స్విగ్గీ టైమ్‌లో... పిగ్గీ బ్యాంక్‌! | start teaching your kids about money and saving | Sakshi
Sakshi News home page

స్విగ్గీ టైమ్‌లో... పిగ్గీ బ్యాంక్‌!

May 24 2026 5:57 AM | Updated on May 24 2026 5:57 AM

start teaching your kids about money and saving

పిల్లలకు బలమైన సే‘వింగ్స్‌’!

‘డబ్బు చెట్లకు కాయదు నాన్నా’ ఈ డైలాగ్‌ ప్రతి మిడిల్‌ క్లాస్‌ నాన్న నోట్లోంచి వచ్చేదే. కానీ ఆ మాట పిల్లల బుర్రకి ఎక్కాలంటే చేతికి చిల్లర ఇవ్వాలి. ఇవాళ 10 రూపాయలు దాచడం నేర్చుకుంటే... రేపు 10 లక్షలు దాచడం తెలుసుకుంటారు. పొదుపు అనేది లెక్కల పాఠం కాదు, జీవిత పాఠం. స్కూల్లో టీచర్‌ చెప్పరు, మనమే చెప్పాలి. మరి ఐదేళ్ల పిల్లాడి నుంచి 15 ఏళ్ల టీనేజర్‌ వరకు పొదుపు ఎలా నేర్పాలి? ఇదిగో  పాఠాలు. ఈ సెలవుల్లో కాసుల క్లాసు తీసుకోండి.

పిగ్గీ బ్యాంక్‌ లాభం
నాలుగైదేళ్లు వచ్చే సరికి పిల్లలకు డబ్బులు తెలుస్తాయి. అర్థమవుతాయి. వారికి డబ్బును దాచడం అప్పటి నుంచే నేర్పవచ్చు. ఎలా? ఒక హుండీ కొనివ్వండి. ‘ఇది నీ బ్యాంక్‌రా కన్నా’ అని చెప్పండి. రోజూ బయటికి వెళ్లొచ్చినప్పుడు రూపాయి, రెండు రూపాయల కాయిన్స్  చేతికిచ్చి డబ్బాలో వేయించండి. నెల తర్వాత డబ్బా ఓపెన్‌ చేసి వాడి ముందే లెక్క పెట్టండి. ఆ డబ్బుతో నచ్చిన చిన్న బొమ్మ కొనిపెట్టండి. ‘నువ్వు దాచుకుంటే నీకు కావాల్సింది కొనుక్కోగలవు’ అనే నమ్మకం వాడి బుర్రలో పడాలి. ఆటలో నేర్పిన పాఠం ఆఖరు వరకూ గుర్తుంటుంది.

మూడు హుండీల విధానం
ఏడు నుంచి పదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ విధానం చెప్పాలి. వాళ్లకు మూడు హుండీలు ఇవ్వాలి. 
1. దాచుకునేది.. భవిష్యత్తు కోసం. 
2.ఖర్చుపెట్టేది... చాక్లెట్, బొమ్మల కోసం. 
3. దానం చేసేది..  పేదవాళ్లకు ఇవ్వడానికి. పిల్లలకు వారానికి యాభై రూపాయలు పాకెట్‌ మనీ ఇస్తే, ‘20 రూపాయలు దాచు, 20 రూపాయలు ఖర్చుపెట్టు, 10 రూపాయలు దానం చెయ్‌’ అని రూల్‌ పెట్టండి. డబ్బు అంటే కేవలం ఖర్చుపెట్టడం కాదు. దాచుకోవడం, పంచుకోవడం కూడా. మూడు హుండీలు అంటే సంపూర్ణ మనిషి.

కోరికలు అవసరాలు
మీ ఇంట్లో 11 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లలు ఉంటే వారికి చెప్పాల్సిన పాఠం ఇది. కోరికలు ఏమిటి... అవసరాలు ఏమిటి... ? ఈ పాఠం ఎలా చెప్పాలి? పిల్లలకు ఒక పేపర్‌ ఇవ్వండి. ‘నీకు కావాల్సినవి రాయి’ అనండి. తర్వాత కూర్చోబెట్టి అడగండి – ‘నువ్వు రాసిన వాటిలో నీ స్కూల్‌ బ్యాగ్‌ చిరిగిపోయింది. అది అవసరం. కాని క్రికెట్‌ బ్యాట్‌ నీ దగ్గర లేకపోయినా గ్రౌండ్‌లో వేరే పిల్లల బ్యాట్‌తో ఆడుకుంటున్నావు. ముందు ఏది?’ అని అడగండి. ‘పాకెట్‌ మనీ సరిగా దాచుకుంటే ముందు అవసరాలకు తర్వాత కోరికలకు ఖర్చు చేయవచ్చు’ అని చెప్పండి. ‘అమ్మ వద్దంది‘ అంటే ఏడ్చే పిల్లాడు ‘నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు’ అని వాడే అంటాడు. అదే పొదుపులో మొదటి గెలుపు.

నీ బ్యాంక్‌ నీ బాధ్యత
మీ ఇంట్లో పద్నాలుగేళ్ల నుంచి పదహారేళ్ల వాళ్లు ఉంటే ఈ పాఠం మీ కోసమే. ఈ వయసు పిల్లలకు  నెలకు పాకెట్‌ మనీ 500 రూపాయలు ఇవ్వండి.  ‘ఇది నీ నెల బడ్జెట్‌. సినిమా, ఫ్రెండ్స్‌తో పానీపూరి, నెట్‌ రీఛార్జ్, స్టేషనరీ అన్నీ ఇందులోనే. నెలాఖరుకి 100 రూపాయలు మిగిల్చి చూపించు’ అని టార్గెట్‌ పెట్టండి. ఒక చిన్న డైరీ ఇవ్వండి. ఖర్చు రాసుకోమనండి. వాడు రెండుసార్లు డబ్బులు అయిపోయాయని మీ దగ్గరకు వస్తాడు. జాలిపడి ఇవ్వకండి. ‘నెక్స్‌›్ట మంత్‌ ΄్లాన్‌ చేసుకో‘ అని చెప్పండి. అప్పుడే డబ్బు, పొదుపు  విలువ తెలుస్తుంది.

బడ్జెట్‌ షురూ
పదహారు నుంచి పద్దెనిమిదేళ్లకు చేరుకున్నాక పిల్లలకు బ్యాంక్‌ అకౌంట్‌ తీయండి. ఏ.టి.ఎం. కార్డ్‌ ఇప్పించండి. పిల్లల పాకెట్‌ మనీ నేరుగా అందులో వేయండి. ‘ఆన్ లైన్ లో ఏదైనా కొనాలంటే నీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉండాలి’ అని రూల్‌ పెట్టండి. వడ్డీ అంటే ఏంటి,  ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అంటే ఏంటి అని చిన్న చిన్న మాటల్లో చెప్పండి. వాడు దాచిన 5000 రూపాయలకు మీరు 500 రూపాయలు కలిపి ‘వడ్డీ’ అని ఇవ్వండి. రెక్కలు రాకముందే ఎగరడం నేర్పాలి. దాని వల్ల రేపు పిల్లలు కాలేజీకి వెళ్లినప్పుడు క్రెడిట్‌ కార్డు మాయలో పడకుండా ఉంటాడు. 

గుర్తుంచుకోండి. పొదుపు సరిగా నేర్చుకుంటే రేపటి కోటీశ్వరుడు ఇవాళ మీ ఇంట్లోనే ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement