కంటిగాయాలు.. ఓ లుక్‌ వేయండి

Precautions to Be Taken by Farmers For Eye Injuries - Sakshi

వ్యవసాయ పనుల్లో ఉండేవారికీ, పల్లెల్లో కూలీ పనులు చేసేవారికి పెద్దగా కంటికి గాయాల వంటివి ఉండవని చాలామంది అపోహపడుతుంటారు. పట్టణాల్లో, నగరాల్లో జరిగే ప్రమాదాల్లోనే అవి ఎక్కువని భావిస్తుంటారు. నిజానికి వ్యవసాయ, కూలి పనుల్లోనే కంటికి గాయాలయ్యే అవకాశాలెక్కువ. ఉదాహరణకు ఓ వ్యవసాయదారు పొలంలో కంపకొడుతుంటాడు. అకస్మాత్తుగా ఏ కంపముల్లో కంట్లో తగిలే అవకాశాలెక్కువ. ఎడ్లబండి తోలుతూ రైతు డొంకదారిన వస్తుంటాడు. దార్లోకి ఒంగిన తుమ్మముల్లు తగిలే అవకాశాలెక్కువ. ఇలాంటి గాయాలతో ప్రతిరోజూ ఎందరో పల్లెవాసులు, అలాగే మిగతా పట్టణ, నగరవాసులూ చూపు కోల్పోతున్నారు. గాయం తగిలిన వెంటనే చికిత్స అందితే ఈ అంధత్వాలను చాలావరకు నివారించవచ్చు. కంటికి అయ్యే గాయాలెటువంటివీ, ముందుగా ఎలాంటి ప్రథమచికిత్సలు, ఆ తర్వాత ఏ ప్రధాన చికిత్సలు అవసరం లాంటి అనేక విషయాలను తెలిపేదే ఈ కథనం.  

కంటి గాయాలూ... వాటి రకాలు 
కంటికి ప్రధానంగా రెండు రకాలుగా గాయాలయ్యే అవకాశాలుంటాయి. 
1) భౌతికంగా అయ్యే గాయాలు. 
2) రసాయనిక ప్రమాదాలు 

భౌతికంగా అయ్యే గాయాలు
వ్యవసాయ, ఇతరత్రా పనుల్లో : పొలాల్లో, డొంకదారుల్లో ఉండే ముళ్లచెట్లతో వ్యవసాయదారులకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకున్నాం. అలాగే కట్టెలు కొట్టే సమయాల్లో చెక్కపేడు వంటివి ఎగిరివచ్చి కంట్లో గుచ్చుకోవచ్చు. రాళ్లు కొట్టేవారు సుత్తిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇటుక, ఇతరత్రా బట్టీలో పెళ్లలు ఎగిరొచ్చి కంట్లో పడవచ్చు. ఇక పట్టణాల్లో వెల్డింగ్‌ వంటి వర్క్‌షాపుల్లో కంటికి గాయాలు తగిలే అవకాశాలెక్కువ. 

రోడ్డు / ఇతరత్రా ప్రమాదాల్లో : రోడ్డు మీద హెల్మెట్‌ లేకుండా వాహనం మెల్లగానే నడుపుతున్నప్పటికీ రోడ్డు మీదికి ఓరగా ఒంగిన చెట్ల కొమ్మలు కంట్లో కొట్టుకుని గాయాలయ్యే ప్రమాదాలెక్కువ. రాత్రివేళల్లో వాహనంపై ప్రయాణం చేసేవారికి పురుగుల వంటివి ఎగిరి వచ్చి కంట్లో పడవచ్చు. యాక్సిడెంట్లలో కంటికి లేదా కనుగుడ్డు అమరి ఉండే గూడు (ఆర్బిట్‌)కు గానీ లేదా తలకు అయ్యే గాయాల వల్ల కంటిచూపు ప్రభావితమయ్యే ప్రమాదాలుంటాయి. 

ఆటల్లో : కంట్లో బంతి తగలడం, షటిల్‌కాక్‌ వంటివి బలంగా తగలడం వల్ల; అలాగే పిల్లలు పదునైన ఉపకరణాలతో లేదా బాణాల వంటి పదునైన వస్తువులతో ఆడుకుంటున్నప్పుడు; బాణాసంచా వంటివి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నప్పుడు.  
పండుగలూ, వేడుకల్లో : దీపావళి, హోలీ వంటి పండగల్లో, వేడుకల్లో.  

ఎగిరి వచ్చే పదార్థాల వల్ల (ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్స్‌) : చిన్న చిన్న రాతిముక్కలు, గాజు ముక్కలు, లోహపు పదార్థాలు, కలప వంటి వాటితోపాటు, పురుగులు కంట్లో బలంగా కంటిని తాకడం వల్ల. సర్రున ఎగిరివచ్చి తాకే ఎలాంటి వస్తువుల వల్లనైనా. 

రసాయనిక ప్రమాదాలు
రసాయన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నట్లుగా వ్యవసాయ పనుల్లో పెద్దగా కంటి ప్రమాదాలు జరగవనే అపోహ లాంటిదే... ఈ రసాయనిక ప్రమాదాలూ జరగవనే భావన కూడా. కానీ పొలంలో ఆర్గానోఫాస్ఫరస్‌ (అంటే ఎండ్రిన్‌ వంటి) మందుల పిచికారీలూ, ఎరువులు వేస్తున్నప్పుడు రసాయనాలు కంట్లోకి వెళ్లే ప్రమాదాలు చాలా ఎక్కువ. దాంతోపాటు పొలానికి మందు కొట్టిన సందర్భాల్లో చేతులు కడుక్కోకుండా వాటితోనే కళ్లునులుముకోవడం వంటి చర్యలతోనూ కళ్లలోకి రసాయనాలు చేరుతాయి. ఇక పట్టణాలూ, నగరాల్లోని రకరకాల పారిశ్రామిక కేంద్రాలూ, ఫౌండ్రీలలో కొన్ని రకాల ఆమ్లాలు / క్షారాల వంటి రసాయన కంట్లో పడి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా చికిత్స జరిగితే శాశ్వత అంధత్వాన్ని చాలావరకు నివారించవచ్చు.

అంతేకాదు... మన ఇళ్లలో ఉండే సుగంధద్రవ్యాలను స్ప్రే రూపంలో చిమ్ముకుంటున్నప్పుడు కూడా ఈ తరహా రసాయన ప్రమాదాలు జరగవచ్చు. అందుకే చిన్నపిల్లలను పర్‌ఫ్యూమ్స్‌కు దూరంగా ఉంచాలి. ఇక ఇళ్లలో జరిగే గాయాల్లో.... సిమెంట్‌ పని చేస్తున్నప్పుడు, ఇంటికి సున్నాలు/కలర్స్‌ వేయిస్తున్నప్పుడు, పాన్‌లో వాడే సున్నాన్ని పిల్లలు కళ్లల్లో పెట్టుకున్నప్పుడు,  బాత్‌రూమ్‌ల వంటి చోట్ల యాసిడ్‌ వంటి రసాయనాలతో పనిచేస్తున్నప్పడు కంట్లోకి సున్నం లేదా యాసిడ్‌ వంటి రసాయనాలు వెళ్లే అవకాశాలెక్కువ. 

రసాయనాల కారణంగా జరిగే ప్రమాదాలతో కెమికల్స్‌కు సహజంగానే తినేసే గుణం (కాస్టిక్‌ ఎఫెక్ట్‌) ఉంటుంది. పైగా అందులోని రసాయనాలు కంటిలోని కణాలూ, ఎంజైముల, ప్రోటీన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఆ రసాయనాలు... కార్నియా, కంజెంక్టివా వంటి కంటి పొరలను దెబ్బతీస్తాయి. ఫలితంగా చూపుకోల్పోయే ప్రమాదాలెక్కువ. 

రసాయన ప్రమాదాల్లో తక్షణం అందించాల్సిన చికిత్స : కంటిలో పడే రసాయన గాఢతను వీలైనంతగా తగ్గించాలి (డైల్యూట్‌ చేయాలి). అందుకోసం రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయిన కంటిని దాదాపు 30 నిమిషాల పాటు పరిశుభ్రమైన నీటితో కడగాలి. రోగి అయోమయంలో ఉంటే  ప్రమాదస్థలంలోని ఎవరైనా ఈ పని చేయవచ్చు.  

పేలుళ్లు : ఈ తరహా ప్రమాదాలలో రెండు రకాలుగా కన్ను గాయపడుతుంది. ఒకటి నిప్పురవ్వలు. రెండోది... పేలుడు ధాటికి చిన్న చిన్న రాతి/ఇతరత్రా రవ్వలు కంటిని బలంగా తాకడం వల్ల. 

గాయాలు నివారించే జాగ్రత్తలివి... 
సాధారణంగా కంటికి అయ్యే గాయాల్లో దాదాపు 90 శాతం నివారింపదగినవే. అందునా 80 శాతం గాయాల్లో డాక్టర్‌ను సరైన సమయంలో సంప్రదిస్తే, చూపు పోకుండా కాపాడుకోవచ్చు. 
∙కర్షకులూ, కార్మికులూ, నిర్మాణరంగంలోని పనివారూ ఎండ వేడిమి నుంచి కంటిని రక్షించుకోవాలి. ఎందుకంటే సూర్యరశ్మిలో యూవీఏ, యూవీబీ కిరణాలుంటాయి. అవి టెరిజియమ్, క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి సమస్యలకు కారణమవుతాయి. పరిశ్రమల్లో పనిచేసే వారికి యూవీఏ, యూవీబీ కిరణాలతో ముప్పు మరింత ఎక్కువ. పొలాల్లో పనిచేసేవారికి కళ్లజోడేమిటి అనే సందేహాలూ, నామోషీలు లేకుండా ప్లెయిన్‌ గ్లాసెస్‌ వాడాలి. దాంతో వ్యవసాయం, రాతికొట్టుడు వంటి పనుల్లో కన్ను గాయపడకుండా ఉంటుంది. వ్యవసాయదారులే కాదు.. హాబీగా గార్డెనింగ్‌ చేసేవారు కూడా ఎప్పుడూ ప్రొటెక్టివ్‌ గాగుల్స్‌ తప్పక ధరించాలి. 
స్పోర్ట్స్‌ ఇంజ్యూరీ : ఆటల్లో కన్ను గాయపడకుండా ఉండేందుకు పాలీకార్బనేట్‌ కళ్లజోళ్లు వాడాలి. (ఇది ప్లాస్టిక్‌ వంటిది. పగలదు). హెల్మెట్స్, కంటి షీల్డ్‌లతో స్పోర్ట్స్‌ ఇంజ్యూరీస్‌ నివారించవచ్చు. 
ఇంట్లో : ఇంట్లో అనేక రకాల పదునైన వస్తువులతో కంటిగాయాలయ్యే అవకాశాలుంటాయి. ఉదాహరణకు పదునైన మూలలు ఉండే మంచాలు, చిలక్కొయ్యలూ, హ్యాంగర్స్‌గా వాడుకునే ఇనుపకొక్కేల వంటి వాటితో కూడా కంటి గాయాలయ్యే అవకాశాలున్నాయి. ఇంటివస్తువులు పదునుగా ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో కూల్‌డ్రింక్‌ ఓపెన్‌ చేసేటప్పుడు ఆ సీసామూతను బయటికి వైపునకు 45 డిగ్రీల  ఏటవాలుగా ఉంచి తెరవాలి. అప్పుడు కన్ను గాయపడే అవకాశం ఉండదు. 
పంటపొలాల్లో ఆర్గానోఫాస్ఫరస్‌ (ఎండ్రిన్‌ వంటివి)  చల్లేటప్పుడు నోరు, ముక్కులకు మాస్క్‌తో పాటు కళ్లకు ప్రొటక్టివ్‌ గాగుల్స్‌ తప్పకుండా పెట్టుకువాలి. 
కార్ఖానాల్లో రసాయనాలను అంటుకునే ముందు, అంటుకున్న తర్వాత చేతులు కడుక్కోకుండానే కళ్లునులుముకోవడం సరికాదు. 
పిల్లల ఆటల్లో విల్లుబాణాలూ అస్సలు వద్దు. బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్లు చిన్నారుల పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. 
టూవీలర్స్‌ నడిపేవారు ఐ వేర్, ఐ షీల్డ్, హెల్మెట్‌ ధరించి తీరాలి. నిజానికి వ్యవసాయం, నిర్మాణ పనివాళ్లు, రాతి పనివాళ్లు, స్టోన్‌ కట్టర్స్, ట్రాక్టర్‌ డ్రైవర్లు... వీళ్లంతా పనివేళ్లల్లో కంటికి అద్దాలు, ఐ షీల్డ్‌ ధరించాలి. హెల్మెట్‌ తరహాలోనే ఈ మేరకు ఓ చట్టం రావడమూ చాలావరకు మేలు చేసే అంశమే. 
కంటిగాయాల ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవాలి. 
ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగకూడదు.

