Natural colors
-
బ్రౌన్, గ్రీన్ రంగుల్లోనూ దేశీ పత్తి!
పత్తి అంటే తెల్లని దూదే అందరికీ గుర్తొస్తుంది. అయితే, గోధుమ (బ్రౌన్), ఆకుపచ్చ వంటి రంగుల్లో దూదిని అందించే సహజ పత్తి వంగడాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?హైదరాబాద్‌కు చెందిన హస్తకళల పునరాభివృద్ధి నిపుణుడు రామనాధం రమేశ్ దగ్గర ఏకంగా 12 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇందులో పది దేశీ పత్తి వంగడాలు కాగా రెండు అమెరికన్ బ్రౌన్ కాటన్ రకాలు. వీటికి సంబంధించిన గింజల దూది, దారాలను ఆయన చాలా కాలంగా భద్రపరచి ఉంచారు. ఆయన దగ్గర ఉన్న వంగడాల్లో లేత ఆకుపచ్చ పత్తి రకం ఒకటి. గోధుమ రంగు పత్తిలో స్వల్ప తేడాలతో 8 వేరియంట్లున్నాయి. ఇవి కాకుండా, తెలుపు రంగు దేశీ రకాలైన గిరిధర్ (తూ.గో. జిల్లా పిఠాపురం ప్రాంత వంగడం), కొండపత్తి శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరు వస్త్రాలను ఈ దూదితోనే నేస్తారు) విత్తనాలు కూడా రమేశ్ దగ్గర ఉన్నాయి. ఈ వంగడాలను సాగు చేయించటం ద్వారా ఒరిజినల్ ఖాదీ సంస్కృతికి తిరిగి ప్రాణంపోయటం.. ఖాదీ వస్త్రాలకు మంచి ధర దక్కేలా చేయటం.. చేనేత కళాకారులకు తిరిగి గౌరవం, ఆర్థిక పుష్టి కలిగించటమే తన లక్ష్యాలని రమేశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.ఈ అపురూప పత్తి రకాలను ప్రకృతి వ్యవసాయంలో పండించటంతో పాటు.. ఏ దశలోనూ యంత్రాలు వాడకుండా స్వాభావిక ఖాదీ పద్ధతుల్లో దారం వడికి, బట్ట నేయించే నిబద్ధత, ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలకు ఈ 12 రకాల వివిధ రంగుల పత్తి విత్తనాలను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నానని రమేశ్ (94400 55266) తెలిపారు. -
ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సహజసిద్ధ రంగులతో.. అబ్బురపరిచే చిత్రాలతో రాజుల కాలం నుంచి ఆకట్టుకుంటూ వస్తున్న ‘తంగెళ్లమూడి తివాచీ’ రంగు క్రమంగా వెలిసిపోతోంది. కోటకు కొత్త అందం తేవాలన్నా.. ఇంటికి కళ రావాలన్నా ఏలూరు తివాచీ పరచాల్సిందే అనే స్థాయిలో వెలుగొందిన పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. దేశవిదేశీయుల మనసు చూరగొన్న పరిశ్రమ.. ఇప్పుడు తనకు ‘ఎర్ర తివాచీ’ పరిచేవారి కోసం ఎదురుచూస్తోంది. పర్షియా నుంచి వలస.. సహజసిద్ధ రంగులతో తయారయ్యే సంప్రదాయ తివాచీలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి ప్రసిద్ధి. గొర్రెల నుంచి సేకరించిన ఊలు, సహజసిద్ధ రంగులు, జూట్, పత్తితో 300 ఏళ్లకు పై నుంచి ఇక్కడ తివాచీలు తయారు చేస్తున్నారు. 18వ శతాబ్ధంలో పర్షియా నుంచి మచిలీపట్నం ఓడరేవుకు తివాచీలు తయారు చేసే ముస్లింలు కొందరు వలస వచ్చారు. వారు కాలక్రమేణ తంగెళ్లమూడిలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తంగేడు వనంలా ఉండేది. తంగేడు పూల నుంచి తీసిన రంగులను తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పత్తి, జూట్ కూడా అందుబాటులో ఉండటంతో వారు ఇక్కడే స్థిరపడిపోయారు. 50 ఏళ్లకు పైగా మన్నిక.. ఎన్ని అడుగుల తివాచీకి ఆర్డర్ ఇచ్చినా.. ఇక్కడ అద్భుతంగా తయారు చేసి ఇస్తారు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏలూరులో మాత్రమే చేనేత మగ్గాలపై తివాచీలు తయారు చేస్తారు. ఇవి 50 ఏళ్లకుపైగా మన్నిక ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసేవారు. యంత్రాలు రావడంతో 2002 నుంచి ఇక్కడి పరిశ్రమకు గడ్డుకాలం మొదలైంది. తక్కువ ధరకు ప్లాస్టిక్ కార్పెట్లు వస్తుండటంతో అందరూ వాటివైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఏలూరు తివాచీల గురించి తెలుసుకున్నవారు ఆర్డర్లు ఇస్తుండటంతో కొంతకాలం కిందట మంచి డిమాండ్ వచ్చిందని తయారీదారులు చెప్పారు. అంతలోనే కరోనా విజృంభించడంతో పరిశ్రమ కుదేలైందని వాపోయారు. తివాచీ నేత పనిలో నిమగ్నమైన కార్మికులు కరోనాతో దెబ్బ గతంలో 100 మందికి పైగా చేనేత కార్మికులు, 50 మంది ఎక్స్‌పోర్టర్లు, 20 మంది మాస్టర్ వీవర్లతో ఈ పరిశ్రమ కళకళలాడేది. ప్రభుత్వ సహాయ సహకారాలు అందడానికి వీలుగా ఏలూరు కార్పెట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ నేతృత్వంలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించడంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కొని వెళ్లిపోయారు. నైపుణ్యమున్న చేనేత కార్మికులు తగ్గిపోయారు. 10 మంది కార్మికులతోనే తక్కువ ఆర్డర్లతో నెట్టుకువస్తున్నారు. 6 గంటల పనికి రూ.300 ఇస్తున్నా కార్మికులు దొరకట్లేదని తయారీదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ హితం.. ఈ తివాచీలు పర్యావరణ హితమైనవని తయారీదారులు చెబుతున్నారు. ఊలు, కాటన్, జూట్‌తో పాటు సహజసిద్ధ రంగులు ఉపయోగిస్తామని తెలిపారు. 50 ఏళ్లకు పైగా మన్నిక ఉండే వీటిని మూడు నెలలకొకసారి శుభ్రం చేస్తే కొత్తగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. సాధారణ కార్పెట్ కంటే వీటి ధర కాస్త అధికం. ఇందులోనే 50 శాతం కూలి ఖర్చులు, 30 నుంచి 40 శాతం మెటీరియల్ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ తివాచీల్లో హానికర రసాయనాలు వినియోగిస్తారని.. ఇవి భూమిలో, సముద్రంలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మన్నిక రెండేళ్లే ఉంటుంది. కానీ ధర తక్కువ కావడంతో అందరూ ప్లాస్టిక్ వైపు వెళుతున్నారని చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే పని సిద్ధమైన తివాచీని ఫినిషింగ్ చేస్తుంటాను. ఫినిషింగ్ ఎంత బాగా చేస్తే అంత మన్నిక ఉంటుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. గతంలో చాలా సందడిగా ఉన్న మా పరిశ్రమ నేడు వెలవెలబోతుంటే చూడటం కష్టంగా ఉంది. – సత్యనారాయణ, ఫినిషింగ్ కార్మికుడు మాది ఐదోతరం కార్పెట్ తయారీ పరిశ్రమలో నేను ఐదో తరానికి చెందినవాడిని. పనినైపుణ్యంతో అనేక అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు ఆ వెలుగులు పోయాయి. ప్లాస్టిక్ కార్పెట్ వచ్చాక మా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మార్కెట్ కొంత మేర బాగానే ఉన్నప్పటికీ.. కార్మికులు దొరకట్లేదు. నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆన్లైన్ మార్కెటింగ్ విక్రయాలకు అవకాశం కల్పిస్తే ఈ రంగం కోలుకుంటుంది. – అబ్దుల్ నయీం, తయారీదారు -
రంగుల కేళి.. కరోనాతో జాగ్రత్త మరి
సాక్షి సిటీబ్యూరో: హోలీ.. రంగుల పండుగ. ప్రేమానురాగాలకు ప్రతీక. అలాంటి పండుగతో ఇష్టానుసారం రంగులు వాడి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దంటున్నారు నిపుణులు. సహజసిద్ధ రంగులను వినియోగించి హోలీని ఆనందాల పండుగగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. కరోనా ప్రభావం ప్రతి ఏటా హోలి పండుగ అనగానే అందరూ రంగులు చల్లుకునే వారు. అయితే ఈ ఏడాది హోలీ సందడి తగ్గిందనే చెప్పవచ్చు. కారణం కరోనా ప్రభావం. మార్కెట్లో రంగులు పెద్దగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నగరంలో హోలీ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లకు కూడా పెద్దగా ఆదరణ లేదు. ప్రేమను పెంచుకోండి... హోలీ అంటేనే రంగులు, మిఠాయిలు. హోలీతో అనుబంధాలు పెంచుకోవాలి తప్ప రోగాలను తెచ్చుకోవొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వల్ల శరీరంతో పాటు ప్రకృతికి కూడా మేలు చేసిన వారమవుతామన్నారు. హోలీ సందర్భంగా వినియోగించే ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రతీకగా నిలిచినట్లే ఆయా రంగుల్లోని ఒక్కో రసాయనం ఒక్కో జబ్బుకు కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండాలి హోలీ వేడుకల్లోఅప్రమత్తంగా ఉండకపోతే సమస్యలు కొనితెస్తుంది అంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వైద్యురాలు డా.ఆర్.రాజ్యలక్ష్మి. ఆమె అందిస్తున్న సూచనలివి... ♦ రంగులలో వెజిటబుల్స్, ఫ్లవర్ డైలు ఉపయోగిస్తున్న సహజ రంగులు తగిన పరిమాణంలో లభ్యం కావడం లేదు. దీంతో సింథటిక్ కెమికల్ కలర్స్ విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. తద్వారా రకరకాల ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపుపై ఈ తరహా రంగులు చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి హోలీ ఆడే సమయంలో... ♦ కంటి చుట్టూ ఉండే చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది. కొబ్బరినూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తగినంత కంటి చుట్టూ అప్లయి చేయడం మంచిది. అలాగే నాణ్యమైస సన్‌గ్లాసెస్ కూడా వినియోగించడం అవసరం. రంగులు కంటిలో, నోటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా అనుకోకుండా కళ్లలో రంగులు ప్రవేశిస్తే వాటిని నలపడం వంటివి చేయకూడదు. శుభ్రం చేసుకున్న చేతులలో నీళ్లు పోసుకుని అరచేతుల్లో కళ్లు ఆర్పుతూ మూస్తూ క్లీన్ చేసుకోవాలి. అంతే తప్ప కంటిపై నీళ్లను గట్టిగా చల్లకూడదు. వాటర్ బెలూన్స్ వినియోగం వద్దు. ఇవి కంటికి చాలా ప్రమాదకరం. కళ్లజోడు ఫ్రేమ్స్ లో ఉండిపోయే రంగులు తర్వాత తర్వాత ఇబ్బందులు సృష్టించవచ్చు. రిమ్లెస్ కళ్లజోళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్‌లు వాడే అలవాటు ఉంటే వాటికి రంగుల పండుగ రోజు దూరంగా ఉండాలి. -
గ్రీన్ గణేషా
సాక్షి, సిటీబ్యూరో: భక్త కోటి ఇష్టదైవం...బొజ్జ గణపయ్య ఈ ఏడాది పర్యావరణ ప్రియమైన రంగులతో కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. పూలు, పండ్లు, దుంపల నుంచి రూపొందించే ఆకర్షణీయమైన...సహజసిద్ధమైన రంగులతో కొలువుదీరనున్నాడు. రెండు లక్షలకు పైగా చిన్న విగ్రహాలకు, మరో 10 వేల పెద్ద విగ్రహాలకు సహజమైన రంగులు అద్దేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారీ ప్రాజెక్టును చేపట్టింది. కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు మొదటి వారం నాటికి 30 టన్నుల సహజ రంగులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటి తయారీ..ప్రజల్లో చైతన్యం...పీసీబీ ఏర్పాట్లు తదితర అంశాలు నేటి సండే స్పెషల్‌లో... ప్రమాదకరమైన రసాయనాల నుంచి జలవనరులను, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో వ్యవసాయ వర్సిటీలో ఈసారి గణపతి విగ్రహాలకు ఉపయోగించే సహజ రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు, భాగస్వాములు కానున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్, సింథటిక్ రంగుల స్థానంలో సహజమైన రంగుల వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, స్వచ్చందసంస్థలు కూడా భాగం పంచుకోనున్నాయి. ఇప్పటి వరకు కేవలం మట్టి విగ్రహాలను రూపొందించి ప్రజలకు అందజేసిన కాలుష్య నియంత్రణ మండలి ఈసారి వాటిని సహజమైన రంగులతో రూపొందించి పంపిణీ చేయనుంది. మరోవైపు ప్రజలు తాము స్వయంగా రూపొందించే మట్టి విగ్రహాలకు సహజ రంగులను అద్దేందుకు కూడా తక్కువ ధరల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు. అందుబాటు ధరల్లో సహజ రంగులు.... నగరంలోని అన్ని ప్రాంతాల్లో సహజమైన రంగులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. విగ్రహాలను తయారు చేసే కళాకారులకు ఇప్పటికే అవగాహన కల్పించిన కాలుష్య నియంత్రణ మండలి...ప్రజల్లో సైతం అవగాహనను పెంపొందించేందుకు సన్నద్ధమవుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు, సైఫాబాద్‌లోని హోంసైన్స్ కళాశాలలోనూ, ఎంపిక చేసిన హస్తకళా కేంద్రాలు, సూపర్ మార్కెట్లలోనూ ఈ రంగులను విక్రయిస్తారు. ఒక లీటర్ రంగు ధర రూ.200 నుంచి రూ.300ల వరకు ఉంటుంది. బేసిక్ కోసం వినియోగించే తెలుపు రంగును రూ.100 కు లీటర్ చొప్పున విక్రయిస్తారు. ధూల్‌పేట్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తయారు చేసే విగ్రహాలకు కూడా సహజమైన రంగులను వినియోగించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రోత్సహిస్తోంది. తయారీదారులకు అవగాహన కల్పిస్తోంది. సహజ రంగులకు ఇలా శ్రీకారం... ప్రమాదకరమైన రసాయనాల కారణంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులన్నీ కాలుష్య కాసారాలయ్యాయి. పర్యావరణానికి కూడా ఈ రసాయనాలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో 2006 లో యునెస్కో సహకారంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సహజమైన రంగుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ఈ సదస్సు లక్ష్యం. ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్ అగ్రికల్చరల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులో భాగంగా హోమ్‌సైన్స్ కళాశాల సహజరంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పండ్లు, పూలు, ఆకులు, బెరళ్లు, వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. ఈ రంగుల నాణ్యత, ఆకర్షణపై హోమ్‌సైన్స్ కళాశాల ఎమిరిటస్ సైంటిస్ట్ శారదాదేవి ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2008లో 500 విగ్రహాలతో ప్రారంభమైన ఉద్యమం 2014లో 5000 దాటింది. చిన్న చిన్న విగ్రహాలతో పాటు, 5 నుంచి 6 ఫీట్లు ఉన్న వినాయక విగ్రహాలకు సైతం సహజరంగులను సిద్ధం చేశారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రూ.కోటితో అతి పెద్ద ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. తెలుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు, గులాబీ వంటి 12 ప్రాథమిక రంగులు, వివిధ రకాల రంగుల కాంబినేషన్లతో మొత్తం 56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించే విధంగా ఈ సహజరంగులను తయారు చేస్తున్నారు. 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10 వేలకు పైగా పెద్ద విగ్రహాలకు రంగులను సిద్ధం చేయడం ఇదే మొట్టమొదటిసారి. నగరంలో వినాయకుడి మండపాలు ఇలా... ప్రధాన మండపాలు : లక్ష చిన్న విగ్రహాలు : 8 లక్షలు ఈ ఏడాది సహజ రంగులతో పెద్ద విగ్రహాలు : 10 వేలు చిన్న విగ్రహాలు : 2 లక్షలు సహజ రంగుల కోసం ప్రజలు, సంస్థలు, కళాకారులు సంప్రదించాల్సిన నెంబర్లు : 04023241059, హోంసైన్స్ కళాశాల. ఎప్పటి నుంచి అందుబాటులోకి : ఆగస్టు మొదటి వారం. -
సహజరంగుల గణేశ ప్రతిమల కోసం..
రాజేంద్రనగర్: సహజ రంగులతో వినాయక విగ్రహాలు అందించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నడుం బిగించింది. సహజ రంగులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు దేశంలోనే మొట్టమొదటి భారీ యంత్రాన్ని వర్సిటీ ప్రాంగణంలో నెలకొల్పింది.. వినాయక చవితి రోజున గణనాధుడికి పూజకు కావాల్సిన పత్రి (21పత్రాలు), పూలతో పాటు ప్రకృతిలో లభించే వివిధ దుంపలు, వృక్షాల బెరళ్లతో వచ్చిన సహజ రంగులను గణేష్ ప్రతిమల తయారీలో వాడుతున్నారు. వర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హోం సైన్స్‌కు నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టు (ఎన్ఏఐపీ) కింద ప్రపంచ బ్యాంక్ నిధులతో సహజరంగులను తయారు చేస్తోంది. సహజంగా లభించే ఆకులు, చెట్ల బెరళ్లు, దుంపల నుంచి తయారు చేసే రంగులను ఏటా 5వేల వరకు వినాయక ప్రతిమలకు అద్ది నగరంలోని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, రంగులను పెద్ద మొత్తంలో తయారు చేసి వినాయక ప్రతిమలను నగరంలోని ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. రసాయనాలతో ముప్పు... వినాయక విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు నీటిలో తేలికగా కరిగిపోవు. దీంతో జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీటిలోని జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు జలాశయాల్లో నీరు కలుషితమవుతుంది. అందుకే, కృత్రిమ రంగుల వాడకాన్ని అరికట్టి సహజరంగులతో రూపుదిద్దుకునే వినాయకవిగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే వర్సిటీలో తయారు చేసే సహజరంగుల ఉత్పత్తిని అధిక మొత్తంలో తయారు చేసి తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) వ్యవసాయ వర్సిటీని కోరింది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తామని వారికి సూచించారు. రోజుకు ఐదు టన్నుల సహజ రంగులు... సహజరంగులను అధిక మొత్తంలో తయారు చేసేందుకు వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో సహజ రంగుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజుకు ఐదు టన్నుల సహజ రంగులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ యంత్రం దేశంలోనే మొట్టమొదటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ వినాయక చవితికి గాను తమకు 30 టన్నుల సహజ రంగులను అందివ్వాలని వ్యవసాయ వర్సిటీని పీసీబీ కోరినట్లు సమాచారం. దీంతో అధిక మొత్తంలో సహజ రంగులను ఉత్పత్తి చేసే యంత్రాలను వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
జారిపోయేలా మృదుత్వం
బ్యూటిప్స్ జుత్తు పట్టుకుంటే పట్టుకుచ్చులా చేతివేళ్ల నుంచి జారిపోవాలి. పూసలు గుచ్చేటంత బలంగా వెంట్రుక కుదురు ఉండాలి. సహజమైన రంగుతో కురులు ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి. అలా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి... - మగ్ నీటిలో గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి, తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని వెంట్రుకలన్నీ తడిచేలా పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పట్టులాంటి మృదుత్వం లభిస్తుంది. - ఆముదం, తేనె సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు, ముఖ్యంగా వెంట్రుకల చివరలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల వెంట్రుకల చివర్లు చిట్లకుండా, మృదువుగా ఉంటాయి. - బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. - ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది. -
రంగుల కేలి కి రేడినా
ముంబై: సహజమైన రంగులతో హోలీ జరుపుకునే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా సింథటిక్ రంగులతో ఆడుతున్నవారే కనిపిస్తున్నారు. ఇవి హానికరమైనవని తెలిసి కూడా వీటితోనే ఆటలాడుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మసంబంధమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం మాత్రమే కాకుండా ఒక్కోసారి కంటిచూపు పోయే ప్రమాదముందని తెలిసినా ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. హోలీ వేడుక తర్వాత చాలా మందిలో కళ్ల మంటలు, రకరకాల అలర్జీలు, చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతూ తమ వద్దకు వస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రంగులతో హోలీ ఆడడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకోసమే హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలన్నా, ఆ జ్ఞాపకాలు ఏడాదంతా ఉండాలన్నా కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని చెబుతున్నారు. సహజ రంగులతోనే సిసలైన హోలీ... సహజమైన రంగులతో హోలీ ఆడడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురుకావని, పైగా ఒంటికి అంటుకున్న రంగులు త్వరగా కడిగేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే సాధ్యమైనంతగా సహజమైన రంగులతో హోలీ జరుపుకోవడమే ఉత్తమం. ఇప్పటికీ పల్లెల్లో గోగు పువ్వును నీళ్లల్లో ఉడికించడం ద్వారా వచ్చే రంగునీళ్లతో హోలీ ఆడతారు. ఇలా హోలీ ఆడడం వల్ల గోగు పువ్వులోని ఔషధ గుణాలు ఒంటికి మేలు చేస్తాయని కూడా చెబుతారు. ఇక పొడి రంగులైన గులాల్ వంటి వాటితో హోలీ ఆడడం అన్ని విధాలుగా ఉత్తమమైనదే. అయితే ఇవి కూడా సహజంగా తయారైనవై ఉండేవిధంగా చూసుకోవాలి. కంటికి రక్షణగా కళ్లద్దాలు.. ఏ రంగులతో హోలీ ఆడినా చలువ కళ్లద్దాలను ధరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. హోలీ అంటే శరీరంలో అంగుళం కూడా వదలకుండా రంగు పూస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కంట్లో రంగుపడితే రకరకాల సమస్యలు తలెత్తే అవకాశముంది. పొడి రంగులు పడినా ప్రమాదమే. వీటన్నింటినుంచి కళ్లను కాపాడుకోవాలంటే చలువ కళ్లద్దాలు ధరించడమే పరిష్కారమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఒకవేళ కంటికి అద్దాలు లేని సమయంలో అకస్మాత్తుగా ఎవరైనా రంగు పూసేందుకు వస్తే ముందుగా కళ్లను మూసుకోవాలని, పెదాలకు కూడా రంగులు అంటకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బయటకెళ్లినప్పుడు మరికాస్త... హోలీ రోజు బయటకెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. హోలీని పురస్కరించుకొని ఎవరేది చేసినా వేడుకలో భాగంగానే భావిస్తారు. దీంతో ఎదుటివారిపై ఎటువంటి చర్య తీసుకునే అవకాశం లేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడమే ఉత్తమం. హానికరమైన రంగునీళ్లతో నింపిన బుడగలను మనపైకి విసిరే కొత్త సంస్కృతి ఈ మధ్య పుట్టుకొచ్చింది. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి.. కార్లు, బస్సుల్లో వెళితే కిటికీ అద్దాలు మూసుకోవాలి. బైక్‌పై వెళ్లినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. కాలినడకన వెళ్లినప్పుడు ఆకతాయిల కదలికలను గమనించాలి. ముందుజాగ్రత్తే మందు... హోలీ తర్వాత ఒంటికి అంటుకున్న రంగులను వదిలించుకోవడం పెద్ద కసరత్తే. రకరకాల సబ్బులు, షాంపూలు వంటివి చర్మానికి రుద్ది మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు. దీనికి పరిష్కారం రంగు పడకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. కోల్డ్క్రీమ్స్ వంటి వాటిని మందంగా ఒంటికి పట్టించడం ద్వారా చర్మానికి రంగు అంటకుండా చూసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనె ముందుగా రాసుకొని బయటకు వెళ్లినా ఫలితముంటుంది. నీళ్ల రంగు ఒంటి మీద పడినా చర్మానికి రంగు పట్టుకోకుండా ఉంటుంది. ఒకవేళ రంగు అంటినా కడిగేసుకోవడం కూడా సులువే. అంతేకాక చర్మాన్ని పూర్తిగా కప్పివే సే దుస్తులు ధరించడం ఉత్తమం.