శ్రీకాకుళం జిల్లా: గార మండలంలోని బూరవిల్లి గ్రామం భోగి ఉత్సవానికి దూరంగా ఉంటోంది. అన్ని గ్రామాల మాదిరిగా వేకువజామున వేసే భోగి మంట అక్కడ వేయరు. పెద్దల కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని తామంతా కొనసాగిస్తున్నామని అక్కడి గ్రామపెద్దలు చెబుతుంటారు. ఇక్కడ ఉగాది రోజున రైతులు ఏరువాక చేయకుండా, మరో రోజు ముహూర్తం చూసి ఏరువాక చేస్తారు. నాగుల చవితి రోజు కాకుండా అదే నెలలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి రోజున పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు.

మంట వేస్తే అరిష్టమని
నరసన్నపేట: నరసన్నపేట మండలం చోడవరం, చింతు వానిపేట, బసివలస, గోకయ్యవలస, సుందరాపురం గ్రామాల ప్రజలు భోగి మంటలకు దూరంగా ఉంటారు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మంట వేస్తే గ్రామానికి అరిష్టం కలుగుతుందని వీరి నమ్మకం. అయితే పూజలు, పిల్లలకు భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుపుతారు.
150 ఏళ్లుగా..
జలుమూరు: లింగాలవలస గ్రామం భోగి పండుగ జరుపుకోదు. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి భోగి మంటే వేయలేదు. 150 ఏళ్ల కిందట గ్రామంలో భోగి పండగ చేసేందుకు కర్రలు, పిడకలు సిద్ధం చేశారు. మంట వెలిగించేందుకు నిప్పు పెడుతుండగా ఒక పెద్ద పులి వచ్చి గ్రామంలో ఓ వ్యక్తిని నోట కరుచుకొని తీసుకెళ్లిపోయిందనే కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి ఇక్కడ భోగి మంట వేయకూడదని పెద్దలు తీర్మానం చేశారు.

ఆ రెండు గ్రామాల్లో..
కొత్తూరు: మండలంలోని ఓండ్రుజోల, బడిగాం గ్రామాల్లో భోగి పండుగ జరుపుకోరు. అప్పట్లో మంట దగ్గరకు పులి వచ్చి ఒకరిని ఎత్తుకుపోవడంతో నాటి నుంచి రెండు గ్రామాల్లో భోగి చేసుకోవడం లేదని వృద్ధులు చెబుతున్నారు.

ముందురోజే..
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామంలో భోగి పండుగను ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంప్రదాయంగా వచ్చే భోగికి ముందు రోజు రాత్రి మంట వెలిగిస్తారు. రాత్రి సుమారు 9 గంటలు తర్వాత భోగి మంటకు గ్రామ పెద్దలు నిప్పు పెడతారు. భోగి రోజు యథావిధిగా పిల్లలు పిడకలను మంటలో వేస్తారు.
కక్క.. ముక్క.. పెరిగిన లెక్క
సంక్రాంతికి ముందే మాంసాహార ధరలు పెరిగాయి. నాటుకోళ్లు, చేపలు, మటన్ ధరలన్నీ బాగా పెరిగాయి. సోమవారం సంతలో నాటు కోళ్లు కిలో రూ. 800కు విక్రయించారు. నాటు కోడి చికెన్ ధర రూ. 1200 ఉంది. మటన్ రూ.900 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి తాకింది. చెరువు చేపల ధరలు కూడా పెరిగాయి.
–నరసన్నపేట

హరిలో రంగ హరి
సంక్రాంతి అతిథులు వచ్చేశారు. హరిలో రంగా.. హరీ అంటూ హరిదాసులు, భలే దొడ్డ దొరండీ మా బసవన్న అంటూ గంగిరెద్దుల వారు, అంబ పలుకు అంటూ కోయిదొరలు, హరోం హరా అంటూ జంగమ దేవరలు ఊరికి కళ తీసుకువచ్చారు. వీరు వేకువ జాము మొదలు ఆయా గ్రామాల్లో శంఖారావం చేస్తూ ఇంటింటా తిరిగి దీవిస్తున్నారు. –జలుమూరు


