సలక్షణంగా ఎలక్షన్‌ డ్యూటీ

Sakshi Special Article On Women Election Officer

∙ముగ్గురు మహిళా అధికారులు

మొత్తం ఎనిమిది విడతల పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మూడో విడతగా మంగళవారం మూడు జిల్లాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ప్రశాంతంగా జరిగింది! ఎక్కువ శాతం జరిగింది. 
ఆ మూడు జిల్లాలు.. దక్షిణ 24 పరగణాలు, హౌరా, హూగ్లీ. ఆ మూడు జిల్లాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించిన ముగ్గురూ యాదృచ్ఛికమే అయినా.. మహిళలు కావడమే ఆ ప్రశాంతతకు, ఎక్కువ శాతం ఓటింగ్‌కు కారణం అని వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర, ముక్త, ప్రియ.. అనే ఆ ముగ్గురు అధికారులు ఆయా జిల్లాల మేజిస్ట్రేట్‌లు.

మూడు జిల్లాలు. ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు. సుమారు డెబ్బై తొమ్మిది లక్షల మంది ఓటర్లు. ఒకే రోజు పోలింగ్‌. జిల్లా యంత్రాంగం మొత్తం పకడ్బందీగా పని చేస్తుంది కనుక పోలింగ్‌ నిర్వహణ పెద్ద పనిగా అనిపించకపోవచ్చు. అయితే పశ్చిమబెంగాల్‌ లో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. గెలిచి తీరాలని దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ఆ పార్టీనీ ఓడించాలని పశ్చిమ బెంగాల్‌ ని పాలిస్తున్న పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లో ఉంది. ‘వెళ్లి ఏం వేస్తాంలే..’ అనే ఉదాసీనత ఓటర్లలో ఉండినా ఉండొచ్చు. అయితే ఆ మూడు జిల్లాల డీఎం (డిస్ట్రిక్ట్‌ మేజిస్టేట్‌)లు అంతర ఆచార్య, ముక్తా ఆర్య, దీపప్‌ ప్రియ గట్టి ముందస్తు ఏర్పాట్లు చేసి, కట్టు దిట్టమైన ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండి సజావుగా ఎన్నికలు జరిపించారు.

అంతర.. దక్షిణ 24 పరగణాలు జిల్లా మేజిస్ట్రేట్‌. ముక్త.. హౌరా జిల్లా మేజిస్ట్రేట్, దీపప్‌ ప్రియ.. హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్‌. మహిళా ఓటర్లంతా ఉత్సాహంగా ముందుకు వచ్చి, ఓటింగ్‌ అనే ఈ ప్రజాస్వామ్య ఉత్సవాన్ని తమ చేతుల మీదుగా జరిపించాలని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. మహిళలు ఓటేస్తేనే సరైన అభ్యర్థులు విజేతలు అవుతారని, మహిళా సంక్షేమానికి తగినంత కృషి జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం ప్రచారం చేయించింది.

పరిస్థితిల్లో పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత కీలకమైన ఈ మూడు జిల్లాలకు ముగ్గురూ మహిళా డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌లే ఉండటం అన్నది ఎన్నికల సంఘం సంకల్పానికి బలం చేకూర్చింది. ఈ ముగ్గురు మహిళా డీఎంలు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా అన్ని వసతులూ కల్పించారు. తమ పరిధిలోని 16 నియోజకవర్గాలలో అంతర, 18 జిల్లాలలో దీపప్, 7 జిల్లాలలో ముక్త నిరంతర పర్యవేక్షణ బృందాలతో పోలింగ్‌ను విజయవంతం చేశారు. జిల్లా పౌరుల మన్ననలు పొందారు. 

అంతర ఆచార్య

ముగ్గురిలో సీనియర్‌. 2006లో యు.పి.ఎస్‌.సి. రాశారు. ఈ ఐ.ఎస్‌.ఎస్‌. అధికారి మొదటి పోస్టింగ్‌ సబ్‌ డివిజినల్‌ ఆఫీసర్‌గా శ్రీరాంపూర్‌లో. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ 24 పరగణాలు జిల్లాకు మేజిస్ట్రేట్‌గా రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో వేర్వేరు హోదాలలో పని చేశారు. దుర్గాపూర్, అసన్సోల్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌గా; అసన్సోల్‌–దుర్గాపూర్‌ అభివృద్ధి మండలి సీఈవోగా; ఈస్ట్‌ మిడ్నాపూర్‌ డీఎంగా విధులు నిర్వహించారు. కొంతకాలం కోల్‌కతా మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఈసీవో గా కూడా ఉన్నారు. 

ముక్తా ఆర్య

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన 2008 ఐ.ఎ.ఎస్‌. బ్యాచ్‌ ఆఫీసర్‌. లోక్‌సభ ఎన్నికలకు ముందు బంకుర జిల్లా డీఎంగా నియమితులయ్యారు. గత ఏడాది నవంబరులో హౌరాకు జిల్లా మేజిస్టేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

దీపప్‌ ప్రియ

ముగ్గురిలో జూనియర్‌. 2011 బ్యాచ్‌ ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తర 24 పరగణాలు జిల్లా అడిషనల్‌ డీఎంగా ఉన్నారు. దక్షిణ దినాజ్‌పుర్, డార్జిలింగ్‌ జిల్లాల డీఎంగా పని చేశారు. ఈ ఫిబ్రవరిలో హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్‌గా వచ్చారు.  

చదవండి: టైమిస్తారా ఇవాళైనా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top