోగించినట్టు భావిస్తున్నారు. ఇక చిత్రాల్లో ముదురు రంగు వచ్చేందుకు హెమటైట్ పొడితోపాటు జంతువుల రక్తాన్ని కలిపి బొమ్మలు గీసిన తీరును గతంలోనే పరిశోధకులు గుర్తించారు. కొన్నిచోట్ల మూత్రం కలిపినట్టు కూడా తేలింది. వీటితోపాటు నలుపు రంగు కోసం హెమటైట్ పొడి, కొవ్వుతోపాటు రాక్షసబొగ్గు పొడిని కలిపి వాడారని తాజాగా నిర్ధారించారు. రాష్ట్రంలో తాము చేసిన పరిశోధనకు సంబంధించిన అధ్యయన పత్రాన్ని పుణెలో అక్టోబర్ 26 నుంచి జరగనున్న రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో సమర్పించనున్నట్టు హరగోపాల్ తెలిపారు. పరిశోధన ఇలా.. ఆది మానవుల చిత్రాల్లోని రంగుల రహస్యాలు తేల్చాలంటే.. ఆ రంగు ఉన్న భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలా చేస్తే చిత్రాలను ధ్వంసం చేసినట్టేనని రాక్ ఆర్ట్ సొసైటీ నిబంధనలున్నాయి. దీంతో రంగుల్లో ఉన్న పదార్థమేమిటో నిర్ధారించేందుకు ‘రామన్ స్పెక్ట్రా’పరీక్షను ఎంచుకున్నారు. ఈ పరికరం ఏదైనా వస్తువు లేదా ఉపరితలంపై కాంతి కిరణాలను ప్రసరింపజేసి.. అవి ప్రతిఫలించే కాంతి ఆధారంగా అక్కడి రసాయన లక్షణాలను గుర్తిస్తారు. ఈ లక్షణాలను అంతర్జాతీయంగా నిర్ధారించిన అంశాల ఆధారంగా డీకోడ్ చేసి.. రసాయనం ఏమిటో తేలుస్తారు. ఆది మానవుల చిత్రాలను దీని సహాయంతో పరీక్షించి.. రంగును హెమటైట్గా నిర్ధారించారు. -
చెరిగిపోతున్న ఆనవాళ్లు..!
వేల ఏళ్లనాటి మానవ మనుగడకు చిహ్నం ఈరన్నగుండు గుహ గుహలో అరుదైన రేఖాచిత్రాలు.. అంతుబట్టని లిపి గుర్తులు పదేళ్ల క్రితమే గుర్తించినా పరిరక్షణ చర్యలు శూన్యం ఇదేపరిస్థితి కొనసాగితే అరుదైన చారిత్రక ఆనవాళ్లు మాయం వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన గుహ అది.. ఆ కాలంలోనే సాగు చేశారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయక్కడ.. పంటలపై పక్షులు వాలితే చెదరగొట్టేందుకు వాడే వడిశల రాళ్లు బయటపడ్డ ప్రాంతమది.. పాడికి సూచికగా ఆవులు, పంటలకు గుర్తుగా ఎడ్ల బొమ్మలు అద్భుత రీతిలో చెక్కిన గుహ అది.. ఇలా ఒక్కటేమిటి.. మానవ నాగరికత పరిణామక్రమంలో ఓ దశను కళ్లకు కట్టే సజీవసాక్ష్యాలవి.. కానీ, ఇవేవీ మన పురావస్తు శాఖ కళ్లకు కనిపించవు. నిపుణులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అద్భుత చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని తేల్చినా గాలికొదిలేశారు. ఇప్పుడు రాళ్లు కొట్టుకునేవారు యథేచ్ఛగా ఆ గుట్టలను ధ్వంసం చేస్తూ మన చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ చారిత్రక గుహ ఎక్కడ.. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దొంగలగట్టు తండాలోని ఈరన్నగుండు గుహ. కల్వకుర్తి నుంచి జూపల్లికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంది. వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు చెందిన అపురూప ఆనవాళ్లు ఉన్నది ఇక్కడే. అయితే స్థానిక తండావాసులకు వాటిపై అవగాహన లేదు. ఆ గుహను వారి పూర్వీకులు మైసమ్మ గుడిగా పేర్కొనటంతో ఇప్పటికీ వారు దాన్ని గుడిగా భావిస్తూ అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ గుహలో దాదాపు ఐదు వేల ఏళ్ల నాటివని భావిస్తున్న నాటి మానవులు గీసిన రేఖా చిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే.. భూ ఉపరితలానికి అడుగు ఎత్తున రెండు అడుగుల పొడవు, అంతే ఎత్తుతో మూపురం, వాడి కొమ్ములున్న ఎద్దు బొమ్మ, దాని పక్కన కొంచెం చిన్న పరిమాణంలో మరో రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. దీనికి ముందువైపు ఆరడుగుల ఎత్తులో అదే రాయిపై ఓ ఆవు దాని వెనుక రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. వీటి కింద చిన్నచిన్న లేగ దూడల బొమ్మలున్నాయి. వాటికింద నాటి లిపిగా భావిస్తున్న అక్షరాలు (గ్రాఫితీ మార్చ్) చెక్కి ఉన్నాయి. ఆ లిపిని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి పురావస్తు నిపుణులు యాజ్దానీ ఇలాంటి లిపిని గుర్తించారు. ఆ పరిసరాల్లో కొత్త రాతి యుగంలో వినియోగించిన వడిశల రాళ్లు, నూరుడు రాళ్లు లభిస్తున్నాయి. పరిరక్షించేవారేరీ? ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ తాజాగా ఈ గుహను గుర్తించి పరిశీలించారు. అక్కడి రేఖా చిత్రాల్లోని ఎద్దుల కొమ్ములు ఈనాటి మైసూరు ఎద్దులను పోలి ఉన్నాయని, కానీ వాటి మూపురాలు, గంగడోలు సింధూ నాగరికత కాలానికి చెందిన వాటివిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితమే పురావస్తు నిపుణులు వచ్చి ఈ రేఖా చిత్రాల అచ్చులను శాస్త్రీయ పద్ధతిలో సేకరించారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ తర్వాత ఎవరూ వీటిని పట్టించుకున్న దాఖలాలులేవు. రాళ్లు కొట్టేవారు గుహను ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.