
టోరెంటో : మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు.
నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారం గా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పా రు. మాట్లాడలేని వారి మనసులో ఏముం దో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.