కథ: అబ్బాజాన్‌.. ఇలాంటి తండ్రి ఉంటే..

Sakshi Magazine Funday Telugu Story Abbazan

‘నేను సిగరెట్‌ తాగను ...’
సాబిరాకు ఏమీ అర్థంకాలేదు.
‘అదేనండీ! నేను సిగరెట్‌ తాగను ...’
అటు ఇటు కళ్ళు తిప్పి చూసింది సాబిరా. ఎవరూ లేరు. అతను తనకే చెప్తున్నాడని అర్థమై ‘అయితే?’ అంది.
భారత ప్రభుత్వం ప్రకటించిన ‘బెస్ట్‌ సోషల్‌ ఆంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు తీసుకొని స్టేజీ దిగి కిందకి రాగానే స్టేజ్‌ మీద నుంచి ఒక సివిల్‌ సర్వీసెస్‌ అధికారి తన వెనకాలే వచ్చి పలకరించి ఇలా చెప్పడం కొంచెం స్ట్రేంజ్‌గా అన్పించింది సాబిరాకు.

అతను నవ్వి ‘మీరు రఫీ మాస్టర్‌ గారి అమ్మాయి కదా ...’ అన్నాడు.
‘అవును. మీకెలా తెలుసు?’ ఆశ్చర్యంగా అడిగింది.
‘నా పేరు ఫసీఉద్దీన్‌. మీకు నేను గుర్తుండకపోవచ్చు గానీ నన్ను చదివించిన మాస్టర్‌ గారిని నేను ఎలా మర్చిపోతాను?’
అప్పుడు ఫ్లాష్‌ అయ్యింది సాబిరాకు.

‘సాయంత్రం అవార్డీస్‌కి మినిస్ట్రీ నుండి పార్టీ ఇస్తున్నాం. హోటల్‌కి వెళ్ళి సాయంత్రం వచ్చేయండి ’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
అతని వైపే చూస్తూ నిలబడింది. లైట్‌ బ్లూ కలర్‌ సూట్‌లో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇతడు తమ ఇంట్లో ఒక మనిషిగా ఉండాల్సింది. కాని లేడు. 20 ఏళ్ళ కింది మాట–

‘బేటా.. నబీ సాబ్‌ కొడుక్కి ఇంజనీర్‌ల సీటు వొచ్చిందట హైదరాబాద్‌ల. బట్టల కిస్తీ కట్టనికొచ్చి చెప్పిండు’ స్కూలు నుంచి వచ్చిన కొడుకుతో చెప్పింది కరీంబీ.
‘అట్లనా అమ్మీ! పిల్లలు బాగా చదివితే అంత కంటే ఏం గావాలె ఏ తల్లిదండ్రికైనా ...’ షర్టు విప్పి చిలక్కోడుకు తగిలించి తల్లి పక్కన కూర్చున్నాడు రఫీ.
‘పస్టు వొచ్చిండట. పేపర్ల సుత పుటువ వొచ్చిందని సూపిచ్చె నబీ సాబ్‌’

‘ఫసీ చిన్నప్పటి నుంచి బాగా చదువుతడు అమ్మీ. మా స్కూల్లనే చదివిండు . నా స్టూడెంటే గాదూ’ అన్నాడు రఫీ.
అప్పుడే స్కూలు నుంచి వచ్చిన జమీల టీ తీసుకొని వచ్చి భర్తకు, అత్తకు ఇచ్చి కుర్చీ లాక్కొని వాళ్ళిద్దరితోపాటు కూర్చుంది.
‘మరి నబీ భాయిజాన్‌ కొడుకుని పట్నం ఎప్పుడు పంపుతున్నడట’ అడిగింది జమీల.

దానికి పెద్దావిడ అందుకుంది–
‘జమీలమ్మా! నబీ సాబ్‌ చాలా పరేషాన్లున్నడు బేటా. రికాడ్‌ అసిస్టెంటు నౌకరిలో ఆరుగురు పిల్లల్ని సాదుడే ఎక్కువ. పెద్దోడు ఉన్నూల్లెనే సదువుకొని మంచిగ ఫైల్‌ల్లోకి వస్తాండు. ఇప్పటి దాంకా ఏదో సదిరిన ఫుప్పూ. ఏం సమజైత లేదు. ఎట్లనో ఏమో అన్నడు. ధైర్నంగుండు బేటా... అల్లా దయ వల్ల అంతా మంచే జరుగుతది అన్న ...’ అంది కోడలితో.

‘దానికి మనిషి కదిలితే గదా. తలగోక్కుంట నిలబడ్డడు. ఎంత గవర్నమెంటు సీటైనా నెలకు మూడు నాలుగు వేలు అయితయి... గుడ్డలేంది? పెడ్డలేంది? బుక్కులేంది? అన్నీ జుమ్లా యాడాదికి యాభై వేలు చేతుల బెట్టుకోవాలె ఫుప్పూ. ఏం సమజైత లేదు’ అని దిగాలు వడ్డడు. తలో సెయ్యి ఏద్దాంలే బేటా... పరేషాన్‌ గాకు అని నచ్చజెప్పి పంపిన’ అందామె.

‘అమ్మీజాన్‌.. నా మనసులో మాటున్నది చెప్పుదునా? తల్లీకొడుకులిద్దరూ కోపమైతరా నా మీద?’ అంది జమీల.
‘అదేంది జమీలా? ఎప్పుడన్న ఉన్నదా అట్ల? చెప్పు ఏందో ...’ అంది కరీంబీ.
‘అమ్మీజాన్‌! నబీ భాయిజాన్‌ కూటికి పేదోడుగని గుణానికి కాదు. పద్ధతికల్ల కుటుంబం. భాభీ గూడ ఉన్న దాంట్లొనే గుట్టుగ సంసారం గుంజుకొస్తాంది. అంతమంది మగపిల్లలు ఉన్నగాని ఇంట్లె ఉన్నరో లేరో అన్నట్టుంటరు’

‘అదైతే నిజమే. పొల్లగాండ్లు తల్లి నోట్లెకెల్లి ఊసిపడ్డట్టె ఉన్నరు ముద్దుగా’ కరీంబీ జోడించింది.
‘మన టౌన్ల రెండొందల గడప ముసల్మాన్లలో అంతా ఏదో యాపారం చేసుకునో, చిన్న నౌకరీలు చేసుకునేటోల్లేనాయె. పిలగాండ్లను పెద్దగ చదివిస్తున్నోల్లు గూడా కనవడతలేదు. మనకు ముగ్గురు ఆడపిల్లలాయె. ఇప్పట్నుంచి ఆలోచన చెయ్యకపోతే కష్టమైతదని అన్పిస్తుంటది’

‘నువ్వనేది నిజమే బేటా’
‘మన పెద్ద పిల్ల సాబిరాను ఫసీకి ఇస్తమని సంబంధం ఖాయం చేసుకొని, ఫసీని మనమే చదివిద్దాం. ఇద్దరి చదువు అయిపోయి జాబ్‌లు వచ్చినంక పెళ్ళి చెయ్యొచ్చు. ఏమంటరు అమ్మీజాన్‌’

‘నా మతిల ముచ్చెట గుంజకున్నవ్‌ పొల్ల. నాకైతే సమ్మతమే’ అంది కరీంబీ.
‘ఇట్ల బాగుంటదా అమ్మీ?’ కొడుకు అడిగాడు.
‘ఏమైతది బేటా.. ఇండ్ల బాగుండక పోయేదేంది? కాలంతోని మనం మారాలె. అవురత్‌ బచ్చీలను బాగా సదివిద్దాం అనుకొంటుంటిమి. బిడ్డలు ముద్దుగ సదువుకొంటున్నరు.

రేపు వాల్లు మంచి పొజిషన్ల కొచ్చినంక అంతకు మీద ఉన్నోన్ని సూడకపోతే కుదురుతదా? గప్పుడు ముక్కుమొకం జెవలనోళ్ళకు ఇచ్చుడు కంటే ఇదే నయ్యం’
‘సరె మీరిద్దరంటున్నరు గదా. అట్లనే చేద్దాం. అమ్మీ నువ్వు నబీ సాబ్‌ను పిలిచి మాట్లాడు. నేను ఫసీతోని మాట్లాడుత. పిల్లల ఆలోచనా తెలుసుకోవాలి కదా’ అన్నాడు రఫీ.
తెల్లారి నబీ సాబ్‌ ‘అంత కంటెనా ఫుప్పూ’ అన్నాడు ఖుష్‌ఖుష్‌ అవుతూ. ఒకసారి భార్య షబ్నంను, కొడుకును విచారించి చెప్తానన్నాడు. సాబిరా అప్పుడు తొమ్మిదో క్లాసులో ఉంది. 

రఫీ.. ఫసీతో మాట్లాడాడు.
‘నిజంగ ఇస్తరా సార్‌’ తలొంచుకొని సిగ్గుపడ్డాడు పద్ధెనిమిదేళ్ళ ఫసీ.
అన్ని వైపుల నుండి సరేననుకున్నాక ఒక ఆదివారం పూట నబీ సాబ్‌ కుటుంబాన్ని, మరో ఇద్దరు జమాత్‌ వాళ్లని ఇంటికి దావత్‌కు పిలిచాడు రఫీ. అన్నీ మాట్టాడుకొని సంబంధం ఖాయం చేసుకున్నారు. పిల్లల చదువులైపోయి, ఉద్యోగాలు వచ్చాక పెళ్ళి చేద్దామని ఇరువైపులా ఒప్పుకున్నారు. ఈ విషయమై పిల్లల దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని, వాళ్ళ చదువుకు ఆటంకం కలుగుతుందని ఆ రోజు పిల్లలిద్దర్నీ ఆ దావత్‌లో లేకుండా చూసుకున్నాడు రఫీ.

వారం రోజుల్లో ఫసీని యూనివర్శిటీ క్యాంపస్‌లో చేర్చి కావలసినవన్నీ సమకూర్చి వచ్చారు రఫీ, నబీ సాబ్‌లు. ఫసీ, సాబిరా పోటాపోటీగా చదువుతున్నారు. టెన్త్‌లో సాబిరా డిస్ట్రిక్ట్‌ ఫస్ట్‌ వచ్చింది. ఫసీ కూడా ప్రతీ సెమిస్టర్‌లో టాపర్‌గా నిలుస్తున్నాడు. 
సాబిరా ఇంటర్‌ పస్టియర్‌ చదువుతున్నప్పుడు ఫ్రెండ్‌ సౌమ్య ఒక రోజు సాబిరాను పక్కకు పిలిచింది.

‘సాబిరా! మీవోడు సిగరెట్‌ తాగుతున్నడు మొన్న దోస్తులతోని’ అంది.
సాబిరా అక్కడ్నుంచి స్పీడ్‌గా సైకిల్‌ తొక్కుతూ రొప్పుతూ ఇంట్లోకి వచ్చింది.
అప్పుడే స్కూల్‌ నుంచి వచ్చిన రఫీ  ‘ఏంది బేటా! ఎందుకంత తొందర. నిమ్మలంగ రావద్దా...’ సాబిరా నుదటి మీద చెమటను తన కర్చీఫ్‌తో తుడిచాడు. సాబిరా చాలా అసహనంగా ఉందని గమనించాడు.

‘ఏంది బేటా ఏమైందీ?’
‘అబ్బాజాన్‌! నేను ఫసీని చేసుకోను. వాడు గల్లీల పోరగాండ్లతో సిగరెట్‌ తాగుతున్నాడు’
‘నేను అడుగుతా బేటా’

‘అడుగుడు లేదు ఏం లేద్‌ . నేను చేసుకోను’ తేల్చి చెప్పింది సాబిరా.
గేటు వైపూ, లోపలికీ తల తిప్పి చూశాడు రఫీ. ఇంకా షాపు నుంచి కరీంబీ, స్కూల్‌ నుంచి జమీల రాలేదు. 
‘బేటా! నువ్వు వద్దంటే వద్దు. ఏం చేసుకోవద్దు. అమ్మీకి, దాదీకి చెప్పకు. నీ ఈపు సాప్‌ జేస్తరు. టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటలే. ఇవ్వేవి మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో’ అన్నాడు.

‘నిజంగా’
‘నిజ్జం బేటా’
ఆ తర్వాత ఎప్పుడూ ఫసీ ప్రస్తావన రాలేదు ఇంట్లో. చిన్నప్పటి నుంచి సాబిరా ఏం చేసినా రఫీకి నచ్చుతుంది. డిగ్రీ అయిపోయిన రెండేళ్ళలో సాబిరాకు రెండు గవర్నమెంట్‌ ఉద్యోగాలు వచ్చాయి. మూసగా ఉండే ఆ రెండు ఉద్యోగాలు నచ్చలేదు. ఆ ఉద్యోగాలకు వెళ్ళనని తెగేసి చెప్పింది. ప్రతి పని ప్లాన్‌ ప్రకారం చేసే జమీలకు, కరీంబీకి ఈ విషయం మింగుడు పడలేదు.

ఇంట్లో పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇష్టంలేని పని ఏదైనా తప్పనిసరిగా చెయ్యాల్సి వచ్చినప్పుడు సాబిరా మొండికేసేది. ఎదురు తిరిగేది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అబ్బాజాన్‌ రఫీ సాబిరా పక్షానే నిలబడతాడు. జమీలకు, కరీంబీకి బాగా కోపం వచ్చేది. ‘జైసా బాప్‌... వైసీ బేటీ’ అని తిట్టిపోసేది జమీల. ఫసీ విషయంలో కూడా భార్యకు, తల్లికి ఏం చెప్పుకున్నాడో వాళ్లు అతని సంగతి సాబిరా ముందు ఎత్తలేదు. కాలక్రమంలో ఆ విషయమే మర్చిపోయింది సాబిరా.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఫసీ కనిపించి సాబిరాకు అన్నీ మనసులో మెదిలాయి.

సాయంత్రం పార్టీకి వెళ్లింది.
పార్టీ జరుగుతున్న ప్రదేశమంతా కన్పించేలా కార్నర్‌ టేబుల్‌ ఎంచుకొని తన పేరు రాసిపెట్టి ఉన్న స్టాండ్‌ని ఆ టేబిల్‌ పైకి మార్చి, అక్కడే కూర్చుంది సాబిరా. నెమ్మదిగా ప్రదేశమంతా నిండింది. వచ్చిన డెలిగేట్స్‌ విజిటింగ్‌ కార్డ్స్‌ మార్చుకుంటూ నెట్‌ వర్కింగ్‌లో బిజీగా ఉన్నారు. పార్టీ ఏర్పాట్లు పర్యవేక్షించి సాబిరా టేబిల్‌ దగ్గరకి వచ్చాడు ఫసీఉద్దీన్‌.

సాబిరా పలకరింపుగా నవ్వి, ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది.
‘ఇంతకీ నేను సిగరెట్‌ తాగానని చాడీ చెప్పిన సౌమ్య ఎక్కడ ఉంది?’ అడిగాడు.
‘మన డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్లో మెడికల్‌ ఆఫీసర్‌’

‘నాకు అప్పుడే తెలిసి ఉంటే ఆ పిల్ల చెవి మెలేసి నిజం చెప్పించే వాడిని’ అన్నాడు ఫసీ.
‘అంటే అది నిజం కాదా?’
‘ఏం చేస్తాంలెండి. కొన్నిసార్లు అంతే. మా ఫ్రెండ్స్‌ అందరూ మా ఇంటి గల్లీ చివర చెట్టు కింద చేరి సిగరెట్‌ తాగుతున్నారు. సిగరెట్‌ పొగ రింగులు రింగులుగా వదులుతున్నారు. సరదాగా నేను కూడా ట్రై చేశా. రింగులు రాకపోగా సౌమ్య కంట్లో పడ్డా. సిగరెట్‌ తాగడం అదే మొదలు అదే చివర. మా ఇంట్లో వరకే చెప్పి తిట్టిస్తుంది అనుకున్నా.. మీకు చెప్పిందని ఎప్పటికో తెలిసింది. అప్పటికే ఇర్రిపేరబుల్‌ డ్యామేజ్‌ జరిగిపోయింది’

సాబిరా నవ్వాపుకుంటూ ‘నాకు తెలిసిందని మీకెవరు చెప్పారు?’ అంది.
‘ఓ రెండుమూడు ఏళ్ళకు మా అబ్బా కోపంతో ఊగిపోతూ నీ సిగరెట్‌ తగలబడిపోను. బంగారమసుంటి సంబంధాన్ని కాల్లతో తన్నుకున్నవని తిట్టే తిట్ల మధ్య తెలిసింది. మీతో మాట్లాడుదామనుకున్న. ధైర్యం చాలలేదు’

‘మరి మా అబ్బాజాన్‌ మాట్లాడుతానన్నాడే ఆ రోజు. ఏం మాట్లాడలేదా?’
‘రఫీ సార్‌ ఒకసారి నన్ను చూడటానికి క్యాంపస్‌కు వచ్చారు. మెస్‌ ఫీజు కట్టి ఇద్దరం హోటల్‌కి వెళ్ళి బిర్యానీ తిన్నాక నన్ను మళ్ళీ క్యాంపస్‌లో దింపి వెళ్తుంటే మాము.. సాబిరా ఎట్లుంది? అని మీ గురించి అడిగా. బాగుంది బేటా. కాని బేటా! చదువు మీద ఎక్కువ ద్యాసపెట్టు . మీరిద్దరు పెద్దయినంక కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే తప్పకుండ నిఖా జేస్తం. ఇద్దర్లో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వద్దు. ఇద్దరు బాగుండాలంటే ఇద్దరి ఇష్టం కూడా ముఖ్యం. ఆనాడు ఎట్ల రాసి పెట్టుంటే అట్ల జరుగుద్ది.

సాబిరా గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు. కొంచెం భయం వేసింది. కానీ ప్రతినెలా వచ్చి చూసి ఫీజులు కట్టి వెళ్ళేవాళ్ళు. నాకు ఎప్పుడూ అనుమానం రాలేదు. ఎప్పటికో తెలిసింది ఈ విషయం. అప్పటికే మీరంతా హైదరాబాద్‌ వెళ్ళిపోయారు మీ చదువుల కోసం. చాన్నళ్ళు బాధపడ్డా!

సాబిరాకు తండ్రి గుర్తుకొచ్చాడు. రింగుల క్రాఫు, బక్క పలుచటి దేహం, లూజ్‌ ప్యాంట్‌ ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌తో నవ్వుతూ ఉండే తండ్రి. ఎప్పుడూ తన తరఫున ఆలోచించే తండ్రి.
‘సంబంధం వద్దనుకున్నాక నా ఫీజులు కట్టడం మానేయొచ్చు రఫీ సార్‌. కాని ఒక మాస్టర్‌గా ఆయన స్టూడెంట్‌ గురించి ఆలోచించారు. అది పెద్ద గొప్పేం కాదు. మంచి టీచర్‌ ఎవరైనా అలాగే చేస్తారు. కాని ఆడపిల్ల అభిప్రాయానికి విలువ ఇచ్చి, అభిప్రాయాలు రుద్దకుండా మీ ఇష్టానికి మిమ్మల్ని ముందుకు సాగనిచ్చారు చూడండి. అది తండ్రిగా ఆయన అసలైన గొప్పతనం’ అన్నాడు ఫసీ.

సాబిరా కళ్లు ఉద్వేగంతో తడి అయ్యాయి.
‘ఓ పదేళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతునే ఉన్నా. మీరు ఎదుగుతున్న కొద్దీ అయ్యో ... మిస్‌ అయ్యానే అన్పించేది. కానీ ఇవ్వాళో విషయం అర్థమైంది. ఒకవేళ మీరు నన్ను చేసుకొని ఉంటే జీవితంలో ఇంత ఎదిగేవారు కాదు. ఒక సివిల్‌ సర్వెంట్‌ భార్య హోదా మీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేది. రెక్కలు కత్తిరించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చిన రఫీ మాస్టర్‌ కూతురు కావడం వల్లే ఇదంతా మీకు సాధ్యమైంది. చూడండి... అవార్డు తీసుకునే వేదిక మీద మీరున్నారు. మీకు మర్యాదలు చేయాల్సిన హోదాలో నేను ఉన్నాను’ అన్నాడు ఫసీ నవ్వుతూ.

‘వన్స్‌ అగైన్‌ కంగ్రాచ్యులేషన్స్‌. రఫీ మాస్టర్‌కు నా సలాములు చెప్పండి’ అన్నాడు లేచి వెళుతూ.
సాబిరా అతనికి చేయి ఊపి ఫోన్‌ చేతిలోకి తీసింది.
‘అబ్బాజాన్‌కు ఫోన్‌ చేయాలి’ అనుకుంది.
ఇప్పుడు సాబిరా తండ్రికి వీడియో కాల్‌ చేస్తుంది. కృతజ్ఞతలు చెప్పదు. ఎందుకంటే తాను మరింత ఎదగడమే తండ్రి పట్ల తాను చూపదగ్గ కృతజ్ఞత అని సాబిరాకు తెలుసు.
-రుబీనా పర్వీన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top