డాల్ఫిన్‌కు కూడా 108 ఉందోచ్‌! | Protecting rivers preserving life Indias Dolphin Rescue | Sakshi
Sakshi News home page

డాల్ఫిన్‌కు కూడా 108 ఉందోచ్‌!

Jun 6 2026 4:43 PM | Updated on Jun 6 2026 5:59 PM

Protecting rivers preserving life Indias Dolphin Rescue

పిల్లలూ... ఎవరికైనా ఆరోగ్యం హటాత్తుగా పాడైతే, ప్రమాదం జరిగితే అంబులెన్స్‌ వస్తుంది కదా. ‘కుయ్‌కుయ్‌’ అని సౌండ్‌ చేసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. మరి గంగానదిలో ఉండే డాల్ఫిన్‌కి ప్రమాదం జరిగితే ఎవరు కాపాడతారు? అందుకే మన దేశం ప్రపంచంలోనే మొదటి ‘డాల్ఫిన్‌ అంబులెన్స్‌’ని తయారు చేసింది. దీని పని ఏంటో తెలుసా? నదిలో దారి తప్పిన, గాయపడిన డాల్ఫిన్స్‌ని కాపాడి, మందు వేసి, మళ్లీ నదిలో వదిలిపెట్టడం. ‘నమామి గంగే’ అనే పథకం కింద ఈ అంబులెన్స్‌ని మొదలుపెట్టారు. అంటే గంగమ్మను, గంగలో ఉండే జీవులను కాపాడటమే దీని లక్ష్యం.

ఈ అంబులెన్స్‌ స్పెషల్‌ ఏంటి?
ఇది కదిలే హాస్పిటల్‌. మన 108 లాగే ఇది కూడా ఒక మొబైల్‌ ఐ.సి.యు,  అంటే లోపల డాక్టర్ల సామాన్లు, మందులు, ఆక్సిజన్‌ అన్నీ ఉంటాయి. డాల్ఫిన్‌కి ఎక్కడ దెబ్బ తగిలినా వెంటనే ట్రీట్మెంట్‌ ఇవ్వొచ్చు. ఇది ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఇప్పటిదాకా ఎనిమిది డాల్ఫిన్‌లను కాపాడింది. సూపర్‌ కదా!  ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఒక పెద్ద డాల్ఫిన్‌ ఇటీవల కాలువలో ఇరుక్కుపోయింది. నీళ్లు తక్కువై నీరసంగా అయి΄ోయింది. వెంటనే మన ‘డాల్ఫిన్‌ 108’ వచ్చేసింది. 13 గంటలు కష్టపడి, బయటికి తీసి, చెకప్‌ చేసి, రాప్తి నదిలో సేఫ్‌గా వదిలిపెట్టారు. 

గంగా డాల్ఫిన్‌ అంటే?
ఇది మంచి నీటి డాల్ఫిన్‌. సముద్రంలో ఉండదు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని నదుల్లో కనిపిస్తుంది. అత్యధికంగా గంగలోనే. ప్రపంచంలో మంచినీటి డాల్ఫిన్లు కేవలం 5–6 జాతులు మాత్రమే ఉన్నాయి. అందులో గంగా డాల్ఫిన్‌ ఒకటి. అదీ అంతరించిపోయే దశలో ఉంది. అందుకే దీనికి ‘జాతీయ జలచర జంతువు’ హోదా ఇచ్చారు. మన నెమలి, పులి లాంటిదన్నమాట. 

దీనికి కళ్ళు సరిగా కనిపించవు. ‘క్లిక్‌ క్లిక్‌’ అని సౌండ్‌ చేసి దారి కనుక్కుంటుంది. ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది. అందుకే దీన్ని ‘నవ్వే దేవత’ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇవి కేవలం 6,324 మాత్రమే మిగిలాయి. అందుకే ప్రతి డాల్ఫిన్‌ చాలా విలువైనది. మనం నదిని శుభ్రంగా ఉంచితే, డాల్ఫిన్‌ హ్యాపీగా ఈదుకుంటూ ఉంటుంది. సరేనా?.

(చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement