కథ: తూరుపు పొద్దు... మానవత్వానికి ప్రతిరూపంలా!

Sakshi Funday: Thurupu Poddu Telugu Story By Bijivemula Ramana Reddy

బిజివేముల రమణారెడ్డి 

ఆకాశంలో చిక్కటి మేఘం ముద్ద పాల నురుగులా పొంగి వుంది. భూమ్మీద నుంచి మానవ ఆకారాలు పొడవాటి గోర్లున్న చేతి వేళ్లను గుచ్చి ఆ ముద్దను పీక్కొని జుర్రుకుంటున్నాయి. 

మనుషులు మరీ పొడుగ్గాలేరు, అట్టాని పొట్టిగానూ లేరు. ఒంటిమీద ఏ ఆచ్ఛాదనా లేనట్టు నల్లని నీడల్లా కదులుతున్నారు.
దివి నుంచి కొన్ని అస్థిపంజరాలను పోలిన ఆకారాలు ఎర్ర మందారాలను పోలిన పూల బుట్టలను భూమ్మీద గుమ్మరిస్తున్నాయి. అవి నేల మీద పడగానే నిప్పు కణికల్లా మారి పొగలు ఎగజిమ్ముతున్నాయి.

ఓ రెండడుగుల బుడతడు ఆ అగ్నిపూలను ఒక్కొక్కటిగా ఏరి భుజాన వేలాడుతున్న జోలెలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జోలెలో పడ్డ నిప్పు కణికలు మంచు ముద్దలుగా మారి, నీటి బిందువులుగా జారుతున్నాయి. నేల మీదపడి పిల్లకాలువలుగా ప్రవహిస్తున్నాయి.

‘ఊరికి బోవాలన్జెప్పి తెల్లారిందాంకా పడుకున్నెవేంది?’ మా ఆవిడ అరుపులతో నా వింత కల చెదిరింది.
రవ్వంతసేపు ఆ అనుభూతితో మంచం మీదనే కూర్చొని వెళ్లాల్సిన పని గుర్తుకు తెచ్చుకొని నిద్దుర మత్తును విదిలించికొట్టి గబిల్లున మంచం దిగాను. 

బీఎస్‌ను కలవాలన్న తొందరలో ఆదర బాదరగా అన్ని పనులూ ముగించుకున్నాను. తొమ్మిది గంటల ప్రాంతంలో బస్టాండుకొచ్చి, అప్పుడే కదులుతున్న విజయవాడ బస్సెక్కాను. టికెట్‌ తంతు ముగించి ఓ పనైపోయిందనుకొని రిలాక్స్‌ అయ్యాను. 

బ్యాగులో నుంచి తిలక్‌ కథల పుస్తకం బయటకు తీసి చదివే ప్రయత్నం చేశాను. మనసు కుదురుకోలేదు. గజిబిజిగా ఎటెటో తిరుగుతోంది. రెండు రోజుల నుంచి బీఎస్‌ తలపులు వెంటాడుతున్నాయి. తనను కలవాలి, మాట్లాడాలి అన్న కాంక్ష నన్ను కుదురుగా ఉండనీయలేదు, ఒకచోట నిలువ నీయడంలేదు.  
రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చింది.

‘అబ్బీ నువ్వు పలానా గదా’ అంటూ కడప ఆర్టీసీ బస్టాండు టీకొట్టు దగ్గర పంచెకట్టు మనిషి పలకరించాడు. అతనివైపు పరిశీలనగా చూశాను, ఎక్కడో చూసినట్లుంది గానీ గుర్తుకు రావడంలేదు. ‘అవును’ అంటూనే ‘మీ దేవూరు’ అన్నాను.

‘మిద్దెల’ అన్నాడు.  బీఎస్‌ అన్ననని చెప్పాడు. 
బీఎస్‌ పూర్తిపేరు బి. శివనారాయణ. అందరూ బీఎస్‌ అనే పిలిచేవాళ్లు. ‘అవునా!’ అంటూనే ‘బీఎస్‌ ఎలా ఉన్నాడ’ని అడిగాను. 

‘ఈ మధ్య కరోనా వచ్చిందబ్బీ..  చావుదాంక వెళ్లాడు. భూమ్మీద నూకలుండి  బతికి బయట పడ్డాడు. డాక్టర్లు కొద్ది రోజులు ఇంటిపట్టునుండి రెస్ట్‌ దీసుకోమని చెప్పినా విన్లేదు. ఊర్లు బట్టుకొని తిరుగుతానే ఉండాడు. యాలకు తిండా పాడా.. ఏందో వాని జీవితం..? తాడూ బొంగరం లేకుండా అయింది’ అంటూ ఏకరువు పెట్టాడు. 

మనసంతా అలజడి. ఆ తరువాత బీఎస్‌ కోసం ఆరా తీశాను. ఎలా ఉన్నాడో తెలియడం లేదని. ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో పెద్దగా కనిపించడం లేదని మిత్రులు చెప్పారు. తనను కలవాలని నిర్ణయించుకుని బయలుదేరాను. 

వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు నా ఆలోచనలకు సడన్‌ బ్రేక్‌ పడింది. ‘ఏందా?’ అని చూశాను. చెకింగ్‌. బస్సెక్కి అందరి దగ్గర టికెట్లు పరిశీలిస్తున్నారు. రెండు సీట్ల అవతలికి పొయ్యేసరికి చెకింగ్‌ అతనికి, ప్రయాణికుడికి మధ్య గొడవ. పిల్లోడికి హాఫ్‌ టికెట్‌ తీసుకోలేదంటూ వాదన. మా వాడికి అయిదేండ్ల లోపే అంటాడు తండ్రి. తనకూ అదే చెప్పడంవల్ల టికెట్‌ కొట్టలేదంటాడు కండక్టర్‌. 

మాటామాటా పెరిగింది. గొడవ పెనుగాలి అయ్యింది. అసలే వేసవి ఎండ.. బొక్కెనలో నీళ్లలా గుబుళ్లున బయటకు దూకిన స్వేదం ఒంటి మీదనే బట్టలు నాన బెట్టింది. బస్సు దిగి వేడి గాలులతో చెమట నార్పుకొన్నాను. 

ప్రయాణికులు తలోమాటా వేయడంతో కొద్దిసేపటికి రభస సద్దుమణిగి చెకింగ్‌ తంతు ముగిసింది.
బస్సెక్కి అన్యమనస్కంగానే ‘నల్లజెర్ల రోడ్డు’ కథ చదువుదామని పుస్తకం తెరిచాను. అహా..అక్షరాల మీద చూపులు నిలవడంలేదు. బలవంత పెట్టినా ససేమిరా అంటూ చెదిరి పోతున్నాయి. నేను కలవాల్సిన మనిషి ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఆ పరంపరలోనే బస్సు పోరుమామిళ్ల  చేరింది. మధ్నాహ్నమైంది. బీఎస్‌ కోసం విచారించాను. నిన్న ‘మిద్దెల’లో ఉన్నాడన్నారు. మిద్దెల బీఎస్‌ సొంతగ్రామం.
అతన్ని కలిసిన తరువాతనే ఊరికెళ్దామని నిర్ణయించుకొని బస్టాండుకొచ్చి వరికుంట్ల బస్సెక్కాను. సర్కార్‌కు నిధుల కొరతేమో? గతుకుల రోడ్డు. బస్సు ఓ గంట తరువాత మిద్దెలలో దింపింది.

ఊరిగమిల్లోనే బీఎస్‌ ఇల్లు. వెళ్లి విచారించాను. నిన్న ఉదయమే గిద్దలూరు వెళ్లాడన్నారు. 
ఎక్కడున్నా వెళ్లాల్సిందే! తనను కలవాల్సిందే! గిద్దలూరు వెళ్దామని ఆటో ఎక్కాను. కిక్కిరిసిన షేర్‌ ఆటో నిండు గర్భిణిలా ఆపసోపాలు పడుతూ ఓబుళాపురం చేర్చింది. 
వేసవి ఎండ.. నాలిక పీకుతోంది. దప్పిక తీర్చుకునేందుకు అక్కడున్న అంగట్లో నీళ్ల బాటిల్‌ కొన్నాను. అంగడతను తెలిసిన వ్యక్తే. బీఎస్‌ కోసం ఆరా తీశాను, ‘నిన్న పొద్దున్నే  రోడ్లో పడిపోయిన ఒకతన్ని పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లాడ’ని చెప్పాడు.  

అక్కడి నుంచి తిరిగి బస్సెక్కి పోరుమామిళ్లకు చేరుకున్నాను. బీఎస్‌ వాళ్ల గ్రామానికే చెందిన వ్యక్తి మెడిసిన్‌  చదివి  ఆసుపత్రి పెట్టాడు. అక్కడికే తీసుకెళ్లి ఉంటాడని వెళ్లాను.
‘ఓ పేషెంటును తెచ్చి చేర్పించి పొద్దున వెళ్లినట్లున్నాడ’ని డాక్టర్‌ చెప్పాడు. పేషెంటు బెడ్‌ చూపించాడు. బీఎస్‌ అక్కడ లేడు. 

బెడ్‌ మీదున్న పెద్దాయన్ను అడిగాను.  తనది తాడిపత్రి అనిచెప్పాడు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం చూసేందుకు వచ్చి రెండు రోజులు అక్కడే ఉన్నాడట. ఈ లోపు మోషన్స్‌ కావడంతో చూపించుకుందామని ఆటోలో ఓబుళాపురం వచ్చాడట. అప్పటికే విరోచనాలు ఎక్కువై నీరసంతో రోడ్డుమీదనే పడిపోయాడట.

తాగి పడిపోయి ఉంటాడని ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే అక్కడికొచ్చిన బీఎస్‌ ఆయనను చూసి బట్టలు నీళ్లతో కడిగి ఆటోలో పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకు వచ్చి వైద్యం చేయించాడట. రాత్రంతా కాపలా ఉండి  పొద్దునకి  ప్రాణాపాయం లేదని  డాక్టర్‌ చెప్పడంతో పెద్దాయన కొడుకుకు ఫోన్‌ చేసి  మధ్నాహ్నం తరువాత గిద్దలూరు పోతున్నానని చెప్పి వెళ్లి పోయాడట. అరగంట క్రితమే వెళ్లాడని చెప్పాడు. ‘తన పాలిట దేవుడ’ని చేతులు జోడించాడు. 

అప్పటికే పొద్దు పడమటి కొండల మీదకు దిగుతోంది. ఇప్పుడు బయలు దేరినా రాత్రికిగాని గిద్దలూరు చేరుకోలేను. పక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో మావూరు. అమ్మ అక్కడే వుంది. ఊరుకెళ్లి అమ్మను చూసి పొద్దున్నే బీఎస్‌ కోసం గిద్దలూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. బీఎస్‌ జ్ఞాపకాలను పదిలంగా పట్టుకొని ఆటోలో ఊరికి బయలు దేరాను.  

దారిలో చెన్నవరం ముందు సగిలేరు పలకరించింది. ఆటో ఆపాను. ఏటిగుండాల నిండా తెలుగు గంగ నీళ్లు. ఏపుగా పెరిగిన జంబు నీళ్లతో జతకట్టింది.« పచ్చిక మేసి వచ్చిన పశువులు నీటిలో మునకలేస్తూ సేద దీరుతున్నాయి. పోరుమామిళ్ల నుంచి వచ్చిన కొందరు గాలాలతో చేపల వేట సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఎండిపోయిన ఏరు ఇప్పుడు నీళ్లలో జలకాలాడుతోంది. ఏట్లోకి దిగి రెండు దోసిళ్లతో కడుపారా నీళ్లు తాగి ఆటో ఎక్కి బయలు దేరాను. 

నల్లని జెర్రిపోతు మాదిరి మెలికలు తిరిగిన తారురోడ్డు. చెన్నవరం, మాలోనిగట్టు, పెసలొంక, కళ్లమందçపట్టలు, గుజ్జాలోల్లకుంట, జ్యోతివాగు అన్నీ చూస్తూ వాటి  జ్ఞాపకాలతో ఊరికి చేరుకున్నాను.
∙∙ 
ఈ రోజు ఎలాగైనా బీఎస్‌ను పట్టుకోవాలి. పొద్దున్నే నడక దారిలో ఓబుళాపురం బయలుదేరాను. నిండు ఎండలకాలం. దారిపొడవునా వేపచెట్లు సరికొత్త ఇగురుతో పండగనాడు కొత్త సొక్కా వేసుకున్న చిన్న పిల్లోడి మాదిరి మురిసి పోతున్నాయి. 

వాటి పొత్తిళ్లలో సేదదీరుతూ పక్షులు కిలకిలారావాలు. వాటిని ఆస్వాదిస్తూ గంటలో ఓబుళాపురం చేరుకున్నాను. కొద్ది సేపటికి వచ్చిన గిద్దలూరు బస్సెక్కాను. 
బీఎస్‌ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అతని తాలూకు తలపుల పరంపర వీడని నీడలా వెంటాడుతోంది. 

రెండేళ్ల నాటికి ముందు అనుకుంటా...  మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్నాను. బస్టాండు పక్కనే ఆఫీసు. బస్టాండు అవుట్‌ గేటు దాటుతూంటే తెల్లప్యాంటు, తెల్లషర్టు, ఆరడుగుల విగ్రహంతో నిటారుగా నడుచుకుంటూ బస్టాండులోకి వెళుతూ కనిపించాడు బీఎస్‌. అప్పటికే బస్టాండు ఆవరణలోకి ప్రవేశించాడు. 

బండి ఆపి  ‘బీఎస్‌..’ అంటూ గట్టిగా కేక పెట్టాను. వెనుదిరిగి చూశాడు. నేను కనిపించేసరికి ముఖాన వెలుగు.. దాంతోపాటు చిరునవ్వు. నేను బండిని టీ కొట్టువద్ద పార్కు చేసేలోపు వచ్చాడు.

చాలా రోజుల తరువాత కలిశాం. రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు.  ‘ఎలా ఉన్నావు?’ అడిగాను. ‘మామూలే.. పాత దారే, అలాగే ముందుకు’ అంటూ నవ్వాడు.
తన మాటలు నా మనసును ద్రవింప జేశాయి. కళ్లలో ఆరాధనా భావం. ‘సడెన్‌ గా కడపలో ఏంటి?’  అన్నాను. ఎవరికో కాలు ఆపరేషన్‌  అట, డబ్బుల్లేని పేదోడట. రిమ్స్‌కు పిల్చుకవచ్చి ఆపరేషన్‌  చేయించి వెళుతున్నానన్నాడు. ‘ఇంటికెళ్లి భోజనంచేసి వెళుదు పా’ అన్నాను.  

‘ఇప్పుడు కాదులే! ఉప్పులూరు ఎస్సీ కాలనీ అమ్మాయి ఉద్యోగ విషయమై రాత్రికి హైదరాబాదు వెళ్లి సార్‌ను కలవాలి’ అన్నాడు. ‘ఈ బస్సుపోతే సాయంత్రం వరకూ బస్సులేదు. ఇంకొకసారి వస్తా! ఇంట్లో అందర్నీ అడిగానని చెప్పు’ అంటూ హడావుడిగా వెళ్లిపోయాడు.  
ఆతరువాత బీఎస్‌ నాకు కనిపించలేదు.

రోడ్డు. కాస్త తారు, కంకర కలగలిపి గుంతల్లో గుమ్మరించినట్లుంది. నా ఆలోచనలకు తెరదించుతూ త్వరగానే బస్సు గిద్దలూరు చేరింది. తెలిసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బీఎస్‌ ఉంటున్న రూము వద్దకెళ్లి విచారించాను. రైల్వేస్టేషన్‌  సమీపంలోని పాఠశాల గదిలో పిల్లలకు క్లాసు చెప్పడానికి వెళ్లాడన్నారు.

ఆటో ఎక్కి అక్కడికెళ్లాను. పది నుంచి పదకొండు గంటలవరకూ క్లాసట. అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి, ముప్పై ఏళ్ల లోపే ఉన్నారు. అప్పటికే కొందరు వెళ్లిపోగా మరికొందరు ఇంటిదారి పట్టారు. 
‘ఏం క్లాసులు?’ అని ఆరా తీశాను.

‘వ్యక్తిత్వ వికాసం మీద అట. నాలెడ్జి పెంచుకోవడం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవడం.. ఆరోగ్యం, మానసిక దృఢత్వం, శక్తి,యుక్తి, ముక్తి, సమాజశ్రేయస్సు లాంటి అంశాల మీదట! ఒక్కో బ్యాచ్‌కు ఎనిమిది రోజుల శిక్షణ ఉంటుందట.. అదికూడా ఉచితంగానే ఇస్తారట’ చెప్పారు. సరికొత్త సమాజసేవకులను అందించే ఆలయంలా కనిపించింది. ‘సార్‌ ఇప్పుడే రూముకెళ్లాడ’న్నారు.

నేను తనని వెతుక్కుంటూ వెళుతుంటే.. యాభై ఏళ్ల పైబడిన వయస్సులో కూడా బీఎస్‌ అలుపెరగని సేవా కార్యక్రమాలతో నాకందనంతగా ముందుకు పరుగెడుతున్నాడు.
తిరిగి ఆటో ఎక్కాను. బీఎస్‌ నేను పదో తరగతి వరకూ కలసి చదువుకున్నాం. సేవాభావం నింపుకొని పుట్టాడేమో..! చిన్ననాటి నుంచే ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా అక్కడ వాలేవాడు. తనతో కలసి సేవా కార్యక్రమాలలో నేనూ పాల్గొనేవాన్ని. అలా మా ఇద్దరి స్నేహం బలపడింది.

కాలగమనంలో మా దారులు వేరయ్యాయి. పెళ్లి చేసుకొని బంధాలు, బాధ్యతల బరువునెత్తుకొని నేను ఊరు వదలిపెట్టాను. బీఎస్‌ మాత్రం ఇల్లు, వాకిలి మరచాడు. జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లికి దూరమయ్యాడు.

పదెకరాలున్న సేద్యగాడికే పిల్లనివ్వని రోజులు.. అన్నీ వదిలి ప్రజాసేవలో మునిగి తేలేవాడికి పిల్లనిస్తారా? అయినా అదేమీ పట్టించుకోక సేవాయుధంతో సమాజంపై అలుపెరగని యుద్ధం సాగిస్తున్నాడు.

తనతో కలసి నడవలేక పోయానన్న వెలితి నన్ను వెంటాడి వేధిస్తోంది. 
‘సర్‌.. మీరు చెప్పిన అడ్రస్‌ ఇదే’ అటోవాడి పిలుపుతో మిత్రుడి జ్ఞాపకాల నుంచి బయటపడి ఆటో దిగి రూములో చూశాను. అక్కడ లేడు. కిందున్న బడ్డీకొట్టతన్ని అడిగాను. 

‘ఇప్పుడే వెళ్లాడు. అయిదు రూపాయల అన్నం క్యాంటీన్‌  దగ్గరుంటాడ’న్నాడు.
ఫోన్‌  చేస్తే రింగ్‌ కావడంలేదు. అడ్రసు పట్టుకొని వెళ్లాను. 
అప్పటికే అన్నం తిని చేయి కడుక్కుంటున్నాడు. ఎప్పుడూ తెల్లని షర్ట్, ప్యాంటు, నలగని బట్టలతో ఉండే బీఎస్‌ మాసిన బట్టలతో కనిపించాడు. బాధనిపించింది. నన్ను చూసి ఒకింత ఆశ్చర్యం.. ఆనందం.. నవ్వుతూ వచ్చాడు.

‘అప్పుడే తిన్నావేంది? కలసి భోంచేద్దామని వచ్చాను’ అన్నాను. 
‘అయిదు రూపాయల భోజనానికి బాగా డిమాండబ్బీ! రోజూ వందమందికే పెడతారు. అరగంట లేటయితే ఉండదు’ అన్నాడు. ‘ఇక్కడ అయిపోతే బయట వంద రూపాయలు పెడితే గానీ అన్నం దొరకదు. నా దగ్గర ముప్పై అయిదు రూపాయలే ఉన్నాయి. అయిదు అన్నానికి పోతే మిగిలిన ముప్పైకి రాత్రి రెండు చపాతీలు తినొచ్చు’ చెప్పాడు.

