కిరాయి సైన్యాలు! | Private military and security companies are often called invisible armies | Sakshi
Sakshi News home page

కిరాయి సైన్యాలు!

Apr 26 2026 1:38 AM | Updated on Apr 26 2026 1:38 AM

Private military and security companies are often called invisible armies

అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. వాళ్లు ఏ దేశానికీ, ఏ జెండాకూ కట్టుబడి ఉండరు. కేవలం వృత్తిపరమైన సైనికులు. ఎవరు డబ్బు ఇస్తే వారి తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. రష్యాకు చెందిన ‘వాగ్నర్‌ గ్రూప్‌’ మొదలు, కొలంబియాకు చెందిన భయంకరమైన ‘డెజర్ట్‌ ఉల్వ్స్‌’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్‌ ఎడారులు.. ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్లు కిరాయికి వెళ్లిపోతారు.

ఔట్‌సోర్సింగ్‌ ‘యుద్ధం’!
సాధారణ సైన్యానికి కొన్ని అంతర్జాతీయ యుద్ధ నియమాలు ఉంటాయి. కిరాయి సైన్యాలకు అవేమీ పట్టవు. అందుకే ప్రభుత్వాలు తాము నేరుగా చేయలేని పనులను వీరితో చేయిస్తుంటాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువులను దెబ్బతీయడం, యుద్ధం వెలుపల తిరుగుబాట్లను అణచివేయడం, విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం వీరి పని. వీరు ప్రభుత్వాల నీడలో పని చేస్తారు. ప్రస్తుతం ఇరాన్‌ తన శత్రువులను దెబ్బతీయడానికి ఈ కిరాయి ఏజెంట్లను వాడుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్‌ చేస్తున్న ఈ ‘ఔట్‌సోర్సింగ్‌’ యుద్ధంపై, బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘ఎం15’ (సెక్యూరిటీ సర్వీస్‌కు సంబంధించినది) చీఫ్‌ కెన్‌ మెకల్లమ్‌ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం గత ఏడాదిలోనే బ్రిటన్‌ లో ఇరాన్‌ మద్దతుతో జరిగిన 20కి పైగా ప్రాణాంతక కుట్రలను తమ ఏజెంట్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు!

రెండు రకాల ‘కిరాయి’లు 
కిరాయి సైన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు. ఇవి ప్రభుత్వాల అవసరాలకు, ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. రెండు: అక్రమ ముఠాలు. డబ్బు కోసం ఆ ముఠాలు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాయి. 1960లలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన దాడుల్లో తొలిసారి వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ‘డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’లో జరిగిన యుద్ధం– కిరాయి సైనికుల ఉనికికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాంగోలోని ‘కటంగా’ అనే ప్రాంతంలో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవి. బెల్జియంకు చెందిన స్థానిక మైనింగ్‌ కంపెనీలు ఆ వనరులను కొల్లగొట్టటానికి బ్రిటన్, అమెరికాల మద్దతుతో కిరాయి సైనికులను అక్కడ దింపాయి. దేశాన్ని అస్థిరపరచి, ఆ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కిరాయి మూకలు కటంగాలో బీభత్సాన్ని సృష్టించాయి.

పెంచిన కుక్కే కరిచే ప్రమాదం
ప్రభుత్వాలు తమ పనుల కోసం కిరాయి ముఠాలకు ఆయుధాలు, డబ్బు ఇస్తాయి. ప్రభుత్వానికి, కిరాయి ముఠాకు మధ్య సయోధ్య ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే కాస్త తేడా వస్తుందో అప్పుడు ఆ ముఠా, ప్రభుత్వం మీదకే తిరగబడుతుంది! దీనికి ఒక ఉదాహరణ అఫ్ఘానిస్తాన్‌ లోని ముజాహిదీన్లు. రష్యాతో పోరాడటానికి అమెరికా ముజాహిదీన్‌లకు ‘స్టింగర్‌’ క్షిపణులను అందించింది. ఆ తర్వాత అవే ఆయుధాలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. ఒకసారి కనుక కిరాయి సైన్యానికి భారీగా ఆయుధాలు, సాంకేతిక నైపుణ్యం ఇస్తే.. వారు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. సొంతంగా ఒక శక్తిగా ఎదిగి ఆ దేశానికే ముప్పుగా మారుతారు.

కిరాయి సైన్యాల అవసరం ఏంటి?  
ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లను ఎంచుకోటానికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానమైన  కారణం మాత్రం సొంత సైనికుల రోటేషన్‌ సమస్య. ఏ దేశమైనా ఒక బెటాలియన్‌ సైన్యాన్ని యుద్ధంలో ఉంచాలంటే, మూడు బెటాలియన్లు అవసరం! మూడు ఎందుకంటే.. ఒకటి యుద్ధంలో ఉంటే, రెండోది సెలవులో ఉండాలి, మూడోది శిక్షణలో ఉండాలి. ప్రైవేటు కంపెనీలకైతే, కేవలం పని జరిగినన్ని రోజులు మాత్రమే డబ్బు ఇస్తారు. వారికి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు, యుద్ధం అయిపోయాక వారి బాధ్యత ఉండదు. దీనినే మిలిటరీ భాషలో ‘ఫోర్స్‌ మల్టిప్లయర్‌’ అంటారు. అంటే సంఖ్యను పెంచకుండా, సామర్థ్యాన్ని పెంచుకోవటం. 

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆఫ్రికా డబ్బు!
2022లో మార్చి 27 నుంచి 31 వరకు  మాలి దేశంలోని మౌరా పట్టణంలో ఊచకోత జరిగింది. దాదాపు 500 మంది అమాయకులను స్థానిక సైనికులు, ‘తెల్లటి చర్మం కలిగిన అపరిచిత భాష మాట్లాడే వ్యక్తులు’ (రష్యాకు చెందిన వాగ్నర్‌ సైనికులు) కలిసి చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. రష్యా మాత్రం ఆ ఊచకోతను ‘ఉగ్రవాదంపై విజయం’గా అభివర్ణించింది. రష్యా పెంచి పోషిస్తున్న వాగ్నర్‌ గ్రూప్‌ ఆఫ్రికాలోని అవినీతి నియంతలకు లేదా మిలిటరీ పాలకులకు కూడా భద్రత కల్పిస్తోంది. దాని వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనమే ఉంది. డబ్బుకు బదులుగా ఆ దేశాల్లోని బంగారం, యురేనియం వంటి విలువైన ఖనిజాల తవ్వకం హక్కులను రష్యా పొందుతుంది. గత రెండేళ్లలోనే ఆఫ్రికా నుండి రష్యా çరూ. 20,000 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రాబట్టుకుంది. ఉక్రెయిన్‌ తో జరుగుతున్న యుద్ధానికి ఈ డబ్బునే రష్యా వాడుతోంది.

వాట్సాప్‌లో రిక్రూట్‌మెంట్‌  
కిరాయి సైనికుల నియామకం ఒక పద్ధతిలో సాగుతుంది! మాజీ సైనికులను వాట్సాప్‌ ద్వారా సంప్రదించి, వారికి దుబాయ్‌లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక కిరాయి సైనికుడికి నెలకు సుమారుగా రూ. 3.3 లక్షల జీతం ఉంటుంది! అది వారు సైన్యంలో పొందే పెన్షన్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ! కొన్ని దేశాలు నేరుగా మద్దతు ఇచ్చే ‘మిలీషియా’ (తీవ్రవాద సైనిక దళాల) గ్రూపులు కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, మిలీషియాను పెంచి పోషిస్తోంది. తన సొంత సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించకుండా, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. ఇరాన్‌ కనుసన్నలలో పనిచేసే హిజ్బుల్లా (లెబనాన్‌), హమాస్‌ (గాజా), హౌతీలు (యెమెన్‌) ఇలాంటి మిలీషియాలే. 

యుద్ధం ముగిశాక...?
యుద్ధం ముగిశాక, శాంతిని కాపాడటానికి ప్రైవేట్‌ సైన్యాలు అవసరమవుతాయి. అవి కిరాయి సైన్యానికి భిన్నమైనవీ, చట్టపరిధిలో పని చేసేవీ. ఇలా – డబ్బు కోసం పోరాడే సైన్యం ఒకవైపు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, చట్టబద్ధమైన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు యుద్ధం తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతుంటాయి. 

డెసర్ట్‌ వుల్వ్స్‌  
రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూపులాగే, కొలంబియాకు చెందిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొంటున్నారు. వారిని ‘డెసర్ట్‌ వుల్వ్స్‌’ అని పిలుస్తారు. ప్రస్తుతం సూడాన్‌ లో జరుగుతున్న భీకర యుద్ధంలో, ‘రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌’ (ఆర్‌.ఎస్‌.ఎఫ్‌.) అనే గ్రూపు తరపున ఈ కొలంబియన్‌ కిరాయి సైనికులు పోరాడుతున్నారు. ఆర్‌.ఎస్‌.ఎఫ్‌. జాతి నిర్మూలన, సామూహిక అత్యాచారాలు, పసిపిల్లలను చంపడం వంటి ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది! అధికారం కోసం ఆర్‌.ఎస్‌.ఎఫ్‌., సూడాన్‌  అధికారిక సైన్యం మధ్య ఈ పోరు జరుగుతోంది. గత అక్టోబర్‌లో ఆర్‌.ఎస్‌.ఎఫ్‌. ‘ఎల్‌ ఫాషర్‌’ అనే నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దాదాపు 60,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే, కొలంబియాకు చెందిన టీనేజర్లు కూడా కిరాయి సైనికులుగా పోరాడాల్సి రావటం.  

వాగ్నర్‌ గ్రూప్‌  
అమెరికా లేదా బ్రిటన్‌ దేశాల ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు కేవలం దేశ రక్షణ విధులను మాత్రమే చేపడతాయి. కానీ రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూప్‌ కథే వేరు! ఇది రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్‌) నిధులు ఇచ్చి నడిపే ఒక రహస్య సైన్యం. 2023లో వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌  పైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించటం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అంతా ఊహించిన విధంగానే వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ కథ విషాదాంతమైంది. పుతిన్‌ ను బాహాటంగా విమర్శించి, తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్, ఒక ప్రైవేట్‌ జెట్‌ ‘ప్రమాదంలో’ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిగోజిన్‌ మరణం తర్వాత, వాగ్నర్‌ గ్రూప్‌ ఇప్పుడు పేరు మార్చుకుని ‘ఆఫ్రికా కోర్స్‌’ గా చలామణి అవుతోంది. 

∙ సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement