సాంకేతికత అను..బంధం | Modern gadgets, digital Technology are weakening relationships | Sakshi
Sakshi News home page

సాంకేతికత అను..బంధం

Oct 25 2025 4:08 AM | Updated on Oct 25 2025 4:08 AM

Modern gadgets, digital Technology are weakening relationships

టీవీ వచ్చి ఆడవాళ్లు .. ఇంట్లోవాళ్లకు తిండి పెట్టకుండా చేసింది.. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చి.. ఇంట్లోవాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసింది.. టెక్నాలజీ మీద సంప్రదాయం చేస్తున్న కామెంటూ..  విడుస్తున్న నిట్టూర్పూనూ!అయ్యో సాంకేతికతతో సౌకర్యాలే కాదు.. సాఫల్య అనుబంధాలూ ఉన్నాయని  చెబుతున్నాయి కొన్ని అనుభవాలు!
జనార్థన్, రాధ (పేర్లు మార్చాం)కి కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. జనార్దన్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. రాధ గృహిణి. ఇద్దరూ డెబ్భైల్లో ఉన్నారు. బీపీతో జనార్ధన్, షుగర్, థైరాయిడ్‌తో రాధ సహజీవనం చేస్తున్నారు. ఓ మూడేళ్ల కిందటిదాకా ఇద్దరి జీవనశైలి వేరుగా ఉండేది. ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. చిన్నిపాటి వ్యాయామానిక్కూడా బద్ధకించేవారు రాధ. 

కూర్చున్న చోటికే ఆమెకు అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ల పనమ్మాయి. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా యూట్యూబ్‌లోనే గడిపేవారు. జనార్దన్‌ వాకింగ్‌ క్లబ్‌ ఫ్రెండ్స్‌తో వాకింగ్‌కి వెళ్లినా..  పార్క్‌లోని చెట్లకింద కూర్చుని కబుర్లతోనే కాలక్షేపం చేసేవారు కానీ నడిచేవారు కాదు. ఆహారం మీద అదుపు ఉండేదికాదు. అమెరికాలో ఉన్న పిల్లలు పోరగా పోరగా మెడికల్‌ టెస్ట్‌లకి వెళ్లేవారు. 

ఆ రిపోర్ట్స్‌లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు కనపడేవి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్లు బాధపడుతూ, విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఆందోళన కలిగించేవారు. తల్లిదండ్రుల కోసం కెరీర్‌ను వదులుకుని పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వీళ్లే అక్కడికి వెళ్లినా, అక్కడ అడ్జస్ట్‌ అయ్యే ముచ్చట అసలే లేదు. అమ్మా నాన్నను హెల్త్‌లైన్‌లో పెట్టడమెలాగా? వాళ్లకు ఓ యాక్టివిటీ కల్పించడమెలాగా అని పిల్లలిద్దరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు కోడలు రంగంలోకి దిగింది.

ఇలా సీన్‌ మార్చేసింది.. 
ఆ అమ్మాయి వృత్తిరీత్యా బిజినెస్‌ ఎనలిస్ట్‌. షేర్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్, ఇండోర్‌ డెకరేషన్‌ ఆమె ఇష్టంగా చేసే పనులు. అందుకే తన అత్తమామల జీవనశైలిని ఓ గాడిలో పెట్టేవరకు ఉద్యోగానికి సెలవుపెట్టి.. హాబీల మీద దృష్టి పెట్టింది. అలా దొరికిన సమయం, వెసులుబాటును పూర్తిగా ఇండియాలో ఉన్న ఇన్‌లాస్‌ మీదే వెచ్చించింది. అందులో భాగంగా ముందు వాళ్ల దైనందిన జీవనసరళిని పరిశిలీంచింది. వాళ్ల బాధ్యతలను చూస్తున్న కన్సల్టెంట్స్‌తో మాట్లాడింది. 

ఆ రిపోర్ట్స్, వాళ్ల లైఫ్‌స్టయిల్‌ గురించి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్‌ న్యూట్రిషనిస్ట్‌తోనూ చర్చించింది. ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే షెడ్యూల్‌ చేసుకుంది. ఈ స్టడీతో ఆమె వాళ్ల దైనందిన కార్యక్రమాల టైమ్‌టేబుల్‌ ఒకటి తయారు చేసి వాట్సాప్‌లో పంపింది. ప్రింట్‌ అవుట్స్‌ తీసుకొమ్మని చెప్పింది. డైట్‌కి సంబంధించిన పట్టీని ఫ్రిజ్‌కి అతికించమంది. వ్యాయామానికి సంబంధించి డ్రెసింగ్‌ టేబుల్‌కి అతికించమంది. సాయంకాలం వాళ్లు చేయాల్సిన పనుల పట్టికను టీవీ కేస్‌కి అతికించమంది. 


రోజూ ఉదయాన్నే (ఇండియన్‌ కాలమానం ప్రకారం) అయిదింటికల్లా ఆ ఇద్దరినీ ఫోన్‌ చేసి నిద్రలేపేది. వాకింగ్‌కి వెళ్లమని పోరేది. వాళ్లకు కావాల్సిన సరకులు, కూరగాయలు, డాక్టర్‌ అపాయింట్‌మెంట్స్‌ వగైరా సమస్తం తానే చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే యాప్స్‌ ద్వారా తనిచ్చిన జాబితా ప్రకారం అన్నీ ఆర్డర్‌ చేసేది. మూడు నెలలకు ఒకసారి వాళ్లకు టూర్స్‌నీ ΄్లాన్‌ చేయడం.. టికెట్స్, అకామడేషన్‌ బుక్‌ చేయడం అన్నీ చూసేది. 

ప్రతివారం ఏడు రోజులకు సరిపడా వాళ్లకు సుడోకు, వర్డ్‌ పజిల్‌ లాంటి ఎక్సర్‌సైజెస్‌ కూడా ఇచ్చేది. వీటన్నిటితో..  ఆరు నెలల గడిచేసరికి ఇద్దరిలో చాలామార్పు వచ్చింది. ఇద్దరూ చెరో రెండు కేజీల వెయిట్‌ తగ్గారు. షుగర్, బీపీ, థైరాయిడ్‌ అన్నీ కంట్రోల్‌లోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ కొత్త సర్కిల్‌ ఏర్పడింది. దాంతో ఇద్దరిలో జీవనాసక్తి, జీవనోత్సాహం పెరిగాయి. ట్రావెల్‌ చేయడం వల్ల ఉల్లాసంగా కనపడసాగారు. 

ఈ మార్పుకి ఇరుగు పొరుగు, చుట్టాలే కాదు వాళ్ల కన్సల్టెంట్‌ డాక్టర్స్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇంట్లో పళ్లు, కూరగాయలు, సరకులు వృథా అవట్లేదు. మురిగిపోయి చెత్త బుట్ట దాఖలు కావట్లేదు. ఎప్పటికప్పుడు తాజా వాటినే వినియోగిస్తున్నారు. కారణం.. తానిచ్చిన టైమ్‌టేబుల్‌ తప్పితే ఆ వారం మనవరాలితో గానీ.. తమతో గానీ ఫోన్‌ ఇన్‌ ఉండదని, తామెవరమూ మాట్లాడమని హెచ్చరించింది కోడలు. ఈ హెచ్చరిక వాళ్ల జీవనశైలిని దిద్దడమే కాదు.. తమ కుటుంబ అనుబంధాన్నీ బలపరచింది అంటారు జనార్ధన్‌.

‘తొలుత.. చిన్నపిల్లల్లా మాతో మా కోడలు అవన్నీ చేయిస్తుంటే చిరాకు, కోపం వచ్చేవి. మా అబ్బాయికి, అమ్మాయికి కంప్లయింట్‌ కూడా చేశాను. మా అమ్మాయి మా కోడలితో ‘పోనీలే వదినా.. పెద్దవాళ్లయిపోయారు వాళ్ల మానాన వాళ్లను ఉండనివ్వండ’ని చెప్పింది. పెద్దవాళ్లయ్యారు కాబట్టే.. ఈ జాగ్రత్తలు. ఒక్క ఏడాది ఓపికపట్టండి.. నా మీద నమ్మకం ఉంచండి’ అని అందరికీ చెప్పింది మా కోడలు. ఏడాది కాదు.. ఆర్నెలు తిరిగేసరికే మా కోడలు కోరుకున్నదేంటో మాకు తెలిసింది. ఆ మార్పు మా ఆరోగ్యాన్నే కాదు మా కుటుంబ బంధాలనూ గట్టిపరిచింది’ అంటారు రాధ. తాను చేసిన ఈ ప్రయోగం తన అత్తమామల ఆరోగ్యాన్ని మెరుగుపరచేసరికి దాన్ని వాళ్ల అమ్మకూ అప్లయ్‌ చేసింది. అంతేకాదు రాధ వాళ్లమ్మాయి తన అత్తమామల విషయంలోనూ ఆ ఎక్స్‌పరిమెంట్‌ను అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది.

విదేశాలలో ఉన్నా కూడా...
విదేశాల్లో ఉన్న చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు, ఇన్‌ లాస్‌ ఆరోగ్యం విషయంలో డాక్టర్ల అపాయింట్‌మెంట్స్‌ తీసుకోవడం, ట్రావెల్‌ ΄్లాన్‌ చేయడం, మందులు, నిత్యావసర సరుకులు ఆర్డర్‌ పెట్టడం పరిపాటే. కానీ ఇలా ఫిజీషియన్‌ ఇచ్చిన రిపోర్ట్స్‌ను సైకియాట్రి, సైకాలజీ నిపుణులు, ΄ûష్టికాహార నిపుణులతో చర్చించి.. భవిష్యత్‌లో రానున్న రిస్క్‌లను నియంత్రించడానికి చేయాల్సిన పనులతో పెద్దవాళ్లకు ఓ ఎక్సర్‌సైజ్‌లాంటిది ఇచ్చి.. అందులో వాళ్లను తలమునకలు చేయడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆరోగ్యకరమైన ప్రయోగం కూడా. దీంతో పెద్దలు రోజుకు సరిపడా కావల్సినంత యాక్టివిటీలో ఉండి.. పిల్లలు దగ్గరలేరన్న బెంగకు గురికాకుండా మానసిక ఉల్లాసాన్ని పెం పొందించుకున్నారు. అలాగే గాడ్జెట్స్‌ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్‌ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. ఆ గాడ్జెట్‌.. వాట్సాప్‌ నెట్‌వర్క్‌తోనే తన ఇన్‌లాస్, పేరెంట్స్‌కి దగ్గరై.. లాంగ్‌ డిస్టెన్స్‌లో కూడా రిలేషన్‌షిప్‌ స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పింది.

గాడ్జెట్స్‌ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్‌ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement