నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్‌ | Sakshi
Sakshi News home page

అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తారు, అప్పట్నుంచే ఆ సాంప్రదాయం..

Published Wed, Dec 27 2023 4:57 PM

Pudami Sakshiga: Intresting Facts About Indian Roller Bird

పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !!

దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది.

భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట.

అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు.

అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది.

ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు.

ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది.

కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. 

రచయిత : ప్రదీప్‌ మాడురి
 ఫోటో : అల్బిన్‌ జాకబ్‌

తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

Advertisement
 
Advertisement
 
Advertisement