
‘జియా జలే జాన్ జలే’ అన్నట్లు గుల్జార్ కవిత్వం ఒక్కోసారిమంట పెడుతుంది, మరోసారి పదబంధాలతోనే ప్రాణాలు తీయగా లాగేస్తుంది. హిందూస్తానీలో కవిత్వం రాసే విలక్షణ కవి ఆయన. ఈస్థటిక్ సెన్స్‌తో కమర్షియల్ సినిమాలు తీసే మేటి దర్శకుడు. అసలు పేరు సంపూరణ్ సింగ్ కాల్రా. 1934 ఆగస్టు 18న ఓ సిక్కు కుటుంబంలో పుట్టారు. దేశ విభజన తర్వాత బొంబాయి వచ్చి ఓ కార్ షెడ్‌లో పెయింటర్‌గా చేరారు. ‘గుల్జార్’ (Gulzar) పేరుతో కవిత్వం రాయడం మొదలుపెట్టింది అక్కడే. ఆ తర్వాత రైటర్స్ అసోసి యేషన్‌లో చేరి బిమల్ రాయ్‌కి దగ్గరయ్యారు. ఆ పరిచయమే‘బందిని’ సినిమాలో ఎస్డీ బర్మన్ స్వరపరిచిన ‘మోరా గోరా’ అనే పాట రాసే అవకాశమిచ్చింది. ‘బందిని’ తర్వాత రిషీకేశ్ ముఖర్జీ సినిమాలకు గుల్జార్ లిరిక్స్ రాశారు. ఇలా పాటలు రాస్తూనే 1971లో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మీనా కుమారి లీడ్‌గా ‘మేరే అప్నే’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘పరిచయ్’, ‘కోషిష్’,‘ఆంధీ’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ వంటి కళాఖండాలను తీర్చిదిద్దారు.
గుల్జార్ సినిమాలు మానవ సంబంధాలను కొత్తగా ఆవిష్క రిస్తాయి, ఫ్లాష్‌బ్యాక్ ఎలిమెంట్‌ని చక్కగా పండిస్తాయి. ‘మౌసం’ దీనికో మంచి ఉదాహరణ. గుల్జార్ దర్శకత్వం వహించిన ‘ఇజాజత్’లోని ‘మేరా కుఛ్ సామాన్’ అనే పాట విరహపు విషాదంతో దిగులు పుట్టిస్తుంది. ఆటలో తగవొస్తే పిల్లలు తమ బొమ్మలు తిరిగిచ్చేయమన్నట్లు ఒక అమ్మాయి తన వస్తువులు తనకిచ్చేయమని ప్రియుణ్ణి అడుగుతుంది. ఆ వస్తువులేంటి– వర్షంలో తడిసిన రోజులు, మంచం పక్కనే తడిసి ముద్దయిన మనసులు, వెన్నెల రాత్రులు, గిల్లికజ్జాలు! వినూత్నమైన ఈ రచన గుల్జార్‌కు జాతీయ అవార్డు సాధించింది.
గుల్జార్ మాస్టర్ పీసెస్‌లో ‘ఆంధీ’ ముఖ్యమైనది. ఇందులోని ‘ఇస్ మోడ్ సే’ అనే పాటలో దారుల గురించి గొప్పగా వర్ణిస్తారా యన. ఈ మలుపు నుంచి మొదలయ్యే దారులు ఒక్కోటి ఒక్కోలా ఉంటాయంటారు. అందరికీ జీవితం ఒకటే, కానీ అది నడిచే దారులు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయని దీని సారాంశం.
‘పరిచయ్’లోని ‘ముసాసఫిర్ హు యారో’ పాట ద్వారా జీవి తమే ఓ ప్రయాణం, దాన్ని కొనసాగిస్తూనే ఉండాలని గుల్జార్ చెప్పకనే చెబుతారు. ‘కినారా’లోని ‘నామ్ గుమ్ జాయేగా’ పాట గుల్జార్, ఆర్డీ బర్మన్ లతాజీ కాంబినేషన్‌లో వచ్చిన ఆణిముత్యం. ఈ పాటలో ‘వక్త్ కే సితమ్’ అంటూ గుల్జార్ కాలం తీరుపై రుసరుసలాడతారు.
రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఓ కథ ఆధారంగా గుల్జార్ రాసి, డైరెక్ట్ చేసిన సినిమా ‘లేకిన్ జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడే ఓ ఆత్మకథ ఇది. చావుబతుకుల మధ్య ఊగిసలాడే మనందరి కథ కూడా! ఇందులోని ‘యారా సీలీ సీలీ’ పాట ఆ సంఘర్షణను చక్కగా ఆవిష్కరిస్తుంది. పచ్చికట్టె మండనూ లేదు, ఆరిపోనూ లేదు. అలాగే విరహపు రాత్రి కూడా ఎటూ కాని మంట రేపుతుంది. అది చావూ కాదు, బతుకూ కాదు. లోతైన ఈ పాట గుల్జార్‌కి జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు తెచ్చిపెట్టింది.
చదవండి: గ్రాండ్‌మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
కాలం మారేకొద్దీ పదునెక్కుతూ వచ్చిన గుల్జార్ రచనకు విశాల్ భరద్వాజ్ స్వరపరిచిన ఛప్పా ఛప్పా, బీడీ జలైలే పాటలు తార్కాణాలు. కానీ కొత్త తరంలో ఆయన పాటకు మరింత పరిమళం అద్దింది మాత్రం ఎ.ఆర్. రెహమానే! ‘దిల్‌సే’ లోని ‘ఏ అజ్నబీ’ పాటను గుల్జార్ ఎంత మార్దవంగా రాశారో రహమాన్ అంతే సుతిమెత్తగా స్వరపరిచారు. గుల్జార్, రహమాన్ జోడీలో వచ్చిన ‘జయహో’ పాట ఏకంగా ఆస్కార్ గెలుచుకొచ్చింది. గుల్జార్ అద్బుతమైన సినిమాలు తీసి ‘దాదాసాహెబ్ పాల్కే’ అవార్డు సాధించుకున్నారు, అందమైన కవిత్వం రాసి ‘జ్ఞాన్ పీఠ్’ పురస్కారం గెలుచుకున్నారు. ఈ రెండింటినీ సాధించిన ఏకైక భారతీయుడాయన!
ఇదీ చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
– శాంతి ఇషాన్ అనువాదకురాలు
ఒక అమ్మాయి తన వస్తువులు తనకిచ్చేయమని ప్రియుణ్ణి అడుగుతుంది. ఆ వస్తువులేంటి – వర్షంలో తడిసిన రోజులు, మంచం పక్కనే తడిసి ముద్దయిన మనసులు, వెన్నెల రాత్రులు, గిల్లికజ్జాలు!