పేరుగొప్ప దేశాల కన్నా. పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలే మిన్న.. | Story On Changing Mindset of Indian Students | Sakshi
Sakshi News home page

పేరుగొప్ప దేశాల కన్నా. పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలే మిన్న..

Mar 21 2026 3:14 PM | Updated on Mar 21 2026 3:31 PM

Story On Changing Mindset of Indian Students

విదేశీ విద్య ఎంచుకోవడంలో మారిన దేశీయ విద్యార్ధులు

ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో విదేశీ విద్యా ప్రాధాన్యతల విషయంలో భారతదేశపు విద్యార్థుల ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ , సింగపూర్, న్యూజిలాండ్‌  దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారతీయులు మొగ్గు చూపడం పెరుగుతోంది.

అమెరికా, కెనడా, బ్రిటన్‌ (యూకే),  ఆస్ట్రేలియా లాంటి ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాలకు, ముఖ్యంగా స్టెమ్‌ (ఎస్‌టిఇఎమ్‌)  కోర్సుల కోసం అమెరికాకు ఇప్పటికీ అత్యధిక డిమాండ్‌ ఉన్నప్పటికీ.. విద్యార్థులు  తమ ఎంపికలను చురుకుగా విస్త్రుతం చేసుకుంటున్నారు. విద్యకయ్యే మొత్తం ఖర్చు, విద్యాసంస్థల నాణ్యత, వీసా నిబంధనలు, ఇంటర్న్‌షిప్‌  ఉపాధి అవకాశాలు, అలాగే విద్యార్థుల భద్రత వంటి అంశాలు వారి వారి నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పెట్టుబడిపై రాబడికే పెద్ద పీట...
‘నేటి భారతీయ విద్యార్థులు విదేశీ విద్య విషయంలో మరింత ఆచరణాత్మకంగా  ’పెట్టుబడిపై రాబడి  ఆధారిత విధానంతో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ (ఎస్‌టిఇఎమ్‌) ప్రోగ్రామ్‌ల కోసం స్పెయిన్, జర్మనీ   న్యూజిలాండ్‌ వంటి దేశాలకు ఇటీవల బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చు, స్పష్టమైన వీసా నిబంధనలు,  చదువు–ఉపాధికి మధ్య మెరుగైన సమన్వయం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం,‘ అని  ఆక్సిలో ఫిన్ సర్వ్‌ ఓవర్సీస్‌ లోన్‌ సీబీవో  శ్వేతాగురు  విశ్లేషించారు.  భారతీయ విద్యార్ధుల సంఖ్యకు సంబంధించి సాంప్రదాయేతర యూరోపియన్‌ దేశాలు, 2023 నుంచి 2025 మధ్య  బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇదే ధోరణి 2026లో కూడా కొనసాగుతుందని విదేశీ విద్యా మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

భారతీయ విద్యార్థులు తమ మొదటి ఎంపికగా ఈ కొత్త దేశాల వైపు మొగ్గుచూపుతుండడానికి  కారణం..‘ సంప్రదాయంగా పేరొందిన దేశాలతో పోలిస్తే.‘కొన్ని దేశాలు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ కోర్సులను దాదాపు సగం ఖర్చుతోనే అందిస్తున్నాయి. అంతేకాకుండా, వీసా సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు త్వరగా పెట్టుబడిపై రాబడి కూడా లభిస్తుంది‘ అని  శ్వేతా గురు వివరించారు. విదేశీ విద్య రంగంలో వస్తున్న ఈ మార్పులు.. విద్యార్థుల పరిణతి చెందిన, పరిశోధనాత్మక నిర్ణయాలను  సూచిస్తున్నాయి. భారతీయ విద్యార్థులలో నవతరం ఇప్పుడు ఈ కొత్త దేశాలను కేవలం ’ప్రత్యామ్నాయంగా’ కాకుండా తమ వ్యూహాత్మక ’మొదటి ఎంపికగా’ పరిగణిస్తోంది.

మార్పును సూచిస్తున్న కొన్ని గణాంకాలు..
స్పెయిన్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): 2023లో 865గా ఉన్న భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 2025 నాటికి 1,192కి పెరిగాయి. ఇది రెండేళ్ల వ్యవధిలో 17 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. అందుబాటులో ఉండే ట్యూషన్‌ ఫీజులు, ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధించే కోర్సుల సంఖ్య పెరుగుతుండటంతో... బిజినెస్, డేటా అనలిటిక్స్, ఇంజనీరింగ్,  పబ్లిక్‌ పాలసీ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో వృద్ధి కనిపిస్తోంది.

పోర్చుగల్‌– లిథువేనియా (ఉన్నత విద్య కోసం మాత్రమే): పోర్చుగల్‌లో 2023లో 980 మంది మన విద్యార్థులు చేరగా, 2025 నాటికి ఆ సంఖ్య 1,350కి  పెరిగింది. ఇదే సమయంలో లిథువేనియాలో ప్రవేశాలు 1,120 నుంచి 1,557 కు పెరిగాయి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌  అప్లైడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల ద్వారా ఈ దేశాలు భారతీయ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఇటలీ , నెదర్లాండ్స్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): ఇటలీలో 2023లో 4,145గా ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 5,196కి పెరిగింది. డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఈ దేశం ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మరోవైపు, స్టెమ్‌  ఏఐ,, ఫిన్ టెక్, సస్టైనబిలిటీ (సుస్థిరత) ఆధారిత పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. నెదర్లాండ్స్‌లో అడ్మిషన్లు 2,871 నుంచి 3,512 కు పెరిగాయి.

జర్మనీ (ఉన్నత విద్య, పీజీ – స్టెమ్‌ కోర్సులకు): ఇంగ్లీష్‌ మాతృభాష గా లేని యూరోపియన్‌ దేశాలలో భారతీయ పీజీ  స్టెమ్‌ విద్యార్థులకు జర్మనీ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ లేదా పూర్తిగా ఉచిత ట్యూషన్‌ ఫీజు, బలమైన పరిశోధనా విధానం,  పరిశ్రమలతో అనుసంధానం ఇందుకు ప్రధాన కారణాలు. ఇంజనీరింగ్, ఆటోమోటివ్‌ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్‌  అప్లైడ్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌లను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇక్కడ వేగంగా పెరుగుతోంది.

సింగపూర్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): సింగపూర్‌లో భారతీయ ఉన్నత విద్యా ప్రవేశాలు 2023లో 2,850 నుంచి 2025లో 3,250కి పెరిగాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ ఆధారిత ప్రోగ్రామ్‌లకు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. తక్కువ కాలవ్యవధి గల కోర్సులు, గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమలతో బలమైన అనుసంధానం,  ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో చదువు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. బిజినెస్‌ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ , ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక కోర్సుల్లో  ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement