పంచారామ క్షేత్రాలు

Pancharama Kshetras In Andhra Pradesh - Sakshi

పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ క్షేత్రాల పుట్టుక గురించి వేర్వేరు పురాణాల్లో వేర్వేరు గాథలు ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఉన్న కథ ఏమిటంటే– క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం పంపిణీలో జగన్మోహిని రూపంలో మహావిష్ణువు తమకు చేసిన అన్యాయానికి అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుల నాయకత్వంలో తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి వరాలు పొందారు. వర గర్వంతో వారంతా దేవతలపై తరచు దాడులు సాగిస్తూ, నానా యాతన పెడుతుండటంతో దేవతలంతా కలసి రాక్షసులకు వరాలు ఇచ్చిన శివుణ్ణే శరణు వేడుకున్నారు. దేవతలపై జాలిపడిన శివుడు తన పాశుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు. 

పాశుపతం ధాటికి త్రిపురాసురుల రాజ్యమంతా భస్మీపటలమైనా, వారు పూజిస్తూ వచ్చిన పెద్దశివలింగం మాత్రం చెక్కుచెదరలేదు. శివుడు ఈ లింగాన్ని ఐదు ముక్కలుగా ఛేదించి, వేర్వేరు చోట్ల ప్రతిష్ఠించడానికి దేవతలకు ఇచ్చాడు. దేవతలు వీటిని ప్రతిష్ఠించిన క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం (దక్షారామం), సామర్లకోటలోన కుమారారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో సోమారామం, గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. 

పంచారామ క్షేత్రాల పుట్టుక గురించి స్కాందపురాణంలో మరో కథ ఉంది. అదేమిటంటే– తారకాసురుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి, శివుడిని మెప్పించి, ఆయన నుంచి ఆత్మలింగాన్ని పొందాడు. బాలకుడి చేత తప్ప ఇంకెవ్వరి చేత తన మరణం ఉండరాదనే వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దేవతలంతా శివపార్వతులను దర్శించుకుని, తారకాసురుణ్ణి సంహరించగల బాలుడిని తమకు అనుగ్రహించమని ప్రార్థించారు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి, తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతడి గొంతులోని ఆత్మలింగం ఐదుముక్కలైంది. దేవతలు వాటిని ఐదుచోట్ల ప్రతిష్ఠించారు. 

పంచారామాల్లోని అమరావతిలో ఉన్న శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ద్రాక్షారామంలో దక్షుడు తపస్సు చేశాడని, ఇక్కడ వెలసిన శివలింగానికి సూర్యభగవానుడు తొలి అభిషేకం చేశాడని పురాణాల కథనం. భీమవరంలోని సోమారామంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. సామర్లకోటలోని కుమారభీమారామంలో భీమేశ్వర ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు. పాలకొల్లులోని క్షీరారామ క్షేత్రంలో శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. 

విదేశాల్లో శివాలయాలు
నేపాల్‌లోని పశుపతినాథ క్షేత్రమే కాకుండా, భారత్‌కు వెలుపల వివిధ దేశాల్లో శివాలయాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయాన్మార్‌ వంటి దేశాల్లో కొన్ని పురాతన శివాలయాలు ఉన్నాయి. అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫిజీదీవులు, ఘనా, గయానా, నైజీరియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆధునికకాలంలో నిర్మించిన శివాలయాలు ఉన్నాయి. 

వివిధ రూపాల్లో శివారాధన
శివుడిని ఎక్కువగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. కొన్నిచోట్ల శివుడిని మానుషవిగ్రహ రూపంలోనూ ఆరాధిస్తారు. సింధులోయ నాగరికత కాలం నాటికి శివుడిని పశుపతిరూపంలో ఆరాధించేవారు. శివుడికి యోగీశ్వర, అర్ధనారీశ్వర, నటరాజ, రుద్ర, వీరభద్ర, భైరవ తదితర రూపాలు ఉన్నాయి. లోకరక్షణ కోసం శివుడు అరవై ఐదు లీలారూపాలు దాల్చినట్లు శివపురాణం చెబుతోంది. వీటిలో ఇరవైనాలుగు రూపాలు ప్రధానమైనవి కాగా, మూడు రూపాలు అత్యంత ముఖ్యమైనవని శివపురాణ కథనం. 

శివుడు సగుణ రూపంలో ఫాలనేత్రంతో, ఒకచేత త్రిశూలం, మరోచేత డమరుకం, శిరసుపై నెలవంక, జటాఝూటంలో గంగ, మెడలోను, చేతులపైన సర్పాలు, శరీరంపై గజచర్మం, విబూది పూతతో దర్శనమిస్తాడు. చెంత జింక, వాహనంగా నంది ఎల్లప్పుడూ శివుడిని అంటిపెట్టుకుని ఉంటాయి. త్రిశూలం త్రిగుణాలకు సంకేతమని ‘లింగపురాణం’ చెబుతోంది. తలపైన నెలవంక మనశ్శాంతికి, గంగ మనోనిశ్చలతకు సంకేతాలు. సర్పాలు జీవాత్మలు. గజచర్మం అహంకార పరిత్యాగానికి సంకేతం. జింక చతుర్వేదాలకు, నంది సత్సాంగత్యానికి, ఫాలభాగాన ఉన్న మూడోకన్ను ధర్మపరిరక్షణకు చిహ్నాలు.

శివుడు సృష్టి స్థితి లయకారకుడు. ప్రళయకాలంలో జగత్తును తనలో లయం చేసుకున్న శివుడు, సృష్టి స్థితులను కొనసాగించడానికి బ్రహ్మ విష్ణువులను నియమించినట్లు పురాణాల కథనం. శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది స్కాందపురాణం. లౌకికభోగాలు పొందడానికి శివలింగమే ఆలంబన అని శివభక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం శివుడే ఆదిగృహస్థుడు. ఆదర్శ దాంపత్యానికి శివపార్వతులే ప్రతీకలు. శివపూజ కోసం అట్టహాసమైన ఏర్పాట్లేవీ అవసరం లేదు.

చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించి, చిటికెడు విబూది, మారేడు దళం భక్తిగా సమర్పించుకుంటే చాలు, తప్పక శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కదల్లేని స్థితిలో ఉన్నవారు శివ మానసిక పూజ ద్వారా శివానుగ్రహం పొందగలరని అనుగ్రహిస్తూ ఆదిశంకరాచార్యులు శివ మానసిక పూజా స్తోత్రాన్ని రచించారు. కదల్లేని స్థితిలో ఉన్నవారు ఎలాంటి నియమాలూ పాటించలేకున్నా, ఈ భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని పఠించినా, మననం చేసుకున్నా శివానుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top