చెరిగిపోతున్న ఆనవాళ్లు..! | Erase traces ..! | Sakshi
Sakshi News home page

చెరిగిపోతున్న ఆనవాళ్లు..!

Mar 15 2015 12:47 AM | Updated on Sep 2 2017 10:51 PM

చెరిగిపోతున్న ఆనవాళ్లు..!

చెరిగిపోతున్న ఆనవాళ్లు..!

వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన గుహ అది.. ఆ కాలంలోనే సాగు చేశారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయక్కడ..

  • వేల ఏళ్లనాటి మానవ మనుగడకు చిహ్నం ఈరన్నగుండు గుహ
  •  గుహలో అరుదైన రేఖాచిత్రాలు.. అంతుబట్టని లిపి గుర్తులు
  •  పదేళ్ల క్రితమే గుర్తించినా పరిరక్షణ చర్యలు శూన్యం
  •  ఇదేపరిస్థితి కొనసాగితే అరుదైన చారిత్రక ఆనవాళ్లు మాయం
  • వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన గుహ అది.. ఆ కాలంలోనే సాగు చేశారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయక్కడ.. పంటలపై పక్షులు వాలితే చెదరగొట్టేందుకు వాడే వడిశల రాళ్లు బయటపడ్డ ప్రాంతమది.. పాడికి సూచికగా ఆవులు, పంటలకు గుర్తుగా ఎడ్ల బొమ్మలు అద్భుత రీతిలో చెక్కిన గుహ అది.. ఇలా ఒక్కటేమిటి.. మానవ నాగరికత పరిణామక్రమంలో ఓ దశను కళ్లకు కట్టే సజీవసాక్ష్యాలవి.. కానీ, ఇవేవీ మన పురావస్తు శాఖ కళ్లకు కనిపించవు. నిపుణులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అద్భుత చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని తేల్చినా గాలికొదిలేశారు. ఇప్పుడు రాళ్లు కొట్టుకునేవారు యథేచ్ఛగా ఆ గుట్టలను ధ్వంసం చేస్తూ మన చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు.     
    - సాక్షి, హైదరాబాద్
     
     చారిత్రక గుహ ఎక్కడ..

     మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దొంగలగట్టు తండాలోని ఈరన్నగుండు గుహ. కల్వకుర్తి నుంచి జూపల్లికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంది. వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు చెందిన అపురూప ఆనవాళ్లు ఉన్నది ఇక్కడే. అయితే స్థానిక తండావాసులకు వాటిపై అవగాహన లేదు. ఆ గుహను వారి పూర్వీకులు మైసమ్మ గుడిగా పేర్కొనటంతో ఇప్పటికీ వారు దాన్ని గుడిగా భావిస్తూ అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ గుహలో దాదాపు ఐదు వేల ఏళ్ల నాటివని భావిస్తున్న నాటి మానవులు గీసిన రేఖా చిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.
     
     అందులో ఏమున్నాయంటే..

     భూ ఉపరితలానికి అడుగు ఎత్తున రెండు అడుగుల పొడవు, అంతే ఎత్తుతో మూపురం, వాడి కొమ్ములున్న ఎద్దు బొమ్మ, దాని పక్కన కొంచెం చిన్న పరిమాణంలో మరో రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. దీనికి ముందువైపు ఆరడుగుల ఎత్తులో అదే రాయిపై ఓ ఆవు దాని వెనుక రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. వీటి కింద చిన్నచిన్న లేగ దూడల బొమ్మలున్నాయి. వాటికింద నాటి లిపిగా భావిస్తున్న అక్షరాలు (గ్రాఫితీ మార్చ్) చెక్కి ఉన్నాయి. ఆ లిపిని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి పురావస్తు నిపుణులు యాజ్దానీ ఇలాంటి లిపిని గుర్తించారు. ఆ పరిసరాల్లో కొత్త రాతి యుగంలో వినియోగించిన వడిశల రాళ్లు, నూరుడు రాళ్లు లభిస్తున్నాయి.
     
     పరిరక్షించేవారేరీ?

     ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ తాజాగా ఈ గుహను గుర్తించి పరిశీలించారు. అక్కడి రేఖా చిత్రాల్లోని ఎద్దుల కొమ్ములు ఈనాటి మైసూరు ఎద్దులను పోలి ఉన్నాయని, కానీ వాటి మూపురాలు, గంగడోలు సింధూ నాగరికత కాలానికి చెందిన వాటివిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితమే పురావస్తు నిపుణులు వచ్చి ఈ రేఖా చిత్రాల అచ్చులను శాస్త్రీయ పద్ధతిలో సేకరించారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ తర్వాత ఎవరూ వీటిని పట్టించుకున్న దాఖలాలులేవు. రాళ్లు కొట్టేవారు గుహను ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement