అద్వైతసిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము

Special Story About SP Balasubramanyam - Sakshi

పాటకు వీడ్కోలు

ఆ పాట ఒక కుర్రవాడి నూగుమీసాలకు మెరుపు తెచ్చింది. ఆ పాట ఒక పెళ్లి కాని అమ్మాయి కాలేజీ నడకకు తోడు అయ్యింది. ఆ పాట ఒక పండితుని చేతి కాఫీతో పాటు పొగలు గక్కింది. ఆ పాట ఒక రిక్షావాడి పెడల్‌ మీద కాలి బలాన్ని పెంచింది. ఆ పాట వెన్నెలను చిన్నబుచ్చి తానే వెలిగింది. ఆ పాట ప్రమిద కంటే పవిత్రంగా దేవుని గుడిలో మంత్రధ్వని అయ్యింది. ఆ పాట ఒక్కసారి వచ్చి వేయి వసంతాలను తెచ్చింది. ఆ పాట ప్రతి గొంతులోనూ పల్లవిగా మారింది. తెలుగు వారికి కృష్ణ, గోదావరులతోపాటు బాలు పాట కూడా ఉంది. రామప్ప శిల్పం, మక్కా మసీదు గుమ్మటంతో పాటు బాలు గళసీమ కూడా ఉంది. ఆస్తిపరులైన తెలుగువారిని నేడు ఆ సంపద విడిపోయింది. ప్రాప్తమున్న తీరానికి పాట సాగిపోయింది. చూస్తూ నిలుచున్న లక్షలాది శ్రోతల రేవు.. అదిగో... బావురుమంటోంది.

ఖదీర్‌ – సాక్షి ప్రతినిధి: ‘గువ్వలా ఎగిరి పోవాలి... ఆ తల్లి గూటికే చేరుకోవాలి’.... అని పాడిన, పాడుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946–2020) అను అభిమానుల అతి ఇష్ట ఎస్‌.పి.బాలు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ పాటే తన నీడా గూడూ అనుకున్నారు. పాట కోసమే జీవించారు. పాటనే శ్వాసించారు. ఆ గళాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీరు మంచు సానువుల వరకూ వినిపించారు. ఆలిండియా రేడియో ఆయన పాటల వల్ల ‘బాలిండియా’ అయ్యింది. కట్టే ఏ పాటకైనా బాలు అనే పేరే అడ్రస్‌ అయ్యింది. ఘంటసాల ఘన పరంపరకు అసలైన వారసుడు బాలు అనిపించుకున్నారు. సరస, విరస, ధిక్కార, సాహస, విప్లవ, విషాద, విలాప గీతం ఏదైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 1980–2000 అనే రెండు దశాబ్దాలు సినీసంగీతంలో బాలు దక్షిణాది రాష్ట్రాలను ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. దక్షిణాది వారికి మోకాలడ్డే ఉత్తర భారతదేశంలోనూ గాన పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి తన సత్తాని, తెలుగువారి సత్తాని చాటారు. బాలు ఎన్ని పాటలు పాడారన్నది కచ్చితమైన గణాంకాలు లేకపోయినా 16 వేల నుంచి 35 వేల లోపు ఉండొచ్చని ఒక అంచనా.

పల్లవించవా నా గొంతులో...
తెలుగు సాంస్కృతిక ఔన్నత్యానికి తార్కాణాలుగా నిలిచిన తిక్కన, దువ్వూరి రామిరెడ్డి వంటి వారిని ఇచ్చిన సింహపూరి సీమ (నెల్లూరు) గాలిని పీల్చి పాటను నేర్చిన బాలు బతుకుతెరువుకు చదువుకొని ఏ ఇంజనీరో అవుదామనుకున్నారు. తిరుపతిలో పి.యు.సి చేశాక అనంతపురంలో బి.ఇ చేరి అక్కడి భోజనం సరిపడక మద్రాసు (చెన్నై) చేరుకున్నారు. అక్కడ కూడా ఏ.ఐ.ఎం.ఇ లో చేరారు కాని మెల్లగా జీవిత లక్ష్యమే పాటవైపు మళ్లింది. అలాగని ఆయన ఇంటిలో శాస్త్రీయ సంగీతం అంటూ ఏమీ లేదు. తండ్రి శ్రీపతి పండిరాధ్యుల సాంబమూర్తి హరికథా గానం చేసేవారు. ఆయన తన కుమారుడిలో గాత్ర ప్రతిభ గమనించినా చదువుకుని బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఆ రంగంలో ప్రత్యేకించి ప్రోత్సహించి శాస్త్రీయ సంగీతం నేర్పించాలని అనుకోలేదు. ఆ వెలితి బాల సుబ్రహ్మణ్యానికి చివరివరకూ ఉండింది. కాని కోకిల ఏ గురువును ఆశ్రయించిందని? ఈలలు వేసే పైరగాలి ఏ సంగీతాన్ని అభ్యసించిందని? బాలూకూ ప్రకృతే పాట నేర్పింది. పి.సుశీల, రఫీ పాడిన పాటలను వేదికల మీద పోటీలలో పాడి సెబాష్‌ అనిపించుకున్నారు. గూడూరులో ఒక పోటీకి జడ్జిగా వచ్చిన ఎస్‌.జానకి ఆ పోటీలో బాలు ప్రతిభను గమనించి ‘సినిమాల్లో ట్రై చెయ్‌’ అని ఆశీర్వదించారు. ఆ వాక్కుఫలితమో, ఫలమో అందుకు తొలి మెట్టుగా చెన్నై చేరారు. సాధారణంగా శిష్యులు మార్గదర్శిని కనుగొంటుంటారు. కాని బాలు విషయంలో మార్గదర్శే శిష్యుణ్ణి కనుగొన్నారు. ఆయనే ఎస్‌.పి.కోదండపాణి.

ఇది తొలిపాట
1963లో చెన్నైలో జరిగిన మద్రాసు కల్చరల్‌ అకాడమీ పాటల పోటీకి ఘంటసాల, పెండ్యాల జడ్జీలు. వారు బాలు పాటను మెచ్చి బహుమతి ఇచ్చి వెళ్లిపోయారు కాని ఆ తర్వాత ఆడియన్స్‌లో నుంచి మెల్లగా వచ్చి తెల్ల పంచె, చొక్కాలో కలిసిన సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది బాబూ. క్రమశిక్షణతో నిలబడితే నలభై ఏళ్లు పాడతావు’ అని ఆశీర్వదించారు. ఆయన అన్నట్టుగానే బాలు నలభై ఏళ్లు పాడారు. కాని అందుకు మొదట కోదండపాణే తన భుజాన్ని ఇచ్చి మోశారు. అనేకమంది సంగీత దర్శకుల దగ్గరకు తీసుకువెళ్లారు. తన సంగీత దర్శకత్వంలోనే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ (1967)లో మొదటి పాట పాడించారు. ఆ తర్వాత ‘సుఖదుఃఖాలు’ (1968) చిత్రంలో ‘మేడంటే మేడా కాదు’ పాడించి బాలూను అందరి దృష్టిలోకి తెచ్చారు. సంగీత దర్శకుడు సత్యం ‘కన్నెవయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాడించి బాలూకు అభిమానులను కల్పించారు.

పాడాలనే ఉన్నదీ...
ఘంటసాల 1974 ఫిబ్రవరిలో మరణించారు. దానికి రెండేళ్ల ముందు నుంచే ఆయన పాడటం తగ్గింది. పరిశ్రమ కొత్త గాయకులను వెతుకుతోంది. బాలు ఒక ప్రత్యామ్నాయం అయితే ‘విచిత్ర బంధం’ (1972) సినిమాతో హఠాత్తుగా దూసుకొచ్చిన గాయకుడు వి.రామకృష్ణ మరో ప్రత్యామ్నాయం. ఈ సమయంలో బాలు కమెడియన్లకు, హీరో కృష్ణకు ఎక్కువ పాటలు పాడుతూ ఉండిపోయారు. ఎన్‌.టి.ఆర్‌కు మొదటగా ‘కోడలు దిద్దిన కాపురం’ (1970) పాడినా, అక్కినేనికి ‘ఇద్దరు అమ్మాయిలు’ (1971– నా హృదయపు కోవెలలో) పాడినా ఆ గొంతు ఇంకా వారికి సరిపోలేదని ప్రేక్షకులు భావించారు. ఈలోపు కవి సినారె సిఫార్సుతో ‘చెల్లెలి కాపురం’ (1971)లో ‘చరణ కింకరణులు ఘల్లుఘల్లుమన’ పాడి మెరిశారు బాలు. కాని ఇంకా మేజిక్‌ జరగాల్సి ఉంది.
కమల్‌హాసన్‌తో...

కలకాలం ఇదే పాడనీ
సంగీత దర్శకుడు చక్రవర్తి ‘శారద’ (1973) సినిమాతో సంగీత దర్శకుడిగా హిట్‌ కొట్టారు. తమిళంలో ఇళయరాజా ‘అన్నక్కిళి’ (1976)తో   సంగీత దర్శకుడు అయ్యాడు. ఇలా జరగడం సినిమా సంగీతంలోనే కాదు బాలూ కెరీర్‌లో కూడా మలుపు. ఎందుకంటే వీళ్లిద్దరూ బాలూకు చాలా గాఢమైన స్నేహితులు. మరోవైపు దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘బాబు’ (1975) సినిమాతో దర్శకుడిగా మారి తన సినిమాలకు చక్రవర్తినే సంగీత దర్శకుడుగా ఎంచుకోవడం వల్ల చక్రవర్తి బలం పెరిగింది. బాలూకు ధైర్యంగా పాటలు ఇచ్చారు. ఇళయరాజా పాటలు బాలూకు తమిళంలో ఊతం ఇచ్చాయి. మొత్తం మీద 1977వ సంవత్సరం తెలుగులో బాల సుబ్రహ్మణ్యం దశ తిప్పింది. ఆ సంవత్సరమే ఎన్‌.టి.ఆర్‌ ‘దానవీరశూర కర్ణ’, ‘అడవిరాముడు’, ‘యమగోల’ సినిమాలకు బాలు పాడి ఇక ఆయనకు మరొకరి గొంతు అక్కర్లేదని శాసనం రాశారు. అక్కినేనికి ‘ఆలుమగలు’ (ఇరక్కపోయి వచ్చాను) ‘బంగారు బొమ్మలు’ (నేనీ దరిని నువ్వా దరిని) పాడి అక్కినేని పాడుతున్నట్టే అనిపించారు. బాలూ శకం మొదలయ్యింది.
ప్రధాని నరేంద్ర మోడీతో...

శృతిలయలే జననీ జనకులు కాగా
బంగారం బంగారం అంటే సరిపోదు... గీటురాయి మీద గీచి ద్రావకం పోసినప్పుడు చెక్కు చెదరకుండా నిలవాలి. అలాంటి పరీక్షా సమయాలను దాటినప్పుడే మెచ్చుకునే స్థాయి ప్రతిభ కీర్తించే స్థాయి ప్రతిభగా మారుతుంది. బాలూకి అలాంటి అవకాశం కె.విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’ (1980) ఇచ్చింది. శాస్త్రీయ సంగీతాన్ని కథాంశంగా తీసుకున్న ఈ సినిమాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహా సంగీతకారులు పాడాలి. కాని ప్రేక్షకుడికి సినిమాలో కావాల్సింది ‘సినిమా రాగం’ అనీ, వాడికి పండితుడి కంటే పల్స్‌ తెలిసినవాడే కావాలని నమ్మిన కె.వి.మహదేవన్‌ బాలూని పాడమన్నారు. కాని బాలు భయపడిపోయారు. సంగీత జ్ఞానం లేని తాను ఆ పాటలు పాడటమా? కాని చిత్తశుద్ధి ఉంటే శివపూజ ఫలించి శివుడే ప్రత్యక్షమవుతాడు. ఇక పాట ఎంత? పుహళేంది ప్రోత్సాహంతో బాలు శంకరాభరణం పాటలను సవాలుగా తీసుకున్నారు. కారులో, ఇంటిలో అనుక్షణం వింటూ తన ఒంటిలో వాటిని రక్త చాలనం గా మార్చుకున్నారు. అందుకే ‘శంకరా’ అని గొంతెత్తితే ఆకాశం నుంచి కుంభవృష్టి కురిసింది. ‘దొరకునా ఇటువంటి సేవ’ అంటే ప్రేక్షకుడి కంట గంగ పొంగింది. ‘రాగం తానం పల్లవి’ ఉన్నంత కాలం బాలు పేరును తెలుగువారు తలుచుకుంటారు అని ఈ సినిమా ఆయనను ఆశీర్వదించింది.

ఇదే పాట ప్రతి నోటా
బాలూను సంగీత దర్శకుడు సత్యం ‘కొడుకా’ అని పిలిచేవారు. కె.వి.మహదేవన్‌ ‘ఒరేయ్‌’ అని బిడ్డతో సమానంగా చూసేవారు. సాలూరి ‘నాయనా’ అని పలుకరించేవారు. అందరికీ బాలూ పాట కావాలి. అందుకే పోటీలు పడి బాలూకు హిట్స్‌ ఇచ్చారు. తాము హిట్స్‌ పొందారు. సంగీత దర్శకులందరికీ బాలు మంచి పాటలు పాడారు.  ఘంటసాలకు ‘సెలయేటి గలగల’ (తులసి), పెండ్యాలకు ‘చిత్రం.. భళారే విచిత్రం’ (దానవీర శూర కర్ణ), ఆదినారాయణ రావుకు ‘గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి’ (కన్నవారిల్లు), సాలూరి రాజేశ్వర రావుకు ‘ఈ రేయి తీయనిది’ (చిట్టి చెల్లెలు), టి.వి.రాజుకు ‘అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది’ (చిన్ననాటి స్నేహితులు), ఎం.ఎస్‌.విశ్వనాథన్‌కు ‘తాళి కట్టు శుభవేళ’ (అంతులేని కథ), తాతినేని చలపతిరావుకు ‘అందానికి అందానివై’ (దత్తపుత్రుడు), బి. గోపాలంకు ‘కదిలింది కరుణరథం’ (కరుణామయుడు), రమేశ్‌ నాయుడుకు ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), రాజన్‌ నాగేంద్రకు ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ (ఇంటింటి రామాయణం), కె.వి.మహదేవన్‌కు ‘నీవుంటే వేరే కనులెందుకు’ (స్నేహం), ఎస్‌.పి.కోదండపాణికి ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’ (గూడుపుఠాణి), జి.కె.వెంకటేశ్‌కు ‘రాశాను ప్రేమలేఖలెన్నో’ (శ్రీదేవి), సత్యంకు ‘ఓ బంగరు రంగుల చిలక’ (తోటరాముడు), జె.వి.రాఘవులుకు ‘కలహంస నడకదానా’ (సమాధి కడుతున్నాం చందాలివ్వం డి), చక్రవర్తికి ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ఇళయరాజాకు ‘మబ్బే మసకేసిందిలే’ (వయసు పిలిచింది), ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు ‘చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ’ (తూర్పు వెళ్లే రైలు)... ఇవన్నీ చెప్పడం అంటే కేవలం విస్తట్లో ఒక్క పదార్థం వేసినట్టే. ఇంకా ఎన్నో పప్పులు, దప్పళాలు, పాల తాలికలు, మజ్జిగ మిరపకాయలు. తెలుగువారు నిద్ర మేల్కొంటూ బాలు   పాట విన్నారు. నిద్రకు ఉపక్రమిస్తూ బాలు పాట విన్నారు. దివారాత్రాల గానం అది.

రాగాల పల్లకిలో గండు కోయిల
తొలితరం హీరోలకు బాలు పాడారు. మలితరంలో వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రామకృష్ణ, చంద్రమోహన్, మురళీ మోహన్‌లకు పాడరు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్‌ బాబు, సుమన్, నరేశ్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్‌లకు పాడారు. ఆ తర్వాత వచ్చిన మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌లకూ పాడారు. చక్రవర్తి హయాం తర్వాత వచ్చిన రాజ్‌కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్, చక్రి, రాధాకృష్ణన్, మిక్కీ జె.మేయర్, తమన్‌కు సహా అందరికీ పాడారు. ఆయన పాట ఆగలేదు. అది లేకుండా సినిమా పరిశ్రమ ముందుకు సాగలేదు. అయితే ‘రోజా’ (1992) సినిమాతో ఏ.ఆర్‌. రహమాన్‌ రంగప్రవేశం తర్వాత కొత్త గాయకుల ఉధృతి పెరిగింది. పర భాషా గాయకులు తెలుగులో విస్తృతంగా పాడటం మొదలెట్టారు. అయితే ఏమిటి? ఎవరెస్ట్‌ ఎక్కి జెండా పాతినవాడు విజేత. బాలు ఆ విజేత. ఆయన శిఖరం దిగి వచ్చి కొత్తతరానికి దారి చూపిస్తూ ఉండిపోయారు. అధిరోహణకు స్ఫూర్తిగా మిగిలిపోయారు.

ఓ పాపా లాలి.. జన్మకే లాలి...
బాలు పాట లేకుండా ఉండలేరు. బాలు  లేకుండా పాట ఉండలేదు. అందుకే టెలివిజన్‌ చానల్స్‌లో పదుల సంఖ్యలో ఆయన షోస్‌ చేశారు. యాంకర్‌గా ఉన్నారు. కొత్త జనరేషన్‌ను తయారు చేశారు. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై తిరుగుతూ విదేశాలలో షోస్‌ చేస్తూ అనుక్షణం శ్రోతకు పాటను దగ్గరగా ఉంచారు. అది ఔషధంగా ఇస్తూ వచ్చారు. ప్రతి ఒక్క తెలుగువాడి జీవితంలో వేల గంటలు, వందల రోజులు ఆయన పాటతో గడిచిపోయి ఉంటాయి. వారి సంతోషంలో, దుఃఖంలో, వేడుకలో, ఉత్సవంలో ఆయన పాట అవిభాజ్యం అయ్యింది. ఆయన పాటల క్యాసెట్టు ఇచ్చి పుచ్చుకోవడమే ఒక పెద్ద బహుమతి.

అలాంటిది... ఆయన గొంతు ఇక మీదట ప్రత్యక్షంగా వినపడదని, ఆయన రూపం ఎంత మాత్రమూ కనపడదని లక్షలాది మంది అభిమానులకు ఈ క్షణాన అనిపిస్తూ ఉంటే వారు విలపిస్తూ ఉంటే కంఠం రుద్ధం అవుతుంది. కళ్లు మసక గమ్ముతాయి. ఆయన పాటను ఆయనకు నివాళిగా అర్పించడానికి కూడా నోరు పెగలదు. ఒక గొప్ప ఎంటర్‌టైనర్, ఉల్లాసదాత, ఉత్సాహ దీపం, తోడుగా ఉంటూ వచ్చిన జతగాడు... ఇక లేడు అంటే వీడ్కోలు పలకడానికి తెలుగుభాష మాట కోసం తారాడుతోంది. పాట కోసం పారాడుతోంది. బాలూ సర్‌... బాలసుబ్రహ్మణ్యం సర్‌... కొమ్మకొమ్మకో సన్నాయిని నింపుకున్న వేల చెట్ల వనమా... కైమోడ్పులు. జోతలు. అశ్రుతర్పణాలు. అమలిన బాష్పహారాలు. ఇవాళ వెళ్లి రేపు పల్లవీ చరణాలుగా తిరిగి రా!
కుటుంబ సభ్యులతో బాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top