కథ: ద షో మస్ట్‌ రన్‌... అన్నీ కలలే! వాడి మాటలు నా చెవిలో అమృతాన్ని నింపాయి! | Sakshi
Sakshi News home page

కథ: ద షో మస్ట్‌ రన్‌... అన్నీ కలలే! వాడి మాటలు నా చెవిలో అమృతాన్ని నింపాయి!

Published Sun, Dec 11 2022 8:13 PM

Sakshi Funday: Nakka Vijaya Rama Raju Telugu Story The Show Must Run

ఎయిర్‌పోర్టు నుంచి కోయంబత్తూర్‌ టౌన్‌లోకి ఎంటర్‌ కాగానే మొదట నన్నాకర్షించింది ఊరు మొత్తం అంటించి వున్న జంబో సర్కస్‌ బొమ్మలు. నాకు కొత్త ఊర్లు, ప్రదేశాలు చూడటం, సర్కస్‌లు, పద్య నాటకాలు, పాత క్లాసిక్‌ సినిమాలన్నా.. పురాతన గుళ్లూగోపురాలూ, రాజుల కోటలూ అన్నా యిష్టం.

కేశవ దిగిన పార్కు ఇన్‌ హాటల్‌కు వెళ్లాను. వాడు నాకోసం లాంజ్‌లో వెయిట్‌ చేస్తున్నాడు. నాబసను అక్కడే ఏర్పాటు చేశాడు. కుశల ప్రశ్నలయ్యాక కాఫీలు తాగాం. కాఫీ చాలా బావుంది. తమిళనాడులో ఎక్కడకు పోయినా ఫిల్టర్‌ కాఫీలు, వేడివేడి యిడ్లీ సాంబార్‌ నాకు ప్రత్యేక ఆకర్షణ. 
‘వెళ్దామా?’ అన్నాను.

‘వరుణ్‌కి డ్యూటీ అయిపోయింది. హాస్టల్‌కు  వెళ్లిపోయాడంట! రేపు మోర్నింగ్‌ పదింటికి కార్డియాలజీ వార్డులో మనల్ని  కలవమన్నాడు’ చెప్పాడు కేశవ. ‘టైమ్‌ సిక్స్‌ అయ్యింది. మరిప్పుడేం చేద్దాం?’ అన్నాను హాల్లో గోడకున్న గడియారం చూస్తూ.

‘ఊర్లో జంబో సర్కస్‌ ఆడుతుందిరా. వచ్చేప్పుడు పోస్టర్లు చూశా. నీకూ నాలాగే సర్కస్‌ అంటే ఇష్టంగా! పోదామా? మంచి టైమ్‌ పాస్‌’ అన్నాడు కేశవ. వాడికి నా మైండ్‌ రీడింగ్‌ బాగావచ్చు. మనసు తెలిసి నడుచుకునే వాడేగా మంచి స్నేహితుడు. ‘పోదాం పదరా’ అన్నాను నవ్వుతూ.
‘అన్నపూర్ణ సర్కస్‌కి రానంది. రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటుందిలే!’ అన్నాడు. కారులో బయలుదేరాం.
∙∙ 
మేము సర్కస్‌ దగ్గరకు చేరేసరికి ఏడు దాటి పోయింది. గేట్‌ మూసేసి వుంది. లోపల షో జరుగుతోంది. ప్రత్యేకమైన మ్యూజిక్‌ వినిపిస్తోంది. ‘షో షురూ హోగయా సాబ్‌! డేఢ్‌ గంటా హోగయా!’ గేట్‌ కీపర్‌ చెప్పాడు. ‘ఏం చేద్దాంరా?’ అన్నట్టుగా నావంక చూశాడు కేశవ. ‘మీ మేనేజర్‌ ఎక్కడ?’ అనడిగితే.. దూరంగా టెంట్‌లో కూర్చున్న మనిషిని చూపించాడు గేట్‌ కీపర్‌. వెళ్లి పరిచయం చేసుకున్నాం.

‘మేరా నామ్‌ రంజిత్‌’ అన్నాడు షేక్‌హేండ్‌ యిస్తూ. మాకు సర్కస్‌ అంటే ఎంతిష్టమో ది గ్రేట్‌ ఒరియంటల్‌ సర్కస్‌ నుంచి జేమిని, గ్రేట్‌ బాంబే సర్కస్‌ దాకా నేను చూసిన సర్కస్‌లు, కేరళలో వున్న సర్కస్‌ స్కూల్స్‌.. వాటి చరిత్ర అంతా  చెప్పేసరికి ఫిదా అయిపోయాడు.

మమ్మల్ని టెంట్‌ లోపల రింగ్‌ దగ్గరకు తీసుకెళ్ళి కుర్చీల్లో కూర్చోపెట్టాడు. అతనూ వచ్చి మాపక్కనే కూర్చున్నాడు. అప్పుడు సైకిల్‌ షో నడుస్తోంది. టెంట్‌లో ఇరవై, ముప్పై పర్సెంట్‌ కూడా నిండలేదు. కుర్చీలు కొన్ని నిండినయి. గేలరీలో జనం ఆ మూలొకరు ఈ మూలొకరు కూర్చున్నారు.

సైకిల్‌ షో అయిపోయింది. జోకర్లు వచ్చారు. కొంచెం వయసు మళ్ళిన వాళ్ళే జనాన్ని నవ్వించడానికి కిందా మీదా పడుతున్నారు. ఒక పక్కనుంచి కొంతమంది నెక్స్‌ట్‌ ఐటమ్‌ కోసం నెట్స్‌ కడుతున్నారు.

‘ఇప్పుడు ట్రపీజ్‌ ఆట మొదలవుతుంద’ని మైక్‌ లోంచి ఏనౌన్స్‌మెంట్‌ వినిపించింది. మాతో పాటు కూర్చున్న సర్కస్‌ మేనేజర్‌  లేవబోతూంటే.. ‘సర్కస్‌లో ట్రపీజ్‌ ఆర్టిస్టులు చాలా గ్రేట్‌ సార్‌. వాళ్ళంటే నాకు చాలా యిష్టం’ అన్నాను. అతని కళ్ళల్లో వెయ్యి కరెంట్‌ బల్బుల వెలుగు కనిపించింది. 

మళ్ళీ మైకులో నుంచి ఎనౌన్స్‌మెంట్‌ వినిపించింది ‘రంజిత్‌ యువర్‌ ఐటమ్‌’ అని. అతను ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ అని అప్పటిదాకా చెప్పనే లేదు. మేం ఆశ్చర్యంగా అతని వంక చూస్తుంటే కొంచెం కుంటుతూ నడుస్తూ టెంట్‌ లోపలికెళ్ళాడు.

ఆకాశమంత ఎత్తులో ఉయ్యాల కట్టుంది. అప్పటికే నలుగురు ట్రపీజ్‌ ఆర్టిస్ట్స్‌ అక్కడ నిలబడి వున్నారు. లైటింగ్‌ మారింది. పైన చుక్కల ఆకాశం నీలిరంగులో అంతా వెన్నెల పరచుకున్నట్టుగా లైటింగ్‌ వుంది. చూసేవాళ్ళకు వాళ్ళు ఆకాశంలో ఉన్నట్టే వుంది. ఉయ్యాల షో మొదలయ్యింది. సన్నగా మధురమైన సంగీతం వినిపిస్తోంది. రంజిత్‌ ఉయ్యాల మీద వూగుతుంటే మా గుండెలు దడదడలాడినయి.

‘జీనా యహా! మర్నా యహా.. యిస్‌ కే సివా జానా కహా!’ అంటూ వయొలిన్‌ మీద సంగీతం వినిపిస్తోంది. అతను ఫీట్‌ చేస్తున్నంత సేపూ జనం భయంతో ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. షో జరిగినంతసేపు సంగీతం జనాల్ని మైమరిపిస్తూనే వుంది. ఫీట్‌ అయిపోగానే పెద్ద పెట్టున చప్పట్లు మోగినవి. షో అయిపోయింది.

మేం హోటల్‌కు వచ్చే వరకు సర్కస్‌ మేనేజర్‌ కమ్‌ ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ రంజిత్‌ ధైర్యసాహసాల గురించి, సర్కస్‌ బతుకుల గురించే మాట్టాడుకున్నాం. ఆరాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. బాల్కనీలోకొచ్చి కూర్చున్నాను. నవంబర్‌ నెల. బయట చల్లగా వుంది. ఊరంతా వెన్నెలతో తడిసిపోతోంది. మధుమాలతి పూల వాసన అలుముకుంది. ‘జీనా యహా మర్నా యహా యిస్కే సివా జానా కహా!?... ’ పాట రేడియోలో దూరం నుంచి వినిపిస్తోంది. పోయి పడుకున్నాను. 
అన్నీ కలలే! సర్కస్‌ గురించే...!
∙∙ 
ఉదయాన్నే లేచి తయారయ్యి నేను, కేశవ, అన్నపూర్ణ.. ముగ్గురం కుప్పుసామి నాయుడు మెడికల్‌ కాలేజీకి వెళ్ళాం. అక్కడే వరుణ్‌ కార్డియాలజీలో పీజీ చేస్తున్నాడు. అప్పటికే ఏడాది కోర్స్‌ అయిపోయింది. అయినా దీనిమీద ఇంటరెస్ట్‌లేదనీ మానేస్తాననీ రోజూ ఫోన్‌చేసి అమ్మ నాన్నలను యిబ్బంది పెడుతున్నాడు. ఈ విషయం వరుణ్‌ ఫస్ట్‌ ఇయర్లో చేరిన దగ్గరనుంచీ నాకు చెపుతూనే వున్నాడు.

నేనూ వాడికి నచ్చచెపుతూనే వున్నాను. ‘ఎడ్జస్ట్‌ అవుతాడు లేరా’ అని కేశవకూ ధైర్యం చెపుతున్నాను. అందరికీ జీవితంలో యిష్టమైన పని దొరకదు! దొరికిన పనిలోనే ఎడ్జస్ట్‌ కావాలి. చాలామంది యిష్టంలేని పనులే చేస్తూ జీవితంలో చాలా సాధించిన వారున్నారు. నచ్చినవి మెచ్చినవి అందరికీ దొరకవు. దీనికి పెళ్లికూడా మినహాయింపు కాదు.

బాపు బొమ్మలాంటి భార్య కావాలని కోరుకోని కుర్రోడు వుంటాడా? సినిమా హీరోలాంటి అబ్బయి కావాలని కోరుకోని అమ్మాయిలు వుంటారా? జీవితంలో చాలా మంది దొరికిన వాటితోనే సర్దుకుపోతారు. జీవితమంటేనే ఎడ్జస్ట్‌మెంట్‌. నాకెప్పుడూ ఆత్రేయ రాసిన సినిమా పాట ఒకటి గుర్తుకు వస్తూ వుంటుంది.

‘అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవటమే మనిషి పని’ అంటూ జీవితసత్యాన్ని యెంత సింపుల్‌గా చెప్పాడు మనసు కవి! మొన్న సడెన్‌గా ఫోన్‌చేసి నన్ను అర్జెంట్‌గా కోయంబత్తూర్‌ రమ్మన్నాడు కేశవ.

నేను రైటర్‌నని, కొంచెం ఖాళీ టైమ్‌ దొరికితే ఊర్లు, కొండలూ, గుట్టలు, అడవులు పట్టుకు తిరుగుతాననీ తనకూ అలా తిరగటం, కవితలు, కథలు రాయటం చాలా యిష్టమనీ చెప్పేవాడు వరుణ్‌ చిన్నప్పుడు. నవ్వేవాణ్ణి. జీవితంలో సెటిల్‌ అయ్యాకే నాకున్న ప్యాషన్స్‌ నెరవేర్చుకుంటున్నానని అతనితో చెప్పా.

తన తండ్రికెప్పుడూ యిరవై నాలుగు గంటలూ  పేషెంట్లతోనే సరిపోతోందని, పేషంట్స్‌ వల్ల తనూ ఎప్పుడూ బయటికెళ్లడని, పిల్లల్నీ తీసుకెళ్లడని.. కనీసం సినిమాలక్కూడా తీసుకుపోడని కేశవ మీద ఫిర్యాదు చేసేవాడు వరుణ్‌. పిల్లలు ఎప్పుడూ.. తల్లిదండ్రులు తమ దగ్గరే వుండాలని కోరుకుంటారు. ఆ వయసుకు అది సహజం. ఆ వయసు పిల్లలకు తల్లిదండ్రుల బరువు బాధ్యతలు తెలియవు.

వరుణ్‌కు సాహిత్యం, సంగీతం అంటే యిష్టం. చిన్నప్పుడు తెలుగులో ఆశువుగా కవితలు అల్లేవాడు. కొంచెం పెద్దయ్యి టెన్త్‌ దాటాక ఇంగ్లిష్‌లో చిన్నచిన్న కవితలు రాసేవాడు. బాగుండేవి. వాడి టాలెంట్‌ని మెచ్చుకునేవాణ్ణి. 

‘నేను మీ అంత రైటర్‌ని కావాలి అంకుల్‌’ అనేవాడు. ‘రే! కవితలు, సంగీతం కడుపు నింపవు. ముందు కష్టపడి బాగా చదువుకో. మీ డాడీలాగా గుండె డాక్టర్‌వి అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలి’ అనే వాణ్ణి. వరుణ్‌ మెడిసిన్‌ చదివేప్పుడు కాలేజీ మేగజైన్‌కి ఎడిటర్‌. ఆ ఏడాది మంచి మేగజైన్‌ తెచ్చాడు. వాడికి నేనంటే గౌరవం. నేను చెపితే వాడు వింటాడని కేశవ్‌ ఆశ. అందుకే నన్ను యిక్కడికి రమ్మన్నాడు.
∙∙ 
మా కోసం కార్డియాలజీ ముందు వెయిట్‌ చేస్తున్న వరుణ్‌.. మేం వెళ్లగానే.. మమ్మల్ని కేంటీన్‌కి తీసుకెళ్ళాడు. నలుగురం ఒక కార్నర్‌ సీట్‌లో కూర్చున్నాం. అది మెడికల్‌ స్టూడెంట్స్, డాక్టర్స్‌ కేంటిన్‌. టీ టైమ్‌ కాబట్టి సందడిగా వుంది. ఏం తీసుకుంటారని అడిగాడు మమ్మల్ని. కాఫీ చాలు అన్నాం. మాకు కాఫీలు చెప్పాడు. తను పొంగల్‌కి ఆర్డర్‌ ఇచ్చుకున్నాడు. రాత్రి ఎక్కడికెళ్ళారనీ అడిగాడు. 

జంబో సర్కస్‌కెళ్ళామని చెపుతూ.. ఆ సర్కస్‌లోని మేనేజర్‌ కమ్‌ ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ గురించి చెప్పా. తను పదేళ్ల కిందట ఉయ్యాల మీద ఫీట్‌ చేసేప్పుడు పైనుంచి కింద పడితే ఒకకాలు మొత్తం నుజ్జునుజ్జయి పనికిరాకుండా పోయిందనీ, దాన్ని తీసేసి ఆర్టిఫీషియల్‌ లెగ్‌ పెట్టారనీ.. యిప్పుడతను దాంతోనే వున్నాడనీ, ఒక్క కాలితోనే యిప్పటికీ ఉయ్యాల మీద ఫీట్‌లు చేస్తున్నాడనీ వివరిస్తూ రాత్రి ఎంతగొప్పగా ఫీట్‌ చేశాడో కూడా చెప్పాను.

‘యీ వయసులో కూడా ఒక్కకాలితో ఉయ్యాల మీద అంత ఎత్తులో ఆ ఫీట్స్‌ మీకెందుకండీ’ అని మేం అంటే.. అతనేం చెప్పాడో తెల్సా.. యానిమల్‌ క్రూయెల్టీ యాక్ట్‌ కింద ట్వంటీ యియర్స్‌ బ్యాక్‌ సర్కస్‌లో వైల్డ్‌ యానిమల్స్‌ని బ్యాన్‌ చేశారనీ, అప్పటి నుంచి జనం, పిల్లలు సర్కస్‌లకు రావటం బాగా  తగ్గిపోయిందనీ, అంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌ మెయింటెనెన్స్, స్టాఫ్‌ జీతాలు, యానిమల్స్‌కి ఫుడ్, వాళ్ల ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులకూ.. సర్కస్‌ తప్ప మరేమీ తెలియని తామూ బతకాలంటే సర్కస్‌ నడవాల్సిందే! అందుకు అక్కడున్నందరూ ఏదో ఒకపని తప్పకుండా చెయ్యాల్సిందే! కాబట్టి ద షో మస్ట్‌ రన్‌ అన్నాడు ఎంతో నిబ్బరంగా అని చెబుతూ రాత్రి సెల్‌ఫోన్‌లో మేం తీసిన ఫొటోలను చూపించా. ఇంటరెస్ట్‌గా చూశాడు.

‘నాకూ చెపితే మీతో వచ్చేవాణ్ణిగా! సర్కస్‌ అంటే నాకూ యిష్టమే. చిన్నప్పుడు మా ఊరికి వచ్చిన సర్కస్‌లన్నీ చూపించేవాడు డాడీ’  అన్నాడు వరుణ్‌. అతను ఆర్డర్‌ యిచ్చిన పొంగల్‌ వచ్చింది. తీసుకున్నాడు.

మేం కాఫీలు తాగుతూ.. ‘హార్ట్‌ స్పెషలిస్ట్‌ అయితే ఎంతమంది రోగుల ప్రాణాలు కాపాడవచ్చో, హాస్పిటల్‌ వుంటే ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్‌ వుంటుందో నీకు తెలియదా? మీడాడీ హాస్పిటల్‌ పెట్టాక ఆ చుట్టుపక్కల గుండెజబ్బుల రోగులు ఎంతమంది బతికింది, రోగులకు యిరవైనాలుగు గంటలూ ఎలా సేవ చేస్తున్నదీ నువ్వు చుడాటంలా?’ అన్నాను.

నేను చెప్పేది వింటూ రాత్రి సర్కస్‌లో తీసిన ఫొటోలు ఆసక్తిగా చూడసాగాడు. నేను కాఫీ కప్పు పక్కన పెట్టి ‘నువ్వు అలా మొండిగా వుంటే ఎలారా? మేం అరవైలోకొస్తున్నాం. ఓపిక తగ్గాక ఆ హాస్పిటల్‌ ఎవరు నడుపుతారు?’ అన్నాను కుర్చీలోంచి లేస్తూ. అన్నపూర్ణ, కేశవ మౌనంగా కూర్చున్నారు. 

వరుణ్‌ పొంగల్‌ తినటం అయిపోయింది. వాటర్‌ తాగి బాటిల్‌ పక్కన పెట్టి ‘అంకుల్‌  మీరు యింతకు ముందు ఈషా ఫౌండేషన్‌ జగ్గీ వాసుదేవ్‌ ఆశ్రమం చూశారా?’ అనడిగాడు. చూడలేదన్నట్టుగా తలలూపాం ముగ్గురం. ‘భలేవారే! ఇంతదూరం వచ్చి ఈషా ఫౌండేషన్‌ చూడకుండా పోతారా? పదండి పోదాం’ అన్నాడు.

నలుగురం జగ్గీ వాసుదేవ్‌ ఆశ్రమానికి వెళ్ళాం. నల్ల గ్రానైట్‌తో చేసిన శంకరుడి విగ్రహం అద్భుతంగా వుంది. జగ్గీ వాసుదేవ్‌.. ఆశ్రమంలో లేరు. ఎక్కడో ప్రవచనాలు చెప్పడానికి పోయారంట! అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. కేశవ, అన్నపూర్ణ వూరెళ్ళి పోయారు. ఈవినింగ్‌ ఫ్లైట్‌కి నేనూ హైద్రాబాద్‌ వచ్చేశా.
∙∙ 
నేను వూరొచ్చాక కేశవ నుంచి ఫోన్‌ లేదు. ఫోన్‌ చేస్తే డల్‌గా మాట్లాడాడు. 
మూడురోజుల తర్వాత ఉదయాన్నే  జిమ్‌కెళుతుంటే వరుణ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఏం చెబుతాడోనని టెన్షన్‌గా వుంది.
‘రాత్రి జంబో సర్కస్‌కెళ్ళాను అంకుల్‌. డోంట్‌ వర్రీ ద షో విల్‌ రన్‌’ అన్నాడు.
వాడి మాటలు నా చెవిలో అమృతాన్ని నింపాయి.
-డాక్టర్‌ నక్కా విజయ రామరాజు 

చదవండి: ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?

Advertisement
 
Advertisement