Mystery: హంతకుడు ఏమయ్యాడు? | A romantic crime story | Sakshi
Sakshi News home page

Mystery: హంతకుడు ఏమయ్యాడు?

Nov 17 2024 1:27 AM | Updated on Nov 17 2024 1:27 AM

A romantic crime story

ఇది 44 ఏళ్ల క్రితం, మార్చిలో ప్రారంభమై, అదే ఏడాది సెప్టెంబర్‌లో ముగిసిన రొమాంటిక్‌ క్రైమ్‌ కథ. 1980 సెప్టెంబర్‌ 18, సాయంత్రం 5 కావస్తోంది. అమెరికా మిసూరీలోని కాన్సాస్‌ సిటీలో ఓ బిల్డింగ్‌ ముందు ఓ కారు వేగంగా వచ్చి ఆగింది. కారులోంచి 34 ఏళ్ల తాన్యా కోప్రిక్‌ అనే డాక్టర్‌ కాలు బయటపెట్టింది. ఆమె పూర్తిగా దిగకముందే ఏకధాటిగా తుపాకి తూటాలు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. ఆ అలికిడికి బిల్డింగ్‌లోని కొందరు బయటికి పరుగు తీశారు. కారు దగ్గరకు వచ్చి చూస్తే, తాన్యా కారు ముందు సీటులో కుప్పకూలిపోయి ఉంది. కిల్లర్‌ అతి సమీపం నుంచి కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు డాక్టర్స్‌ తేల్చారు. 

తాన్యా చాలా అందగత్తె. ఆరేళ్ల క్రితమే యుగోస్లేవియా నుంచి అమెరికా వచ్చి, సొంతంగా ఆసుపత్రి పెట్టుకుని డాక్టర్‌గా సెటిల్‌ అయ్యింది. మరోవైపు పలు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా, కాలేజీల్లో ప్రొఫెసర్‌గా చాలా విధులు నిర్వహించేది. ఆమె హత్య జరిగిన భవంతిలోనే ఆమెకు సొంతగా అపార్ట్‌మెంట్‌ ఉంది. కారు, ఇల్లు, కావాల్సినంత సంపాదన, చక్కని జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. తాన్యా మరణవార్త యుగోస్లేవియాలోని ఆమె పేరెంట్స్‌కు తెలియడంతో వాళ్లు కూడా కాన్సాస్‌ సిటీకి హుటాహుటిన చేరుకున్నారు.
అయితే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు చాలా కీలక సమాచారం అందింది. అసలు తాన్యాను హత్య చేసింది ఎవరో కాదు మాజీ ప్రియుడు రిచర్డ్‌ గెరార్డ్‌ బోక్‌లేజ్‌ అని తెలుసుకున్నారు. తాన్యాను రిచర్డ్‌ చంపడం, పారిపోవడం స్వయంగా చూశామని ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.

యూనివర్సిటీ ఆఫ్‌ మిసూరీలో రిచర్డ్‌ ఫార్మసీ విద్యార్థిగా తాన్యాకు పరిచయం అయ్యాడు. అతడి కంటే తాన్యా పదకొండేళ్లు పెద్దది. వారి పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారడానికి నెలరోజులు కూడా పట్టలేదు. వారి బంధం ఎంత వేగంగా అల్లుకుందంటే 1980 మార్చిలో రిచర్డ్, హాస్టల్‌ ఖాళీ చేసి తాన్యా అపార్ట్‌మెంట్‌లోకి మారిపోయాడు. కాలక్రమేణా అతడికి చదువు మీద శ్రద్ధ తగ్గింది. తాన్యా చుట్టూనే ప్రదక్షిణలు చేసేవాడు. అతడి తీరును అతడి స్నేహితులు తీవ్రంగా విమర్శించినా పట్టించుకునేవాడు కాదు. కేవలం తాన్యా డబ్బు, ఆస్తి కోసమే ఆమెతో సాంగత్యం మొదలుపెట్టాడని చాలామంది గుసగుసలాడుకునేవారు. కానీ ఆ జంట ఎవరి మాటా వినలేదు. ఆరు నెలలు గడవకముందే నిశ్చితార్థం చేసుకున్నారు. 