గాయమైన వెంటనే... 
కంటికి గాయం తగలగానే తక్షణం ఓ శుభ్రమైన మెత్తటి గుడ్డ సహాయంతో రెండు కళ్లనూ మూసి ఉంచాలి. వీలైనంతగా కనుగుడ్లు కదలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌కు చూపించాలి. కంటికి గాయాలను స్వయంగా పరిశీలించుకోవడం, సొంత చికిత్స చేసుకోవడం చాలా ప్రమాదం. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. కెమికల్స్‌ పడ్డాయని తెలియగానే... చేతులను సబ్బు, మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. దొరికితే ప్రిజర్వేటివ్‌ ఫ్రీ యాంటీబయాటిక్‌ డ్రాప్స్, ల్యూబ్రికెంట్స్‌ వేసుకోవాలి. కళ్లునలపకూడదు. కంటి మీద ఒత్తిడి పడనివ్వకూడదు.  కళ్లలో పడ్డ నలకలను (ఫారిన్‌బాడీని) మనంతట మనమే తీయకూడదు. వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌తో చికిత్స తీసుకోవాలి. అవసరమైతే వారి సలహా మేరకు పెద్ద ఆసుపత్రుల్లో కంటి వైద్యనిపుణులకు చూపించుకోవాలి.

డాక్టర్‌ను కలవాల్సింది ఎప్పుడు? 
కన్ను నొప్పి, నీళ్లు కారడం, వెలుగు చూడలేకపోవడం, చూపు తగ్గడం, ఎర్రబారడం, తలనొప్పి, కళ్లు (కనుగుడ్లు) కదిలిస్తున్నప్పడు నొప్పి ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. 
చికిత్స  
ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్స ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అంటే ఉదాహరణకు... సున్నం, సిమెంట్, బాత్‌రూమ్‌ యాసిడ్‌ వంటివి పడ్డప్పుడు వెంటనే కన్ను శుభ్రంగా కడుక్కుని, ఆ వెంటనే కంట్లో చుక్కల మందులు అయిన ప్రిజర్వేటివ్‌–ఫ్రీ యాంటిబయాటిక్‌ ఐ డ్రాప్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక కన్ను కడుక్కోడానికి పరిశుభ్రమైన నీరు (ప్లేన్‌ వాటర్‌) వాడాలి. అదంత శుభ్రంగా ఉండదనుకుంటే ప్యాకేజ్‌డ్‌ వాటర్‌బాటిల్‌ నీళ్లు వాడుకోవచ్చు. ఇక గాయాన్ని బట్టి చేయాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే ఎంత త్వరగా చికిత్స అందిస్తే చూపు దక్కే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top