breaking news
Pancharam
-
పంచారామాలు... ప్రసిద్ధ క్షేత్రాలు
భీమవరం(ప్రకాశం చౌక్)/పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం తొలి సోమవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామక్షేత్రాలైన భీమవరం గునుపూడి లోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆల యం (సోమారామం), పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ముస్తాబయ్యాయి. భీమవరంలో క్షేత్రానికి వేకువజాము నుంచి భక్తుల తాకిడి ఉంటుందని, సుమారు 50 వేల మంది భక్తులు వస్తా రనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశామని, ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ.100 ప్రత్యేక దర్శనా లు కల్పిస్తామన్నారు. ఆలయం వెనుక వైపు స్వామికి అభిషేకాలు, కార్తీక నోములు నోచు కునే ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాన కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం అధిక సంఖ్యలో.. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. క్షీరారామం.. శోభాయమానం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వెలుపల ప్రాకారం లోపల ఉన్న గోశాల వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్లు ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్వదర్శనం క్యూలైన్లు దేవస్థానం కార్యాలయం పక్కనున్న మండపం వద్ద కేటాయించారు. ప్రసాదం విక్రయాలను ప్రత్యేక క్యూలైన్ పక్కన అలాగే సేవా సంస్థలు, దాతలు పా లు, ప్రసాదాలను ఆలయం బయట ఉత్తరం గేటు వద్ద భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వేకువజామున కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పంచారామ యాత్రికుల వాహనాల పార్కింగ్‌కు బస్టాండ్ వెనుక సంత మార్కెట్ రోడ్డు, మార్కెటింగ్ యార్డు రోడ్డు వద్ద స్థలాలను కేటాయించారు. క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసినట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. -
పంచారామ క్షేత్రాలు
పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ క్షేత్రాల పుట్టుక గురించి వేర్వేరు పురాణాల్లో వేర్వేరు గాథలు ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఉన్న కథ ఏమిటంటే– క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం పంపిణీలో జగన్మోహిని రూపంలో మహావిష్ణువు తమకు చేసిన అన్యాయానికి అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుల నాయకత్వంలో తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి వరాలు పొందారు. వర గర్వంతో వారంతా దేవతలపై తరచు దాడులు సాగిస్తూ, నానా యాతన పెడుతుండటంతో దేవతలంతా కలసి రాక్షసులకు వరాలు ఇచ్చిన శివుణ్ణే శరణు వేడుకున్నారు. దేవతలపై జాలిపడిన శివుడు తన పాశుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు. పాశుపతం ధాటికి త్రిపురాసురుల రాజ్యమంతా భస్మీపటలమైనా, వారు పూజిస్తూ వచ్చిన పెద్దశివలింగం మాత్రం చెక్కుచెదరలేదు. శివుడు ఈ లింగాన్ని ఐదు ముక్కలుగా ఛేదించి, వేర్వేరు చోట్ల ప్రతిష్ఠించడానికి దేవతలకు ఇచ్చాడు. దేవతలు వీటిని ప్రతిష్ఠించిన క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం (దక్షారామం), సామర్లకోటలోన కుమారారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో సోమారామం, గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. పంచారామ క్షేత్రాల పుట్టుక గురించి స్కాందపురాణంలో మరో కథ ఉంది. అదేమిటంటే– తారకాసురుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి, శివుడిని మెప్పించి, ఆయన నుంచి ఆత్మలింగాన్ని పొందాడు. బాలకుడి చేత తప్ప ఇంకెవ్వరి చేత తన మరణం ఉండరాదనే వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దేవతలంతా శివపార్వతులను దర్శించుకుని, తారకాసురుణ్ణి సంహరించగల బాలుడిని తమకు అనుగ్రహించమని ప్రార్థించారు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి, తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతడి గొంతులోని ఆత్మలింగం ఐదుముక్కలైంది. దేవతలు వాటిని ఐదుచోట్ల ప్రతిష్ఠించారు. పంచారామాల్లోని అమరావతిలో ఉన్న శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ద్రాక్షారామంలో దక్షుడు తపస్సు చేశాడని, ఇక్కడ వెలసిన శివలింగానికి సూర్యభగవానుడు తొలి అభిషేకం చేశాడని పురాణాల కథనం. భీమవరంలోని సోమారామంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. సామర్లకోటలోని కుమారభీమారామంలో భీమేశ్వర ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు. పాలకొల్లులోని క్షీరారామ క్షేత్రంలో శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. విదేశాల్లో శివాలయాలు నేపాల్‌లోని పశుపతినాథ క్షేత్రమే కాకుండా, భారత్‌కు వెలుపల వివిధ దేశాల్లో శివాలయాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయాన్మార్ వంటి దేశాల్లో కొన్ని పురాతన శివాలయాలు ఉన్నాయి. అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫిజీదీవులు, ఘనా, గయానా, నైజీరియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆధునికకాలంలో నిర్మించిన శివాలయాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో శివారాధన శివుడిని ఎక్కువగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. కొన్నిచోట్ల శివుడిని మానుషవిగ్రహ రూపంలోనూ ఆరాధిస్తారు. సింధులోయ నాగరికత కాలం నాటికి శివుడిని పశుపతిరూపంలో ఆరాధించేవారు. శివుడికి యోగీశ్వర, అర్ధనారీశ్వర, నటరాజ, రుద్ర, వీరభద్ర, భైరవ తదితర రూపాలు ఉన్నాయి. లోకరక్షణ కోసం శివుడు అరవై ఐదు లీలారూపాలు దాల్చినట్లు శివపురాణం చెబుతోంది. వీటిలో ఇరవైనాలుగు రూపాలు ప్రధానమైనవి కాగా, మూడు రూపాలు అత్యంత ముఖ్యమైనవని శివపురాణ కథనం. శివుడు సగుణ రూపంలో ఫాలనేత్రంతో, ఒకచేత త్రిశూలం, మరోచేత డమరుకం, శిరసుపై నెలవంక, జటాఝూటంలో గంగ, మెడలోను, చేతులపైన సర్పాలు, శరీరంపై గజచర్మం, విబూది పూతతో దర్శనమిస్తాడు. చెంత జింక, వాహనంగా నంది ఎల్లప్పుడూ శివుడిని అంటిపెట్టుకుని ఉంటాయి. త్రిశూలం త్రిగుణాలకు సంకేతమని ‘లింగపురాణం’ చెబుతోంది. తలపైన నెలవంక మనశ్శాంతికి, గంగ మనోనిశ్చలతకు సంకేతాలు. సర్పాలు జీవాత్మలు. గజచర్మం అహంకార పరిత్యాగానికి సంకేతం. జింక చతుర్వేదాలకు, నంది సత్సాంగత్యానికి, ఫాలభాగాన ఉన్న మూడోకన్ను ధర్మపరిరక్షణకు చిహ్నాలు. శివుడు సృష్టి స్థితి లయకారకుడు. ప్రళయకాలంలో జగత్తును తనలో లయం చేసుకున్న శివుడు, సృష్టి స్థితులను కొనసాగించడానికి బ్రహ్మ విష్ణువులను నియమించినట్లు పురాణాల కథనం. శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది స్కాందపురాణం. లౌకికభోగాలు పొందడానికి శివలింగమే ఆలంబన అని శివభక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం శివుడే ఆదిగృహస్థుడు. ఆదర్శ దాంపత్యానికి శివపార్వతులే ప్రతీకలు. శివపూజ కోసం అట్టహాసమైన ఏర్పాట్లేవీ అవసరం లేదు. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించి, చిటికెడు విబూది, మారేడు దళం భక్తిగా సమర్పించుకుంటే చాలు, తప్పక శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కదల్లేని స్థితిలో ఉన్నవారు శివ మానసిక పూజ ద్వారా శివానుగ్రహం పొందగలరని అనుగ్రహిస్తూ ఆదిశంకరాచార్యులు శివ మానసిక పూజా స్తోత్రాన్ని రచించారు. కదల్లేని స్థితిలో ఉన్నవారు ఎలాంటి నియమాలూ పాటించలేకున్నా, ఈ భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని పఠించినా, మననం చేసుకున్నా శివానుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. -
పంచారామాలకు, శబరిమలైకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా పంచారామాలకు, శబరిమలైకు ప్రత్యేక బస్సులను నడుపుతోందని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్ ఎం.సన్యాసిరావు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచారామాలైన అమరావతి(అమరలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీరరామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట (కొమరరామలింగేశ్వర స్వామి) ఐదు శైవ క్షేత్రాలను ఒకేరోజులో భక్తులు దర్శించుకునే విధంగా నడుపుతామన్నారు. ఈ నెల 10, 17, 24, డిసెంబర్ ఒకటో తేదీల్లో (ఆదివారాల్లో) మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళంలోని కాంప్లెక్స్‌లో బయలుదేరి సోమవారం ఐదు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించి మంగళవారం ఉదయం శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు బస్సు చేరుకుంటుందన్నారు. టిక్కెట్ ధరను డీలక్స్ బస్సుకు పెద్దలకు రూ. 3120, పిల్లలకు 990 రూపాయలుగా నిర్ణయించామన్నారు. వివరాలకు 08942 224492, 7382922015 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. అలాగే శబరిమలైకు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. వీటితోపాటు పిక్నిక్ స్పాట్లైన కళింగపట్నం, మొగదాలపాడు, విశాఖపట్నంలోని కైలాసగిరి, బీచ్ తదితర ప్రాంతాలకు కూడా బస్సులను నడుపుతామని.. ఈ అవకాశాన్ని జిల్లావాసలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్పీ రావు పాల్గొన్నారు.