
ఆన్‌లైన్‌లో పాపులర్ అయిన మాట డ్రై బెగ్గింగ్. సూటిగా, సుత్తి లేకుండా మనసులో ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఒక విధానం. అలా కాకుండా ఏవేవో మాట్లాడుతూ అసలు విషయాన్ని మసకపరచడం మరో విధానం. ఈ రెండో కోవకు చెందిన వారు ‘డ్రై బెగ్గింగ్’(Dry begging) బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా పట్టించుకోదగిన సమస్యగా అనిపించనప్పటికీ ‘ఎమోషనల్ ప్రెషర్’తో ఒక రేంజ్‌లో బాధించే సమస్య ఇది.. సుమన తన స్నేహితురాలితో అరగంటకు పైగా మాట్లాడింది.
‘అందరూ ఆత్మీయులలాగే అనిపిస్తారు గానీ అవసరమైన సమయంలో ఉపయోగపడరు’ ‘బతకడానికి ఏ ఆశా కనిపించడం లేదు’.... ఇలాంటి నిరాశపూరితమైన మాటలే ఆమె నోటినుంచి వినిపించాయి. అసలు విషయం గురించి ఆమె ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అసలు విషయం... ఆమెకు ఉన్న ఆర్థిక సమస్య. సుమనకు అర్జంటుగా అయిదు లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. ఆ విషయాన్ని స్నేహితురాలితో చెప్పకుండా ఏవేవో విషయాలు మాట్లాడుతూనే ఉంది. ఈ ధోరణినే ‘డ్రై బెగ్గింగ్’ అంటారు.
తన మనసులో మాటను డైరెక్ట్‌గా కాకుండా, పరోక్షంగా చెప్పడాన్ని ప్రాథమికంగా ‘డ్రై బెగ్గింగ్’ అంటారు. ‘డ్రై బెగ్గింగ్’ అనేది మొదట చిన్న విషయంలాగే కనిపించినప్పటికీ ఆ తరువాత దాని తీవ్రత పెరుగుతూ పోతుంది. స్నేహం, కుటుంబ బంధాలలో అ పోహలను రేకెత్తిస్తుంది. దూరాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తెలిసి కొందరు, తెలియక కొందరు ‘డ్రై బెగ్గింగ్’ దారిలోకి వెళుతున్నారు. ‘ఒకవేళ నేను అడిగింది కాదంటే’ అనే భయంతో కొందరు....
‘ఎమోషనల్ స పోర్ట్’ కోసం కొందరు... ‘డైరెక్ట్‌గా అడిగితే నలుగురి ముందు పలచనై పోతాం’ అని సమాజానికి భయపడి కొందరు... ‘డ్రై బెగ్గింగ్’ను ఆశ్రయిస్తుంటారు.
నిజాయితీగా కాకుండా అకారణ ద్వేషంతో విషపూరితంగా, కించపరిచేలా, వేధించేలా మాట్లాడే స్వభావం కూడా ‘డ్రై బెగ్గింగ్’లో భాగమే. సైకాలజీ టెక్ట్బ్‌బుక్స్‌లో ‘డ్రై బెగ్గింగ్’ అనే మాట ఇంకా చేరనప్పటికీ ఆన్‌లైన్ సమాజంలో, థెరపీ సెషన్‌లలో ప్రాచుర్యంలో ఉంది. బ్రిటన్‌కు చెందిన కౌన్సెలర్ డరెన్ మాగీ ద్వారా బాగా పాపులర్ అయింది. మాగీ మాటల్లో చె΄్పాలంటే ‘డ్రై బెగ్గింగ్’ అనేది ఎమోషనల్ ప్రెషర్. ఓపెన్ కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించడం ‘డ్రై బెగ్గింగ్’ నివారించడానికి ఒక మార్గం. ఇన్ డైరెక్ట్ రిక్వెస్ట్‌లు, మాటలు ఇబ్బందిగా ఉంటే వెంటనే అభ్యంతరం చెప్పాలి.
బంధాలు బలంగా ఉండేలా...
ఈ డ్రై బెగ్గింగ్ అనేది ఇటీవల సోషల్‌మీడియాలో తరచూ వింటున్నాం. ఈ డ్రై బెగ్గింగ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే... అసలు సమస్య గురించి కాకుండా వేరేవన్నీ మాట్లాడుతుంటారు. తమది జాలిగుండె గా, ఎదుటివారంతా కఠినాత్ములుగా భావించి చెప్పడం చేస్తుంటారు. ఇలాంటి మాటల ద్వారా సహాయం, ప్రోత్సాహం, గిఫ్ట్, డబ్బు.. వంటివి కావాలని అర్థం వచ్చేలా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియా పోస్టుల్లో ‘ఇవాళ నా పుట్టినరోజు, కానీ ఎవ్వరూ గుర్తించలేదు’ అని నిష్టూరంగా ఎదుటివారిదే తప్పు అయినట్టుగా పోస్ట్ పెడుతుంటారు.
అంటే ‘నిన్న రాత్రి ఏమీ తినలేదు తెలుసా, నిద్ర పట్టలేదు’ అంటూ సమస్యను చెప్పకుండా సానుభూతిని కోరుతుంటారు. కొందరు తాము చాలా స్వతంత్రంగా ఉన్నట్టు కనిపిస్తూ, సహాయం కోరతారు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటివారిలో గిల్ట్‌ను ప్రేరేపించేలా ఉంటుంది. కొందరికి ఇది సున్నితంగా తన అవసరాన్ని చెప్పే మార్గం కూడా. మరికొందరికి ఇది డైరెక్ట్‌గా లేకుండా సహాయం పొందేందుకు చేసే ఓ మానిప్యులేషన్. సందర్భాన్ని బట్టి ఇది సహజంగానూ ఉండొచ్చు, అలవాటుగా వాడితే అసహజంగానూ మారొచ్చు.
తమకు, కుటుంబ సభ్యులకు మధ్య సరైన బంధం లేక పోయినా ఇలాంటి ప్రవర్తన బయటకు వస్తుంటుంది. ఇది వృద్ధులలో గమనిస్తుంటాం. ఇటీవల టీనేజ్, యుక్త వయసు, గృహిణుల్లోనూ ఇది ఎక్కువ కనిపిస్తోంది. ఇది వారిలో ఒక బలహీనతగా మారకుండా చూడాలి. తమను తాము శక్తిమంతులుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ బంధాలలో బీటలు వారకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన తమలో లేదా ఎదుటివారిలో కనిపిస్తే నిపుణుల సాయం తీసుకోవాలి.
– జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ ట్రైనర్