రంగుల కేళి.. కరోనాతో జాగ్రత్త మరి | COVID 19 Effect on Holi Festival Hyderabad | Sakshi
Sakshi News home page

రంగుల కేళి..జాగ్రత్త మరి

Mar 9 2020 8:43 AM | Updated on Mar 9 2020 8:43 AM

COVID 19 Effect on Holi Festival Hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో:  హోలీ.. రంగుల పండుగ. ప్రేమానురాగాలకు ప్రతీక. అలాంటి పండుగతో ఇష్టానుసారం రంగులు వాడి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దంటున్నారు నిపుణులు. సహజసిద్ధ రంగులను వినియోగించి హోలీని ఆనందాల పండుగగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.  

కరోనా ప్రభావం
ప్రతి ఏటా హోలి పండుగ అనగానే అందరూ రంగులు చల్లుకునే వారు. అయితే ఈ ఏడాది హోలీ సందడి తగ్గిందనే చెప్పవచ్చు. కారణం కరోనా ప్రభావం.  మార్కెట్లో రంగులు పెద్దగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.  ఇక నగరంలో హోలీ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లకు కూడా పెద్దగా ఆదరణ లేదు.  

ప్రేమను పెంచుకోండి...
హోలీ అంటేనే రంగులు, మిఠాయిలు.  హోలీతో అనుబంధాలు పెంచుకోవాలి తప్ప రోగాలను తెచ్చుకోవొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వల్ల శరీరంతో పాటు ప్రకృతికి కూడా మేలు చేసిన వారమవుతామన్నారు.   హోలీ సందర్భంగా వినియోగించే ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రతీకగా నిలిచినట్లే ఆయా రంగుల్లోని ఒక్కో రసాయనం ఒక్కో జబ్బుకు కారణమవుతుంది.  

అప్రమత్తంగా ఉండాలి
హోలీ వేడుకల్లోఅప్రమత్తంగా ఉండకపోతే సమస్యలు కొనితెస్తుంది అంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్స్‌ వైద్యురాలు డా.ఆర్‌.రాజ్యలక్ష్మి. ఆమె అందిస్తున్న సూచనలివి...
రంగులలో వెజిటబుల్స్, ఫ్లవర్‌ డైలు ఉపయోగిస్తున్న సహజ రంగులు  తగిన పరిమాణంలో లభ్యం కావడం లేదు. దీంతో సింథటిక్‌ కెమికల్‌ కలర్స్‌
విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. తద్వారా రకరకాల ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపుపై ఈ తరహా రంగులు చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి హోలీ ఆడే సమయంలో...
కంటి చుట్టూ ఉండే చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది. కొబ్బరినూనె లేదా ఆల్మండ్‌ ఆయిల్‌ తగినంత కంటి చుట్టూ అప్లయి చేయడం మంచిది. అలాగే నాణ్యమైస సన్‌గ్లాసెస్‌ కూడా వినియోగించడం అవసరం. రంగులు కంటిలో, నోటిలో పడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.  అయినా అనుకోకుండా కళ్లలో రంగులు ప్రవేశిస్తే వాటిని నలపడం వంటివి చేయకూడదు. శుభ్రం చేసుకున్న చేతులలో నీళ్లు పోసుకుని అరచేతుల్లో కళ్లు ఆర్పుతూ మూస్తూ క్లీన్‌ చేసుకోవాలి. అంతే తప్ప కంటిపై నీళ్లను గట్టిగా చల్లకూడదు. వాటర్‌ బెలూన్స్‌ వినియోగం వద్దు. ఇవి కంటికి చాలా ప్రమాదకరం. కళ్లజోడు ఫ్రేమ్స్‌ లో ఉండిపోయే రంగులు తర్వాత తర్వాత ఇబ్బందులు సృష్టించవచ్చు. రిమ్‌లెస్‌ కళ్లజోళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడే అలవాటు ఉంటే వాటికి రంగుల పండుగ రోజు దూరంగా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement