
డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎమ్‌జెఎఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్సు ఒక భాగం. మొదట అన్హాద్ ఫిల్మ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయ్యింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
బాల్య వివాహాల సంకెళ్లలో చిక్కుకుని, కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకొని, మహిళా కార్మికుల దయనీయ జీవితాలు, గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు, చాలావరకు విజయం సాధించారు కూడా.
వీరు తమ ఆలోచనలను సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి, సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధించిన ఈ మహిళలు ట్రైనర్లుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అత్యంత సామాన్యంగా ఉండే రెండంతస్తుల భవనం అది. అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకొంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తారు. వారంతా బాల్యవివాహాల సంకెళ్ల బందీలే. నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కల్పించడానికి మహిళా జన అధికార్ సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగ్‌లకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి, వారు నూతన భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్‌ని స్క్రిప్ట్ చేస్తున్నారు.
డిజిటల్ అక్షరాస్యత
మహిళా జన అధికార్ సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం, ఎడిటింగ్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే. పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం, కులవివక్ష, బాల్య వివాహాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా ΄ోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళా జన అధికార్ సమితి పుట్టుకు వచ్చింది. నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహ హింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి, వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకు రావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.
గ్రామీణ మహిళ చేతిలో కంప్యూటర్ స్క్రీన్...
మహిళా జన అధికార్ సమితి ఆఫీసులోకి వెళ్లి చూస్తే – ఎడిట్ రూమ్‌లో 19 ఏళ్ల మంజు రావత్ దీక్షగా తన డెస్క్‌టాప్‌పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవోలో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం. అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ, కెమెరా వర్క్‌తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. ‘కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ నన్ను చూసి నవ్వారు. నా కుటుంబంతో పాటు ఇరుగు పొరుగువాళ్లు ‘ఆమె ఎలా తిరుగుతుందో చూడండి’ అనేవారు. కానీ, వారి మాటలను పట్టించుకోలేదు’ అని చెబుతుంది. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన ఛాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యలపైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది. రావత్ చెల్లెలు సంజు వయసు 19 ఏళ్లు. ఆమె, అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది.
సవాళ్లను ఎదిరిస్తూ..
24 ఏళ్ల భగవతీ దేవికి 15 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్‌కు ప్రతిరోజూ 30 కి.మీ దూరం ప్రయాణించే భగవతీ దేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేక΄ోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహాయించిన సంచార జాతి ఘుమంతు తెగపై సినిమాలు నిర్మించింది.
ఈ కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి, కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. ఈ యేడాది మొదట్లో 23 ఏళ్ల సంత్రా చౌరాసియా, భగవతీ దేవి, మరో ఇద్దరు కిషన్ గఢ్‌లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక΄ోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకు వస్తాం. కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరూ ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అని 22 ఏళ్ల మేరీ చెబుతోంది.
‘‘గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటినుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమష్టి విజయం’ అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా బాను గర్వంగా చెబుతుంది.
స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపైన సినిమాలు తీస్తూ, వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు.