
పత్తి అంటే తెల్లని దూదే అందరికీ గుర్తొస్తుంది. అయితే, గోధుమ (బ్రౌన్), ఆకుపచ్చ వంటి రంగుల్లో దూదిని అందించే సహజ పత్తి వంగడాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
హైదరాబాద్‌కు చెందిన హస్తకళల పునరాభివృద్ధి నిపుణుడు రామనాధం రమేశ్ దగ్గర ఏకంగా 12 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇందులో పది దేశీ పత్తి వంగడాలు కాగా రెండు అమెరికన్ బ్రౌన్ కాటన్ రకాలు. వీటికి సంబంధించిన గింజల దూది, దారాలను ఆయన చాలా కాలంగా భద్రపరచి ఉంచారు.
ఆయన దగ్గర ఉన్న వంగడాల్లో లేత ఆకుపచ్చ పత్తి రకం ఒకటి. గోధుమ రంగు పత్తిలో స్వల్ప తేడాలతో 8 వేరియంట్లున్నాయి. ఇవి కాకుండా, తెలుపు రంగు దేశీ రకాలైన గిరిధర్ (తూ.గో. జిల్లా పిఠాపురం ప్రాంత వంగడం), కొండపత్తి శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరు వస్త్రాలను ఈ దూదితోనే నేస్తారు) విత్తనాలు కూడా రమేశ్ దగ్గర ఉన్నాయి.
ఈ వంగడాలను సాగు చేయించటం ద్వారా ఒరిజినల్ ఖాదీ సంస్కృతికి తిరిగి ప్రాణంపోయటం.. ఖాదీ వస్త్రాలకు మంచి ధర దక్కేలా చేయటం.. చేనేత కళాకారులకు తిరిగి గౌరవం, ఆర్థిక పుష్టి కలిగించటమే తన లక్ష్యాలని రమేశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
ఈ అపురూప పత్తి రకాలను ప్రకృతి వ్యవసాయంలో పండించటంతో పాటు.. ఏ దశలోనూ యంత్రాలు వాడకుండా స్వాభావిక ఖాదీ పద్ధతుల్లో దారం వడికి, బట్ట నేయించే నిబద్ధత, ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలకు ఈ 12 రకాల వివిధ రంగుల పత్తి విత్తనాలను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నానని రమేశ్ (94400 55266) తెలిపారు.