మనస్సు చివుక్కుమంది. నన్నూ తినమన్నాడు. బీఎస్‌ చిన్నబుచ్చుకోకూడదని తిన్నాను. సాంబారు అన్నం, చివర్లో మజ్జిగ వేశారు. బాగానే వుంది. ఎవరో పుణ్యాత్ముడు చేతనైన మటుకు పేదల కడుపు నింపుతున్నాడు. 
పక్కనున్న కానుగ చెట్టు కింద అరుగుమీద కూర్చున్నాం. ‘ఏంటి పరిస్థితి?’ అడిగాను. 

‘ఆర్థిక పరిస్థితి ఏం బాగా లేదబ్బీ! ఇక్కడ అయిదు రూపాయల భోజనంతో..  తక్కువ ఖర్చుతో ముప్పూటలా కడుపు నింపుకోవచ్చు. ఒక సర్వేయర్‌ రూములో ఫ్రీగానే తల దాచుకుంటున్నాను’ చెప్పాడు.
తన సోదరులు, మేనమామలు మంచి స్థితి మంతులే. తిరగడం చాలించి ఇంటిపట్టునే ఉండమని ఎన్నిసార్లు చెప్పినా బీఎస్‌ వినడంలేదట. 

‘అంత ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్లొచ్చుగా’ అన్నాను. 
‘ఇప్పుడు కాదులే.  ఓపికున్నన్నాళ్లూ  చేద్దాం. తరువాత చూద్దాంలే’ అంటూ దాట వేశాడు. 
‘ఊరికెళ్దాం రా’ అన్నాను.

‘ఏముందబ్బీ ఊర్లో..? వారంనాడే అమ్మానాయన్ను చూసొచ్చినా. ఇప్పుడు నిన్ను చూసినా.. సంతోషంగా ఉంది’ అన్నాడు. 
నా బ్యాగులో దాచిన డబ్బుకవరు తీసి జేబులో పెట్టి ఖర్చులకు ఉంచు అన్నాను. కొంతమాత్రమే తీసుకొని మిగిలిందంతా వెనక్కు ఇచ్చి  ‘ఇది చాల్లేబ్బీ ఈ వారం పని జరుగుద్ది’ అన్నాడు. 
‘నీకోసమే తెచ్చాను’ అన్నాను.

‘ఒంటరి బతుకు.. నాకెందుకబ్బీ.. ! సంసారం ఈదేటోడివి నీకే ఖర్చులుంటాయిలే తీసుకెళ్లు’ అన్నాడు.
ఇంతలో మోటార్‌ బైకుపై రైతులా ఉన్న ఓ వ్యక్తి బీఎస్‌ను వెతుక్కుంటూ వచ్చాడు. 

‘వెళ్లొస్తా బ్బీ.. అంబవరం వెళ్లి ప్రకృతి సేద్యంలో ఈయనకు చీనీచెట్లు నాటించాలి’ అంటూ నాకు చెయ్యి ఊపి రైతు మోటారు బైకు ఎక్కి వెళ్లిపోయాడు. 
సేవకు అవకాశం వచ్చేసరికి అన్ని కష్టాల్ని పక్కనబెట్టి  మిత్రుడికి వీడ్కోలును కూడా పట్టించుకోక ఎంతో ఆనందంగా వెళ్లిపోయాడు. ఏపూటకాపూట గడిస్తే చాలు.. సేవ దొరికితే అదే పదివేలు. బీఎస్‌ నడక మారలేదు, నడత మారలేదు.

తను వెళ్లిన దారివైపు చాలాసేపు చూస్తూండి పోయాను. నిలువెత్తు రూపంలో మానవత్వం నింపుకున్న మాధవుడిలా కనిపించాడు. ముఖం మీద ఏదో పారాడినట్లనిపించింది. చేయిపెట్టి చూశాను, చేతికి తడి తగిలింది. బరువెక్కిన హృదయంతో బస్టాండు వైపు అడుగులు వేశాను. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top