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాన్యా ధ్యాసలో రిచర్డ్‌ తన కెరీర్‌ని పక్కన పెట్టేశాడు. చదువు తగ్గిపోయింది. మార్కులు తగ్గిపోయాయి. అతడి తీరు గమనిస్తూ వస్తున్న ప్రొఫెసర్స్‌ అతడిపై రెడ్‌ మార్క్‌ వేశారు. జూలై వచ్చేనాటికి రిచర్డ్‌ డాక్టర్‌ కావడానికి అనర్హుడని, ఇక యూనివర్సిటీకి రావాల్సిన పనిలేదని నోటీసులిచ్చారు. దాంతో రిచర్డ్‌ రగిలిపోయాడు. ‘నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే’ అంటూ తాన్యాను వేధించడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్స్‌తో, యూనివర్సిటీ నిర్వాహకులతో గొడవలకు దిగడం ప్రారంభించాడు. అడ్మిష¯Œ ్స డిపార్ట్‌మెంట్‌లో తన తరపున మాట్లాడి, తిరిగి తనకు అర్హత పత్రాన్ని ఇప్పించాలని ప్రతిరోజూ తాన్యాతో గొడవకు దిగేవాడు. అతనితో పడలేక సెప్టెంబర్‌ 2న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది తాన్యా. అపార్ట్‌మెంట్‌లోంచి అతణ్ణి బయటికి పంపించేసింది. దాంతో అతడు మరింత ఉన్మాదిగా మారిపోయాడు.

రెండు వారాల తర్వాత తన కేసును పునఃపరిశీలించాలని వేడుకుంటూ యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయంలోని అధికారులకు లేఖ రాశాడు రిచర్డ్‌. చివరకు సెప్టెంబర్‌ 18న మధ్యాహ్నం మూడుగంటలకు పరిశీలనలో భాగంగా రిచర్డ్‌ను విచారణకు ఆహ్వానించారు ప్రొఫెసర్స్‌. అయితే అక్కడ కూడా రిచర్డ్‌ తీరు నచ్చక అతడు తిరిగి జాయిన్‌ కావడానికి వీల్లేదంటూ వారంతా తీర్మానించారు. దాంతో అదే రోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న తాన్యాను రిచర్డ్‌ కాల్చి చంపేశాడు. అయితే ఆ రోజు విచారణకు రిచర్డ్‌ ఒక కవర్‌ తెచ్చాడు. తాన్యా హత్య తర్వాత ఆ కవర్‌ను చూసిన చాలామంది ప్రొఫెసర్స్‌.. అందులోనే తుపాకి ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు కొన్ని వారాల ముందే ఆ పిస్టల్‌ని కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

హత్య జరిగిన రోజు కొంత దూరం వరకూ రిచర్డ్‌ పరుగుతీస్తూ వెళ్లాడని డాగ్స్‌ స్క్వాడ్‌ గుర్తించింది. బహుశా అతడికి ఎవరైనా లిఫ్ట్‌ ఇచ్చి ఉంటారని, అందుకే తప్పించుకోగలిగాడని డిటెక్టివ్స్‌ ఊహించారు. హత్య జరిగిన వారంలోనే రిచర్డ్‌ నుంచి తాన్యా తల్లిదండ్రులకు ఓ లేఖ వచ్చింది. దానిలో ‘తాన్యాకు నేను మరణ శిక్ష విధించాను. ఆమెకు తగిన శిక్షే వేశాను’ అని రాశాడు. ఆ పోస్ట్‌కార్డు మీద 2 రోజుల ముందు తేదీ ఉంది. ప్రస్తుతం రిచర్డ్‌కి 67 ఏళ్లు దాటుంటాయి. అమెరికాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో అతని పేరు చేరింది. ఏళ్లు గడిచే కొద్దీ రిచర్డ్‌ ఎలా ఉండి ఉంటాడోనని పోలీసులు ఎన్నో ఊహాచిత్రాలు గీయిస్తున్నారు. అయినా అతను మాత్రం ఇప్పటికీ దొరకలేదు. దాంతో ఈ కేసు అపరిష్కృతంగానే మిగిలిపోయింది. రిచర్డ్‌ ఏమయ్యాడనేది నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.
∙సంహిత నిమ్మన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement