ఒత్తిడి లేని జీవితం కావాలంటే.. ఇదే సీక్రెట్‌! | The Secret To Live A Happy And A Stress Free Life | Sakshi
Sakshi News home page

ఒత్తిడి లేని జీవితం కావాలంటే.. ఇదే సీక్రెట్‌!

Jul 1 2025 10:37 AM | Updated on Jul 1 2025 10:54 AM

 The Secret To Live A Happy And A Stress Free Life

ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏ జీవిౖయెనా ఏమీ తీసుకురాదు. మృతి చెందినప్పుడూ తనతో ఏదీ తీసుకుపోదు. ఈ ఎరుక ఒక్కటే మనిషికి ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తుంది. ఈ చిన్న కథ ద్వారా ఈ వాస్తవం బోధపడుతుంది. ఒకానొక రోజు, ఓ ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాస్సేపటికి అతను ఒక చిన్న చీమ తన ఆకారం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ పెద్దదైన ఓ ఆకును తీసుకుపోవటం చూశాడు.

ఇంతలో ఓ చోట ఒక పగులు కనిపించింది. అక్కడ ఆ చీమ ఎలా పోతుందా అని ఆసక్తిగా చూశాడు. పగులు దగ్గరకు రావడంతోనే చీమ అక్కడ ఆకును అడ్డంగా ఉంచి దానిపైకి ఎక్కి అవతలకు దాటింది. అనంతరం ఆ ఆకును ముందుకు లాగింది. మొత్తం మీద చీమ ఇలా మరిన్ని అడ్డంకులను దాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగింది. చీమ చివరకు దాని గమ్యస్థానమైన పుట్ట వద్దకు చేరుకుంది. తన పుట్ట ముందర ప్రవేశ ద్వారంగా ఓ రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోకి తాను వెళ్ళడానికి వీలుంది తప్ప తానింత దూరమూ తీసుకొచ్చిన ఆకుని పుట్టలోకి తీసుకుపోయే వీలు లేదు. అది తెలీని చీమ ఎంత ప్రయత్నించినా ఆకుతో సహా రంధ్రంలోకి వెళ్లడానికి నానా తిప్పలూ పడింది. చివరకు చేయగలిగిందేమీ లేక ఆకును ప్రవేశద్వారం దగ్గరే విడిచిపెట్టి లోపలికి వెళ్లింది.

ఇదీ చదవండి: యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?

ఒక వ్యక్తి చాలా కష్టపడి తన జీవితంలో ఎన్నెన్నో సమకూర్చుకుంటాడు. ఇబ్బందులు అధిగమించి సౌకర్యాలను పొందుతాడు. బోల్డన్ని ఆస్తిపాస్తులను పోగేసుకుంటాడు. తాను జీవించడానికి అవసరమైనవాటికన్నా ఎక్కువే పోగుచేసి సంతోషపడిపోతూ ఉంటాడు. చివరికి, అతను మరణించేటప్పుడు తనదంటూ ఏదీ తీసుకుపోలేడు. ఈ సంపదలేవీ తనతో రావని తెలిసీ మనిషి చివరి వరకూ అవసరం లేకపోయినా సంపాదించడానికే ప్రయత్నిస్తాడు. కానీ, రిక్త హస్తాలతో చీమ పుట్టలోకి వెళ్లినట్లే... మనిషీ మరణం ఒడిలోకి జారుకుంటాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం! ఈ జ్ఞానమే ఇహలోకంలో మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. 
– యామిజాల జగదీశ్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement