బతుకుదాం వీళ్ల స్ఫూర్తితో

Special Story About Charlie Chaplin Gold Rush Movie - Sakshi

అలాస్కా మంచుదిబ్బలు. ఘోరమైన తెల్లతుఫాను. తినడానికి తిండి లేదు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని వేడివేడి నీళ్లలో షూ ఉడకబెట్టుకుని తింటాడు చార్లీచాప్లిన్‌ ‘గోల్డ్‌ రష్‌’ సినిమాలో. కుటుంబంతో బతికే వ్యక్తిని తీసుకెళ్లి అమెరికా దక్షణాది రాష్ట్రాల్లో బానిసగా అమ్మేస్తారు కొందరు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని అతను స్వేచ్ఛ కోసం 12 ఏళ్ల పాటు ప్రయత్నించి పొందుతాడు ‘12 ఇయర్స్‌ ఏ స్లేవ్‌’ సినిమాలో. చనిపోవడానికి ఉండే కారణాలు ఎప్పుడూ స్వల్పమే. బతికేందుకు దొరికే దారులు వేయి. బతుకుదాం వీరి స్ఫూర్తితో.

1890ల చివరలో అలాస్కా– కెనెడా సరిహద్దు ప్రాంతంలో బంగారం బయటపడింది. అమెరికా లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా సియాటిల్, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆ బంగారం కోసం లక్ష మంది వేటగాళ్లు బయలుదేరారు. కాని దారి సులువు కాదు. అలాస్కా మీదుగా కెనెడాలో ప్రవేశించి బంగారం దొరికే ప్రాంతానికి చేరుకోవాలి. దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం అలస్కా నుంచి. అలస్కా అంటే శరీరాన్ని క్షణాల్లో కట్టెగా మార్చేంత శీతల ప్రాంతం. కాని వేటగాళ్లు ప్రాణాలకు తెగించి బయలుదేరారు. లక్షమంది వెళితే కేవలం 30 వేల మంది తిరిగి వచ్చారు. అందరూ వెళ్లే దారిలో లేదా తిరిగి వచ్చేదారిలో మరణించారు. చార్లి చాప్లిన్‌ ఈ చారిత్రక ఘటన మీద ‘గోల్డ్‌ రష్‌’ సినిమా తీశాడు.

బంగారం వేటకు వెళ్లి అలాస్కా మంచు తుఫానులో చిక్కుకుంటాడు చాప్లిన్‌. అతడికి ఆసరా ఒక చెక్కముక్కల గది. తోడుగా మరో వేటగాడు. తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. బయట తుఫాను ఎన్నిరోజులు గడిచినా ఆగదు. భయంకరమైన ఆకలి. తోటి వేటగాడు ఆకలితో భ్రాంతికి గురై చాప్లిన్‌నే తిందామన్నంత పిచ్చివాడైపోతాడు. చేతిలో తుపాకీ ఉంది. ఆత్మహత్య చేసుకోవడం చిటికెలో పని. కాని చాప్లిన్‌ బతకాలని నిర్ణయించుకుంటాడు. తిరిగి ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు. అందుకే తన కాలి షూ తీసి నీళ్లలో బాగా ఉడకబెడతాడు. తర్వాత దానిని తెచ్చి టేబుల్‌ మీద పెట్టి రెండు సగాలుగా కోస్తాడు. ఒక సగం తన పార్టనర్‌కు ఇచ్చి మరో సగం తీరిగ్గా భుజిస్తాడు. చచ్చిపోవడం కంటే షూ తిని ప్రాణాలు కాపాడుకోవడం బెటర్‌. బతికి ఉంటే ఆ తర్వాత బిరియాని దొరకొచ్చు. ఈ కష్టాలకు ఓర్చుకున్నాడు కనుకనే సినిమాలో చాప్లిన్‌కు బంగారం దొరుకుతుంది. కోటీశ్వరుడు అవుతాడు.

‘పాపియాన్‌’ (1969) ప్రఖ్యాత ఫ్రెంచ్‌ నవల. నిజ జీవిత ఘటనల ఆధారంగా రాసింది. సినిమాలూ వచ్చాయి. అందులో ‘పాపియాన్‌’ (అంటే సీతాకోకచిలుక) అనే చిల్లర దొంగను హత్యానేరం కింద ఇరికించి అతి భయంకరమైన ఫ్రెంచ్‌ గయానా దీవుల్లోని జైలుకు పంపుతారు. ఇది ఇంకో రకమైన మరణశిక్షలాంటిది. ఎందుకంటే అక్కడికి వెళ్లినవారు తిరిగి రావడం కల్ల. హత్యకు అయినా గురవుతారు. ఆత్మహత్య అయినా చేసుకుంటారు. కాని పాపియాన్‌ బతకాలని నిశ్చయించుకుంటాడు. ఎలాగైనా బతికి తీరాలని పదే పదే పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని తీసుకొచ్చి ఏకాంత శిక్ష వేసినా ఆకలితో మాడ్చినా బతికే తీరుతాడు. 1931 నుంచి 1945 వరకు అతడు జైల్లో గడిపిన జీవితమే ఆ నవల. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన నవల ఇది. ఇస్తున్న నవల. పాపియాన్‌ కంటే పెద్ద కష్టం ఎవరికీ రాకపోవచ్చు. మరి ఎందుకు చనిపోవడం?

1841లో సోలమన్‌ నార్తప్‌ అనే ఆఫ్రికన్‌–అమెరికన్‌ను బానిసల వ్యవస్థ లేని న్యూయార్క్‌ నుంచి పట్టుకెళ్లి బానిసల వ్యవస్థ ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మేస్తారు. అతని భార్యకు, పిల్లలకు ఈ విషయం తెలియనే తెలియదు. అమ్ముడుపోయిన బానిసలు పత్తి, చెరకు చేలలో బండ చాకిరి చేయాలి. రాక్షస హింసను ఎదుర్కోవాలి. దానిని భరించలేక చాలామంది చచ్చిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు. కాని నార్తప్‌ తాను బతికి తిరిగి కుటుంబానికి చేరుకోవాలనుకుంటాడు. తాను బతికే ఉన్నానని చెప్పి ఒక లేఖ రాయడానికి కావలసిన కాగితం కోసం అతడు 12 ఏళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తాడు. కాగితం దొరికాక అతడు రాసిన లేఖ చూసి అధికారులు వచ్చి విడిపిస్తారు. నార్తప్‌ జీవితంపై వచ్చిన బయోపిక్‌  ‘12 ఇయర్స్‌ అండ్‌ స్లేవ్‌’. ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి సినిమా చూడాలి.

‘మలావి’ అనే దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ దేశంలోని కసుంగు అనే ఊళ్లో ఒక 15 ఏళ్ల కుర్రాడి పేరు విలియమ్‌ కమ్క్‌వాంబ. తల్లి, తండ్రి, అక్క, ఒక పెంపుడు కుక్క, బడి ఇదీ అతని జీవితం. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. కొద్దిగా పొలం, ఒక సైకిల్‌ వారి ఆస్తి. కాని ఆ పొలం పండదు. దాని కారణం వానలు ముందే వచ్చి పోతాయి. విత్తు నాటే సమయానికి ఉత్త ఎండ. దేశమంతా కరువు వచ్చేస్తుంది. అందరి పొలాల్లో కొద్దిగా మొక్కజొన్న పండితే ఒకరి పంటను మరొకరు దొంగిలించేంత ఆకలి. ఈ పేదరికం భరించలేక అక్క పారిపోతుంది. గుప్పెడు తిండి కూడా పెట్టకపోవడంతో కుక్క చనిపోతుంది. అమ్మా నాన్న జీవచ్ఛవాలు అయినట్టే. ఆ కుర్రాడు ఒక్కడు. కాని పారిపోడు. పోయి ఏట్లో దూకడు. కరెంటు లేని ఆ ఊళ్లో బావిలోని నీటిని పొలానికి తీసుకురావడానికి విండ్‌మిల్‌ తయారు చేస్తాడు. చనిపోయే దారి ఉన్నా బతికే మార్గం వెతికే ఉపాయమిది. ఆ పిల్లవాడికి ఆ తర్వాత అమెరికా యూనివర్సిటీలు సీటిచ్చాయి. అతడి జీవితం ఆధారంగా ‘ద బాయ్‌ హూ హార్వెస్ట్‌ విండ్‌’ సినిమా వచ్చింది.

ఈ సినిమాలే కాదు ఇలాంటి సినిమాలు ఎన్నో నెట్‌లో ఉన్నాయి. బతుకు మీద ఆశ కలిగించే సాహిత్యం ఉంది. విలోమ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పారదోలేందుకు సాయపడే హెల్ప్‌లైన్లు ఉన్నాయి. స్నేహితులు ఉంటారు. కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మరైతే చనిపోవడం ఎందుకు? ప్రకృతి మనిషికి బుద్ధి, చేతన, ఆలోచన ఇచ్చింది పాజిటివ్‌గా ఆలోచించేందుకు. వెలుతురు వైపు చూసేందుకు. చీకటి పడితే నిద్రపోయి (దానిని భరించి) వెలుతురులో మేల్కోవాలి. అదీ జీవితం. కష్టాలు ఇంతకుముందు లేవని కాదు. ఇక ముందు ఉండవనీ కాదు. మన పూర్వికులు కోట్లాది మంది కష్టాలకు తట్టుకుని నిలబడ్డారు. కనుక మనం ఇవాళ ఉన్నాం. మనం తట్టుకుని నిలబడి తర్వాతి తరాలకు ఆశ కల్పించాలి. ఇది నిరాశ ఉన్న కాలం నిజమే. ‘కరోనా’ మహమ్మారి మనల్ని ఆందోళనలో, నైరాశ్యంలో ముంచుతోంది నిజమే. కాని మరో మూడూ లేదా ఆరు నెలలు ఓపిక చేసుకోలేమా. ఇతర మన కష్టాలకు విరుగుడులను వెతుక్కోలేమా. ఆత్మీయులతో మన భారాన్ని పంచుకుని బతుకును పెంచుకోలేమా? బతుకుదాం. శతమానం భవతి. – సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top