
విరేచనాలు.. లవణ నష్టంతో నీరసం
నీటి, ఆహార కలుషితాలే కారణం
వానాకాలంలో సులభంగా వ్యాప్తి
చిన్నారులపై తీవ్ర ప్రభావం
నల్లకుంట: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా చుట్టుముడుతాయి. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీని ప్రభావం చిన్నారులపై తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చే వ్యాధుల్లో డయేరియా(అతిసార- diarrhea) ముఖ్యమైనది. దీనికి నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ముఖ్య కారణాలు కాగా, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుంది.
పెద్దలైనా, పిల్లలైనా ఓ సారి డయేరియా బారిన పడితే శరీరంలో ఉన్న లవణాలన్నీ బయటకు వెళ్లిపోయి శరీరం శుష్కించి పోతుంది. చిన్నారుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతిని అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితి వస్తుంది. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన వద్దని అధికారులు పదేపదే చెబుతున్నా మురికి వాడల్లోని ప్రజానీకంలో తగిన చైతన్యం రాకపోవడంతో ఓ రోగి నుంచి మరొకరికి ఈగల ద్వారా రాటావైరస్ క్రిమి వ్యాపిస్తుంది. వాటి ద్వారా ఆహార పదార్థాలు కలుషితమై డయేరియాకు దారి తీస్తాయి. ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులు డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఫీవర్‌కు పెరుగుతున్న డయేరియా కేసులు.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15వ తేదీ వరకు 1,034 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి : Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
నీటి కాలుష్యం ద్వారానే అధికం..
వర్షాలు కురుస్తుండంతో చిన్నపిల్లలు, వృద్దులు వ్యాధుల బారిపడుతున్నారు. డయేరియా వ్యాధి ఎక్కువగా నీటి కలుíÙతం ద్వారానే వస్తుంది. ఈ వర్షాకాలంలో మంచినీటి వనరులు, రిజర్వాయర్లలో కలుషిత నీరు చేరి, కుళాయిల ద్వారా అవే రావడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. మంచినీటి పైపులు లీక్ అయినప్పుడు అందులో మురికినీరు కలిసి ఆ నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. 80 శాతం డయేరియాకు కలుషిత నీరే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మిగిలిన 20 శాతం కలుషిత ఆహారం వల్ల వస్తుంది. నగరంలో చాలా వరకు ఈ వర్షాకాలంలోనే డయేరియాకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
వ్యాధి లక్షణాలు...
తరుచూ వాంతులు,విరేచనాలు కావడం.
నాలుక పిడచ కట్టుకుపోవడం,
కళ్లు లోపలికి పోవడం.
చర్మం సాగే గుణం కోల్పోవడం.
రక్తపోటు పడిపోయి అపస్మారక స్థితిలోకి పోవడం.
నిర్లక్ష్యం వద్దు...
వర్షాకాలంలో డయేరియా వ్యాధిపట్ల ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆహార నియమాలు, చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఏడు సంవత్సరాలు పై బడిన వారికి ఫీవర్‌లో చికిత్సలు అందిస్తున్నాం. ఏడు సంవత్సరాల లోపు చిన్నారులను నీలోఫర్‌కు పంపిస్తాం. – డాక్టర్ జయలక్ష్మి, ఫీవర్ ఆస్పత్రి సీఎస్ ఆర్‌ఎంవో