ఆలూ ద బెస్ట్ | Sagubadi: global potato production was indeed approximately 375 million tons in 2022 | Sakshi
Sakshi News home page

ఆలూ ద బెస్ట్

Jun 4 2025 12:06 AM | Updated on Jun 4 2025 12:06 AM

Sagubadi: global potato production was indeed approximately 375 million tons in 2022

ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. 66% ప్రపంచ ప్రజలు దైనందిన ఆహారంలో బంగాళదుంపలు తింటున్నారు. 2023లో 38.3 కోట్ల టన్నులు బంగాళదుంపలు పండాయి. ప్రపంచ జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్న బంగాళదుంప ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి 2008లో అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. 2024 నుంచి మే 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తోంది. ‘చరిత్రను నిర్మించటం, భవిష్యత్తును పోషించటం’ ఇదీ ఈ ఏడాది నినాదం.

పెరులోని ఆండీస్‌ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్‌ దేశాలకు ఈ పంట చేరింది. ఎటువంటి వాతావరణానికి ఇట్టే అలవాటైపోవటం వంటి సుగుణాల వల్ల 5 శతాబ్దాల్లోనే ప్రపంచం అంతా వ్యాపించింది. 

వేల రకాల బంగాళదుంపల్లో దేని రంగు, సైజు, రుచి, పోషక విలువలు దానికే ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల ఇదొక ముఖ్యమైన ఆహార పదార్థంగా మాత్రమే కాదు వంటింటి సృజనాత్మక సంస్కృతికి మూలాధారం అని కూడా అర్థమవుతుందని ఐరాసకు చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) చెబుతోంది.

⇒ ఆహారపు అలవాట్లు మారిపోతున్న నేపథ్యంలో తాజా బంగాళదుంపలను వండుకు తినే వారి సంఖ్య తగ్గుతున్నట్లు అంచనా. అదేసమయంలో, అతిగా ప్రాసెస్‌ చేసిన పొటాటో చిప్స్, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటివి తినటం మాత్రం ఎక్కువైందట. ఫలితంగా అనేక రకాల పోషకాహార లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ట్రెండ్‌ మన దేశంలోనే కాదు ప్రపంచదేశాలన్నిటిలోనూ ఇంతేనని ఎఫ్‌ఎఓ తాజా నివేదిక చెబుతోంది. 

⇒ బంగాళదుంపల్లో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు బంగాళదుంపలో 80% నీరు, 15.7% పిండిపదార్ధాలు, 1.8% మాంసకృత్తులు, 1.7% పీచుపదార్థం, 0.1% కొవ్వు ఉంటాయి. 

⇒ విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కర్వీ జబ్బును నివారించడంలో సహాయపడుతుంది.
⇒ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్‌. మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది. 

⇒ బంగాళాదుంప పైపొరలో పీచు పదార్థం ఉంటుంది. మానవ జీర్ణవ్యవస్థలో ఆహారం జీర్ణం కావడానికి ఇది అవసరం. 
⇒ దేహ రక్షణకు సహజ మూలకాలైన యాంటీఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి దన్నుగా నిలవటం ద్వారా ఆరోగ్యదాయకమైన కొలెస్ట్రాల్‌ స్థాయిలను నిర్వహించటంలో యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. 

⇒ బంగాళదుంపలోని పోషక విలువ దాని రకం, వాతావరణం, నేల, సాగు పద్ధతులు, నిల్వ పరిస్థితులు, ప్రాసెసింగ్, తయారీ, వంట పద్ధతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 
బంగాళదుంపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కాగలిగినవైప్పటికీ ఇవి అందరికీ సరిపడవు. ఎందుకని అంటే..? ఎంత తింటాం? ఎలా ప్రాసెస్‌ చేస్తాం? ఎలా వండుతాం? విలువ ఆధారిత ఆహారోత్పత్తుల్ని ఎలా తయారు చేస్తాం? వంటి అంశాలతో పాటు ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిపినప్పుడు ఎంత సమతుల్యతను పాటిస్తాం అన్నదానిపై ఆధారపడి బంగాళదుంప బాగోగులు ఆధారపడి ఉంటాయని ఎఫ్‌ఎఓ తెలిపింది.  

ఏ రకం బంగాళదుంపల్లో ఏయే పోషక విలువలు ఎంతెంత?
(ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) సమాచారం ప్రకారం.. 100 గ్రామాలు పచ్చి బంగాళదుంపలో గత పోషక విలువలు)

బంగాళదుంపలు..  అంకెలు.. వాస్తవాలు..
⇒  ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. 
⇒  ఇవి 5 వేల రకాలు ఉన్నాయి. బంగాళదుంపల జీవవైవిధ్యం ప్రపంచ ఆహార భద్రతకు ఒక పట్టుకొమ్మగా నిలిచింది. చిన్న, సన్నకారు రైతులకు ఇదొక ముఖ్యమైన ఆహార పంటగా మారిపోయింది.   
⇒ బంగాళదుంపలకు పుట్టిల్లు పెరులోని ఆండీస్‌ పర్వత ప్రాంతాలు. పెరులోని కస్కో దగ్గర పోటాటో పార్క్‌ ఉంది. దీని విస్తర్ణం 12 వేల హెక్టార్లు. వైవిధ్యంతో కూడిన పురాతన బంగాళదుంప వంగడాల జన్యువనరులను, సంప్రదాయ విజ్ఞానాన్ని ఆదివాసులు అనాదిగా పరిరక్షిస్తున్నది ఈ ప్రాంతంలోనే. 

⇒ ఆండీస్‌ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. 
⇒  పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్‌ దేశాలకు, అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాపించింది బంగాళదుంప పంట. కేవలం 5 శతాబ్దాల్లో వేగంగా విస్తరించింది. 
⇒ ఐర్లాండులో 1840వ దశకంలో బంగాళదుంప పంట చీడపీడలతో తుడిచిపెట్టుకుపోవటంతో క్షామం సంబవించింది. అక్కడ ఈ పంట వంగడాల్లో వైవిధ్యతను నిలుపుకోకపోవటమే ఇందుకు కారణం.   
⇒ బంగాళదుంపలు మనకు గోధుమ రంగులో ఉండేవే తెలుసు. కానీ, ఎన్నెన్నో రంగుల్లో ఉంటాయి. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో, విభిన్న సాగు పద్ధతుల్లో, భూతాపాన్ని తట్టుకుంటూ మనగలుగుతున్న అతి ముఖ్యమైన ఆహార పంట ఇది. మారుతున్న పరిస్థితులకు తగినవిధంగా మార్పుచెందే క్రమంలో ప్రతి బంగాళదుంప వంగడానికి ప్రత్యేకమైన గుణాలు ప్రకృతిసిద్ధంగా చేకూరాయి. 

⇒ 2000–2020 మధ్యకాలంలో బంగాళదుంపల సాగు విస్తీర్ణం 17% తగ్గినప్పటికీ ఉత్పత్తి 11 శాతం పెరిగింది. తక్కువ చోటులో ఎక్కువ దిగుబడి సాధించటంలో మెరుగైన వంగడాలు, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు దోహదం చేస్తున్నాయి.
⇒  ప్రపంచవ్యాప్తంగా బంగాళదుంప వంగడాల సంరక్షణ, విత్తటం, కోత, విక్రయం తదితర ప్రక్రియల్లో గ్రామీణ మహిళలు కీలకపాత్రపోషిస్తున్నారు. ఈ పొలాల్లో మహిళల శ్రమే అధికం.

బంగాళదుంపలతో ఆహారేతర ప్రయోజనాలు
⇒ బంగాళదుంపలను ఆహారంగానే కాకుండా.. ఔషధతయారీ, వస్త్రోత్పత్తి, ప్లైవుడ్, పేపర్‌ పరిశ్రమల్లోనూ రకరకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.
⇒ బంగాళదుంప పై పొరను ఫ్యూయల్‌–గ్రేడ్‌ ఇథనాల్‌ ఉత్పత్తిలో వాడుతున్నారు.
⇒ 100% ప్రకృతిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ల తయారీలోనూ బంగాళదుంపలు ఉపయోగపడతాయి.

⇒ గోజాతి పశువులు, పందులు వంటి పశువులకు దాణాగా బంగాళ దుంపలను పెడుతున్నారు.
8,000 ఏళ్ల క్రితం బంగాళదుంపలను తొలిసారి పెరులో సాగు చేయటం మొదలుపెట్టారు.
5.000 రకాలకు పైగా బంగాళదుంపల వంగడాలు ఉన్నాయి
159 దేశాల్లో బంగాళదుంపలను పండిస్తున్నారు

అతి ముఖ్యమైన పంట
బంగాళదుంపల సాగు: ∙వేర్వేరు వ్యవసాయ వాతావరణ ప్రాంతాల్లో, నేలల్లో సాగు అవుతుంది. 
సముద్రతలం నుంచి 4,700 మీటర్ల ఎత్తు వరకు భూముల్లో సాగవుతుంది.

చిన్న, సన్నకారు రైతులకు ఆధారపడదగిన ఆదాయాన్ని అందిస్తుంది బంగాళదుంప పంట.
సుసంపన్నమైన జన్యువైవిధ్యం వల్ల బంగాళదుంప వంగడాలు చీడపీడలను దీటుగా తట్టుకోగలుగుతుంది.
బంగాళదుంపలను కోట్లాది మంది ప్రజలు దైనందిన ప్రధాన ఆహారంగా తింటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2022లో 37.5 కోట్ల టన్నుల బంగాళదుంపలను రైతులు పండించారు.
చైనా  95.5 (టన్నులు)
భారత్‌  56.2
ఉక్రెయిన్‌  20.9
రష్యా సమాఖ్య  18.9
అమెరికా  17.8
జర్మనీ  10.7
బంగ్లాదేశ్‌  10.1
ఫ్రాన్స్‌  8.0
పాకిస్తాన్‌  7.9
నెదర్లాండ్స్‌   6.9 

ఆలూపై అపోహలు వద్దు
ఎవరైనా తీసుకునే ఆహారం వారి వయసు, రోజువారీగా వారి శారీరక శ్రమపై ఆధారపడి ఉండాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి. బంగాళదుంప వాతం అంటూ ఉంటారు. కానీ, నిజానికి ఇది అపోహే. బంగాళదుంపలో ఎక్కువగా పిండిపదార్థాలు ఉన్నాయి. దీనితో పాటు కలిపి తీసుకునే ఇతర ఆహార పదార్థాలు మాంసకృత్తులు కలిగినవై ఉండాలి. ఉత్తరాదిలో ఏ కూర చూసినా ఆలు లేకుండా ఉండదు. అయితే, ఆలుతో పాటు కాబోలి శనగలు కూడా కలిపి వండుతారు. మన ఆహారంలో సాధారణంగా మాంసకృత్తులు లోపిస్తున్న విషయం తెలిసిందే కదా.

పెద్దవాళ్లు రోజూ ఆలు తిని కూర్చుంటే పిండిపదార్థాలు ఎక్కువై నొప్పుల సమస్య వస్తుంది. పెద్దవాళ్లకు జీర్ణశక్తి తగ్గటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. అదే పిల్లలైతే శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి వారికి ఆ సమస్య రాదు. ఎవరైనా, తగుమాత్రంగా, సమతులాహారంలో భాగంగా తీసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు. లేదంటే ఊబకాయానికి దారితీస్తుంది. నూనెలో డీప్‌ ఫ్రై చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్, చిప్స్‌ తినటం చిన్నా పెద్దా ఎవరికీ ఆరోగ్యకరం కాదు. –  ఆచార్య విజయ ఖాదర్, విశ్రాంత డీన్, ఫ్యాకల్టీ ఆఫ్‌ హోం సైన్స్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement