
చరిత్రలో మహిళ
‘ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయిలు ఎవరు?’ అని ప్రశ్నించాడు కవి. లూయిస్, క్లార్క్ సాహస, అన్వేష యాత్రలు ప్రపంచ ప్రసిద్ధం. అయితే లూయిస్, క్లార్క్ ద్వయానికి దారి చూపింది ‘సకాగవేయ’ అనే సాహసికురాలు అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. నేటివ్ అమెరికన్ అయిన సకాగవేయ లూయిస్, క్లార్క్‌లకు అనువాదకురాలిగా, గైడ్‌గా పనిచేసింది.
లూయిస్, క్లార్క్‌లు 1804 నుంచి 1806 వరకు అమెరికాలో ఎన్నో అన్వేష యాత్రలు చేశారు. ఈ ఇద్దరు ఆమెరికా ఆర్మీలో కెప్టెన్, కమాండింగ్ ఆఫీసర్ హోదాలో పనిచేశారు. 1804 నవంబర్‌లో లూయిస్, క్లార్క్‌లు తొలిసారిగా నార్త్ డకోటలో షోషోన్ తెగకు చెందిన సకాగవేయను కలుసుకున్నారు. సకాగవేయ వయసు పదిహేడు సంవత్సరాలు. అప్పటికి ఆమె గర్భవతి.
1805లో జీన్స్ బాప్టీస్ట్ అనే కొడుకుకి జన్మనిచ్చింది. కొన్ని నెలలకే పసిబిడ్డను భుజాన వేసుకొని లూయిస్, క్లార్క్‌ల అన్వేష యాత్రలో భాగం అయింది. ఈ అన్వేష యాత్రలో ఎంతోమంది నేటివ్ అమెరికన్స్‌తో మాట్లాడాల్సి వస్తుంది. ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్న సకాగవేయ వారికి అనువాదకురాలిగా పనిచేయడమే కాదు ఎన్నో మొక్కల పేర్లు, వాటి వివరాలు, ఔషద గుణాల గురించి చెప్పేది. ప్రమాదాలను పసిగట్టేది.
కొండల్లో, కోనల్లో, ఎల్లోరివర్ ప్రాంతాలలో లూయిస్, క్లార్క్‌లకు దారి చూపింది. అందుకే క్లార్క్ ఆమెను ‘పైలట్’ అని పిలిచేవాడు. పసిఫిక్ మహా సముద్రాన్ని చేరుకోవడంతో లూయిస్, క్లార్క్‌ల అన్వేష యాత్ర 1806లో విజయవంతంగా పూర్తయింది. ఈ యాత్ర విజయానికి సకాగవేయ సంపూర్ణ సహాకారాన్ని అందజేసింది. అయితే సకాగవేయ పడిన కష్టానికి భర్తకు 232 ఎకరాల భూమి దక్కింది తప్ప ఆమెకు చిల్లి గవ్వ కూడా దక్కలేదు. ఎలాంటి సన్మానమూ జరగలేదు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో సకాగవేయ అసాధారణ మహిళ. సాహసం మూర్తీభవించిన సకాగవేయ ముఖచిత్రంతో నాణేలు, స్టాంప్‌లు ముద్రించారు. ఎన్నోచోట్ల విగ్రహాలు నెలకొల్పారు.