చిన్న ప్రపంచం మళ్లీ మొదలు!
ఫస్ట్ డే.. ఫస్ట్ ఫీల్!
లంచ్‌బాక్స్ ఐడియాస్!
ఉదయపు యుద్ధాలు మళ్లీ మొదలవుతున్నాయి. అలారం విలన్‌లా అరుస్తుంటే, ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటున్న పిల్లల్ని కాపాడేందుకు దుప్పట్లు ఫైట్ చేస్తున్నాయి. స్కూల్ బస్సులు హారన్ లు మోగిస్తున్నాయి. కొత్త బ్యాగుల జిప్‌లు తెరుచుకుంటున్నాయి. కాళ్లు చాపుకుని మూలన నిద్రపోతున్న షూస్ డ్యూటీలోకి దిగుతున్నాయి. కిచెన్‌లో లంచ్ బాక్స్‌లు తమ హడావుడి స్టార్ట్ చేసేశాయి.
కొత్త కొత్త కవర్స్‌తో రెడీ అయ్యి, పుస్తకాలు ఇల్లంతా తిరుగుతున్నాయి! ఇలా రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత, పిల్లల ప్రపంచం మళ్లీ ‘స్కూల్ మోడ్’లోకి వచ్చేస్తోంది. ఆలస్యంగా లేచే రోజులకి గుడ్‌బై చెప్పి, ప్రతి విద్యార్థి కొత్త క్లాస్, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త నోట్‌బుక్స్‌లతో ఒక చిన్న ‘న్యూ ఇయర్’ ఫీలింగ్‌తో మెరిసిపోతూ, స్కూల్ సీజన్ ను స్టార్ట్ చేస్తున్నారు.
చిన్న ప్రపంచం మళ్లీ మొదలు!
జూన్ నెల అడుగుపెట్టిందంటే చాలు– రెండు నెలల పాటు మూలన పడేసిన స్కూల్ బ్యాగుల వెలుగులు, యూనిఫామ్‌లకు ఇస్త్రీ వేడి మొదలవుతుంది. షూ షాపులు, బుక్ స్టాళ్లలో పేరెంట్స్ టెన్షన్ , స్టేషనరీ దుకాణాల్లో ‘ఇంకో కవర్ కూడా పెట్టండి’ అనే బేరసారాలు కనిపిస్తాయి. ‘బ్యాక్ టు స్కూల్’ మోడ్‌తో మార్కెట్ కూడా కార్టూన్ బ్యాగులు, సూపర్‌హీరో వాటర్ బాటిల్స్, లైట్లు వెలిగే కంబాక్స్‌లు, ‘టాపర్ స్టడీ టేబుల్’ అంటూ కొత్త డిజైన్స్‌తో ఆకట్టుకుంటుంటే, పిల్లలు ‘కొత్త బ్యాగ్ కావాలి..’ అంటూ బ్లాక్ మెయిల్స్ స్టార్ చేస్తారు.
అమ్మలు యూనిఫామ్‌లకు పేర్లు కుట్టడంలో బిజీ అయిపోతే, నాన్నలు ‘ఈ ఏడాది ఫీజు ఎందుకింత ఎక్కువ?’ అంటూ క్యాలిక్యులేటర్‌తో వేసిన లెక్కలనే వేస్తూ ఫైట్ చేస్తుంటారు. మరోవైపు, స్కూల్ బస్సులు మళ్లీ రోడ్లపై రంగంలోకి దిగి, ఉదయాన్నే కాలనీలను నిద్రలేపుతుంటాయి. అలా సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు ఇప్పుడు మళ్లీ స్కూల్ ప్రపంచంలోకి అడుగుపెడతారు.
రీల్స్ ఆల్బమ్!
ఒకప్పుడు స్కూల్ ఓపెనింగ్ అంటే కొత్త యూనిఫామ్‌లో ఒక ఫోటో తీసి ఆల్బమ్‌లో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు? అదే సీన్ రీల్‌గా మారి ఇన్ స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది! ‘ఫస్ట్ డే ఆఫ్ స్కూల్’ అంటూ చిన్నారుల ఎంట్రీలు, యూనిఫామ్ ట్రాన్సిషన్ వీడియోలు, రంగురంగుల లంచ్‌బాక్స్ క్లిప్స్, ‘మై కిడ్ గోయింగ్ టు స్కూల్’ వ్లాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయి. కొందరు పిల్లలు స్కూల్ గేట్ దగ్గర స్టయిల్‌గా పోజులు ఇస్తుంటే, ఇంకొందరు ‘స్కూల్‌కి వెళ్లను’ అంటూ ఏడుస్తూ కూడా వైరల్ అవుతున్నారు. అమ్మలు లంచ్‌బాక్స్‌తో, నాన్నలు బ్యాగ్ మోసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కేవలం ఎడ్యుకేషన్ ఈవెంట్ కాదు, సోషల్ మీడియా కంటెంట్ సీజన్ లా కూడా మారిపోయింది.
ఫస్ట్ డే.. ఫస్ట్ ఫీల్!
స్కూల్ మొదటి రోజు అంటే ఒక చిన్న ఎమోషనల్ సినిమా నడిచినట్టే! ముఖ్యంగా ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలైతే స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లగానే ‘అమ్మా.. నువ్వు కూడా రా!’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం కామన్ . కొందరు చిన్నారులు బ్యాగ్ పట్టుకుని ధైర్యంగా వెళ్లిపోతే, ఇంకొందరు మాత్రం అమ్మ చున్నీని వదలకుండా చిన్నపాటి డ్రామా స్టార్ట్ చేద్దామా వద్దా అనే డౌట్ ఫేస్‌లతో నిదానంగా నడుస్తుంటారు.
ఎలాగోలా పిల్లల్ని లోపలి పంపిన అమ్మలు కొందరు, ఇంకా గేట్ బయటే నిలబడి క్లాస్‌రూమ్ వైపు చూస్తుంటే, ‘ఏడవడం ఆపేశాడా?’ అని టెన్షన్ పడే నాన్నలు అక్కడే కనిపిస్తారు. పిల్లల్ని నవ్విస్తూ క్లాస్‌లోకి తీసుకెళ్లే లేడీ టీచర్స్, కాస్త పెద్ద పిల్లలను ‘త్వరగా.. త్వరగా..’ అంటూ గట్టిగా అరిచే పీటీ మాస్టర్స్ ఉంటారు. ఇలా ఫస్ట్ డే స్కూల్ సీన్లు ప్రతి ఏడాది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ చిన్న కన్నీళ్ల వెనుకే పిల్లల కొత్త ప్రపంచం, కొత్త ప్రయాణం మొదలవుతుంది!
పిల్లలకు ఎగై్జట్‌మెంట్ ప్లస్ టెన్షన్ !
కొత్త క్లాస్‌లో ఎవరు ఫ్రెండ్ అవుతారు? కొత్త టీచర్ స్ట్రిక్ట్‌గా ఉంటారా? హోంవర్క్ ఎక్కువ ఇస్తారా? ఇలా పిల్లల మైండ్‌లో కూడా చిన్న చిన్న ప్రశ్నలే! కానీ కొత్త బ్యాగ్, కొత్త షూస్, కొత్త నోట్‌బుక్స్ చూస్తే మాత్రం ఆ టెన్షన్ కంటే ఎగై్జట్‌మెంట్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ డే స్కూల్ అంటే చాలామందికి ‘ఫ్యాషన్ షో’ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరి బ్యాగ్ బెటర్? ఎవరి పెన్ కొత్తది? ఎవరి వాటర్‌బాటిల్ కూల్‌గా ఉంది? అనే సీక్రెట్ కంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది! సెలవుల్లో ఆటపాటలతో ఎక్కువకాలం గడిపిన పిల్లలు స్కూల్‌లోకి తిరిగి అడుగుపెడుతూనే పాఠాలు వినే మూడ్‌లో ఉండరు. వాళ్లను తిరిగి పాఠాల వైపు మళ్లించడానికి టీచర్లు నేరుగా సిలబస్ మొదలుపెట్టకుండా, కొంత ఓపికతో ప్రయత్నించాలి. - కృష్ణభరత్, సైకాలజిస్ట్
టీచర్స్‌కి కూడా ఇదే న్యూ ఇయర్!
స్కూల్ ఓపెనింగ్ అంటే కేవలం పిల్లలకే కొత్త మొదలు కాదు.. టీచర్స్‌కి కూడా అదే ‘న్యూ ఇయర్’ ఫీలింగ్! కొత్త సిలబస్, కొత్త టైమ్‌టేబుల్స్, కొత్త స్టూడెంట్స్, కొత్త టార్గెట్స్‌తో వారి అసలు హడావుడి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు క్లాస్‌రూమ్‌లో పిల్లల అటెన్షన్ ను పట్టుకోవాలి; మరోవైపు మొబైల్, రీల్స్, గేమ్స్ ప్రపంచం నుంచి వారిని బయటకు తీయాలి. ఇప్పుడు టీచర్స్‌కి మరో కొత్త చాలెంజ్ కూడా వచ్చేసింది; అదే ‘చాట్‌జీపీటీ హోంవర్క్స్!’ పిల్లలు నిజంగా చదివారా? లేక ఏఐతో అసైన్ మెంట్ చేయించారా? అనేది కూడా గుర్తించాల్సి వస్తోంది. పేరెంట్స్ అయితే మొదటి రోజే స్కూల్ వాట్సాప్ గ్రూప్స్‌లో ‘హోంవర్క్ ఏమిచ్చారు మేడమ్?’, రేపు కలర్ డ్రెస్‌నా?’ వంటి మెసేజ్‌ల వరద మొదలుపెడుతుంటారు. - పి. మాధవి దేవి ప్రిన్సిపాల్, వైఆర్‌ఎల్ స్కూల్, సామర్లకోట.
స్మూత్ ‘బ్యాక్ టు స్కూల్’ కోసం స్మార్ట్ టిప్స్!
నిద్ర టైమ్‌ను ముందే రీసెట్ చేయండి
సమ్మర్ హాలీడేస్ అంతా లేట్‌గా పడుకుని, ఆలస్యంగా లేవడం పిల్లలకు అలవాటైపోతుంది. అందుకే స్కూల్ ఓపెన్ అయ్యే వారం ముందు నుంచే రోజుకు 15–20 నిమిషాలు ముందుగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం ప్రాక్టీస్ చేయించాలి. లేదంటే ఫస్ట్ డేనే స్కూల్‌కి లేట్‌గా వెళ్లడమో, ఉదయం ఇంట్లో ‘ఇంకో 5 నిమిషాలు’ డ్రామానో గ్యారంటీ!
బడ్జెట్ షాపింగ్ బెస్ట్
షాపింగ్‌కి వెళ్లే ముందు ఇంట్లో ఇప్పటికే ఉన్న బాటిల్స్, పెన్సిల్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైన వాటికే లిస్ట్ తయారు చేసుకుని వెళ్తే.. ‘కార్టూన్ ఉంది కాబట్టి కొనాలి’అనే ఖర్చులు కాస్త తగ్గుతాయి!
లంచ్‌బాక్స్‌కి చిన్న స్ట్రాటజీ పెట్టండి
స్కూల్ మొదటి రోజుల్లో పిల్లలు టిఫిన్ పూర్తిగా తినకపోవడం కామన్ . అందుకే మొదటి రెండు వారాలు వారికి ఇష్టమైన, సులువుగా తినగలిగే ఫుడ్‌ను ప్లాన్ చేయాలి. బాక్స్ ఖాళీగా ఇంటికి వస్తే, మదర్స్‌కి వచ్చే ఆనందం వేరే లెవెల్!
బ్యాగ్ బరువు చెక్ చేయండి
అవసరం లేని పుస్తకాలతో పిల్లల బ్యాగ్‌ను చిన్న జిమ్ కిట్‌లా మార్చేయొద్దు! అవసరమైన నోట్‌బుక్స్, మెటీరియల్స్ మాత్రమే పెట్టే అలవాటు చేయాలి. చిన్న పిల్లల బ్యాగ్ వారి బరువుకంటే ఎక్కువగా ఉండకూడదు.
స్క్రీన్ టైమ్‌కి లిమిట్ పెట్టండి
స్కూల్స్ కూడా ఇప్పుడు డిజిటల్ అయ్యాయి కాబట్టి మొబైల్, ట్యాబ్‌లను పూర్తిగా దూరం పెట్టడం కష్టం. కానీ రీల్స్, గేమ్స్, అనవసర స్క్రోలింగ్‌ను తగ్గించి, గాడ్జెట్స్‌ను కేవలం హోంవర్క్, స్కూల్ యాప్స్‌కే పరిమితం చేసే రూల్స్ పెట్టుకోవాలి.
చదువును టెన్షన్ రీజన్‌లా చేయకం.
మొదటి రోజు నుంచే బాగా చదువుకోవాలి. ‘ర్యాంక్ రావాలి’ అని రోజూ ఒత్తిడి పెడితే పిల్లల్లో భయం పెరుగుతుంది. దాని బదులు ‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’ అని అడిగితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
డిజిటల్ సేఫ్టీ కూడా నేర్పండి
ఆన్ లైన్ క్లాసులు, యాప్స్, స్టడీ వెబ్‌సైట్లు వాడేటప్పుడు తెలియని లింక్స్, ఫేక్ కోర్సులు, స్కామ్‌ల గురించి పిల్లలకు ముందే అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్‌తో పాటు సైబర్ సేఫ్టీ కూడా తప్పనిసరి సబ్జెక్ట్ అయిపోయింది!
పేరెంట్స్‌కి మళ్లీ ‘మార్నింగ్ షిఫ్ట్’
హాలిడేస్‌లో కాస్త రిలాక్స్ అయిన అమ్మానాన్నలకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఉదయం పిల్లల్ని లేపడం, బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడం, హోంవర్క్ చెక్ చేయడం, స్కూల్ బస్ టైమ్ మిస్ కాకుండా చూడడం.. ఇల్లు ఒక్కసారిగా ‘మినీ కమాండ్ కంట్రోల్ రూమ్’లా మారిపోతుంది! పిల్లలు స్కూల్‌కి వెళ్తే కాస్త రిలీఫ్ దొరుకుతుంది అనే ఆనందంతో పాటు, లంచ్ తిన్నాడా లేదా? అనే చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. - కర సాయి బిందు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
బ్యాగ్‌ల బిజినెస్‌కి బంపర్ సీజన్ !
స్కూల్స్ ఓపెన్ అంటే మార్కెట్‌లో కూడా అసలు హడావిడి మొదలవుతుంది. బ్యాగులు, లంచ్‌బాక్స్‌లు, వాటర్ బాటిల్స్, షూస్, బుక్స్, స్టేషనరీ.. ఒక్కసారిగా అన్నీ ‘హాట్ సెల్లింగ్’ ఐటమ్స్‌గా మారిపోతాయి. దుకాణాల్లో పిల్లలు కార్టూన్ బ్యాగ్‌ల కోసం ఫైట్ చేస్తుంటే, పేరెంట్స్ మాత్రం ‘ఇది ఏడాది మొత్తం వాడాలి’ అంటూ బడ్జెట్ క్యాలిక్యులేషన్ ్సలో పడిపోతున్నారు! ఇక ఆన్ లైన్ లో అయితే ‘బ్యాక్ టు స్కూల్ సేల్’ పేరిట భారీ ఆఫర్లు. ఒక పెన్సిల్ కొనడానికి వెళ్లి, చివరికి ఐదు నోట్‌బుక్స్, మూడు స్టిక్కర్ సెట్లు, రెండు కొత్త బాటిల్స్‌తో కార్ట్ ఫుల్ అయ్యే పరిస్థితి!
ఆరోగ్యం.. ఆనందం
స్కూల్ ఓపెన్ అయ్యాక పిల్లలతో పాటు వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబులు కూడా క్లాస్‌లోకి ఎంట్రీ ఇస్తుంటాయి! కొత్త టైమింగ్స్, బయట ఆహారం, వేడి వాతావరణం వల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. అందుకే ఈ సీజన్ లో హెల్త్ కేర్ కూడా హోంవర్క్‌లాగే చాలా ముఖ్యం. నీళ్లు తాగడం తగ్గిపోకుండా మంచి వాటర్ బాటిల్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్ర లేకపోతే పిల్లలు క్లాస్‌లోనే ‘లో బ్యాటరీ మోడ్’లోకి వెళ్లిపోతారు! ముఖ్యంగా చిన్న పిల్లలైతే చేతులు కడుక్కోవడం, టిఫిన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ముందే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలతో పాటు ఇమ్యూనిటీ కూడా తప్పనిసరి!
డేటా బరువు!
ఒకప్పుడు స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలు, పెన్సిల్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చదువు కూడా అప్‌డేట్ వెర్షన్ లోకి వెళ్లిపోయింది! పుస్తకాలతో పాటు ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు, ఇయర్‌ఫోన్ ్స, చార్జర్లు కూడా బ్యాగ్‌లో స్థానం సంపాదించుకున్నాయి. హోంవర్క్ వాట్సాప్‌లో వస్తోంది. ఫీజులు యాప్‌ల్లో కట్ అవుతున్నాయి. అటెండెన్ ్స కూడా మొబైల్ నోటిఫికేషన్ గా పేరెంట్స్‌కి చేరిపోతోంది. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్ కన్నా.. ఇంట్లో వైఫై సిగ్నల్‌కే ఎక్కువ విలువ! ఒకప్పుడు ‘పుస్తకాలు తెచ్చుకున్నావా?’ అని అడిగేవారు. ఇప్పుడు ‘చార్జర్ పెట్టుకున్నావా?’ అనేదే కొత్త స్కూల్ ప్రశ్న! అందుకే పేరెంట్స్ ఇప్పుడు ఫీజుల బడ్జెట్‌తో పాటు నెల డేటా ప్యాక్, స్క్రీన్ టైమ్, గాడ్జెట్ ఖర్చుల లెక్కలు కూడా వేసుకోవాల్సి వస్తోంది.
ఈజీ అండ్ హెల్తీ హోమ్‌మేడ్ లంచ్‌బాక్స్ ఐడియాస్!
లంచ్‌బాక్స్‌లో పెట్టేది కేవలం టేస్టీగా మాత్రమే కాదు.. హెల్తీగా, ఈజీగా తినగలిగేలా కూడా ఉండాలి. ఎక్కువ ఆయిల్, జంక్ ఫుడ్
కంటే ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ పిల్లలకు ఎనర్జీ కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది! అందుకే, కొన్ని ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ మీకోసం..
1. వెజ్ ఉప్మా + బనానా + డ్రైఫ్రూట్స్ చిక్కీ
ఉప్మాలో ఉండే రవ్వ పిల్లలకు ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తుంది. ఉప్మాలో కూరగాయలు వేస్తే ఫైబర్, విటమిన్లు కూడా అందుతాయి. బనానా వల్ల ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. డ్రైఫ్రూట్స్ చిక్కీ ఐరన్ , కాల్షియంతో చిన్నపాటి హెల్తీ స్వీట్‌లా పనిచేస్తుంది.
2. ఇడ్లీ + పీనట్ పొడి + యాపిల్ ముక్కలు
ఇడ్లీ లైట్‌గా ఉండటంతో పిల్లలు ఈజీగా తింటారు, జీర్ణం కూడా త్వరగా అవుతుంది. పీనట్ పొడిలో ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ ఉంటాయి. యాపిల్ ఫైబర్, విటమిన్ సి అందించి పిల్లల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది.
3. వెజ్ పులావ్ + కీరదోస + కార్న్ చాట్
వెజ్ పులావ్‌లో కార్బోహైడ్రేట్స్‌తో పాటు కూరగాయల పోషకాలు కూడా ఉంటాయి. కీరదోస శరీరాన్ని చల్లగా ఉంచి హైడ్రేషన్ ఇస్తుంది. కార్న్ చాట్ పిల్లలకు టేస్టీగా అనిపించడంతో పాటు ఫైబర్, ఎనర్జీ కూడా ఇస్తుంది.
4. చపాతీ రోల్స్ + ఆలూ/పనీర్ స్టఫింగ్ + ఖర్జూరాలు
చపాతీ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పనీర్ స్టఫింగ్ అయితే ప్రోటీన్ , కాల్షియం ఎక్కువగా అందుతుంది. ఖర్జూరాలు నేచురల్ స్వీట్‌గా పనిచేసి ఐరన్ కూడా అందిస్తాయి.
5. లెమన్ రైస్ + ఉడికించిన గుడ్డు + ఆరెంజ్ ముక్కలు
లెమన్ రైస్‌లో విటమిన్ సి ఉండటంతో పాటు పిల్లలకు టేస్టీగా అనిపిస్తుంది. గుడ్డు మంచి ప్రోటీన్ సోర్స్. ఆరెంజ్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి వేసవిలో ఫ్రెష్‌గా ఫీలవుతారు.
6. పెరుగు అన్నం + దానిమ్మ గింజలు + ముర్మురా మిక్స్
పెరుగు అన్నం కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మలో ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముర్మురా మిక్స్ లైట్ స్నాక్‌లా ఉండి పిల్లలకు ఈజీగా తినిపించొచ్చు.
7. కార్న్/వెజ్ సాండ్‌విచ్ + ద్రాక్ష + రోస్టెడ్ పల్లీలు
సాండ్‌విచ్‌లో కూరగాయలు వేసితే పిల్లలు తెలియకుండానే హెల్తీ ఫుడ్ తింటారు. ద్రాక్ష శరీరానికి నీరసం రాకుండా సహాయపడుతుంది. రోస్టెడ్ పల్లీలు ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ అందిస్తాయి.
8. మినీ దోశలు + టమాటా చట్నీ + హోమ్‌మేడ్ అరటి చిప్స్
మినీ దోశలు పిల్లలకు ఫన్ గా అనిపిస్తాయి కాబట్టి పూర్తిగా తినేస్తారు. టమాటాలో లైకోపీన్ , విటమిన్ సి ఉంటాయి. ఇంట్లో చేసిన అరటి చిప్స్ బయట జంక్ ఫుడ్ కంటే బెటర్ ఆప్షన్ .
9. పొంగల్ + డ్రైఫ్రూట్స్ + పుచ్చకాయ ముక్కలు
పొంగల్ సాఫ్ట్‌గా ఉండి చిన్న పిల్లలకు బాగా సూట్ అవుతుంది. డ్రైఫ్రూట్స్ ఎనర్జీ పెంచుతాయి. పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ ఇచ్చి వేసవిలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.
10. వెజ్ పాస్తా + ఫ్రూట్ బాక్స్ + మఖానా స్నాక్
పిల్లలకు పాస్తా అంటే ఇష్టం కాబట్టి కూరగాయలు కలిపి హెల్తీగా చేయొచ్చు. ఫ్రూట్ బాక్స్ వల్ల విటమిన్లు అందుతాయి. మఖానా లైట్, లో–ఆయిల్ స్నాక్‌గా మంచి ఆప్షన్ .
స్కూల్ ఓపెన్ అంటే కేవలం క్లాసులు స్టార్ట్ కావడం కాదు. పిల్లల కలల పుస్తకంలో ఒక కొత్త పేజీ తిప్పడం. ఎందుకంటే ప్రతి జూన్ లో.. స్కూల్ బెల్, కొత్త క్లాస్‌తో పాటు కొత్త కలలు కూడా బ్యాగ్‌లో జిప్ వేసుకుని వస్తాయి!
- కొండి దీపిక


