Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్‌ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల..

Paranoia: Unnecessarily Doubting Spouse Spoil Relationship Overcome - Sakshi

అకారణ అనుమానం ఏం చేయాలి?

అనుమానం పెనుభూతం. అకారణ అనుమానం  ఎదుటివారికి ప్రాణాంతకం. భర్త మంచివాడే.. ఉద్యోగం చేస్తాడు.. కష్టపడతాడు. ఇంటిని పోషించాలనుకుంటాడు. కాని అతనికి తీవ్రమైన అనుమానం ఉంటే? భార్యను విసిగిస్తూ ఉంటే? అదొక మానసిక అవస్థ అని తక్షణమే గుర్తించాలి.

ఆత్మీయుల సాయం పొందాలి. వైద్యం అందించాలి. ఇటీవల పత్రికలలో ఈ మానసిక అవస్థతో జరుగుతున్న దుర్ఘటనలు ఇంటిని, ఇంటి మనిషిని కాపాడుకోమని అప్రమత్తం చేస్తున్నాయి.

కేస్‌స్టడీ 1: మధు ఆఫీస్‌ నుంచి హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఆమె వంటపనిలో ఉంది. తలుపు తట్టి నేరుగా లోపలికి దూసుకువచ్చాడు. బెడ్‌రూమ్‌ అంతా కలియతిరిగాడు. బాత్‌రూమ్‌ చూశాడు. కప్‌బోర్డులు వెతికాడు. ‘ఎక్కడ దాచి పెట్టావ్‌ వాణ్ణి’ అన్నాడు. ఆమె హతాశురాలు కాలేదు. అలా అతణ్ణి చూస్తూ ఉంది.

ఈ మధ్య అలాగే చేస్తున్నాడు. ‘చెప్తాను నీ సంగతి’ అని పళ్లు కొరుకుతూ వెళ్లిపోయాడు. ఆమెకు ఏడుపొచ్చింది. కాని ఎన్నిసార్లని ఏడుస్తుంది. ఈ అనుమానం మొగుణ్ణి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు. ఇతను ఇలా తయారవుతాడని కలగందా? ఏం చేయాలి? ఇంటి నుంచి బయటపడి కుటుంబాన్ని డిస్ట్రబ్‌ చేయడమా? లేదా అతణ్ణి భరించడమా?

కేస్‌ స్టడీ 2: బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ముభావంగా మారిపోయాడు శివ. భార్య గతుక్కుమంది. అలా మారాడంటే ఏదో అయ్యిందన్నమాటే. ‘ఏమైందండీ’ అడిగింది బైక్‌ వెనుక నుంచి. ‘పార్టీలో నువ్వు ఐదు నిమిషాలు కనిపించలేదు. ఎవరితో మాట్లాడటానికి వెళ్లావ్‌’ అన్నాడు. ‘అయ్యో. వాష్‌రూమ్‌కు వెళ్లానండీ’.

‘అంటే వాష్‌రూమ్‌ దగ్గరకు వాణ్ణి రమ్మన్నావా?’. ‘దేవుడా.. వాడెవడండీ’. ‘అదే... ఆ శ్రీనివాస్‌గాడు. భోజనాల దగ్గర నీతో మాట్లాడుతున్నాడు కదా’. ‘అయ్యో. నాతో ఏం మాట్లాడలేదండీ. ప్లేట్‌ అందించాడంతే’. కాని శివ ఏమిటే మిటో అంటున్నాడు. ఇల్లు చేరేవరకూ అంటూనే ఉన్నాడు. చేరాక అన్నాడు. తెల్లార్లూ అన్నాడు.

కేస్‌స్టడీ 3: ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. భర్త మంచం మీద లేడు. కంగారుగా లేచి చూసింది. హాల్లో ఒక్కడే పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ‘ఏంటండీ... ఇక్కడ ఏం చేస్తున్నారు’.... ‘నాకు చచ్చిపోవాలని ఉంది. నేనంటే నీకు ఇష్టం లేదు.

అది తెలిసిపోయాక నిన్నేదైనా చేస్తానేమోనని భయంగా ఉంది’ చెప్పి భోరుమన్నాడు. ఆమె భయంతో ఆందోళనతో సతమతమైపోయింది. ‘మీరంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు’. ‘ఒకరు చెప్పాలా... నాకు తెలుసు’. ఆమె నెత్తి కొట్టుకుంది.
∙∙ 
పారనోయ
‘పారనోయ’ అనేది ఒక మానసిక అనారోగ్యం. ఈ అనారోగ్యం ఉన్నవారికి అనుమానం, అపనమ్మకం, అక్కసు, భ్రాంతి... వంటి రకరకాల భావాలు ఉంటాయి. వీరు అందరిలా నార్మల్‌గానే ఉంటారు. నార్మల్‌గా జీవిస్తున్నట్టుగానే కనపడుతుంటారు కాని ఈ సమస్య ఉంటుంది.

వారు ఎవరిని ఆ సమస్యతో ఇబ్బంది పెడుతున్నారో వారికే అది తెలుస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు చేసే ఆరోపణలు ‘ఏనుగు గాల్లో ఎగురుతుంది’ లాంటివి కావు. ‘ఏవి జరగడానికి ఆస్కారం ఉంటుందో ఆ విషయాల పట్ల వారికి అనుమానం ఉంటుంది’.

అంటే ‘భార్యకు మరొకరితో బంధం ఉండే ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘కొలీగ్‌ తన డెస్క్‌ను చెక్‌ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘పక్కింటివారు తనకు ఏదో హాని చేసే అవకాశం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’.

అంటే జరగగలిగిన వాటి గురించే వీరు వర్రీ అవుతూ ఉంటారు. కాని వాటికి వారి దగ్గర ఆధారాలు ఉండవు. కాని గట్టిగా నమ్ముతుంటారు. ‘నీకు పక్కింటి వ్యక్తితో సంబంధం ఉంది’ అని భార్యతో వాదిస్తారు. ‘లేదు’ అని భార్య వాదించే కొద్దీ వారి అనుమానం బలపడుతుంది. దీనిని నసగా, చాదస్తంగా, పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కానట్టుగా, భరించక తప్పదు అని లోలోపల కుళ్లే విషయంగా చాలామంది భార్యలు భావిస్తుంటారు.

అది ప్రమాదం. ఇది ‘మానసిక అనారోగ్యం’ అని గుర్తించాలి. అలా ఎప్పుడైతే గుర్తిస్తామో పరిష్కారం వైపు అడుగులు వేసినట్టు. ప్రమాదం నుంచి దూరం జరుగుతున్నట్టు. లేకపోతే ఈ అవస్థ ముదిరితే నూటికి ఇద్దరు తమకు తాము హాని చేసుకోవడమో ఎదుటివారికి హాని తలపెట్టడమో చేస్తారు. పేపర్లలో ఇప్పుడు చూస్తున్నవి అలాంటి వారి వల్ల జరుగుతున్న ఉత్పాతాలే.

ఏం చేయాలి?
►మొదట ఆత్మీయుల మద్దతు తీసుకోవాలి. వైద్యానికి ఒప్పించాలి. ఇలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో సైకియాట్రిస్ట్‌ల సలహా తీసుకోవాలి. భర్తతో ఈ ఇబ్బంది తప్ప వేరే సమస్య లేదు కనక అతణ్ణి కాపాడుకోవాలి (భార్యల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది. ఆమె గురించి కూడా ఇదే వర్తిస్తుంది).
►వాదించకూడదు. భర్త చేసే ఆరోపణలను వాదించవద్దు. ఖండించవద్దు. విని ఊరుకుంటూ ఉండాలి.
►స్నేహంగా, ఓర్పుగా వారితో మాట్లాడాలి.
►ఈ సమస్య ఉన్నవారితో వేగాలంటే ముందు మన మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉండాలి.
►అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి.

ఏమిటి వైద్యం?
►సైకోథెరపీ, బిహేవియరల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ థెరపీ లాంటివి ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నుంచే మందులూ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్‌ డ్రగ్స్‌ ఉన్నాయి. అయితే కొన్ని మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అవి గమనించుకుంటూ వైద్యుణ్ణి సంప్రదిస్తూ సరైన మందులు ఇస్తూ ఈ అనుమాన భూతాన్ని అదుపులోకి తేవాలి.
►సమస్యను అయినవారితో చెప్పకుండా దాచడం మంచిది కాదు. చెప్తే నవ్వుతారేమో అనుకోకూడదు. ప్రమాదం వచ్చాక అందరూ ఏడ్వడం కన్నా ఇప్పుడు ఒకరిద్దరు నవ్వినా నష్టం లేదు. పరిష్కారం వైపు అడుగు ముందుకు పడటమే ముఖ్యం.

చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్‌నర్‌కు సంబంధించి
Sitterwizing: పిల్లలతో కూచోండి.. దగ్గరగా చూడండి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top